దూరంగా రెండో జవాను అటు తిరిగి ఏదో వ్రాస్తున్నాడు. నన్నుచూసి లేచి నిలబడ్డాడు. డాక్టర్ రిపోర్టు తీసుకురమ్మన్నాను అతడిని.
ఈ లోపులో మొదటి సెంట్రీ తలుపు తీశాడు.
మెట్లెక్కినట్టు నటించి, మెట్లక్రింద ఉన్న మెయిన్ చటుక్కున ఆపాను. ఇదంతా కనురెప్పపాటులో జరిగిపోయింది.
కరెంటు పోగానే ఆటోమాటిక్ గా వెలగాల్సిన ఎమర్జెన్సీ లాంతరు వెలగలేదు. సెంట్రీకి ఆలోచించుకునే టైమ్ ఇవ్వకుండా, గొంతులోకి కఠినత్వం తెచ్చుకుని "ఏమిటిది నాన్సెన్స్. ఇదేనా మెయిన్ టెనెన్స్?... ఎవరున్నారు పైన? కోటిలింగం వుంటే రమ్మను. వైర్లు చూస్తాడు" అన్నాను అధికారయుక్తంగా. అతడు కూడా కంగారుగా పైకి పరిగెత్తాడు.
తెరచి వున్న గేటు తలుపుల్లోంచి బయట ప్రపంచం కనబడుతూంది. అక్కణ్ణుంచి చల్లటి గాలి రివ్వున లోపలికి వీస్తూంది.
వెనక్కి తిరిగి రమ్మన్నట్టు చెయ్యి వూపాను.
అట్నుంచి అలికిడి లేదు.
ఒక్కసారిగా నాలో రక్తకణం హెచ్చింది. పరుగెత్తుకుంటూ పొదల దగ్గిరకి వెళ్ళాను. "వెళ్ళు" రొప్పుతూ దాదాపు అరిచాను. "పరుగెత్తు.... టైమ్ లేదు."
అతడు మెయిన్ గేటువైపు వెళ్ళాడు.
నా గుండె వేగంగా కొట్టుకుంటూంది. చూస్తూ నిలబడ్డాను.
ఏ క్షణమైనా సెంట్రీలు మెట్లు దిగవచ్చు. ఏ ఒక్కరు చూసినా చేసినదంతావృధా అవటమే కాక అక్కడికక్కడే అతడిని కాల్చి చంపెయ్యవచ్చు.
రెండు సెకన్లు గడిచాయి.
... నాలుగు సెకన్లు.
నేను నెమ్మదిగా ఆఫీసువైపు నడిచాను.
చీమ చిటుక్కుమంటే వినబడేతంత నిశ్శబ్దంగా వుందక్కడ.
కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి.
అంతలో మెట్లమీద అలికిడి వినిపించింది.
సెంట్రీ బ్యాటరీలైటు పట్టుకుని దిగుతున్నాడు. వెనుకే కోటిలింగం. నిముషం తరువాత లైట్లు వెలిగాయక్కడ.
హల్లో ఎవరూ లేరు.
15
ఇంటికి వెళ్ళటానికి అయిదు నిముషాలు పట్టింది. దగ్గరకి వేసిన తలుపులు వేసినట్టే వున్నాయి. అమ్మా అలాగే శిలాప్రతిమలా కూర్చుని వుంది.
"అమ్మా" అన్నాను దగ్గిరగా వెళ్లి! నిలబడి వుండటంవల్ల నా నీడ నాకన్నా పొడుగ్గా కనబడుతూంది.
"నాన్నని విడిపించాను. దూరంగా పంపించేశాను."
నా మాట ఆమెకు అర్ధమైందో లేదో- చాలాసేపటివరకూ అలాగే వుండిపోయింది.
"నాన్నని జైలునుంచి తప్పించానమ్మా. నాన్న పారిపోయాడు."
అమ్మ నెమ్మదిగా తలెత్తింది. నేను చెప్పింది అర్ధమైనట్టు క్రమక్రమంగా ఆమె మొహంలో మార్పు వచ్చింది. 'బాబూ' అంది ఒక్కసారిగా చేతులు సాచి... ఆ చేతుల్లో ఒదిగిపోయాను.
స్త్రీ సహజమైన ఉద్వేగంతో ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది. తెల్లవారేసరికల్లా వచ్చెయ్యవలసిన ఉప్పెన, తృటిలో తప్పినందుకు ఆనందంతో వస్తూన్న దుఃఖం అది. నెమ్మదిగా అది సర్దుకుంటూ ఉండగా, ఏదో అనుమానం మనసులో ప్రవేశించినట్టు తలెత్తింది.
"బాబూ! ఇది- ఇదంతా నీ మీదకు రాదట్రా?"
అబద్ధం చెప్పలేకపోయాను. అమ్మ జైల్లో పనిచేసింది. తనకీ ఆ రూల్సూ, శిక్షలూ తెలుసు.
నేను చేసిన పని చెప్పాను.
అమ్మ మొహం రక్తం లేనట్టు ఇంకిపోయింది. నేను చెప్పటం పూర్తి చేయగానే "అయ్యో" అంది అప్రయత్నంగా.
"వాళ్ళు నిన్నొదలర్రా. రెండ్రోజుల్లో అంతా తెలుసుకుంటారు."
రెండ్రోజులు అఖ్ఖర్లేదు. రేప్రొద్దున్నకల్లా అంతా తెలిసిపోతుంది. సెంట్రీకి స్పృహరాగానే అలజడి మొదలవుతుంది.
అమ్మ అంటూంది- "ఎందుకుచేశావురా ఇలా? ఎందుకు ఇంత తొందరపడ్డావ్? ఇప్పటివరకూ భర్తకోసం బాధపడ్డాను. ఇకముందు కొడుకుకోసం ఏడవాలని నా నుదుట వ్రాసి వుందేమో, భగవంతుడా నేనేం చేసేది" అంటూ కుమిలిపోయింది.
ఇంక చెప్పెయ్యాలి, చెప్పవలసిన సమయం వచ్చింది. కొంచెం కటువుగా వున్నా నా మనసులోని భావాల్ని చెప్పక తప్పదు.
"అమ్మా" అన్నాను. "-ఇదంతా నా తండ్రికోసం చేయలేదు. నా తండ్రి నా చిన్నప్పుడు వెట్టిచాకిరీ నుంచి నన్ను రక్షించాడన్న కృతజ్ఞతతోనూ చేయలేదు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు ఏమీ మారలేదు. అందుకోసం చేశాను. ఈ విషయాన్ని నా అనుభవంతో గ్రహించి నాన్నని వదిలి పెట్టాను. ఎంతోమంది నారాయణలకు నాన్న అవసరం వుంది. అతడు వారికి దేవుడమ్మా. ఈ వ్యవస్థ మారేవరకూ ఆ దేవుడి అవసరం వారికి చాలా ఉంది. ఎంతోమంది మంగల కోసం, లక్ష్మిల కోసం నాన్నని వదిలి పెట్టాను.
అమ్మా... మరొక్క విషయం చెప్పనీ, ఇది వినటానికి కటువుగా వుండవచ్చు. అయినా చెబుతాను. నాన్నేగానీ మామూలు దొంగ అయివుంటే, ఏదో ఒక హత్యా నేరం మీద ఇక్కడికి వచ్చి ఉంటే, నేను నా చేతుల్తో స్వయంగా తనని ఉరి తీసి వుండేవాడిని. నా చేతుల్తో నేను స్వయంగా నీ బొట్టు చెరపవలసి వచ్చినా అందుకు వెనుకాడే వాడిని కాను. అంత కర్కోటకుడిని నేను! కానీ అమ్మా!! ఇక్కడ నేను విడుదల చేసింది నా తండ్రిని కాదు. గండ్రగొడ్డలిని!!!... అందుకు నా ప్రాణం పోయినా సరే నేను బాధపడను. దయచేసి నన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించు-"
అమ్మ దగ్గిరగా వచ్చింది. అనూహ్యమైన సంభ్రమంతో ఆమె కళ్ళు మెరవటం చూశాను. ఒక విశ్వవ్యాప్తమైన వెలుగు దగ్గిరకి వచ్చి నన్ను చుట్టుముట్టినట్టు, ఆకాశం నుంచి వెండి దారపు పోగులు జలజల రాలినట్టు, ఒక పుడమి తల్లి ఆప్యాయంగా తన బిడ్డని స్పృశించినట్టు-
అమ్మ నా నుదుట ముద్దు పెట్టుకుంది.
* * *
ఆ రాత్రి హాయిగా నిద్రపట్టింది. నిద్రలో ఒక కల....
రెండో సెంట్రీ ఎంతకీ కనబడకపోయేసరికి కొత్తగా డ్యూటీకి వచ్చిన జవాను వెతికాడు. పొదల్లో స్పృహతప్పి వున్న సెంట్రీని చూడగానే విజిల్ వూదాడు.
గండ్రగొడ్డలి తప్పించుకుపోయిన వార్త క్షణాల్లో పాకిపోయింది...
రాజారాంకి కబురు వెళ్ళింది. అంతా హడావుడి...
ఎక్కడా తాళ్ళూ, సొరంగాలూ కనబడలేదు. గేటు దగ్గిర సెంట్రీలు అర్ధరాత్రి నేను వచ్చినట్టు చెప్పారు. జనరేటర్ వైరు తెగి వుండటం కనిపించింది. సి.బి.ఐ. ఇన్ స్పెక్టర్ రమేష్ వర్మ రంగంలోకి దిగాడు.
సరీగ్గా నాలుగైదు గంటల ఇన్వెస్టిగేషన్ లో అంతా నేను చేశానని తేలిపోయింది. నేను చేశానని వప్పుకున్నాను. జైలంతా దిగ్భ్రాంతి చెందింది.
రమేష్ వర్మ పాత పాటే మొదలు పెట్టాడు. చాలా ప్రతిష్టాకరమైన జైలు.... ఈ వార్త బయటకొస్తే బాగోదు... ఎలాగు శిక్ష తప్పదు వగైరా వగైరా. కేసు రహస్యంగా ముగియటానికి నేనొప్పుకోలేదు. ఈ కేసు కోర్టుకి వెళ్ళాలి. నా వాదన ప్రపంచం అంతా వినాలి. నేను చావబోయే ముందు నా వాదనతో కనీసం ఒక్కరినైనా మార్చాలి.
"మైలార్డ్! చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని నేను. జైలంటే నాకు చాలా ఇష్టం. ఎంతో నమ్మకంగా ఇంతకాలం ఈ జైలులోని ఖైదీలకి కాపలా కాస్తూ వచ్చాను. కానీ మైలార్డ్! ఈ జైలు బయట మరొక జైలుంది అన్న విషయం నాకు మొన్నే తెలిసింది. మన పక్క ప్రపంచంలోనే ఎంతోమంది అమాయకులు ఆ జైల్లో కుళ్ళిపోతున్నారు. చిన్న పిల్లలు వెట్టి చాకిరీ చేస్తున్నారు. వాళ్ళు తమకి జరిగిన అన్యాయాలు చెప్పుకోవటం కోసం తహసిల్ ఆఫీసుల చుట్టూ తిరగలేరు. ఐ.పి.పిటీషనులు పెట్టి అప్పు మాఫీ చేయించుకోలేరు. లాయర్లని నియమించుకోలేరు. ఉరుములా ఊర్లోకి వచ్చి, మెరుపులా అడవిలోకి మాయమయ్యే గండ్రగొడ్డలి ఒక్కడే వారికి ఆధారం! గత వారం రోజుల్లో నేను తెలుసుకున్న నగ్నసత్యం ఇది!! నేనేగానీ, మరే ఆఫీసర్ గానీ, మేధావి గానీ, పల్లెల్లో వుండే వడ్డీ వ్యాపారస్తుల్నీ, కామందుల్నీ వాళ్లు చేస్తున్న నేరాలకి మన రాజ్యాంగం ద్వారా గానీ, చట్టబద్దంగా గానీ బంధించే ఒక్క ఆలోచన చెప్పలేరు. అలా చెప్పగలిగిననాడు నేను చేసింది నేరం అవుతుంది. పూర్తిగా వ్యవస్థన్నా మారాలి. లేకపోతే 'వాళ్ళ'కి గండ్రగొడ్డలి భయమన్నా ఉండాలి. కేవలం అయిదురూపాయల పెట్టుబడితో ఒకడు, దేశపు అమాయకుల అయిదు లక్షల విలువ గల శ్రమశక్తిని దోచుకుంటుంటే వాడిని మీరు శిక్షించరు, కాని శిక్షించేవాడిని శిక్షిస్తారు. ఇదెక్కడి న్యాయం? మీ రక్షణ పల్లెపల్లెకూ పాకాలి. మనిషి మనిషికీ చేరాలి. పంట చేతికొచ్చిన రైతుకి 'అది తన నోటికి దక్కుతుంది' అన్న నమ్మకం కుదరాలి. నెలల నిండిన తల్లికి ఆ బిడ్డతనకు దక్కుతాడు అన్న నమ్మకం కుదరాలి. అలా కుదిరిన రోజున గండ్రగొడ్డలి అవసరం మనకు లేదు. దీన్ని నేను మనసావాచా నమ్ముతున్నాను. వేయి అరచేతులు కూడా నా గొంతును ఆపలేవు. ఈ... న్యా... య... స్థా... నా... లూ... ఈ..."
"ఆర్డర్... ఆర్డర్...." జడ్జిమెంటు చదవటం మొదలుపెట్టాడు. "ధర్మారావు (దామోదరం) అనే ప్రజా ప్రతినిధిని చంపి, చిదానందం అనే ప్రముఖ వ్యాపారవేత్త చెయ్యి అమానుషంగా నరికి, కృష్ణమూర్తి అనే పేరుతో పోలీస్ ఎన్ కౌంటర్లలో పాల్గొన్న గోపీచంద్ అనే ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తున్నాను. హి విల్ బి హాంగ్డ్ బై నెక్ టెల్ హి డైస్."
....
మెడ ఎముక విరిగిన చప్పుడుతో మెలకువ వచ్చింది.
భయం వెయ్యలేదు. నవ్వొచ్చింది. మనసు స్థితి కల తెలుపుతుందంటారు.
అప్పటికే బాగా తెల్లారిపోయింది. గబగబా తయారై జైలుకి వెళ్ళాను. రాజారాం పెనంమీద ఆవగింజలా ఎగురుతూ వుంటాడని నా వూహ. వైర్ లెస్ మెసేజీలూ, పోలీస్ జీపులూ- అంతా హడావుడిగా వుంటాయి.
ఉరితీత ఖైదీని ప్రతీ అరగంటకీ గమనించాలి. కాబట్టి రెండు గంటల ప్రాంతంలో అతడు తప్పించుకుపోయినట్టు తెలుస్తుంది. రాజారాం ఏ మాత్రం కాస్త ఎంక్వయిరీ మొదలు పెట్టినా నా సంగతి తెలిసిపోతుంది. వెంటనే అరెస్ట్ చేస్తాడా? పది గంటల వరకూ ఆగుతాడా అనేది చూడాలి. తప్పించుకునే ఆలోచన నాకేదీ లేదు. తప్పించుకున్నా రెండు మూడు రోజుల్లో పట్టుకుంటారు. ఈ లోపులో అమ్మని వాళ్ళు అనవసరంగా బాధ పెట్టటం ఇష్టం లేదు. అదీగాక నాకు వచ్చిన కలలో నా వాదనని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను.
ఆలోచన్లతోనే జైలు గేటు సమీపించాను.
జైలు మామూలుగానే వుంది.
సెంట్రీ యధావిధిగా సెల్యూట్ చేసి తలుపు తెరిచాడు.
విద్యుద్ఘాతం తగిలినవాడిలా నిలబడిపోయాను.
లోపల అందరూ మామూలుగానే తమ కర్తవ్య నిర్వహణ కొనసాగిస్తున్నారు. నా మొహంలో మారుతున్న భావాలని ఎవరూ గమనించలేదు. ప్రేక్షకుడిలా మిగిలాను. ఒక సుడిగాలి నన్ను చుట్టుముట్టిన అనుభూతి కలుగుతుంది.