Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 32

      
    "నువ్వు యిష్టపడే అమ్మాయిగా మారాలీ అంటే నేనేం చేయాలి?" అంది సశ్యం దృఢంగా.

 

    "నాకంటూ కొన్ని అభిరుచులున్నాయి సశ్యా! ఆ అభిరుచులకి దగ్గరయిన వ్యక్తులు ఇప్పటికి యిద్దరయ్యారు" ఓరకంట విజూషని గమనిస్తూ అన్నాడు.

 

    సశ్య తట్టుకోలేకపోయింది.

 

    "ఇద్దరా?"

 

    తను కాక మరొకరు అన్న భావం ఆమెను ప్రశాంతంగా వుండనివ్వలేదు.

 

    "ఆ మరో వ్యక్తి ఎవరు?"

 

    "విజూష."

 

     పక్కలో బాంబు పడినట్లు అదిరిపడింది సశ్య.

 

    నిన్నలేదూ మొన్న పరిచయమైన విజూష. ...

 

    రుత్వి చుట్టూ చేరి అతడ్ని తాకే ఎన్నో గాలి అలల్లో ఒకటిగా అనిపించిన అమ్మాయి అతడి ఊహా శాకాంచలాల్లో చిక్కుకున్న అందమైన పదంలా, రథంలా మారి పరిచితురాలైన తన మొహంపై అపరిచిత గాయాన్ని చేసి అగ్నిజిహ్వాన తనని కాల్చుతూ రుత్వి మనోహిమతల్పంపై జ్యోత్స్నావల్లరిగా కాలం రెక్కలు విదిలిందీ అంటే........

 

    వీల్లేదు

 

    "తేలిపోవాలి రుత్వీ" బింకంగా అంది సశ్య.

 

    "మా ఇద్దరిలో ఎవరో ఒకరే నీకు దగ్గరవ్వాలి."

 

    అనుకున్న గమ్యానికే సశ్య నడుస్తుంటే రుత్వి అన్నాడు "కానీ విజూష నీతో పోటీకి సిద్దం కావాలిగా?"

 

    ఇది విజూష అహంకారాన్ని దెబ్బతీసింది.

 

    అంతే.......

 

    "గెలుపంటే నాకు చాలా యిష్టం" అంది విజూష సశ్యని చూస్తూ.

 

    "ఎదుటి వ్యక్తి ఓటమిని నేను ప్రేమిస్తాను" కౌంటర్ లా అంది సశ్య.

 

    "కాబట్టే క్విజ్ పోటీలో ఓడిన రుత్విని నీవాడ్ని చేసుకోవాలనుకున్నావేమో"

 

    విజూష స్టేట్ మెంట్ తో తొట్రుపడింది సశ్య.

 

    అంటే రుత్వి విజూషకి ఆ విషయం చెప్పాడనేగా.

 

    తనకు తెలియకుండా ఇద్దరి మధ్య ఇంత పరిచయం ఎలా పెరిగింది?

 

    తెగిపోతున్న ఏ  మనోశృంఖలాలో సశ్యని ఆలోచనల కత్తుల బోనులోకి నెడుతుంటే యవ్వనపు బరువుకింద నలగకుండా పదిలంగా దాచుకున్న స్మృతుల అరల్ని మరే  వ్యక్తికీ పంచలేని వున్మాదంతో చూసింది.

 

    రుత్వితో వాసానికిగాని... శాశ్వత మౌన ప్రవాసానికిగాని ఒకపొరాటానికి  సిద్దపడాలనుకుంది.


 
    "చెప్పు రుత్వీ" ఖండితంగా అడిగింది సశ్య" మా ఇద్దరిలో నువ్వు  కావాలనుకుంటున్న దెవర్ని?"

 

    "నేను కావాలనుకోవాలీ అంటే నేను ఇష్టపడే అమ్మాయిగా ముందు ఇప్పటికి నేను  గుర్తించింది మీ యిద్దర్నే.


 
    ఇలా నేను అంటున్నది నా అహంలా నీకు అనిపిస్తే క్షమించు సశ్యా.

 

    కానీ....

 

    అన్నివిధాలా సమవుజ్జీలుగా వున్న మీ ఇద్దరిలో ఒకర్ని నేను కావాలని అనుకోవాలీ అంటే నేను మిమ్మల్ని పరీక్షించాలి. "

 

    అడిగింది సశ్య "ఏ విషయంలో?"

 

    "ఐ క్యూ" ఠక్కున జవాబు చెప్పాడు రుత్వి.


 
    "ఎస్... మీ యిద్దరిలో ఎవరి మేధస్సు గొప్పదో కొన్ని వారాల పాటు చక్ చేసి చివరిగా ఎక్కువ స్కోరు చేసిన వ్యక్తికి నేను దగ్గరవుతాను" ఇద్దరివేపూ చూశాడు రుత్వి.

 

    "చాలా అర్హతల్లో మీరు నాకన్నా గొప్ప కుటుంబాలకి చెందిన అమ్మాయిలని  తెలిసిన నేను యిలాంటి ప్రక్రియకి సిద్దపడుతున్నది నన్ను ఇష్టపడే మీ యిద్దరిలో ఒకర్ని నా మనిషిగా నేను యిష్టపడటానికి.

 

    అయితే ఒక్కమాట.

 

    ఈ నా నిర్ణయంలో మీలో అహాన్ని దెబ్బతీస్తే పక్కకి జరిగిపోవచ్చు."

 

    "నో"

 

    నిశ్చలంగా అంది సశ్య.

 

    "ఈ పోటీకి నేను సిద్దం"

 

    "నేను కూడా" విజూష అందుకుంది.

 

    ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక చిత్రమైన పోరాటానికి అలా అంకురార్పణ చేసిన రుత్వి ఆ తరువాత నెమ్మదిగా అన్నాడు దూరంగా చూస్తూ -

 

    "నాకు తెలుగు సాహిత్యమంటే చాలా యిష్టం.

 

    అలాంటి ఇష్టం మీరు పెంచుకోటాన్ని నేనూ యిష్టపడతాను...."

 

    క్షణం ఆగాడు.

 

    "ఇప్పుడు నేను అడుగుతున్నది సాహిత్యానికి చెందిందే. జవాబు ఎవరు ముందు చెబితే......."

 

    ఆర్దోక్తిగా అంది సశ్య.

 

    "వాళ్లతో నువ్వు ఒకరోజు గడపాలి"

 

    నిర్లిప్తంగా చూశాడు ముందు.

 

    వెంటనే నవ్వేస్తూ -

 

    "గడపాలీ అంటే మరో అర్దం వస్తుంది సశ్యా! ఒకరోజుపాటు గెలిచిన అమ్మాయికి టైం కేటాయించాలి అంటే బాగుంటుంది"   

 Previous Page Next Page