"ఆనందంగా వుందా."
అర్ధంకానట్టు చూశాడు "దేనికి"
"ఎయస్పి శమంత్ అదృశ్యాన్ని ప్రతి క్రిమినలూ ఎంజాయ్ చేస్తాడు మిస్టర్ శ్రీహర్షా..."
చెప్పలేదు అతడితో తనకుగల అనుబంధమేమిటో, ఈదేశంలో అడుగుపెట్టాక కాకతాళీయంగా ఆ కుటుంబంతో ఏర్పడ్డ బంధం గురించిగాని, ముఖ్యంగా ఆ చిన్ని కుటుంబం తనపై చూపించే ఆత్మీయతనిగాని ఏకరువు పెట్టడం అతడికిష్టం లేదు.
లల్లూ గుర్తుకొచ్చింది. అంతకుమించి ఆప్యాయంగా అన్నం తినిపించిన రేవతి జ్ఞప్తికొచ్చింది.
చిత్రమైన సందిగ్ధత.
ఏం చేయాలి?
ఒక్కసారి, మరొక్కసారి శమంత్ కోసం తన కాలాన్ని వెచ్చించాలా లేక కేవలం జూలీకోసం మాత్రమే ఆలోచించాలా.
"ఏమిటి శ్రీహర్షా... ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్" అడిగింది రేష్మి.
"మీరనుకుంటున్నట్టు శమంత్ అదృశ్యం కావడాన్ని నేను ఆనందించడంలేదు రేష్మి. ఈదేశంలో క్షణక్షణమూ నిర్వీర్యమైపోతున్న నిజాయితీ విక్రయంతో అరక్షణంపాటు ఆలోచించాలనుకుంటున్నాను."
"శమంత్ మీకు తెలుసా?"
తెలుసన్నట్టు తల పంకించాడు.
"అయితే అదృశ్యంచేసిందేవరో కూడా మీకు తెలిసేవుండాలి"
మరింత స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాడేమో నిర్లిప్తంగా అన్నాడు "చెప్పండి"
"నైతికవిలువల సరిహద్దుల్ని దాటుకుని వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్న నేర ప్రపంచపు సముద్రపుహోరుని పిడికిలితో బంధించాలనుకునే శమంత్ యిక్కడ బ్రతికి బట్టకట్టలేరు శ్రీహర్షా. అది భరించలేరు యీ సంఘాన్ని శాసిస్తున్న సవ్యసాచిలాంటి వ్యక్తులు..."
"వ్వాట్" శ్రీహర్ష స్థాణువయ్యాడు. సవ్యసాచికి ఇందులో సంబంధమేమిటి?
మహేంద్ర ఈదేశపు ఉపప్రధాని కొడుకు. సవ్యసాచికి కాబోయే అల్లుడు. కాబట్టి మహేంద్రకి ప్రత్యర్థి సవ్యసాచికీ ప్రత్యర్థిగా..."
చాలా అర్థమైంది.
యాదృచ్చికంగా జూలీ విషయం మరుగునపడిపోయింది.
టేబుల్ పైవున్న డెకోలెట్ 'బ్రా'ని చూస్తూ ఫోన్ అందుకున్నాడు.
అతడేంచేస్తున్నదీ ఆమె గ్రహించేలోగానే దృశ్య నంబర్ డయల్ చేసాడు.
"ఎవరు" దృశ్య కంఠం వినిపించింది.
"నేనే"
"గెలిచావుగా. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు"
"ఇది నేను గెలుపుగా భావించడంలేదు"
"అసలు ఎవర్నువ్వు" ఎందుకు నన్నిలా సాధిస్తున్నావ్?
జవాబు చెప్పలేకపోయాడు.
"ఆకతాయిగా ఏదో అన్నందుకు క్షణక్షణమూ నన్నెందుకు వేధిస్తున్నావ్..."
"నిన్నోసారి పర్సనల్ గా కల్సుకోవాలనుంది."
నిశ్శబ్దం క్షణంపాటు "నన్నా?"
"అవును దృశ్యా. నీ సొత్తుని నీకందించడమే గాక నీనుంచి ఓ సహాయం కోరాలనుకుంటున్నాను."
"సరే. ఎక్కడ కలుద్దాం?"
"ఆశ్చర్యంగా ఉంది"
"దేనికీ?"
"ఇంత సులభంగా అంగీకరిస్తున్నందుకు"
"సరేననకపోయినా ఏదోలా నువ్వు నా దగ్గరికి రాగలవని నిరూపించుకున్నావుగా"
అర్థమైంది ఎందుకంత సునాయాసంగా సరేనందో...
చెప్పాడు ఎక్కడ కలుసుకునేదీ.
ఫోన్ క్రెడిల్ చేసిన శ్రీహర్షని చూస్తూ అంది రేష్మి "మీరేం ఆశించి యిదంతా చేస్తున్నారో నాకు అర్థం కావడంలేదు."
"రక్తపాతం నాకు యిష్టంలేదు రేష్మీ... సాధ్యమైనంత సున్నితంగా శమంత్ ని విడిపించాలనుకుంటున్నాను.
"దానికి దృశ్య ఏవిధంగా సహకరిస్తుంది."
"దృశ్య సవ్యసాచికి గారాల కూతురుగా"
"అయితే"
"దృశ్య ద్వారా శమంత్ ని బయటికి రప్పించాలనుకుంటున్నాను."
"జరిగింది అంత చిన్న సమస్యగా ఎలాభావిస్తున్నావు శ్రీహర్షా"
"నా పద్ధతులు నాకున్నాయ్ రేష్మీ... ఏదన్నా చేయగలనని నిరూపించుకున్న నాకోసం దృశ్య యీ మాత్రం తల ఒగ్గుతుందని నమ్ముతున్నాను.
"దృశ్యని తక్కువగా అంచనా వేస్తున్నారు."
ఆమె అంచనా తప్పు కాదన్న సత్యానికి సాక్ష్యంగా అక్కడ తన భవంతిలో దృశ్య సెక్యూరిటీ ఇన్ ఛార్జి డేవిడ్ ను పిల్చి అంది.
"రాత్రి మీ స్టుపిడిటీని నిరూపించుకున్నారు అవునా."
డేవిడ్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. "వాడు మిమ్మల్ని కిడ్నాప్ చేసింది శక్తితో కాదు యుక్తితో..."
"అంటే శక్తితో మీరు అతడ్ని గెలవగలనంటారు."
పాకిస్తాన్ టెర్రరిస్టుల కేంపులో యేళ్ళ తరబడి తర్ఫీదును పొంది తను టెర్రరిజంలో నిష్ణాతుడ్నని నిరూపించుకోడానికి స్కూలు భవంతిలో అడుగుపెట్టి డెబ్బైమంది పసిపిల్లల్ని కాల్చి చంపగలిగిన డేవిడ్ ఎంత క్రూరుడో సవ్యసాచికి తప్ప ఆమెకు తెలీదు.
రోబోట్ లా అలసిపోకుండా పోరాడగల డేవిడ్ నెమ్మదిగా అన్నాడు "వాడికోసం గాలించి తీరుతాను"
"అవసరం లేదు. ఈరోజు సాయంకాలం అతనే నన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు."
"ఎక్కడ"
"బీచ్ లో నిర్మానుష్యంగా వుండే శాంతి ఆశ్రమపు సరుగుడు తోటలో సాయంకాలం అయిదుగంటలకి."
సప్తభుజంగంలా చూసాడు డేవిడ్. "ఆరున్నరకి అతడి శవాన్ని మీకు కానుకగా అందిస్తాను."
"అలా అయితే మీకు లక్షరూపాయలు బహుమతిగా ఇస్తాను."