నిముషాలు గడుస్తున్నాయి. ఆమెలో అలజడి అధికమౌతూంది.
అది కూడా కాదు. తను ఇప్పుడు ప్రమాదంలో కూరుకుపోతున్నట్టు మనసు కీడును శంకిస్తూంది.
మరో మూడు నిముషాలు మూడుగంటల కాలంలా భారంగా గడిచాయి.
ఇక ఎక్కువసేపు అక్కడ నిలబడే సాహసం లేనట్టు కారులోకి అడుగు పెట్టబోతుంటే "తెచ్చావా?"
ఓ కంఠం వినిపించింది రోడ్డు వారగా...
ఆమె గిరుక్కున వెనక్కి తిరిగింది.
ఒకరు కాదు...సుమారు నలుగురు ధృడంగా వున్న వ్యక్తులు నిలబడి వున్నారు.
చీకటిలో వారి ముఖాలు కనిపించడం లేదు.
"తె...తెచ్చాను..."
"ఇచ్చేయ్..."
"మామయ్య...అదే డాక్టర్ సంఘమిత్ర ఎక్కడ...?"
తోడేలుగా ఓ నవ్వు వినిపించింది. ఆ తర్వాత వికృతమయిన వారి నవ్వుల్తో నిశిరాత్రి వజవజా వణికింది.
నవ్వుతూ ఆగిపోలేదు. యిప్పుడు మీదపడే యమకింకరుల్లా ముందుకు నడుస్తున్నారు.
ఆమెకు అప్పుడు బోధపడింది ప్రత్యర్ధి మాటలు నమ్మి తను ఎంత పొరపాటు చేసిందో...
"మర్యాదగా ఇచ్చేయ్"
"మీరన్నమాట ప్రకారం సంఘమిత్ర...ఆ పార్శిల్" ఆమె మాటలింకా పూర్తికానేలేదు. ఓ వ్యక్తి అమాంతం ఆమెను ఓ మూలకి లాగేశాడు. వెంటనే కారుడోర్ తెరిచి పార్శిల్ అందుకున్నాడు.
అది అరణ్యరోదనని తెలుసు కాని గట్టిగా అరిచింది.
రెప్పపాటులో ఆమె నోరు నొక్కేసిన ఆ వ్యక్తులు ఆమె చూస్తుండగానే పార్శిల్ అందుకుని పొదల్లోకి నడవడం మొదలుపెట్టారు.
శృతి ప్రాధేయపడుతూంది. యిన్నిరోజుల తరువాత డాక్టర్ సంఘమిత్రని కలుసుకోవాలని ఆయనకే ప్రాణహాని జరక్కూడదని యిలాంటి ఒప్పందానికి సిద్ధపడిన శృతి తన వ్యక్తిత్వాన్ని సైతం మరిచి వారివెంటపడింది... "ప్లీజ్ ఆ పార్శిల్ తో నాకు పనిలేదు. మా మావయ్యెక్కడ...ఆయన్ని విడిచిపెట్టండి..."
పార్శిల్ పట్టుకున్న వ్యక్తి ఆగాడు.
ఓ పొదచాటున పార్శిల్ తెరిచి పెన్ టార్చితో లోపలికి చూసిన ఆ వ్యక్తి "యూ బిచ్ హెరాయిన్ ఎక్కడ?" దూకుడుగా ఆమెను సమీపించాడు.
ముందు ఆమెకే అర్ధంకాలేదు అతడంటున్న దేమిటో...
"చెప్పు" ముగ్గురు కాటేసే సర్పాల్లా ఆమెని సమీపిస్తుంటే నాలుగో వ్యక్తి పార్శిల్ లోని కంకరరాళ్ళని నేలపైకి ఒంపుతున్నాడు.
శృతికీ గొంతు తడారిపోయింది.
హెరాయిన్ కి బదులు పార్శిల్లో రాళ్ళెవరు నింపారు?
ఆమె ఆలోచనలనుంచి తేరుకోకముందే ఓ చేయి ఆమె జుట్టునందుకుంది.
మరోవ్యక్తి ఆమె చీరను లాగేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడామె కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలుతున్నాయి. మృత్యువు నుంచి సంఘమిత్రని కాపాడాలనుకుంది. యిప్పుడు తనే మృత్యువు జ్వాలలో ఒక దిష్టిబొమ్మలా తగలడిపోతూంది.
"ఎక్కడ...హెరాయిన్ ఎక్కడ దాచావు?" అప్పటికే ఆమె చీర వూడిపోయింది...రోషంతో వూగిపోతున్న ఆ వ్యక్తుల మూలంగా మరో అరనిముషంలో ఏం జరిగేదో...
సరిగ్గా అప్పుడు గాలి చీలిన శబ్దం.
మరుక్షణం నేలతాకిన సన్నని మూలుగులు ప్రకంపనాలు.
ఓ ఆకారం చీకటిలో స్వైర విహారం చేస్తూంది.
ఎదుర్కోవాలనుకున్న నలుగురు దృఢకాయల శరీరాలూ పలుగురాళ్ళరాపిడికి పగులుతున్న సమాధులయ్యాయి.
అక్కడ కదిలే మెరుపు జయేంద్రగా బోధపడింది.
ఎక్కడో ఉన్నవాడు యిక్కడెలా ప్రత్యక్షమయ్యాడూ అని ఆమె ఆలోచిస్తుండగానే అతడి కరాళనృత్యం విరిగిపడుతున్న శతృవుల ఎముకలతో చీకటి కాగితంపై రాసే మృతచరిత్రగా మారింది.
ఒక నిముషం తరువాత అక్కడ నిశ్శబ్దం చోటుచేసుకుంది.
మరో అరనిముషం తరువాత శృతి తెలుసుకుంది భయంతో జయేంద్రని చుట్టేసుకున్న తను అర్ధనగ్నంగా వున్నానని.
* * * *
"ఇది సాహసంకాదు శృతీ! నేను నిన్నటిదాకా బాట తెలీని పసికందుని. జీవంపోశావు. మొన్నటిదాకా లోలోనే కాలిపోతున్న చిచ్చుని జ్వాలగా మార్చావు" భావరహితంగా చెప్పుకుపోతున్నాడు జయేంద్ర. ప్రయోగశాలలో అతడికి అభిముఖంగా ఉన్న కేజెస్ లోని సర్పాలు సరిగ్గా ఇప్పటి అతడి స్థితిని గుర్తుచేస్తున్నాయి. ఎక్కడివాడైనా అతడూ యిప్పుడు ఓ బందీగానే వున్నాడు. మొన్న శరపంజరంలో యిప్పుడు ఒక విచిత్రమైన భావుకత ఆవహించిన శృతి మనోమందిరంలో.
"నేను వూహించగలిగాను శృతీ. ఫోన్ లో నిన్నెవరో హెచ్చరిస్తున్నారని గ్రహించాను. ఆ హెచ్చరిక ఇదమిద్దంగా నాకు తెలియచేయలేని స్థితిలో నువ్వు నలిగిపోతున్నావనీ అర్ధం చేసుకున్నాను. అందుకే నీ ఆజ్ఞలేకుండా నిన్ను వెంటాడాలనుకున్నాను. నీకు తెలియకుండా పార్శిల్లో హెరాయిన్ తీసి కంకరరాళ్ళని నింపాను."
శృతి ఇప్పుడు జరిగినదానితో కత ముగిసిందనుకోవడంలేదు. యిప్పుడు తను మాత్రమే కాదు కోరి కోరి జయేంద్ర ప్రమాదంలో చిక్కుకున్నాడని కలవరపడుతూంది. "ఎందుకిలా చేశావు జయేంద్రా- నువ్వు ఇలా తొందరపడాల్సింది కాదేమో..."
"శృతీ! నువ్వు కోరినట్టు నలుగురికోసమూ నేను బ్రతకడం అవసరమే అనుకుంటే నువ్వూ ఆ నలుగురిలో ఒక్కదానివి మాత్రమే కాదు...అందరికన్నా నాకు అతి ముఖ్యమైనదానివి."
నిర్లిప్తంగా చూసిందామె.
"శృతీ...యిప్పుడు నిజానికి సంఘమిత్రగారికి ఎలాంటి ప్రమాదమూ జరగదన్నది నా బలమైన నమ్మకం..."
అతడి విశ్లేషణ ఆమె వూహకందడం లేదు.
"ఎందుకలా అనుకుంటున్నావు?"
"నువ్వు నిజంగా హెరాయిన్ పార్శిల్ వాళ్ళకే అందిస్తే ముందు నీ ప్రాణాలు తీసేవారు. ఆ విధంగా డాక్టర్ సంఘమిత్ర అపహరణ విషయాన్ని నీతోనే సమాధి చేసేవారు. ఇప్పుడు ఆ అవకాశం చేజారింది. నా నమ్మకం తప్పుకాకపోతే ప్రొఫెసర్ సంఘమిత్రను చాలా ముఖ్యమైన అవసరంపై వాళ్ళు కిడ్నాప్ చేసి వుంటారు. అది ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేనుగాని కేవలం ఒక పార్శిల్ కోసం అతడి ప్రాణాలు తీయలేరు..."
"కాని ఇది కోట్ల ఖరీదుచేసే డ్రగ్."
"ఇదే ముఖ్యమైతే సంఘమిత్రని అక్కడికి తీసుకొచ్చి మార్పిడికి సిద్ధపడేవారుగా."
చివాలున తల పైకెత్తి చూసింది. అతడి మాటలు తను వూహించలేని ఓ వాస్తవాన్ని ఎరుకపరుస్తున్నాయి. "చూడు శృతీ...ఇది కోట్ల ఖరీదుచేసే డ్రగ్ కావచ్చు. కాని ఇన్ని కోట్లమందినీ వదిలి ప్రత్యేకించి సంఘమిత్రగార్ని అపహరించడంలో ఇంతకుమించి వెలకట్టలేని ఓ లాభం వుండి వుంటుంది."
"అలాంటప్పుడు దీనికోసం ఇలాంటి బేరం ఎందుకు పెట్టి వుంటారు."
"ఇదీ నష్టపోవడం వాళ్ళకిష్టంలేదు కాబట్టి. అందుకే నువ్వు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సంఘమిత్ర పేరుచెప్పి నిన్ను కట్టడిచేసింది. సరిగ్గా ప్రత్యర్ధి తప్పుచేసింది అక్కడే..."
మామూలు మనుషులకన్నా భిన్నంగా వ్యవహరించే వ్యక్తి మాత్రమే అనుకుంటున్న జయేంద్ర ఇప్పుడు క్రమంగా ఆమె ఊహల్లో మెరుపులా ఎదిగిపోయాడు...ఇంకా తన మేధకందని సరిహద్దులేవో అతడిలో అస్పష్టంగా కనిపిస్తుంటే నిమిలినేత్రాలతో అతడ్నే చూస్తూ వుండిపోయింది.
రగులుతున్న దావానలంలో కడదాకా నిలబడగల శక్తివంతుడా... ఇప్పుడేం జరగబోతూంది.
ఆమె ముఖ కవళికల్ని చదివేయగలిగినట్టు నిర్లిప్తంగా చూసాడు.
"శృతీ! జీవితపు కొసకొమ్మలను పట్టుకుని వేళ్ళాడుతూ మృత్యువు లోయలోకి బ్రతుకును నెట్టుకునే నా మార్గాన్ని నిర్దేశించిన సంజీవిని నువ్వు. కరడుగట్టిన నా హృదయ శిలాశాసనంపై స్వహస్తాలతో రాసుకున్న రక్తాక్షరాలను చెరిపి సహనఫలకంగా మార్చిన అపురూపమైన వ్యక్తివి నువ్వు. నీ మనోమంత్రంతో దివ్యాస్త్రాన్ని కాలేకపోయినా ఈ బ్రతుకు మంత్రంతో మారణాస్త్రంగా మారకపోయినా నా నుదుటిగీతను చెరుపుకుని ఒక మామూలు మనిషిగా అయినా బ్రతుకుని వెళ్ళమార్చాలనుకుంటున్నవాడ్ని. చావు చంపిన బ్రతుకు నాది. నీకోసం మరణిస్తేనేం. అశాశ్వతమైన ఐహికజీవనంలో అది శాశ్వత ధర్మంగా మిగిలిపోదూ."