ఈసారి రెండో కాలుకి పనిపెట్టిన శ్రీహర్ష పిడికిలితో డేవిడ్ అప్పటికే అందుకున్న ఇసుకని కళ్ళలోకి విసరడాన్ని వూహించలేకపోయాడు.
కంటిపాపాల్లో సూదులు గుచ్చుకున్నట్టయింది.
ముందు నవ్వు వినిపించింది. మరుక్షణం భుజం చీలిపోయింది.
తనో అసాధారణమైన శక్తివంతుడ్నని ఆలోచిస్తున్న శ్రీహర్షకి జ్ఞానోదయ మైందిక్కడే.
ప్రత్యర్థిని తక్కువగా అంచనావేయలేదు కాని తనకన్నా తక్కువని భావించి పొరపాటు చేశాడు. అదే ఆలోచనతో చాలా కేజువల్ గా పోరాడుతూ ఇప్పుడు గాయపడ్డాడు.
నిజానికి గాయం శ్రీహర్షకి కొత్తకాదు. ఇలాకావడం తొలిసారి.
క్షణంలో వెయ్యోవంతు కళ్ళు చిట్లిస్తూ చూసాడు.
భుజంనుంచి రక్తం చిమ్ముతూంది.
మూడడుగుల దూరంలో ఛార్జి చేయబోతున్న పులిలా నిలబడి వున్నాడు డేవిడ్.
తనేమిటి అన్నది తెలియజేసే అవకాశం కాదు. మిగిలిన అహంకారపు పొరలకి సంతృప్తినివ్వాల్సిన సమయం ఆసన్నమైపోయింది.
"బా... స్ట... ర్డ్..."
శక్తిని సమకూర్చుకుంటున్నట్టు క్షణం గట్టిగా గాలి పీల్చుకున్న శ్రీహర్ష డేవిడ్ అవాక్కయి చూస్తుండగానే నేలకి నాలుగడుగుల పైకి లేచాడు.
దడ్ మన్న చప్పుడు...
శరీరానికి శతఘ్ని తాకినట్టుందేమో...
దేవ్వుమంటూ కూలిపోయాడు డేవిడ్...
మెడలో నరాలు జివ్వుమన్నాయి...
మరోదెబ్బ...
నాడీమండలం మొద్దుబారిపోయింది.
టెర్రరిస్టుగా పొందిన తర్ఫీదుని మర్చిపోయిన డేవిడ్ స్తబ్ధంగా చూస్తుండగానే చేతిలో కత్తి దూరంగా తుళ్ళింది.
ఇప్పుడతడి తల శ్రీహర్ష పిడికిలిలో ఉంది.
అదికాదు.
షార్క్ నోట చిక్కినట్టు కపాలం పగిలిపోయింది.
పది సెకండ్ల వ్యవధిలో డేవిడ్ స్పృహతప్పినట్టు తల వాల్చేసాడు. స్వరపేటిక వూడిపడేదే. నిభాయించుకున్నాడు. కాదు నిగ్రహించుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు శ్రీహర్ష.
హత్యచేయటం తన అభిమతం కాదు. తానేమిటీ అన్నది తెలియచెప్పడం తప్ప హంతకుడిగా ఈ దేశంలో సైతం వేటాడబడడం అతడికి ఇష్టంలేదు.
భావాతీత ధ్యానంలోలా కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు. నిర్జనంగా వున్న పరిసరాల్లో వాతావరణం ప్రశాంతంగా వుందిప్పుడు.
కాలు కదులుతుంటే 'కరాల్' మంది బుల్లెట్. నిస్త్రాణగా కత్తినందుకున్నాడు.
నేలపై చదికిలబడి తొడలో చిక్కిన తూటాని కత్తిమొనతో బయటికి లాగి హేండ్ కర్చీఫ్ చుట్టాడు. బాధ కాదది... కొద్దిపాటి అలసట.
మరో అయిదు నిమిషాలలో నగరంవైపు నడక ప్రారంభించి చీకటిని చీల్చుతున్న విద్యుద్దీపాలను చూస్తూ ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర ఆగేడు.
"యస్" దృశ్య కంఠం వినిపించింది.
"నేనే... శ్రీహర్షని."
ఆశ్చర్యపోయిందామె, నిజానికి ఆమె యెదురుచూస్తున్నది డేవిడ్ ఫోన్ కోసం. 'నువ్వు."
"ఇంకా చావలేదు. పాపం! లక్షరూపాయలకోసం నన్ను ఎదుర్కొన్న నీ అనుచరుడు అక్కడ స్పృహతప్పి పడివున్నాడు. మరో గంటదాకా లేవడు.
"నాకెందుకు ఫోన్ చేశావ్."
"నన్ను మరోసారి రెచ్చగొట్టావని తెలియజెప్పటానికి."
"యూ ఆర్ ఎ మేడ్ కేప్" ఎగతాళిగా నవ్వింది. లేకపోతే నిజంగా వస్తానని ఎలా అనుకున్నావ్?
క్షణం నిశ్శబ్దం. "నా అభ్యర్థన మన్నిస్తావనుకున్నాను."
"నేనేమిటీ అన్నది నీకిప్పటికి అర్థమై వుంటుంది."
"అర్థమైనా నీమీద కోపంలేదు దృశ్యా" మృదువుగా అన్నాడు. "శమంత్ కిడ్నాప్ చేయబడ్డాడు కదూ"
"విన్నాను."
"అతను నిజాయితీగల ఓ పోలీసాఫీసర్."
"అలాంటివాళ్ళే సమస్యల్లో ఇరుక్కునేది."
"ఆ సమస్య నిజంగా టెర్రరిస్టులమూలంగా అయితే ఫర్వాలేదు. నీ తండ్రి సవ్యసాచి, నీకు కాబోయే భర్త మహేంద్ర మూలంగా ఏర్పడిందని నాకు తెలుసు."
ఇదంతా నాకెందుకు చెబుతున్నట్టు?
"నువ్వు తలచుకుంటే శమంత్ ని కాపాడగలవు కాబట్టి."
"అలాంటి విషయాల్లో నేను తలదూర్చను."
కనీసం అతడ్ని నిర్భంధించిందెక్కడో అదయినా చెప్పు.
"యూసీ మిస్టర్ శ్రీహర్శా..." స్పష్టంగా వినిపించింది దృశ్య గొంతులోని అవహేళన "ఒకవేళ తెలిసినా నీకెలా చెబుతాననుకున్నావ్."
"నేను నీకేదో ఆత్మీయుడ్ని కాబట్టి చెప్పి తీరాలి అని నేను అనలేను దృశ్యా. కాని అమాయకురాలయిన నీలాంటి ఓ ఆడపిల్లని, శమంత్ కూతురి స్థానంలో నిలబడ్డ ఓ పసికందు భవిష్యత్తుని కాపాడాలీ అంటే ఈ మాత్రం సహాయం నువ్వు చెయ్యాలి."
"ఇంపాజిబుల్."
"అంటే నాతో శాశ్వతమైన శతృత్వానికి నువ్వు సిద్ధపడతానంటావ్. యూసీ మిస్ దృశ్యా! నువ్వు నాపై చేస్తున్న ప్రయోగం నన్ను రెచ్చగొడుతున్నా శమంత్ విషయంలో నువ్వు సాయం చేస్తే నిన్ను పూర్తిగా క్షమించేయాలనుకున్నాను. కాని నువ్వు ఓ ఆడపిల్లలా కాక ఆ తండ్రికి కూతురిలానే ప్రవర్తిస్తున్నావ్.
"ఆ తండ్రికి కూతురిలా కాక నీకు భార్యలా ప్రవర్తిస్తాననుకున్నావా."
"ప్రవర్తించేట్టు చేస్తాను మిస్ దృశ్యా. ఏం! నమ్మలేక పోతున్నావా." క్షణం ఆగి అన్నాడు "శమంత్ కి ఏ ఆపదా జరక్కూడదు. జరిగిందీ అంటే నిన్ను నేను క్షమించను."
"ఏం చేస్తావ్."
"ఈనెల ఇరవైనాలుగున నీ బర్త్ డే అనుకుంటాను కదూ"
"అయితే" విస్మయంగా అడిగింది.