Previous Page Next Page 
రక్త సింధూరం పేజి 32


    నేను చేయవలసిందేమిటో అర్ధమైంది.
                                               *    *    *
    కానీ ఒక చిన్న పని మాత్రం ఇంకా మిగలి వుంది.
    ఈ ప్రపంచంలో మనం ఎవరికైనా జవాబుదారీగా వుండవలసి వస్తుందీ అంటే అది మనం ప్రేమించిన వారికి మాత్రమే! ఎంత చిన్న పనికైనా- తీసుకునే ఎంత చిన్న నిర్ణయానికైనా సరే...
    ...అంత అర్ధరాత్రి వచ్చిన నన్ను చూసి రేఖ ఆశ్చర్యపోయింది. వాతావరణాన్ని తేలిక చేయటం కోసం నవ్వేను. "చిన్న సమస్య వచ్చి పడింది రేఖా. నువ్వే పరిష్కారం చెప్పాలి. ఓ చిన్న కథ చెపుతాను వింటావా?"
    "అర్ధరాత్రి కథ చెపుతావా..." నిద్ర కళ్ళతో అడిగింది.
    "ఊఁ"
    "సరే చెప్పు" అందామె నవ్వాపుకుని.
    "ఒక అడవి..."
    "జనారణ్యమా?"
    "మధ్యలో ప్రశ్నలు వేయకు- అడవే- ఆ అడవిలో ఒక కుర్రవాడు వుండేవాడు."
    "అడవిలో కుర్రవాడుంటమేమిటి?"
    "మధ్యలో ప్రశ్నలు వేయొద్దన్నాగా!"
    "ఊఁ"
    "ఒకరోజు ఆ కుర్రవాడిని ఒక సింహం వెంటాడింది. దాని బారిన పడి వుంటే. కాళ్ళూ చేతులూ అన్నీ తినేసేదే బ్రతికినా కేవలం జీవచ్చవంలా బ్రతికేవాడు- అలాంటి స్థితి ఆ కుర్రవాడికి కలిగేది-"
    "చాలా గమ్మత్తయిన సింహంలా వుందే అదీ."
    "అవును. గమ్మత్తయిన సింహమే. దీని మరో పేరు 'వ్యవస్థ'. మనిషిని జీవచ్చవం చేసే మిగులుస్తుంది."
    "తరువాత ఏం జరిగింది-"
    "ఆ సమయంలో ఒక అడవి మనిషి ఆ కుర్రవాడిని సింహం బారి నుంచి రక్షించాడు. కుర్రవాడు తిరిగి ఊళ్ళోకి వచ్చాడు. ఊరు అతడిని ఆదరించింది. పెంచి పెద్దవాడిని చేసింది. కత్తిసాము, గుర్రపుస్వారీ అన్నీ నేర్పింది. అతడన్నీ నేర్చుకున్నాకా చివరగా ఒక కోరిక కోరింది. అడవిలోకి వెళ్ళి ఆ అడవి మనిషిని చంపెయ్యమని... ఏం చెయ్యాలి అతడు?"
    రేఖ మొహంలో నవ్వు మాయమయింది. "ఎవర్ని గురించి చెపుతున్నావు గోపీ నువ్వు" అని అడిగింది ఆందోళనగా.
    "అది తరువాత. ముందీ ప్రశ్నకి సమాధానం చెప్పు?"
    "కుర్రవాడిని మొదట రక్షించింది అడవి మనిషే. కాళ్ళూ, చేతులూ లేకపోతే కుర్రవాడు ఏ స్వారీ నేర్చుకునే వాడే కాదు కదా. అయితే ఇంకో విషయం కూడా ఆలోచించాలి. ఆ అడవి మనిషిని ఈ నాగరికులు ఎందుకు చంపేయమంటున్నారా అని-"
    "ఎవరి వాదనలూ- ఎవరి సిద్ధాంతాలూ వారికి వున్నాయి.
    "ఆ కుర్రవాడికి ఎవరి వాదన సరియైనదని తోస్తే అది చెయ్యాలి. అంతేకాని కేవలం అడవి మనిషి తనని రక్షించాడన్న కృతజ్ఞతతోనే ఈ పని చెయ్యక్కర్లేదు."
    "కానీ సింహాన్ని తయారు చేసింది నాగరీకులే. అది అలా విశృంఖలంగా ఇంకా తిరుగుతూనే వుంది."
    "అయితే నిశ్చయంగా అడవి మనిషినే రక్షించాలి."
    "అలా రక్షించటంలో ప్రాణాలుపోతే? నాగరీకులందరూ కలిసి అతడి ప్రాణాలుతీస్తే?"
    "అడవి మనిషే గానీ ఆనాడు ఆదుకోకపోయి వుంటే ఆ కుర్రవాడి ప్రాణాలు ఎప్పుడో పోయి వుండేవి. కాబట్టి ఇప్పుడు పోయినా ఫర్వాలేదు..."
    "థాంక్స్ రేఖా నా క్కావల్సిన సమాధానం కూడా అదే- "లేస్తూ అన్నాను. ఆమె బదులుగా, భయంగా "ఏమిటిదంతా గోపీ- ఎవరా అడవి మనిషి?" అని అడిగింది.
    "గండ్రగొడ్డలి."
    ఏదో అర్ధమైనట్టుగా ఆమె చప్పున తలెత్తింది. "ఆ కుర్రవాడు?"
    "నేనే!"
    ఒక అనూహ్యమైన భావం ఆమె మొహంలో రెప రెపా కొట్టుకుంటూ కదలాడింది. గుమ్మం దగ్గిర ఆగాను.
    "రేఖా! ఒకప్పుడు నీ తండ్రి చట్టానికి దొరక్కుండా వుంటే అతడికి శిక్ష పడేలా చేశాము. మరణాన్ని అతడు ఆహ్వానించేలా చేశాము. దానికి నువ్వు మనస్పూర్తిగా సాయపడ్డావు. అలా సాయపడ్డందుకు నువ్వు తరువాత ఎప్పుడూ బాధపడలేదు కూడా. దానికి కారణం కూడా నువ్వా రోజు చెప్పావు. నేరం చేసిన మనిషిని న్యాయం ఏదో రూపంలో శిక్షిస్తుందని!... అదే నిజమైన పక్షంలో నేరం చేయని మనిషిని న్యాయం ఏదోలా రక్షించాలి కూడా. నీ తండ్రి చుట్టూ వల బిగించిన చేతులే, ఇప్పుడు నా తండ్రి మెడచుట్టూ ఉరి బిగించాలి. కానీ ఇప్పుడు కూడా నువ్వే సాయపడ్డావు. నువ్వు చేసిన మాట సాయం, ఇప్పటివరకూ నా మనసులో అస్పష్టంగా వున్న సందిగ్ధాలని తొలగించి కర్తవ్యాన్ని బోధించింది. నా మనసులో బ్రతుకుపట్ల- ప్రపంచంపట్ల, ముఖ్యంగా నీపట్ల వున్న ఇష్టం- ఈ క్షణం 'కర్తవ్యం'గా పరిణతి చెందింది. వెళ్ళొస్తానురేఖా! నీకు నా కృతజ్ఞతలు."
                                                14
    ఇంటి కొచ్చేసరికి రాత్రి ఒంటిగంట కావొస్తుంది.
    తలుపులు తీసే వున్నాయి. వెలిగే ఆరిపోయాక సర్వస్వం పోతే ఏముంది అన్న వైరాగ్యం ఆ ఇంటిని నిండి వుంది.
    మోచేతి మీద తల ఆన్చుకుని అమ్మ వంటింటిలో కూర్చుని వుంది.
    ఎంత భయంకరమైన అవస్థ!
    భర్త ప్రాణాలు సరిగ్గా ఎప్పుడు పోతాయో నిముషాలూ సెకన్లతో సహా తెలుసు.
    సరిగ్గా ఎన్ని రోజుల తరువాత పసుపు కుంకుమ తీసెయ్యాలో తెలుసు.
    దగ్గిరుండలేని దుస్థితి. ఉన్నా ఏమీ చేయలేని నిర్భాగ్యపు స్థితి.
    .... నా గదిలోకి వెళ్ళాను.
    రివాల్వర్ జేబులో పెట్టుకున్నాను. అమ్మ అలాగే కూర్చుని వుంది. తలుపులు దగ్గిరకి వేసి బయటకు వచ్చాను. అప్పుడే చంద్రుడు బయటకు వచ్చాడు. అయినా వెన్నెల మసగ్గానే వుంది.
    దూరంగా జైలు గోడలు నిస్తేజంగా కనబడుతున్నాయి.
    ప్రపంచం గాఢ సుఘప్తిలో వుంది.
    జైలు దగ్గిరకి నడిచాను.
    జైల ముఖద్వారాన్ని రాత్రిళ్ళు ఎటువంటి పరిస్థితిలోనూ తెలవరు. కానీ వచ్చింది నేను కాబట్టి సెంట్రీ సెల్యూట్ చేసి తీశాడు. ఒక మూల ఇద్దరు జవానులు నిద్రపోతున్నారు. దూరంగా సెర్చిలైటు గుండ్రంగా తిరుగుతూ వుంది. రెండో గుమ్మం దగ్గిర ఇద్దరు సెంట్రీలు తుపాకుల్తో అటూ ఇటూ తిరుగుతున్నారు.
    అక్కణ్ణుంచి లోపలికి దారి ఉంది. వరుసగా సేల్స్. ఆ తరువాత...
    అటువైపు నడిచాను.
    ఇద్దరు సెంట్రీల్లోను ఒకడు టైమ్ చూసుకున్నాడు. నేనూ చూసుకున్నాను. ఒంటిగంటన్నరకి సరీగ్గా రెండు నిముషాల టైముంది. డ్యూటీ మారే టైమ్ అది. అందుకే దాన్ని ఎన్నుకున్నాను.
    ఆ క్షణం కూడా నాకు గర్వంగానే అనిపించింది. సెంట్రీలు ఇంత టంఛనుగా పని చేయటం... నిద్ర పోకుండా వుండటం... అహర్నిశలూ జైలుని కనిపెట్టుకు ఉండటం.
    చాలా ప్రతిష్టాకరమైన జైలు.
    "ఇక నేను వెళ్తున్నా."
    "గుడ్ నైట్"
    ఒంటిగంటన్నర అవగానే ఒక సెంట్రీ అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళి మరొకడిని లేపుతాడు.పాతవాడు మూడున్నర వరకూ చేసి, పెళ్ళి మరొకడిని లేపుతాడు. ఇలా అంచెలంచెలుగా మార్పు జరుగుతుంది.
    వెళ్ళినవాడు కొత్తవాడిని లేపి పంపటానికి రెండు మూడు నిముషాలు పడుతుంది. ఆ సమయాన్నే ఉపయోగించుకున్నాను.
    సెంట్రీ నిలబడి సిగరెట్ వెలిగించుకుంటున్నాడు. పొదలు వెనుకగా చప్పుడు చేయకుండా వెళ్లి ఒకే ఒక దెబ్బ- రివాల్వర్ మడమతో తలమీద కొట్టాను.
    కుప్పకూలిపోయాడు. గంట తరువాత లేస్తే, అసలు తన తలమీద పైనుంచి ఇటుక పడిందా మరేమైనా జరిగిందా అన్న విషయం కూడా గుర్తుండదు. 
    అతడి దగ్గిర తాళాలు తీసుకుని మెరుపుకన్నా వేగంగా లోపలికి పరుగెత్తాను. మిగతా ఖైదీలందరూ నిద్రపోతున్నారు. కాస్త దూరంలో వుంది- సాలిటరీ సెల్... ఉరితీత ఖైదీల కోసం విడిగా.
    లోపలున్నాడు.
    అలికిడికి తలెత్తి చూశాడు.
    మాట్లాడనివ్వకుండా తాళం తీసి క్షణాల్లో అతడిని బయటికి తీసుకొచ్చాను. ఇంకా అయోమయంలోనే వున్నాడు. కానీ అన్నీ వివరించటానికి అక్కడ టైమ్ లేదు. ఆ బ్లాక్ నుంచి తొందరగా బయటపడాలి.
    మేమిలా బయటకు రావటం- అట్నుంచి కొత్త సెంట్రీ డ్యూటీలో ప్రవేశించటం ఒకేసారి జరిగినయ్. ఒక్కక్షణం ఆలస్యమయి వుంటే పట్టుబడిపోదుము. కొత్త సెంట్రీకి పాతవాడు ఏమయ్యాడా అన్న అనుమానం అయిదు నిముషాల వరకూ రాదు. ఆ మాత్రం సమయం మాత్రమే మాకుంది.
    ఉరితీత బ్లాకు నుంచి మొదటిగేటు దగ్గిరకి దాదాపు అయిదొందల గజాల దూరం వుంటుంది. మధ్యలో ఖైదీలు పెంచిన మొక్కలున్నాయి, వేగంగా పరుగెత్తటంవల్ల ఆయాసం వస్తూంది. సెర్చిలైటు వెలుతురు మొక్కలమీద నుంచి పాక్కుంటూ వెళుతూంది.
    దూరంగా పెద్దగేటు, దానిచుట్టూ ఆఫీసు బిల్డింగూ కనబడుతూ వుంది.
    జరుగుతున్న దాన్ని అతడు ప్రేక్షకుడిలా చూస్తూ నిలబడ్డాడు. పొదల చాటునుంచి పెద్దగేటు దగ్గిరకి వెళ్ళబోతూ ఆగాను. ఆ రెండు సెకన్ల కాలమే మే మిద్దరమూ మా జీవితాల్లో మాట్లాడుకోవటానికి ఆఖరి అవకాశం. వెళ్ళబోతూ ఆగి "నాన్నా" అన్నాను. "...నువ్వొక ప్రశ్న అడిగావు గుర్తుందా? సమాధానం తెలుస్తే ఉరికంబం ఎక్కబోయే లోపులో చెప్పమన్నావు. ఇదే నాన్నా ఆ సమాధానం! ఒక గోపీ తయారవ్వాలంటే ఒక చిదానందం భయపడాలి. ఇంకో మార్గంలేదు. కానీ చిదానందాలు అంత సులభంగా భయపడరు. పూర్తిగా వ్యవస్థని నేనెలాగూ మార్చలేను. ఒక జైలు ఆఫీసర్ గా నా చేతిలో ఉన్నది ఒక్కటే.... నిన్ను వదిలిపెట్టటం! అదే చేస్తున్నాను..."
    తనేదో అనబోయాడు. టైమ్ లేదు. ఇక్కణ్ణుంచి ప్రతి క్షణమూ విలువైనదే!
    ఆఫీసులోకి పరుగెత్తాను. వెళ్తూ వెళ్తూ ఎమర్జన్సీ లైటుకీ, జనరేటర్ కీ మధ్యనున్న కనెక్షన్ తీసేశాను.
    సెంట్రీ సెల్యూట్ చేసి తాళం తీస్తున్నాడు. రిజిష్టర్ లో వ్రాయకుండా లోపలికీ, బయటికీ తిరిగే అధికారం నాకూ, రాజారాంకీ మాత్రమే వుంది.
    అతడు తలుపు తీసేవరకూ ఊపిరి బిగపట్టాను.

 Previous Page Next Page