Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 32


    ఎప్పుడో భానుమతికి మెలుకువ వచ్చినప్పుడు "మాలీ! ఇంకా నిద్రపోలేదా?" అని వీపు నిమిరి దగ్గరకు లాక్కుంటుంది. "నిద్రపో పిచ్చినాన్నా! ఎప్పుడూ చిన్న చిన్న విషయాలగురించి ఆలోచించాలిగానీ పెద్ద విషయాలను చాలా తేలిగ్గా తీసుకోవాలి. ఊఁ పడుకో.

    రామ్మోహన్ అప్పుడప్పుడూ భానుమతికోసం వస్తూ వుంటాడు. ఇద్దరూ కలిసి బయటకు వెడతారు. భానుమతి ఆ అనుభూతికోసం అలమటించినట్టు కనబడదు. మనిషన్నాక కొన్ని సంఘటనలు జరగాలి. అంతకుమించిన విలువల్ని ఇవ్వడం ఒకరకంగా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.

    ఒకరోజు భానుమతి ఆఫీసుకెళ్ళిపోయాక మాలతి ప్రక్కమీద బోర్లా పడుకుని వుంది. నిద్రపోకుండా పడుకోవటంతో బహుశా సంవత్సరాల తరబడి గడిపే అలవాటు ఆమె చేసుకుంది.

    బయట ఎవరో తలుపు తట్టారు.

    తమ తలుపు కాదేమో అనుకుంది.

    "అమ్మగారూ!" అమ్మగారూ!" చాలా పరిచితమైన గొంతు. ఛివాల్న లేచి కూర్చుంది. మరుక్షణంలో తలుపులు తెరిచేసింది.

    "గోపయ్య!"

    "అమ్మగారూ! బావున్నారా?" అంటూ ఆమెను చూస్తూనే గోపయ్య బావురుమన్నాడు.

    ఆమెకికూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. లోపలకి రా గోపయ్యా! అంటూ గదిలోకి నడిచింది.

    "గోపయ్యా! అయ్యగారు బావున్నారా?"

    అతను మాట్లాడకుండా తల వంచుకున్నాడు.

    "ఏమిటి గోపయ్యా!చెప్పవేం?"

    "ఏం చెప్పనమ్మగారూ! మీరెళ్ళిపోయిన రోజే అయ్యగారికి ఇంట్లో తలకి పెద్ద దెబ్బ తగిలి, ఆ ప్రమాదంలో కళ్ళుపోయాయి."

    "శేఖర్ కళ్ళుపోయాయా?" మాలతి నిలువునా వణికింది.

    "అప్పట్నుంచీ ఇల్లంతా నరకమైపోయిందమ్మగారూ! అయ్యగారు పిచ్చెత్తినట్లయిపోయారు. అన్నం తినరు, మందు తీసుకోరు. ఎప్పుడూ ఈ పేరు కలవరిస్తూ వుంటారు. మళ్ళీ అంతలోనే మిమ్మల్ని తలచుకుని మండిపడతారు. అప్పుడప్పుడూ నొప్పికూడా వస్తోంది....అయ్యగారి పరిస్ధితేమీ బాగుండలేదమ్మగారూ........!"

    మాలతి ఆ విద్యుద్ఘాతం నుంచి కోలుకుంది. కానీ యదార్ధంనుంచి కలలోకి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది.

    "ఇప్పుడేం చేద్దాం గోపయ్యా?"

    "మీరక్కడికి రావాలమ్మగారూ! లేకపోతే అయ్యగారు బ్రతకరు."

    "ఎలా గోపయ్యా? నా పేరువింటేనే ఆయన మండిపడుతున్నారు. నన్ను భరించే శక్తి ఆయనకు లేదు."

    "నాకు తెలుసమ్మగారూ! అందుకే నేనో ఉపాయం ఆలోచించాను. డాక్టరుగారు అయ్యగార్ని చూడ్డానికి రోజూ వస్తున్నారుగా! వారితోకూడా మాట్లాడి వారిసలహా కూడా తీసుకున్నాను. మీరు నా మనవరాలిగా ఆ ఇంట్లోకి వస్తున్నారు. మీ పేరు దుర్గ."

    మాలతికేం అర్ధంకావటంలేదు. "పేర్లయితే మార్చగలం. అయన నన్ను చూడలేరు కాబట్టి ఫర్వాలేదు కానీ గొంతెలా గోపయ్యా?

    "మీరా ఇంట్లో మాట్లాడరు అమ్మగారూ! మీరు మూగవారు."

    "గోపయ్యా!"

    "అవునమ్మగారూ! ఈ పరిస్ధితుల్లో ఇలా నాటకమాడటం తప్పితే నాకు వేరే మార్గం కనబడటంలేదు."

    మాలతి ఆలోచించింది. చాలా లోతుగా ఆలోచించింది. గోపయ్య చెప్పింది నిజమే. ఇంతకంటే త్రోవ లేదు......నిర్ణయానికి వచ్చింది.

    "ఎప్పుడు వెడదాం గోపయ్యా?"

    "ఇప్పుడే నమ్మగారూ!"

    "ఉండు" అని కూర్చుని భానుమతికో ఉత్తరం రాసింది.

    "భానూ!

    నా జీవితంలో మెలోడ్రామా వుందంటున్నావు. అలాగే జరుగుతోంది. ఈవేళ గోపయ్య వచ్చాడు. శేఖర్ కి ప్రమాదంజరిగి, అంధత్వం ప్రాప్తించిందట. నేనతన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. నేనుగా వెడితే రానివ్వడని తెలుసు. గోపయ్యకు మనవరాలిగా, బహుశా ఓ పరిచారికగా ఆ ఇంట్లోకి కాలు పెడుతున్నాను. మళ్ళీ ఎప్పుడో కలుసుకుంటాను. వుంటాను.

                             నీ మాలతి."

    ఉత్తరం ఆమెకు కనిపించేలా టేబిల్ మీద పెట్టి గదికి తాళం పెట్టి, తాళం చెవి ఇంటివాళ్ళకిచ్చి గోపయ్యతో బయల్దేరింది.

                                             15

    "రండమ్మగారూ!" అని గోపయ్య ఇంట్లోకి నడిచాడు.

    మాలతి సంకోచంగా గుమ్మందగ్గరే ఆగిపోయింది.

    ఫర్వాలేదు రండమ్మగారూ! ఇది మీ ఇల్లు. మీ ఇంట్లోకి మీరు రావడానికి అనుమానమేమిటి?"

    మాలతి ఒక్కొక్కఅడుగూ బరువుగా వేస్తూ లోపలకు వచ్చింది.

    "ఎవరూ?" లోపలి గదిలోంచి శేఖర్ గొంతు.

    మాలతి శరీరం జలదరించినట్లయింది.

    శేఖర్ చేతికర్ర సాయంతో మెల్లగా తడుముకుంటూ హాల్లోకి వచ్చాడు.

    ఆ దృశ్యం చూసేసరికి మాలతికి దు;ఖం పెల్లుబికింది. ఎంత చిక్కిపోయారు? ఎంత మార్పు? గోపయ్య సౌంజ్ఞ చేస్తే నిగ్రహించుకుంది.

    "గోపయ్యా!"

    "నేనేనయ్యగారూ!"

  "నాకాశ్చర్యంగా వుంది గోపయ్యా. ఈ ఇంట్లో నువ్వూ నేనూ తప్ప ఎవరమూ లేమా?....కానీ...." అంటూ తడుముకుంటూ మాలతి దగ్గరకు వచ్చాడు. అతనికి తగులుతానన్న భయంతో మాలతి ఈ ప్రక్కకి తప్పుకోవాలని చూసిందికానీ, టేబిల్ అడ్డుగా వుండడంతో సాధ్యపడలేదు. ఇంచుమించు తాకుతున్నంత దగ్గరగా నిలబడ్డాడు.           

 Previous Page Next Page