Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 32


    అతను కళ్ళు తెరిచేసరికి ఒక ప్రక్కమీద పడుకుని వున్నట్లు తెలిసింది. ఓ గదిలో వున్నట్లు గ్రహించాడు. ఆ గది సుపరిచితమైనట్లుగా తోచింది. బెడ్ లైటు సన్నని వెల్తురు మందంగా ప్రసరిస్తోంది.
    మాలతి కంఠం వినిపించింది. "ఎలా వుంది మృత్యుంజయరావుగారూ?" అతను తలత్రిప్పి చూశాడు. మాలతి అతని మంచానికి దగ్గరగా కుర్చీలో కూర్చుని అతని ముఖంలోకి ఆతృతగా చూస్తోంది. తను పశుపతిగారింట్లో వున్నాడు.
    వళ్ళంతా పచ్చిపుండులా, సమ్మెట్లు పెట్టి కొట్టినట్లుగా వుంది. 'బాగానే వుంది' అన్నట్లు తల ఊపాడు.
    "మంచినీళ్ళు కావాలా?"
    కావాలన్నట్లు తల ఆడించాడు.
    బల్లమీద గ్లాసు తీసి, తన కోమలహస్తంతో చెంచా పట్టుకుని, అతని నోట్లో కొంచెం కొంచెం పోస్తోంది. అది గ్లూకోజ్ వాటర్. మధురంగా వుంది.
    "శేఖరంగారూ, నేనూ సినిమాకి వెళ్ళాము. తిరిగివచ్చేటప్పుడు ఆయనకు భరించలేని తలనొప్పి వచ్చింది. అందుకని మళ్ళీ యింతదూరమెందుకని, ఆయన వస్తానంటున్నా బలవంతంగా పంపాను. ఒక్కదాన్ని రిక్షాలో బయల్దేరాను. దాని ఫలితమిది. మీరు పడిపోయాక, ఆ గడబిడకు బీటు తిరుగుతూన్న ఘూర్ఖా అటు వచ్చేసరికి దుర్మార్గులు కాలికి బుద్ధి చెప్పారు. ఘూర్ఖా సాయంతో మిమ్మల్ని యింటికి తీసుకువచ్చాను. నావల్ల మీరు చాలా దెబ్బలు తిన్నారు" అంది మాలతి అతని నోట్లో గ్లూకోజ్ నీళ్ళు పోస్తూ, విచారం ధ్వనిస్తూన్న కంఠంతో.
    అతనికి హఠాత్తుగా దుఃఖావేశం కలిగింది. ఆ సమయంలో మాలతి తనదనిపించింది. ఆమె సమాధానం తనగుండెల్ని చీలుస్తుందని తెలుసు. అయినా అడిగెయ్యాలనుకున్నాడు. అడగాలన్న కోరికను నిగ్రహించుకోలేక అడిగాడు.
    అతను ఆకస్మికంగా తన పెదవులమీద నర్తిస్తోన్న ఆమెచేతిని పట్టుకున్నాడు. గుండెలమీదకు లాక్కున్నాడు. "మాలతీ!... మీరు... మీరు నాకు కావాలి. కాదనకండి" అన్నాడు గాద్గదిక కంఠంతో.
    అతని గుండెమీద ఆమెచెయ్యి ఒణికింది. నిర్ఘాంతపోయినట్లూ, అందులోంచి క్రమంగా కోలుకుంటున్నట్లూ గోచరించింది. అతని చేతిలోంచి మృదువుగా తనచేతిని విడిపించుకుంది.
    "క్షమించండి. మిమ్మల్నా దృష్టితో ఎప్పుడూ చూడలేదు. నా మనస్సు ఇంకొకరికి అంకితమైపోయింది!"
    అంతే! ఈ సమాధానం వినటంకోసమే అతడామెను అర్థించాడు. ఈ ఒక్క స్నేహమాధుర్యమూ అతను పోగొట్టుకున్నాడు.
                         14
    మ్ముడ్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత జగతి పిచ్చిదానిలా తిరిగింది. రైళ్లు ఎక్కింది. రైళ్ళు దిగింది. సత్రాలలో పడుకుంది. రెండురోజులకు ఓసారి నాలుగుపళ్ళు కొనుక్కుని తినేది. అందమైన స్త్రీ వంటరిగా తిరుగుతూ కనిపించే సరికి యువకులు వెంటబడ్డారు. ఆమెకు వారితో దెబ్బలాడే ఓపికగానీ, వాళ్ళను ఆడించే పూర్వపు మనస్తత్వంగానీ లేదు. వారి బారినుంచి రక్షించుకోవటం పెద్దసమస్య అయింది.
    రోజులు గడిచిపోతున్నాయి. మనిషి క్షీణించిపోయింది. కట్టుకున్న బట్టలు చిరిగి పీలికలైపోతున్నాయి. ముఖంలో కాంతి నశించిపోతోంది. గంటలకి గంటలు ఏ పార్కులోనో, చెట్టుక్రిందో నిలబడి ఆలోచిస్తుంది. తనలో తను నవ్వుకుంటుంది. ఏడుస్తుంది. గొణుక్కుంటుంది. కొంతమంది జనం ఆమెను పిచ్చిదనుకుని గేలిచేశారు. ఆకతాయి కుర్రాళ్ళు రాళ్ళు రువ్వారు. అయినా ఆమె ఎవర్నీ ఏమీ అనలేదు. శపించలేదు. శూన్యంలోకి చూస్తూ వూరుకునేది.
    ఒక సూర్యాస్తమయం సమయాన జుట్టు విరబోసుకుని, చిరిగిన దుస్తుల్లో వున్న జగతి ఏదో ఆలోచన మెరిసి నిలువునా లేచి నిల్చున్నది. అస్తమించే భాస్కరుని శోణిమకాంతులు ఆమె ముఖంమీద పడి, ఎర్రగా వెలిగిపోతున్నది. ఆమె నేత్రాలుకూడా ఎర్రగా మెరుస్తున్నాయి.
    'నేను వెళతాను. ఆయన దగ్గరకు- ఏది ఏమైనా కానీ' ఆమె నిశ్చయించుకుంది. కుదిరింది.
                                                 *    *    *
    తెల్లవారింది. తూర్పురేఖలు విచ్చుకుని, బాలభానుని లేతకిరణాలు భూమిని మృదువుగా తాకసాగాయి. విద్యారణ్యస్వామి మాధవీపురంలోని తను ఆశ్రమంలో పూజా పునస్కారాలు పూర్తిచేసుకుని, వెలుపలకు వచ్చి నిలబడి, దూరంగా గోచరించే పర్వత కనుమలవంక చూస్తున్నాడు.
    కాసేపటికి ఆయన దృష్టి మళ్ళించి, మరో దిక్కుకుచూసి త్రుళ్ళిపడ్డాడు. దూరం నుంచి వడివడిగా నడిచివస్తోన్న ఆ యువతి... ఆయన కనులు పెద్దవైనాయి. శరీరంలో విద్యుల్లత ప్రవహించింది.
    మరుక్షణంలో కోపంతో, ఉద్రేకంతో ఆయనముఖం ఎరుపెక్కింది. "చివరకు యిక్కడకూ వస్తావా నువ్వు? నా పిరికితనాన్ని ఎత్తి చూపటానికి వస్తున్నావా? నన్ను లోకంముందు దోషిగా నిలబెట్టటానికి వస్తున్నావా? నా పతనం చూడదలిచావా? నీకు యిక్కడ స్థానం లేదు. నిన్ను యిక్కడ్నుంచి వెళ్ళకొడ్తాను. ఒక్క నిముషమైనా నువ్విక్కడ వుండటానికి వీల్లేదు" మనసులో శపిస్తున్నాడు.
    జగతి ఆయన్ని సమీపించింది. ఆయన ముఖంకేసి తదేకంగా చూస్తున్నది.
    స్వామి చకితుడై చూస్తున్నాడు. అప్పటి జగతేనా యీమె? ఈ కృశాంగిని, యీ అమాయకురాలిని, యీ కరుణామూర్తిని తను వెళ్ళకొట్టగలడా?
    జగతికూడా ఆశ్చర్యంగా తన విశాలనేత్రాలను మరింత విశాలం చేసి అవలోకిస్తోంది. "ఇతడా తన స్వామి! ఎంత చిక్కిపోయాడు! ఎంత దీనవదనుడై పోయాడు! ఏదీ ఆ గాంభీర్యం?
    "స్వామీ!" ఆమె పెదవులు ఉచ్ఛరించాయి.
    "జగతీ!"
    ఆమె ఆయన పాదాలమీద వాలిపోయింది. కన్నీటితో వాటిని అభిషేకం చేస్తోంది.
    "లే జగతీ! దుఃఖించకు అలా."
    "నాకు రక్షణ యివ్వండి స్వామీ! ఆశ్రయం యివ్వండి."
    "ముందు లేచి నిల్చో జగతీ! నాకు అర్ధమయ్యేటట్లు మాట్లాడు."
    ఆమె ఆయన పాదాలు విడిచిపెట్టి లేచి నిల్చుని కళ్ళు తుడుచుకుంటూ అంది. "స్వామీ! ఈ క్షణాన నాకు ప్రపంచంలో ఎవరూ లేరు, హతభాగినిని. అనుక్షణం ఏదో అశాంతి నన్ను కాలుస్తుంది. మనస్సు యిక్కడికే తెచ్చింది. ఎంతో నిగ్రహించుకుందామని ప్రయత్నించాను. ఆ ఊహతో నేను తిరిగాను గాని, నాకు చేతకాలేదు. నేను వెళ్ళవలసిన చోటు యిదే. ఇదే అని మనసు ఘోషించింది. వచ్చేశాను మరి."
    స్వామి అయిదునిముషాలు ఆలోచిస్తూ వూరుకున్నాడు. ఆలోచనలోని తీవ్రతతో ఆయన కళ్ళు మెరుస్తున్నాయి. చివరకు అన్నారు. "ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఎందుకోసం నీవు వున్న ఊరు వదిలి, నా ఆశ్రమానికి వచ్చి చేరుకున్నానో, ఆ ఆశయం ఫలించలేదు. సరే, ప్రకృతిశక్తుల్ని ప్రతిఘటించటానికే నేనూ నిశ్చయించుకున్నాను. ఈ పోరాటంలో అంతిమ విజయం సాధించి తీరుతాను. జగతీ! నువ్వు ఎక్కడికీ వెళ్ళవద్దు. ఇక్కడే వుండు. నా ఆశ్రయంలోనే జీవించు. ఇన్నాళ్ళూ నేను చేసిన సాధన ఎందుకు కొరగాకుండా పోతుందో, ఎందుకు భగ్నమవుతుందో నేనూ చూస్తాను" అని "శంకరా! శంకరా!" అని ఎలుగెత్తి పిలిచారు.
    లోపలనుండి అంగోస్త్రంతో వున్న ఒక శిష్యుడు పరిగెత్తుకు వచ్చి, ప్రశ్నార్థకంగా ముఖంపెట్టి నిలుచున్నాడు.
    "ఉత్తరంవైపు ఏకాంత కుటీరంలో నేటినుంచీ ఈ యువతి నివసిస్తుంది. ఈమెకు కావలసిన సదుపాయాలూ చూడు" అని జగతివంక తిరిగి, అతనివెంట వెళ్ళమన్నట్లు చూశాడు. ఆమె చేతులు జోడించి ఆయనకు నమస్కరించి, శిష్యుడ్ని అనుసరించింది.
                     *    *    *
    ఆశ్రమ ప్రాంగణంలోనే ముఖ్యమందిరానికి ఉత్తరంగా వున్న చిన్న కుటీరం ఆమెకు యివ్వబడింది. అందులో పూర్వం వృద్ధురాలైన ఓ భక్తురాలుంటూ వుండేది. కొద్దినెలలక్రితం ఆవిడ చనిపోయింది. అప్పట్నుంచీ స్త్రీలెవరూ లేని కారణంచేత ఆ చిన్నకుటీరం ఖాళీగా వుంటూవచ్చింది. ఇప్పుడు జగతి అందులో ప్రవేశించి దీపం వెలిగించింది. ఆ గ్రామంనుండే ఆమెకు నేతచీరెలూ, స్వయంపాకానికి కావలసిన వస్తుభండారమూ పంపబడేది. వేకువ చీకట్లతోనే జగతి నిద్రలేచి, స్నానాదికాలు ముగించుకుని, పూజాపునస్కారాలు చేసుకునేది. ధవళవస్త్రధారిణియై ఆమె సూర్యనమస్కారాలాచరిస్తూంటే అక్కడి శిష్యులకు నేత్రపర్వంగా వుండి, ముగ్ధులై తిలకిస్తూ వుండేవారు. ఎనిమిది గంటలు అవుతూండే సమయానికి ఆశ్రమంలో సంయుక్తంగా ప్రార్థనలు జరిగేవి. దానికి ఆశ్రమవాసులతోబాటు వూళ్ళోని ప్రజలుకూడా కొంతమంది హాజరయేవారు. తర్వాత స్వామి శిష్యులతోనూ, తనని దర్శించటానికి వచ్చిన జనులతోనూ ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటిస్తూ వుండేవారు. మధ్యాహ్న సమయాల్లో గ్రంథపఠనం చేస్తూ స్వామి కాలం వెళ్ళబుచ్చేవారు. జగతికూడా ఆయన ఆయన దగ్గరనుంచి పుస్తకాలు తెచ్చుకుని మధ్యాహ్నమప్పుడు చదువుతూ కూర్చునేది. సాయంత్రం తిరిగి భజన, ఆధ్యాత్మిక సమావేశాలు, వేదాంతగాథ. ఉదయంకన్నా ఎక్కువమంది జనులు పాల్గొనేవారు. రాత్రి పొద్దుపోయేవరకూ ఎవరో ఒకరు ఆయన్ని ఏవో ప్రశ్నలు అడిగి సందేహాలు తీర్చుకుంటూ వుండేవారు. స్వామిని దర్శించటానికి చుట్టుప్రక్కల ఊళ్ళనుండికూడా భక్తులు తరచు వస్తూ వుండేవారు. అలా వచ్చినవారు రెండుమూడు రోజులు ఆశ్రమంలో గడిపి తిరిగి వెళ్ళిపోతూండేవారు. 
    మాధవపురంలో జగతి జీవితం చాలా ప్రశాంతంగా గడిచింది. స్వామిని చూసినప్పుడు, ఆయనతో గడిపినప్పుడు మనసునిండా స్వచ్చమైన నైర్మల్యం, పవిత్ర అనుభూతులు తప్ప మరోభావం కలగటంలేదు. ఒక్కొక్కప్పుడు తన నిశ్చలత్వం తనకే ఆశ్చర్యం గొలుపుతూ వుండేది. ఆశ్రమానికి వచ్చాక ఆమె ఊళ్ళోకి కూడా ఎక్కువసార్లు పోలేదు. ఒకటి రెండుసార్లు శివాలయానికి వెళ్ళి వచ్చింది. మొదట్లో స్నానం చేయటానికి ఏటికి వెళ్ళేదిగాని, తడిసిన చీరెతో తిరిగివస్తూన్న తనవంక జనం వింతగా చూడటం చూసి, అక్కడకు కూడా వెళ్ళటం మానేసింది.
    అయితే ఆశ్రమంలో ఆమెకు కలవరపాటు లేకపోలేదు. శిష్యులంతా వయసులో చిన్నవాళ్ళు, వాళ్ళది మూఢభక్తి. విద్యాబోధనకోసం వచ్చినట్లు, కొన్నాళ్ళపాటు ఆశ్రమంలో వుండి, స్వామికి సేవలుచేసి, తరించి, భగవంతుడ్ని గురించి విజ్ఞానార్జనచేసి, తిరిగి యిళ్ళకు వెళ్ళిపోయి సంసారయాత్ర సాగిద్దామన్న ఊహ చాలామందికి వుంది. వారిలో చాలామంది మధ్య మధ్య గృహాలకి పోయి వస్తూండేవారు. డబ్బూ దస్కం తెచ్చుకుంటూ వుండేవారు.

 Previous Page Next Page