వాళ్ళిద్దరూ కలిసి రాత్రంతా నా నిద్ర పాడుచేశారు.
అయితే ఉదయం నాకింకో షాకింగ్ విశేషం!
డాక్టర్ విలాస్ నన్ను కాఫీకి రమ్మని ఆల్బం చూపించాడు అందులో వంటింటి పనులు చేసుకుంటున్న వనిత ఉన్నది. ఆమె శరీరం మీద దుస్తులు లేవు.
ఆమె చాలా అందంగా వున్నది.
"ఫోటోలు ఎలా ఉన్నాయి?" అన్నాడతను.
"ఆడవాళ్ళు ఇలాంటి ఫోటోల కెలా ఒప్పుకుంటారు?"
విలాస్ నవ్వి, "ఇది చిన్నపిల్లల సందేహం..." అని "భార్యాభర్తల మధ్య రహస్యాలెందుకు?" అన్నాడు.
"అంటే?" అన్నాను.
"ఇవి నా భార్య ఫోటోలు" అన్నాడతను.
తెల్లబోయాను. కాసేపు మతికూడా పని చేయడం మానేసింది.
"నా దగ్గర పోలరాయిడ్ కెమేరా వున్నది. నా స్నేహితులు వెళ్ళినప్పుడల్లా రీల్సు తెప్పిస్తూంటాను. ఈ కెమేరాలో సుఖం ఏమిటంటే-క్లిక్ మన్న తొంభై సెకన్సులో బొమ్మ వచ్చేస్తుంది. నో డెవలపింగ్__నో ప్రింటింగ్."
నేను ఇంకా ఇందాకటి స్థితిలోనే ఉన్నాను.
విలాస్ చెప్పుకుపోతున్నాడు. "పోలరాయిడ్ కెమేరా మనభోటి వారికి వరం. వెధవ ఫోటోలు బజార్లో ఇలాంటివి ఎన్నయినా దొరుకుతాయి. కానీ, కట్టుకున్న భార్యను ఇలా ఫోటోలు తీసే అదృష్టం ఈ కెమేరా వల్లనే నాకు కలిగింది__"
"అవి మీ భార్యవయినప్పుడు నాకు చూపకుండా ఉండవలసింది" అన్నాను.
విలాస్ నా భుజం తట్టి "అందం చూడ్డం వేరు. ఆస్వాదించడం వేరు. ఆడదాని అందం దుస్తుల్లో లేదు శరీరంలో ఉంది. ఆ శరీరాన్ని చూడ్డంలో తప్పేమిటో నాకర్ధం కాదు. అదీకాక ఇవి ఫోటోలే కదా_" అన్నాడు.
"అయితే మాత్రం__" అన్నాను చిరాగ్గా.
"మీ వాటం చూస్తూంటే మీరు మీ ఇంట్లో తీసిన ఫోటోలు నాకు చూపించరులాగుంది" అన్నాడు విలాస్.
నేను తెల్లబోయి, "అంటే?" అన్నాను.
విలాస్ నవ్వి. "నాకు మగాళ్ళ మనస్తత్వం బాగా తెలుసు. మీరీ ఫోటోలు చూడగానే-మీకూ ఇలాంటి సరదా కలుగుతుంది. అందుకే మీ కోసం ఓ డజన్ శ్నాప్స్ ఉంచాను. ఫోటోలు మీరే తీసుకోవచ్చు" అన్నాడు.
ఆవేశంతో నా వళ్ళు వణికింది.
"వాటీజ్ దిస్ ఫెలో __" అనుకున్నాను.
కానీ ఏమనను? ముందు తన భార్య ఫోటోలు చూపకుండా ఇలాగని ఉంటే-నేనేమైనా అని ఉండేవాడ్ని కానీ ఇప్పుడేమీ అనలేదు.
అందులోనూ అతడి భార్యను చూడడం అదే మొదటిసారి ఎప్పుడూ బురఖాలోనే ఉండేదామె.
ఒక్కసారి యిలా చూశాను.
ఎంత తేడా?
ఆమె గురించి ఎన్నో ఊహించాను. ఆమె ముఖం చూడాలని తాపత్రయపడ్డాను ముఖం చూడకుండానే విలాస్ ను మార్చి ఆమెకు సంతోషం కలిగించాలని కూడా అనుకున్నాను.
కానీ యిప్పుడు__
"యూ విలాస్__" అనుకున్నాను కోపంగా.
నాకుకొన్ని ఆశయాలున్నాయి. పరాయి ఆడదాన్ని పవిత్రముగా చూడాలన్న భావన ఉన్నది. భావనను పాడుచేస్తున్నాడు ఈ విలాస్.
భార్య ఫోటోలు ఈ విధంగా చూపాలనుకున్న విలాస్ ఆమె నింత కాలమూ బురఖాలో ఎందుకుంచాడు?
ఆమెపట్ల నాకు కుతూహలం పెరగాలనా__? ఆమె గురించి నేను ఆలోచించాలనా?
ఏది ఏమయినప్పటికీ విలాస్ వంటి భర్తలు ఈ భారతావనికే అవమానం అతన్ని కట్టుకున్న ఇల్లాలి దురదృష్టం మాటల్లో వర్ణించలేనిది.
ఈ ఫోటోలు నాకు చూపిస్తాడని తెలిస్తే ఆ ఇల్లాలు ఇందుకు ఒప్పుకునేదా? నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు కోమలి గురించి నాతో మాట్లాడవలసివచ్చినందుకే__ ఆమె గొంతులో బాధ ధ్వనించింది.
బాపూ కార్టూన్లో చూపినట్లు ఆ ఫోటోలకు ఏ తువ్వాలునో అందించగలిగితే బాగుండుననిపిస్తున్నది.
విలాస్ తన భార్య ఫోటోలు చూపిస్తాడన్న ధ్యాస లేక వాటిని పరీక్షగానే చూశాను ఆమె చాలా అందంగా వున్నది.
ఇప్పుడు నేను వాటిని చూసినందుకే బాధపడుతున్నాను.
విలాస్ నా చేతిలో కెమేరా పెట్టి, "ఆడవాళ్ళు ఓ పట్టాన ఒప్పుకోరు. ట్రై యువర్ లక్_" అన్నాడు.
ముందు మామూలుగా కెమేరా అందుకుని వెంటనే వులిక్కిపడి, "ఇది నాకు వద్దు" అన్నాను.
"వద్దనకండి" అని నవ్వాడు విలాస్. "ఎలాగో ఒప్పించండి. ఈపాటికి ఇలాంటి విద్యలు మీకు తెలిసే ఉండాలి..."
'పద్మిని అలాంటిది కాదు' అనాలనిపించింది. కానీ నా కనుల ముందు మాధవరావు ఆల్బంలోని తైలవర్ణచిత్రం మెదిలింది.
మాధవరావు ఆమెకు ప్రియుడో కాడో తెలియదు. భర్తమాత్రం కాడు. అతడి ముందే ఆమె అలా నిలబడగలిగినప్పుడు....నా ముందు సందేహిస్తుందా?