ఇంటికిపోయాక హాల్లో మంచం వాల్చి పడుకోబెట్టారు. ఇంట్లో వాళ్ళు తప్ప యెవరూ లేరు. రంగయ్య కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రకాశరావు వెళ్ళి డాక్టర్ని పిలుచుకు వస్తానన్నాడు కాని రామరావుగారు తెలివిగానే వున్నారు. "అక్కర్లేదు. ఏదో కొంచెం అలసటవల్ల అలా వచ్చింది. అనవసరంగా మీరేం శ్రమ పడకండి" అన్నారు. శకుంతల నీరసం తగ్గించటానికి లోపలికిపోయి గ్లూకోజ్ కలిపినా నీళ్ళు తీసుకువచ్చి తండ్రికి పట్టింది.
రామారావుగారు పూర్తిగా స్పృహను కోల్పోకపోయినా, నీరసంగానే వున్నారు. తన బాధనంతా బయటపెడితే అసలే చిన్నవాళ్ళు కంగారు పడిపోతారేమోనని తనలో తనే ఓర్చుకోసాగారు. ప్రకాశరావుకైతే డాక్టర్ని పిలుచుకువద్దామనే వుంది. కాని శకుంతల ఇంట్లో ఒంటరిగా వుంది. ఆమె మరీ భయపడిపోతుందేమోనని ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. బహుశా ఆ ఉద్దేశ్యంతోనేనేమో, ఆమె కూడా అతన్ని యెక్కువగా వొత్తిడి చేయలేదు.
పది దాటుతుండేసరికి రామారావుగారికి నిద్ర పట్టింది. శకుంతల ప్రక్కనే విసురుతూ కూర్చుంది. కొంచెం ఎట్లా అయినా ప్రకాశరావు కంగారు మనిషి. పరిస్థితి ఇలా వచ్చేసరికి యేమి జరుగుతుందోనని అతను భయపడసాగాడు. చేయవలసిన పని కూడా అతనికి ఏమీ కనిపించలేదు. కిటికీ దగ్గర కుర్చీవేసుకుని కూర్చుని బయట చీకట్లోకి చూస్తూ ఆలోచించసాగాడు. మరో అరగంట అలాగే నిశ్చలంగా గడిచేసరికి కునికిపాట్లు కూడా వచ్చాయి.
శకుంతల అతని అవస్థను పరికిస్తూనే వుంది. ఆమెకు జాలివేసింది. "నిద్రవస్తే పడుకోండి" అంది.
ప్రకాశరావు ఉలిక్కిపడి "అహ, లేదు" అన్నాడు.
"లేదేమిటి? అవసరం లేకపోయినా ఊరకనే మేలుకొని వుండటం వల్ల ప్రయోజనం ఏమిటి?"
"మీరో?"
"కొంచెం ఆగి నేనూ పడుకుంటాను" అంది.
ప్రకాశరావు లేచాడు. అతనికి ఒక సంశయం కలిగింది. గదిలోకి పోయి పడుకుంటే శకుంతల వొంటరిగా వుండి భయపడుతుందేమోనని.
ఇలా అనుకుని అతను తటపటాయించ సాగాడు. అతనివంక పరకాయించి చూస్తూ అతని భావం గ్రహించి "మీ ప్రక్క తెచ్చుకొని ఇక్కడే వేసుకోండి" అని అతని సంశయాన్ని తేలికగా తీర్చింది. ఒక అయిదు నిముషాల వ్యవధిలో అతను అలాగే చేసి "అవసరం వుంటే లేపండి" అని ఆమెతో చెప్పిన మరో పదిహేను నిమిషాలు గడిచాక నిద్రలో మునిగిపోయాడు.
ఇంకో అరగంట గడిచాక శకుంతల కూడా పడుకునేందుకు నిశ్చయించుకుంది. తండ్రి ప్రశాంతంగా నిద్రపోవటం చూసి ఆమె నిశ్చింతగా పడుకోవడానికి సంకల్పించింది. ఆమె లేచి ప్రకాశరావు నేలమీదే ప్రక్క పరుచుకుని పడుకోవటం చూచాక ఆమె హృదయమంతా సానుభూతితో నిండింది. అతనికి మంచం లేదన్న సంగతి ఆమె యెరిగేవుంది. అతనిగదిలో అతను యెట్లా పడుకుంటాడో ఆమె ఇన్నాళ్ళనుంచీ పట్టించుకోలేదు. కాని ఈ రోజు తమదగ్గర పడుకొన్న అతనిని చూస్తే ఆమెకు బాధ కలిగింది. మొదట మంచం తెచ్చుకుని వాల్చుకొందామనే అభిప్రాయం వచ్చినా అతను క్రింద పడుకొనివుంటే తను దర్జాగా మంచంమీద పడుకోవటం సవ్యంగా తోచక ఆ అభిప్రాయాన్ని త్రోసిపుచ్చింది. లోపలకుపోయి చాప తెచ్చుకొని తండ్రి మంచం ప్రక్కనే వేసుకుంది. పడుకోవటానికి ఉపక్రమించబోయేముందు ఒక్కసారి ప్రకాశరావు దగ్గరకు వెళ్ళి మోకాళ్ళమీద నేలమీద కూర్చుని అతని ముఖంలోకి చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతనికేం పీడకలలు రావటంలేదు గావును అనుకొని నిట్టూర్చింది తరువాత తన చాప మీదకు వెళ్ళింది. లైటు వెలుగుతూనే వుంది.
ఆమెకు యెంతసేపటికోగాని నిద్రపట్టలేదు. తరువాత ఏ కొంచెం సేపు పట్టినా అది కలత నిద్ర. ఒక కునుకు తీసిందేమో అంతలోనే లేచి కూర్చుంది. ఉలిక్కిపడి ఆమె ఆపాదమస్తకం వణకసాగింది. తండ్రి గట్టిగా మూలుగుతున్నాడు కాళ్ళూ, చేతులూ కొట్టుకుంటున్నాడు. చప్పున లేచి నిల్చుంది. తండ్రి ఈ చేష్టలు చూచేసరికి ఆమెకు ముచ్చెమటలు పోశాయి. ఎలాగో ధైర్యం తెచ్చుకుని దగ్గరకుపోయి చేత్తో కదుపుతూ "నాన్నా, నాన్నా" అని పిలిచింది. ఆయనకు తెలివిరాలేదు. ఏదోబాధతో మెలికలు తిరిగిపోయి మూలుగుతున్నాడు. ఒక్క క్షణంసేపు ఏమి చేయటానికి తోచక శకుంతల భయంగా సందిగ్ధంగా నిలబడిపోయింది. తరువాత తెలివి తెచ్చుకుంది. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా, ప్రకాశరావుకు మెలకువ రాకపోవటం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతని దగ్గరకుపోయి "ఏవండి" అని పిలిచింది. ఇటువంటి తరి అతనికి అంత గాఢంగా ఎలా నిద్రపట్టిందో నిజంగా ఆశ్చర్యమే. అతను ఉలకలేదు, పలుకలేదు, శకుంతలకు అతనిన మళ్ళీ పిలిచే ఓపికలేదు. ఒంగి అతని భుజంమీద చేయివేసి గట్టిగా కుదిపింది. ప్రకాశరావు ఉలుక్కుపడిలేచి కూర్చున్నాడు. కళ్ళు నులుముకొంటూ చూచేసరికి ఎదురుగా శకుంతల కనబడింది అతని మైకం వొదిలిపోయింది.
"ఏమిటి?" అంటూ లేచి నిల్చున్నాడు.
శకుంతల మాట్లాడకుండాతండ్రిని చూపింది. ప్రకాశరావు అక్కడకు ఒక్క ఉదుటున పోయాడు. భుజంమీద చేయివేసి కుదిపాడు. ఆయన పూర్తిగా బహ్మస్మృతిని కోల్పోయి బాధతో కొట్టుకొంటున్నాడు. ప్రకాశరావుకు ఏమి చేయటానికి తోచక ఆమెవైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
"డాక్టరు! డాక్టర్ని పిలుచుకు రండి"
"మీరు..... ఒంటరిగా వుంటారా?"
"ఆఁ వుండకేం చేస్తాను? ఇవతల కొంపలు అంటుకుపోతూంటేను" అని శకుంతల భయంతోనూ, విసుగుతోనూ జవాబిచ్చింది.
ప్రకాశరావుకూడా ఆమెను ప్రశ్నలడుగుతూ కూర్చోవటానికి ఇష్టపడలేదు. ఆ సమయంలో డాక్టర్ని పిలుచుకురావటం తప్పితే అన్యధా అతనికి కన్పించలేదు కూడా. ఒకసారి శకుంతలవంకా, రామారావువంకా జాలిగా చూచి "సరే! నేను పోయి వస్తాను. మీరు జాగ్రత్తగా వుండండి. తలుపులు వేసుకోండి" అని చెప్పి వున్నవాడు వున్నట్లు గబగబా బయటకు చీకట్లోకి వెళ్ళిపోయాడు. "చెప్పులు వేసుకు వెళ్ళండి" అని శకుంతల బలహీనంగా అన్న మాటలు అతనికి వినిపించనేలేదు.
శకుంతల తలుపులు గడియవేసి వచ్చి గడియారంవంక చూసింది. తరువాత తండ్రి దగ్గరకుపోయి విసురుతూ కూర్చుంది. అంతకు తప్ప ఆయన అవ్యక్తమైన బాధను నివారించటం యెలాగో ఆమెకు బోధపడలేదు. బాహ్య, మానసిక భయాలు రెండూ ఆమెను పీడిస్తూ శాంతిలేకుండా చేస్తున్నాయి. ఆ రాత్రి......ఒంటిగంటవేళ - - - - అంత పెద్ద ఇంట్లోనూ శకుంతల స్మృతులు కోల్పోయిన తండ్రి ప్రక్కన ఒంటరిగా దైవాన్ని స్మరిస్తూ బయటకు పోయిన మనిషి వచ్చేదాకా కూర్చుంది.
ప్రకాశరావు వచ్చేటప్పటకి ఒక్క గంట పట్టింది. ఇంటిముందు కారు ఆగిన చప్పుడయ్యేసరికి శకుంతల తలుపులు తీసింది. ప్రకాశరావు డాక్టర్ గారితో కూడా లోపలికి వచ్చాడు. కొంతసేపు పరీక్షచేసి తాత్కాలికంగా ఒక ఇంజక్షన్ ఇచ్చాడాయన.
"రేపు పొద్దున్నకల్లా తెలివి వస్తుంది. ఇంకో అయిదు నిమిషాల్లో హాయిగా నిద్రపడుతుంది" అన్నాడాయన.
"అసలు ఇదేమిటి అంటారు డాక్టర్?" అని ప్రకాశరావు అడిగాడు.
"అప్పుడే చెప్పేందుకు యెలా వీలవుతుంది. రేపు తెలుస్తుందేమో"
"అయితే ఇవాళకి యేమీ భయం లేదంటారా?"
"ఉహుఁ"
ఆయన చేతులు కడుక్కునేందుకు నీళ్ళు పోస్తూ ప్రకాశరావు "ఈ పూట కేమయినా మందు యివ్వాలా?" అని అడిగాడు.
"ఇప్పుడు ఎలా వీలవుతుంది. అయినా ఇంక్షన్ ఇచ్చాను కదా" అన్నాడాయన. తర్వాత కొంతసేపు అక్కడేవుండి రోగి ముఖకవళికలు పరిశీలిస్తూ నిల్చుండి ఆయనకు నిద్రపడుతుందని గ్రహించాక "ఇక నేను వెళ్తాను, రేపు ఎనిమిదింటికి వస్తాను" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఇంటిదాకా ప్రకాశరావు వస్తానన్నాడు. "కారు వుందికదా అక్కర్లేద"ని ఆయన అన్నాడు.
"అంతసేపూ శకుంతల ఏమీ మాట్లాడలేదు. ప్రతిమలా చూస్తూ నిల్చుంది. "అప్పుడు మాత్రం రమ్మనమని అడగగానే వచ్చారా!" అని అడిగింది.
"ఏం వచ్చారు" మీ ఫేమిలీ డాక్టర్ గారి ఇల్లు నాకు తెలియదాయె. ఇద్దరు ముగ్గురు ఇంత రాత్రి రాలేమని విసుక్కున్నారు. ఈయన మాత్రం అదృష్టంవుండి వచ్చాడు" అని ప్రకాశరావు జవాబిచ్చాడు.
"ఆ రాత్రి వాళ్ళిద్దరిలో యెవరూ తర్వాత నిద్రపోనేలేదు. అటు ఒకళ్ళూ, ఇటు ఒకళ్ళూ రోగిని కనిపెట్టుకొని కూర్చున్నారు.
మరునాడు ఉదయం ఆరాయేసరికి రామారావుగారికి తెలివి వచ్చింది. ప్రయత్నంమీద ప్రక్కన కూర్చున్న ఇద్దరినీ గుర్తుపట్టాడు. కొంత ఓపిక మీద "యిదేమిటి? రాత్రంతా నే నేమయినా హడావుడి చేశానా?" అన్నారు.
"ఉహుఁ!హడావుడి ఏమీలేదు. కాస్త కలవరించారులే" అని సమాధానం చెప్పింది శకుంతల.
"నేను లేవచ్చునా?"
"మీకు శక్తి వుందా?"
రామారావుగారు నవ్వి లేవడానికి ప్రయత్నించారు. కాని పూర్తిగా విఫలీకృతులు కావలసి వచ్చింది. "ఇదేమిటి? అసలీ భాగం కదిలించలేకుండా వున్నాను" అని వెనక్కి వాలిపోయారు.
శకుంతలా, ప్రకాశమూ ఆశ్చర్యంగా, భయంగా చూశారు.
"అవును, ఏమిటి? నేను లేవలేకుండా వున్నాను?"
"అదేంలేదు. నీరసం మీద లేవలేకుండా వున్నారు. అంతే" అన్నాడు ప్రకాశరావు.
ఏమనుకున్నాడో ఏమిటో, రామారావుగారు మాట్లాడకుండా వూరుకున్నారు. తండ్రి ముఖంలోకి చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగి తల ప్రక్కకు తిప్పుకుంది శకుంతల.
ఎనిమిదింటికి డాక్టరు వచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఆయన అడిగిన ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు చెప్పారు తప్ప నోరువిడిచి "నాకేమిటయిందని" అడగలేదు రామారావుగారు. డాక్టరుగారు ప్రకాశరావుని ఇవతలికి పిలిచి "సీరియస్ గానే వుంది. రైట్ పోర్షన్ అంతా పెరాల్సిస్ వచ్చింది. దానిమీద సెరిబ్రల్ ధ్రాంబోసిస్ రావచ్చు. రెండు మూడు రోజుల్లో తగ్గకపోతే రోజుల తరబడి తెలివికూడా తప్పిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు" అని చెప్పారు. మందు తీసుకుపోవటానికి ఒక గంట ఆగి హాస్పిటల్ కి రమ్మన్నారు. రోగికి ఏమేమి ఇవ్వాలో చెప్పారు.
తరువాత రంగయ్య వచ్చాడు. నిన్న లక్షణంగా చూసిన యజమానిని ఈ వేళ ఈ స్థితిలో చూసేసరికి, వాడి గుండె నీరయిపోయింది. జబ్బు నయమాయిపోయే వరకూ ఈ ఇంట్లో వుండిపొమ్మని శకుంతల వాడిని అడిగింది.
ఆ మధ్యాహ్నం శకుంతల ఎక్కడోవుంది. పళ్ళూ అవీ తీసుకురావటానికి రంగయ్య బజారుకు వెళ్ళిడు. ప్రకాశరావు ఆయన దగ్గర కూర్చుని వున్నాడు.
"ఏనుగులాంటివాడ్ని. రోగం, రొస్టూ నా దగ్గరకు రాలేవని గర్వపడేవాడిని. అటువంటిది ఒకేసారిగా పెద్దదే వచ్చింది" అని ఆయన విషాదంగా అన్నాడు.
"ఏమీ భయంలేదని డాక్టర్ చెప్పాడు తగ్గిపోతుందిట."
"ఏమీ భయంలేదని డాక్టర్ చెప్పాడు తగ్గిపోతుందిట."
"నేను చాదస్తంగా మాట్లాడుతున్నానని అనుకోబోకండి. డాక్టర్లు అలానే చెబుతారు. ఆవిడ పోయినప్పుడూ అలాగే అన్నారు."
"అటువంటి మాట అనబోకండి. శకుంతల వింటే బాధపడుతుంది."
"ఏమీలేదు. అల్లుడూ గిల్లూడు రావాలని నాకేం కోరికలేదు. కాని ఆడదానికి భర్త అవసరంకదా. ఆ బాధ్యతకూడా తీర్చివేస్తే బాగుండుననిపిస్తోంది."
ఆయన ధోరణి చూసి ప్రకాశరావుకి విచారం కలిగింది. ఏనాటికైనా ఉక్కు తునకవంటి రామారావుగారి నోటినుంచి ఇటువంటి మాటలు వినబడతాయని అతను కలలోకూడా భావించలేదు. అంతవరకూ యెందుకు, నిన్న ఎంత గొప్పగా, హాయిగా మాట్లాడారు! ఇవ్వాళ్టి పరిస్థితి తారుమారయిపోయింది.