హెడ్ జవాను వచ్చి సెల్యూట్ చేశాడు. నా గొంతు తడారి పోయింది. ఎలాగో పెకలించుకొని అడిగాను - "ఏమైంది?"
"అంతా అనుకున్నట్టే జరిగింది సార్. ఏడింటికి గండ్రగొడ్డలిని ఉరి తీశారు."
నో... నో... నో.... వేయి గొంతుకలు నా చుట్టూ చేరి అరుస్తున్నట్టు అనిపించింది. అది కంకాళాల వికటాట్టహాసం కాదు. వాస్తవాల ఝణంఝణ ప్రతిధ్వని... హోరు.
యార్డ్ లోకి పరుగెత్తాను.
డాక్టర్ ధృవీకరణ జరిగిపోయినట్టుంది. బండిమీద శవాన్ని తెస్తున్నారు. తెల్లగుడ్డ కప్పి వున్నది.
గొంతులో దుఃఖపు పొర అడ్డుపడ్డట్టు ఆగిపోయాను.
నాన్నా... నా....న్నా.
బండిమీద శవం ముందుకు వస్తూంది. ఉరి తాలూకు ఛాయలు లేకుండా నిర్మలంగా వుందా మొహం. మనసుకీ నడవడికీ ఎంతో సంయమనం ఉంటే తప్ప ఆ నిర్మలత్వం రాదు. అంపశయ్యమీద భీష్ముడిలా వున్నాడు నాన్న. భూదేవి అందించిన నీళ్ళు తాగి మరణించిన సంతృప్తి. అతడి చుట్టూ పూలు లేవు. అన్నార్తుల బాష్ప జలాలున్నాయి. తల దగ్గిర ఊదొత్తులు లేకపోవచ్చు. అడవి దివిటీలున్నాయి. ఒక కారణం కోసం మరణాన్ని ఆహ్వానించిన వ్యక్తి అతడు. మామూలు మనుషులకు ఒక సూక్తి అతడు. మహారణ్యంలో మధ్యాహ్నపు నిశ్శబ్దం అతడు. దుఖాశ్రువుల మధ్య దావానలం అతడు.
వెనుకే వస్తూన్న రాజారాం నన్ను చూసి ఆగాడు. అతడి మొహంలో విషాదం తొంగి చూస్తూంది. ఎవరినన్నా ఉరి తీసినప్పుడు ఎంతటి ఆఫీసర్ల మనసైనా వికలమవుతుంది.
రాజారాం దగ్గరికి వచ్చాడు. నేనింకా షాక్ నుంచి తేరుకోలేదు. అతడు అన్నాడు- "శవాన్ని తీసుకెళ్ళటానికి ఎవరూ రాలేదు. ఇతడికెవరూ లేరనుకుంటాను."
"ఎందుకు లేరు? బయట జనాన్ని చూడలేదా?"
అతడు నా వైపు విస్మయంగా చూసి "వాళ్ళకెలా అప్పగిస్తాం? రూల్స్ వప్పుకోవు. మున్సిపాలిటీకి ఫోన్ చేస్తాను."
"అఖ్ఖర్లేదు-"
"మరి?"
"నేను తీసుకెళ్తాను..."
"నువ్వా?"
"అవును."
"గండ్రగొడ్డలి..."
"నా తండ్రి."
చాలాసేపు అతడు నిర్విణ్ణుడై చూసి "రాత్రి నువ్వొచ్చింది?...." అని ఆగాడు.
"... అందుకే" అంతకన్నా ఎక్కువ చెప్పలేదు.
కానీ, ఒకటీ ఒకటీ కలుపుతే రెండవుతుందని ఊహించలేనంత అమాయకుడు కాదు రాజారాం. అతడూ పోలీసు ఆఫీసరే. అతడి కళ్ళల్లో ప్రశ్న- నా చూపులో సమాధానం - కేసు క్లోజ్ చేస్తున్నట్టు తల పంకింపు. నేను చేసిన ప్రయత్నం అతడికి అర్ధమై వుండొచ్చు. "గండ్రగొడ్డలి మరణానికి ముందు ఆఖరి కోరిక- నీ కివ్వమని-" అంటూ జేబులోంచి కాగితం తీసి ఇచ్చాడు. మౌనంగా అందుకున్నాను. భుజం మీద చెయ్యి వేసి "...సారీ" అన్నాడు. అతడి కంఠంలో సిన్సియారిటీ ధ్వనించింది.
"ఇట్సాల్ రైట్" అన్నాను. ఎక్కువ మాట్లాడేకొద్దీ నా గొంతులో జీర దుఃఖంగా మారుతూంది.
మా జైలు తలుపులుచాలా పెద్దవి. ఎప్పుడో గానీ తెరుచుకోవు. అందులోంచి బండి బయటకు వెళుతూంది. లోపలికి వచ్చే జీవాలు. బయటకు వెళ్ళే శవాలు.
రాజారాం సెల్యూట్ చేశాడు.
ఫేర్ వెల్ సెల్యూట్.
* * *
మంటలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఎర్రటి మంటలు. వెనుక మౌనంగా జనం.
వ్యవస్థని శాసించిన చెయ్యి మంటల్లో కాలుతూంది.
జేబులోంచి ఉత్తరాన్ని తీసి మరోసారి చదివాను.
"బాబూ! నా కన్నా!
ఈ ఉత్తరం చదివే సమయానికి నేనుండను. కానీ ఈ క్షణం నా మనసు ఎంత ఆనందంగా ఉందో ఎలా చెప్పన్రా నీకు? కళ్ళనిండా నీళ్ళు అలుక్కుపోయి అక్షరాలూ కూడా కనిపించటంలేదు. అయితే ఈ కన్నీళ్ళు ఆనందం వల్ల వచ్చినవి! నా కొడుకు సమస్యని అర్ధం చేసుకోవగలగటమే కాదు. దాన్ని పరిష్కరించటానికి తన ప్రాణాల్నే బలి ఇవ్వబోయాడు. ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించబోయే తండ్రికి ఇంతకన్నా పెద్ద బహుమానం ఇంకేముంటుందిరా? కానీ బాబూ! దీనికి నేను ఎలా వప్పుకుంటాననుకున్నావు? నేను బయటపడిన మరుక్షణం నీకు పడబోయే శిక్ష ఏమిటో నాకు తెలుసు. ఈ జైలు గౌరవానికి భంగం కలిగించే ఏ వ్యక్తికైనా ఒకటే శిక్ష- మరణం! అంటే నువ్వు దానికి కూడా సిద్ధపడే ఈ పనికి పూనుకున్నావన్నమాట. సిద్దాంతం పట్ల ఎంతో నమ్మకం, గౌరవం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అలాటి మరణానికే నువ్వు సిద్ధపడ్డప్పుడు ఇంత చిన్న వయసులో ఇంత అర్ధంతరంగా జీవితాన్ని ముగించేసుకోవటం దేనికిరా?
కన్నా! జీవితపు పశ్చిమార్థంలో వున్నవాడిని. నేనెందుకురా బ్రతకటం? అదే నువ్వయితే కనీసం ఇంకో పాతికేళ్ళయినా నాకన్నా ఎక్కువ కాలం దీన్ని ప్రచారం చేయగలవు. మరింత యువ రక్తంతో ఆదర్శాన్ని ప్రభావితం చేయగలవు. ఒక్కసారి 'మరణ భయం' పోయిన నీలాంటివాడు జీవితంలో ఎన్నో సాధించగలడు.
-సెంట్రీలు లేని గదిలో, బయటకు వెళ్ళిపోవటం కోసం తెరిచిన తలుపు దగ్గిర నిలబడి ఇదేరా నేను ఆలోచించింది! అందుకే వెనక్కి తిరిగి, లోపలికి వెళ్ళిపోయాను.
మనిషి మనిషిని ఉరి తీయగలడేమోకానీ సిద్ధాంతాన్ని ఉరి తీయలేడు. ఒక గండ్రగొడ్డలి చచ్చిపోతే మరొకడు జన్మిస్తాడు. ఆ మరొకడు నా కొడుకవ్వాలన్నదే నా కోర్కె... నన్ను రక్షించాలన్న నీ కోర్కెలో నీ ఆదర్శం నాకు తెలిసింది. నేను నేర్పిన పాఠం ఇంత తొందరగా ఫలితం చూపించటం నా అదృష్టం. అది నా కొడుకే అవ్వటం నాకు గర్వకారణం. వెళ్ళు బాబూ! పల్లెలూ, కొండలూ, అరణ్యాలూ, పర్వతాలూ అన్నీ నీ కోసం చూస్తున్నాయి. గోవిందు, మంగ, లక్ష్మణ్, నారాయణ, లక్ష్మి.... ఎందరో నీ రాక కోసం చూస్తూ వుంటారు. వెళ్ళిరాతండ్రీ. నేనుకూడా వెళ్ళొస్తాను. బయట నుంచి పిలుపొచ్చింది- నీ నాన్న."
.......
ఉత్తరం జేబులో పెట్టుకున్నాను.
నాకు దుఃఖం రాలేదు. యుద్ధంలో సైనికుడు చనిపోతే తోటి సైనికుడు ఏడవడు.
ఇది యుద్ధం.
కొనసాగుతూనే వుంటుంది.
ఇక చెప్పటానికి కథేమీ లేదు.
రేఖ గ్రాడ్యుయేషన్ తరువాత 'లా' చదివింది. ఎప్పటికైనా చట్టపు కోరల్లో ఇరుక్కుంటే నన్ను రక్షించాలని ఆమె తాపత్రయం. అమ్మ తనతోనే వుంటోంది.
* THE END *