Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 33


    కరటక, దమనకులు కాకినాడలో జగతిని చూశారాయె! వాళ్ళు ఆమెని గురించి తమకు చాలా తెలిసినట్లు మిగతా శిష్యులకు చెప్పసాగారు.
    ఊళ్ళోకూడా ఆమెను గురించి విచిత్రంగా చెప్పుకోకపోలేదు. అయితే స్వామి అంటే వారందరికీ అమిత శ్రద్ధాభక్తులు. అటువంటి మహనీయుడి ఆశ్రమం తమ గ్రామంలో వుండటమే అదృష్టంగా తలపోశారు. అందుకని ఆ విషయానికి అంత ప్రాధాన్యత యివ్వటం మానేశారు.
                                                       15
    మనకుడి అసలుపేరు మార్కండేయశాస్త్రి. అతడు స్వతహాగా చాలా చురుకైనవాడు. ఆశ్రమానికి సంబంధించిన విషయాలుగానీ, పూజా పునస్కారాలకు సబంధించిన తతంగాలు కానీ అతనికి తెలిసినట్లు మిగతా శిష్యులెవరికీ తెలియదు. స్వామికూడా అతని తెలివితేటలనూ, బుద్ధికుశలతనూ అప్పుడప్పుడు ప్రశంసిస్తూ వుండేవారు.
    మార్కండేయుడి దృష్టి జగతిపై పడింది. తను యింట్లోని స్పర్థల కారణంగా ఆశ్రమంలోకి వచ్చి చేరి యిక్కడ కాలం గడుపుతున్నాడుగానీ శాశ్వతంగా యిక్కడ ముడిపెట్టుకు కూర్చోవాలన్న తలంపు అతనికెన్నడూ లేదు. అటువంటిది ఏమి బాధలు పడిందని, ఏమి జీవితం అనుభవించిందని యీ లావణ్యవతి ఆశ్రమవాసియై నిస్సంగజీవితం గడుపుతోంది. రానురానూ ఆమె వైఖరి ఆధునిక జిజ్ఞాస కలిగించసాగింది. కొన్నాళ్ళకు ఆ జిజ్ఞాస వ్యామోహంగా మారింది.
    ఎప్పుడూ ఏదో పని కల్పించుకుని జగతి కుటీరానికి వస్తూండేవాడు. సందర్భం వున్నా లేకపోయినా వ్యర్థప్రసంగాలు చేస్తూండేవాడు. క్రమంగా యీ వ్యామోహం అతన్లోని విచక్షణాజ్ఞానాన్ని నశింపజెయ్యసాగింది. తీర్థ ప్రసాదాలు ఆమెకు అందచేస్తున్నప్పుడూ, నిత్యావసరవస్తువులు ఇస్తున్నప్పుడు బుద్ధిపూర్వకంగా ఆమెకు తాకుతూ వుండేవాడు. ఆమె ఎదురుగా వస్తున్నప్పుడు, నడవటానికి చాలా ఖాళీవున్నా ఆమెను రాసుకుంటూ నడిచేవాడు.
    జగతికి యితనిపీడ దుస్సహంగా గోచరించింది. ఒకటి రెండుసార్లు మృదువుగా చెప్పిచూసిందిగాని, అతను లెక్కచేసే స్థితిలో లేడు.
    ఒకరోజు రాత్రి పన్నెండుగంటలు దాటింది. అవి చలిరోజులు. అమావాస్య వెళ్ళి రెండురోజులు గడిచింది. ఆశ్రమమంతా చీకటి పులుముకుని, నిశ్శబ్దం అలుముకుని వుంది.
    జగతి తన కుటీరంలో చాపమీద పడుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది. ఈ ఆశ్రమంలోకి వచ్చి చేరాక ఆమెకు కలలూ లేవు, కలవరమూ లేదు. ఉన్నట్లుండి మెకు మెలకువ వచ్చింది. ఈ మెలకువ రావటంలో స్వాభావికం కనపడకపోయేసరికి, ఆమె కళ్ళు మూసుకునే శ్రద్ధగా ఆలకించసాగింది. తలుపుమీద చిన్నగా ఎవరో కొడుతున్నారు. "జగతీ! జగతీ!" అని పిలుస్తున్నారు రహస్యంగా. ఆమె కా కంఠం స్వామివారిదిగా తోచింది. ఈ ఊహ వచ్చేసరికి గుండె దడదడ కొట్టుకుంది. తలుపుమీద వరుసగా చప్పుడవుతోంది. ఆమె గుండె దిటవుచేసుకుని లేచి, గోడనున్న దీపం పెద్దదిచేసి, తలుపుతీసింది. దీపం వెల్తుర్లో ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి కొయ్యబారిపోయింది. మార్కండేయుడు చిరునవ్వు నవ్వుతూ నిలబడి వున్నాడు. 
    ఆమె తేరుకుని ఏదో అనేలోపునే అతను ఆమెను తోచుకుంటూ లోపలకు వచ్చి, "అర్ధరాత్రి నేనిలా రావటం ఆశ్చర్యం కలిగించిందా జగతీ!" అన్నాడు చొరవగా.
    ఆమె అతనివంక తూస్కారంగా చూస్తూ "ఆశ్చర్యంకాదు... అసహ్యం కలిగించింది" అంది.
    "నేనంత అసహ్యంగా వున్నానా?" అన్నాడు మార్కండేయుడు.
    "నా కళ్ళకి అసహ్యంగానే కనిపిస్తున్నావు" అంది జగతి.
    "నాకు కోపం రాలేదు" అన్నాడు మార్కండేయుడు. "చూడు జగతీ! ఒకానొక కారణంగా మాయింట్లో జగడమాడి పారిపోయివచ్చి ఆశ్రమంలో చేరాను. మేము చాలా ఆస్తిపరులం. మా తల్లిదండ్రులకు యిద్దరమే తనయులం. ఇన్ని సంవత్సరాలు యిల్లు విడిచివున్న కారణంగా మావాళ్ళు నాతో రాజీకి వచ్చి నామాటకు తిరుగుచెప్పలేని స్థితిలో వున్నారు."
    "ఈ సోదంతా నాకెందుకు?" అంది జగతి విసుగ్గా.
    "నా స్థితిగతులు నీకు తెలియాలిగా, అందుకని చెప్పాను. నీ రూపం, గుణం అన్నీ నాకు నచ్చాయి. నువ్వు నా మనస్సుని దోచుకున్నావు. నాతో పెళ్ళికి నువ్వు ఒప్పుకుంటే నీకు కొత్తజీవితం చూపించగలను."
    జగతి అతనివంక చూస్తూ వెటకారంగా నవ్వింది. ఆమెకళ్ళలో కొంటెతనం దోబూచులాడింది. "నీకు అంత శ్రమ యివ్వటం నాకిష్టంలేదు. అలాంటి క్రొత్త జీవితాలు యిదివరలో చాలా చూశాను" అంది నిర్లక్ష్యంగా.
    "అంటే?" అన్నాడతను దెబ్బతిని.
    "నీకు తెలియనివి, నీవు కలలోకూడా రుచి చూడలేనివి నేను చాలా చవిచూశాను. నువ్వింకా అక్షరాభ్యాసం దశలో వున్నావు చిట్టినాన్నా! నువ్వు నా దృష్టిలో చాలా కుర్రవాడివి. నువ్వు పెళ్ళి చేసుకోవలసిందే. కాదనను. కాని నన్నేమిటి నీ మొహం. నాకన్నా చరిత్రహీన దొరకలేదా?" జగతి పెదవులపై విచిత్రహాసం తళుక్కుమంది.
    మార్కండేయుడి కళ్ళలో కోపం ప్రజ్వలించి, ముఖం జేవురించింది. "నువ్వు చరిత్రహీనవైతే నాకు మరీ మంచిది. ఈ కల్లబొల్లి భగవత్ చింతనలెందుకు? నువ్వు నాకు కావాలి" అన్నాడు ఒక అడుగు ముందుకువేసి సిగ్గులేకుండా.
    "ఆ దశ దాటిపోయింది తమ్ముడూ. నాకు వాంఛ వుంటే నేనే నిన్ను రమ్మని పిల్చివుండేదాన్ని. ఇది నా పునర్జన్మ. ఆ ప్రశ్నేలేదు. ఇహ ప్రతాపం చాలుగాని బయటకు నడు" ఆమె అక్కడ్నుంచి కదలకుండా నిర్లక్ష్యంగా అంది.
    కోపంతో అతను నిలువునా వొణికాడు. "దిక్కులేని దేశద్రిమ్మరివి, నీ ప్రేమకోరి వచ్చినవాడ్ని, నన్ను అవమానిస్తావా? దీనికి ప్రతీకారం చేసి తీర్తాను. ఎప్పుడోకాదు, యిప్పుడే" అన్నాడు నిప్పులు గ్రక్కుతూ.
    "ఈ చవట ప్రేమలూ, ప్రతీకారాలూ నా దగ్గర సాగవు. తక్షణం బయటకు వెడతావా? నలుగుర్నీ పిలిచి అల్లరి చేయమన్నావా?"
    ఆమె నోటిలోంచి మాట యింకా పూర్తిగా రాలేదు. అతను చిరుతలా ఆమెమీదకు ఉరికి, తన బలమైన రెండుచేతుల్తో ఆమెను గట్టిగా బంధించాడు. క్రోధం, మోహం, కామం వీటి ఉన్మాదంతో అతను మానవత్వాన్ని విసర్జించి పశువులా మారాడు. ముఖమంతా యెర్రగా అయి, రక్తం పరవళ్ళు తొక్కుతోంది. ఉచ్చ్వాస నిశ్వాసాలు తీవ్రంగా, వేడిగా, అసహ్యంగా వస్తున్నాయి. ఆమెను తనవైపు బలంగా అదుముకుంటూ, ఆమెముఖంలో ముఖం వుంచటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ హఠాత్ సంఘటనకు నివ్వెరపోయిన జగతి పడగవిప్పిన నాగులా తల ఎత్తి నిప్పులు గ్రక్కుతూ అతనివంక చూసింది. తన సర్వశక్తినీ కూడదీసుకుని ఒక్క విదిలింపు విదిలించి, చేతులు రెండూ అతని గుండెమీద పెట్టి వెనక్కి తోసింది. ఆమె మృదుహస్తాలలో అంతబలం వుంటుందని వూహించలేని అతను నాలుగు అడుగులు వెనక్కి తూలి, గోడకు కొట్టుకుని, అప్రతిభుడైపోయాడు. ఆ క్షణాన్ని ఊతగా తీసుకుని ఆమె వగరుస్తూ ముందుకు వెళ్లి "దుర్మార్గుడా! పశువా! అని తిడుతూ అతని చెంపలు కందిపోయేటట్లు, పేలిపోయేటట్లు వాయించసాగింది.
    పది పదిహేను దెబ్బలు మీదపడ్డాక మార్కండేయుడు తెలివిలోకి వచ్చాడు. ఆదిశక్తిలా విజృంభించి తనను శిక్షిస్తున్న జగతిని చూసి అతనికి సిగ్గు కలగక పోగా అతన్లోని పశుత్వం మరింత రెక్కలు విప్పుకుని స్వైరవిహారం చేసింది. అతని రక్తంలో అణువణువునా ప్రతీకారవాంఛ చెలరేగింది. ముఖం వికట రేఖల్ని విరజిమ్ముతూ భయంకరంగా తయారయింది. పెదవులపై విషహాసం మెరిసి మాయమైంది. ముఖంమీద పడుతూన్న దెబ్బల్ని లక్ష్యపెట్టకుండా ఆమె రెండు భుజాలూ పట్టుకుని ఒక్కతోపు తోశాడు. ఆ విసురుకు జగతి చాపమీదపడి, అచేతనంగా వుండిపోయింది. "జగతీ! నిన్ను పరాభవిస్తాను" అతను వెళ్ళి మృగంలా ఆమెమీద పడ్డాడు.
    మరుక్షణంలో ఓ బలమైన హస్తం అతని రెక్కపుచ్చుకుని అవలీలగా యివతలకు లాగి ప్రక్కకి విసిరేసింది. ఆ విసురుకు పది అడుగులు అవతలపడి, గోడకి బలంగా గుద్దుకున్నాడు. తలకి గాయమై "అబ్బా" అని మూలిగాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే ముఖంమీదా, మెడమీదా దెబ్బలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి. మార్కండేయుడు బాధతో మూలుగుతున్నాడు. అతనికి ఊపిరాడటంలేదు. కళ్ళు తెరిచి చూడటానికి కూడా సాధ్యపడటంలేదు. ఇంతలో ఆ బలమైన హస్తం అతని మెడని పుచ్చుకుని బరబర గుమ్మంవరకూ గెంటి, అవతలకు ఒక్కతోపు తోసింది. "అప్రాచ్యుడా! తెల్లారేలోగా యీ ఆశ్రమం విడిచిపెట్టి వెళ్ళిపో."
    ఈ గొంతు అతను గుర్తుపట్టాడు. రక్తం గడ్డకట్టిపోయింది. ఎలాగో లేచి నిలబడి సర్వశక్తి కూడదీసుకుని ఆ కటికచీకట్లో తూలుకుంటూ నడవసాగాడు.
    ఆయన వెళ్ళి మూలనున్న కూజా తీసుకుని వచ్చి, అందులోని నీళ్ళు ఆమెముఖంమీద చిలకరించసాగాడు. కాసేపటికి జగతి కళ్ళు విప్పింది. ఎదురుగా ఆజానుబాహువైన విద్యాధరస్వామి గంభీరమూర్తి కనిపించింది. చకితనేత్రయై అలానే చూస్తున్నది. ఏం జరిగింది? మార్కండేయుడేమైనాడు?
    "లే జగతీ! లేచి కూర్చో."
    ఆమె లేవటానికి ప్రయత్నించి విఫలురాలైంది. శరీరమంతా విపరీతమైన నీరసం క్రమ్మివేసింది. అసలే ఉపవాసాలు చేసి చేసి ఆమె యీమధ్య కృశించి పోతోంది. దానికితోడు యీ దారుణ సంఘటన.
    ఆమె అశక్తత గ్రహించి స్వామి వొంగి ఆమె భుజాలు పట్టుకుని మెల్లిగా లేవదీసి కూర్చోపెట్టాడు. మరుక్షణం జగతి ఆయన పాదాలను స్పృశించి, వాటిమీద ముఖం ఆన్చి విలపిస్తోంది. ఒకనిముషం మెదలకుండా ఊరుకుని ఆమె తల నిమురుతూ "దుఃఖించకు జగతీ!" అన్నారు స్వామి మృదుకంఠంతో.
    ఆమె ఆయన పాదాలను విడిచిపెట్టి కుదురుగా కూర్చుని ఆయన దీర్ఘాకృతి వంక ఒకసారి భీతహరిణలా చూసింది. తరువాత "స్వామీ! నేను ఆశ్రమంలోకి అడుగుపెట్టి యిక్కడ వాతావరణం కలుషితం చేస్తున్నాను. అపరాధాన్ని గుర్తించాను. నా పాపానికి మితిలేదు. ఇక్కడ సంక్షోభం లేవదియ్యలేను, అనుజ్ఞయివ్వండి. సెలవు తీసుకుంటాను" అంది దీనస్వరంతో.
    "జగతీ! నీవెక్కడినుండి వచ్చావు?" ఆయన గంభీరవాక్కు ప్రశ్నించింది.
    "పాపంలోంచి."
    "తిరిగి ఎక్కడకు పోతావు?"
    "శూన్యంలోకి."
    "శూన్యం! ఈ విశాల విశ్వంలో నీవు శూన్యాన్ని దర్శించగలవుగాని శూన్యంలో జీవించలేవు. ప్రపంచమే మిధ్య అయినప్పుడు శూన్యం మరింత మిధ్య, భ్రమ, భ్రమని చూడగలవుగాని పొందలేవు. నీకు చిక్కేది నిరంతర సమస్యలతో కూడిన నిజమైన మనుగడే."
    "పోనీ చచ్చిపోతాను. నాకు చావంటే భయంలేదు."

 Previous Page Next Page