Previous Page Next Page 
అష్టావక్ర పేజి 32


    ఆ నిండు గర్భిణీ అలా కదులుతూంటే- హిమాలయాల్ని కూడా వణికిస్తూ ఆవేశంతో భూమ్మీదకు దూకిన గంగానది గుర్తొచ్చింది. ఆకాశమే కదలగా, ఐరావతం బెదరగా, నందనవనం పెగలగా... కుదిలింది... కదిలింది గంగ! కదిలి ఉప్పొంగింది గంగ!! ఉన్మత్త మానస విహంగ!!! పరమ రాజన భావ పరిచుంబిత నిజాంగ... ఎవరో కవి అన్నట్టు.

    ఆమె కదిలి వెళ్ళిపోయింది.

    రంగప్రసాద్ అలాగే నిలబడిపోయాడు. ఏదో అనూహ్యమైన ఆర్ధ్రత, కరుణ, అభిమానం- అన్నీ కలగాపులగమైన భావం అతడి మనసంతా క్రమ క్రమంగా ఆక్రమించుకుంది.


               *    *    *    *


    రెండ్రోజులనుంచీ షాడో అలా కూర్చునే వున్నాడు. కళ్ళు కదల్చకుండా, చూపు మరల్చకుండా అంతా చూస్తూనే వున్నాడు.

    మరో రోజు గడిచింది. షాడోకి నిస్పృహ ఎక్కువైంది. సరిఅయిన నిద్ర తిండి లేక శోష వస్తూంది.

    మూడోరోజు మధ్యాహ్నం జరిగిందది.

    షాడో మామూలుగానే చూస్తున్నాడు. ఒక వ్యక్తి, మధ్యవయస్కుడు, సన్నగా వున్నాడు- అతడి దృష్టి గోడమీద పడింది. అతడి మొహంలో మార్పు స్పష్టంగా కనబడింది. క్యూలో నుంచి చప్పున విడివడి గోడవైపు నడిచి, పరీక్షగా దాని దగ్గరకి వెళ్ళి చూశాడు.

    షాడో వంట్లో రక్త ప్రసరణ హెచ్చింది.

    అతడి మొహాన్ని మనసులోనే చిత్రీకరించుకున్నాడు.

    పది నిముషాల తరువాత ఏదో పని వున్నట్టు అతడి పక్కగా నడుస్తూ, కేవలం అతడికి మాత్రమే వినబడేటట్టు "ఉస్సోక్" అన్నాడు.

    అస్తిపంజరంలా సన్నగా వున్న ఆ వ్యక్తి ఉలిక్కిపడ్డాడు. షాడో అక్కడినుంచి తప్పుకున్నాడు. అయిదు నిముషాల తరువాత చూస్తే ఆ జనం నుంచి విడివడి అతడు తన వెనుకే రావటం కనపడింది. ఇద్దరూ నిర్మానుష్యమైన ప్రదేశం చేరుకున్నారు.

    "చెప్పు మిత్రమా!" అన్నాడు అతడు.

    షాడోకి ఏం చెప్పాలో తెలియక మళ్లీ "ఉస్సోక్" అన్నాడు.

    "ఏమిటి? మళ్ళీ ఏదైనా మీటింగా?"

    షాడోకి లింకు దొరికినట్టయింది "ఆఁ అదే!!! ఎప్పుడో తెలియటం లేదు. దాని గురించే ఆలోచిస్తున్నాను" అన్నాడు. ఆ ప్రదేశమంతా చీకటిగా వుంది. దూరంగా మనుష్యులు మసగ్గా కనిపిస్తున్నారు.

    "వెళ్ళి అవతార్ బాబాని అడిగి వస్తాను" అన్నాడు.

    షాడో గుండె వేగంగా కొట్టుకోసాగింది. "వెళ్ళిరా. తొందరగా రా" అన్నాడు.

    "వెంటనే వస్తాను" అంటూ అతడు వెనుదిరిగి వెళ్ళాడు. అయిదు నిముషాల తరువాత తిరిగి వచ్చి, "ఇప్పుడేమీ మీటింగ్ లేదట" అన్నాడు.

    "అలాగా" అన్నాడు షాడో.

    "అన్నట్లు నువ్వు బ్లాక్ స్కెలిటన్ వేనా?"

    "కాదు".

    "మరి" అనుమానంగా చూస్తూ అడిగాడు.

    "ఉస్సోక్ లో చేరదామనుకుంటున్నాను. ఎలా చేరాలో తెలియటం లేదు" సందిగ్ధంగా అన్నాడు.

    "నీకు ఉస్సోక్ గురించి చెప్పిన దెవరు?"

    "నా స్నేహితుడు నన్ను చేర్పిస్తా అన్నాడు. ఈ లోపులో చచ్చి పోయాడు".

    "మొత్తం అంతా అయిపోయిందా?"

    "ఆఁ ముందు పరీక్షలన్నీ అయిపోయాయి. ఇక చేర్పించటం ఒక్కటే మిగిలింది. ఈ లోపులో ఇది జరిగింది".

    "నీ స్నేహితుడి పేరు?"

    "రామ్ సింగ్".

    అది భవానీశంకరం నౌకరి పేరు...షాడోకి తను చీకట్లో బాణాలు వేస్తున్నానని తెలుసు. అవి సరీగ్గా గుచ్చుకుంటున్నాయని మాత్రమే తెలీదు.
     
    "మిత్రమా! నువ్వు చాలా అదృష్టవంతుడివి. అష్టావక్రుడు మరో కొద్ది రోజులలో జన్మించబోతున్నాడు. కాష్మోరాని నమ్మని వాళ్ళందరూ ఊచకోత కోయబడతారు. ఆఖరి క్షణాల్లో నువ్వు ఇందులో చేరుతున్నావు. అందుకే అదృష్టవంతుడివి అంటున్నాను. అష్టావక్రుడు పుట్టాక ఆధీనంలోకి వచ్చేవారందరూ మన క్రింద వుంటారు".

    షాడో వినటంలేదు. "మరో కొద్ది రోజుల్లో అష్టావక్రుడు జన్మించబోతున్నాడు" అన్న వాక్యం దగ్గిరే అతడి ఆలోచన్లు ఆగిపోయాయి.

    ఇంతమంది ఇన్ని కోణాల్లో చెప్పిన ఒకేమాట...ఇందులో... నిజముందా? ఉంటే... ఉంటే తన చిన్నారి చెల్లి మరణిస్తుందా?

    నో... అలా జరగటానికి వీల్లేదు!

    "మిత్రమా నేను వెళ్ళొస్తాను".

    షాడో తలెత్తాడు.

    "రేపు ఇదే సమయానికి ఇక్కడే వేచివుండు. ఎవరికీ చెప్పకు. ప్రాణాల్తో పని సుమా-"

    షాడో తలూపాడు.


                                         *    *    *    *


    "నువ్వలా చెయ్యకుండా వుండవలసింది గౌరీ".

    గౌరి సిద్ధార్థ దగ్గిరగా వచ్చింది. "ఎలా చెయ్యకుండా వుండవలసింది".

    "నీకు వెటకారంగా వుందా?"

    ఆమె అతడి చేతిమీద చేయివేసి, లాలనగా, "చూడండీ! చిన్నప్పటినుంచీ నాలో ఈ దుర్గుణం ఒకటి వుంది. ఎంత దిద్దుకోవాలన్నా దిద్దుకోలేకపోయాను. లాజిక్ కి అందని ఏ విషయాన్నైనా నేను వప్పుకోలేను. ఈ ఒక్క విషయంలోనూ నన్ను దయచేసి క్షమించండి. తొమ్మిది నెలల ముందే మీరు ఇక్కణ్ణుంచి వెళ్ళిపోదామంటే తప్పక వప్పుకొని వుండేదాన్ని" అని ఆగి నెమ్మదిగా, "ఈ విషయం మీరూ ఆలోచించగలరండీ! నా వాదనలో నిజం వుందని ఒప్పుకుంటారు. పోతే సమస్య మనవరకూ వచ్చింది కాబట్టి మీరు కాస్త బెదురుతున్నారు. అంతే. తాపీగా ఆలోచించండి ప్లీజ్... నాకోసం... మనం ఇలా భయపడుతూ వుంటే చివరికి వీధినపోయే బిచ్చగాడు కూడా ఇంటిముందు ఆగి, "మోరా- కాష్మోరా" అంటూ భయపెడతాడండీ".

    ఆమె మాట పూర్తికాలేదు. అతడు చివుక్కున తలెత్తి "కాష్మోరా ఏమిటి?" అని అడిగాడు.

    "అబ్బే, ఏమీలేదండీ".

    అతడు ఆమె చేతి రెక్కపట్టుకుని దగ్గిరకిలాగుతూ "కాష్మోరా ఏమిటి? అసలు దాని ప్రసక్తి ఇప్పుడెందుకు వచ్చిందీ" అని అరిచాడు. అతని కంఠం ఆ గదిలో వికృతంగా, భయంగా ధ్వనించింది. అతడలా వున్నట్టుండి మార్పు చెందడంతో ఆమె బెదిరిపోయింది. అంత సడెన్ గా ఆ మార్పెలా వచ్చిందో అర్ధంకాలేదు.

    "ఏదో చెప్పాడండి. అది కాష్మోరానో కాదో నాకు సరీగ్గా వినపడలేదు" అంటూ ఆ రోజు జరిగినదంతా చెప్పింది.

    వింటూన్న అతడి మొహం పాలిపోయింది.

    "ఎక్కడ? ఎక్కడున్నాడు అతడు?"

    ఆమె తలవంచుకొని, "రోజుకి మూడుచోట్ల తప్ప ఎక్కువ ఇళ్ళల్లో ఆయవారం అడగనని అన్నాడు! ఒక రాత్రి గడిపిన ఊరిలో మరో రాత్రి గడపనని అన్నట్టు జ్ఞాపకం" అంది. తన మాటలు భర్తని కన్విన్స్ చేయవని ఆమెకి తెలుసు. ఆమె అనుకున్నట్టే అతడు అక్కణ్ణుంచి గాలిలా వేగంగా వెళ్ళిపోయాడు.


                   *    *    *    *


    "అతడికోసం ఎంతో వెతికాను. ఇంక సమయం కూడా ఎక్కువ లేదు. అసలేం జరగబోతూంది? నాకంతా అయోమయంగా వుంది. ఈ పరిస్థితుల్లో మీరే సహాయం చెయ్యాలి?" అర్ధిస్తున్నట్లు అన్నాడు సిద్ధార్థ.

    జయదేవ్ మాట్లాడలేదు. ఆలోచిస్తూ వుండిపోయాడు.

    జయదేవ్ కి రంజిత ద్వారా సిద్దార్ధ కుటుంబం పరిచయం అయింది. పూర్వపు అనుభవాల్ని కథలుగా చెప్పింది ఆ అమ్మాయి. జయదేవ్ అన్నాడు. "చాలాకాలం క్రితం నా మిత్రుడు శ్రీధర్ తన కూతుర్ని రక్షించుకోవటానికి కాద్రా అనే మాంత్రికుడిని చంపాడు. కానీ తులసి అనారోగ్యానికి అసలు కారణం అదికాదని నేను నమ్మాను. అలాగే తులసి హెలూసినేషేన్స్ కి కారణం కాష్మోరా కాదని, శ్రీనివాస్ పిళ్ళై చేసిన 'బ్రెయిన్ వాష్' అనీ నేను భావిస్తున్నాను. ఇప్పుడు కూడా...

    "జయదేవ్ బాబూ..." మధ్యలో మాటల్ని ఆపుచేస్తూ అన్నాడు సిద్ధార్థ.

    "ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. ఇక్కడ సమస్య నాది....మీకిదంతా హాస్యాస్పదంగా కనబడవచ్చు. కానీ ఆ రోజు శ్రీధరే గానీ మీరన్నట్టు కాద్రా యజ్ఞానికి భంగం గావించకుండా వుంటే తులసి బ్రతికేది కాదేమో! తులసి మరణించివుంటే మీరేమని వుండేవారు? ఆమె మరణానికి మరొక కారణాన్ని వెతకటంలో నిమగ్నమయి వుండేవారు. అవునా? కానీ ఇక్కడ కావలసింది నా భార్యబిడ్డల జీవితం!! దీనికి పరిష్కారం చెప్పండి".

    జయదేవ్ అతడి మొహంవైపు కన్నార్పకుండా చూశాడు. ఒకప్పుడు శ్రీధర్ కూడా ఇలాగే విలవిల లాడిపోయాడు.

    అతడికి జాలేసింది. (అయితే ఆ జాలికి కారణం వేరు) తన మనసులో భావం బయటకు తెలుపకుండా "నాకు దీని గురించి ఎక్కువ తెలీదు. వయసు పైబడ్డాక నేను ఇల్లు కదలడంలేదు కూడా! మీరీ విద్య గురించి తెలుసుకోవాలంటే నేనొక పుస్తకం ఇవ్వగలను" అన్నాడు.

    సిద్ధార్థలో ఆశ చిగురించింది. చివుక్కున తలెత్తి "ఏమిటిది?" అని అడిగాడు.

    "పురాతన విద్యల గురించి గ్రంథాలయంలో ఒక పుస్తకం వుంది. దాని పేరు 'తంత్ర'. అందులో మీకు వివరాలు దొరకవచ్చు" అంటూ తీసుకొచ్చి ఇచ్చాడు.

    అతడు ఆ బౌండు పుస్తకం తీసుకుని కూర్చున్నాడు. అతడి గుండె ఆత్రుతతో వేగంగా కొట్టుకుంటూంది. వణుకుతూన్న వేళ్ళతో ఒక్కో పేజీ తిప్పసాగాడు. అతడి చూపు చివరికి ఒక పేజీ దగ్గిర ఆగింది.

    కాష్మోరా...

    అతడు చదవసాగాడు. వివరణ ఇలా వుంది :

    "...కాష్మోరా...

    క్షుద్ర గణాధిపతి, కుట్టి సైతాన్ అంశ".

    అంతే వుంది!

    అతడు హతాశుడయ్యాడు. ఎంతో ఆశ పెట్టుకుని వస్తే నీళ్ళు చిలకరించినట్లు అయింది. వివరణ దొరకలేదు. అతడు నిస్పృహగా లేచాడు. అంతలో లీలగా స్పురించింది.

    మళ్ళీ వెనక్కి వెళ్లి తిరిగి ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. పేజీలు గబగబా వెనక్కి తిప్పాడు. ఈ..ఇ...ఆ...అ

    అష్టావక్ర...

    అతడి గుండె ఆగినట్టయింది. కుర్చీలో కూర్చోటానికి కూడా సమయం వృధాపర్చకుండా చదవసాగాడు.

 Previous Page Next Page