"వెరీగుడ్! మాకు అంతకంటే కావలసిందేముంది! ఈ క్షణం నుంచే నిన్ను మా ఉద్యమ సభ్యురాలిగా చేర్చుకుంటున్నాను. మా అందరితోపాటే నీకూ సమాన హక్కులు వుంటాయి. కష్టం, సుఖం మా అందరితో పాటే! ఏమంటావు?"
"అంగీకరిస్తున్నాను"
"ప్రమాణం చెయ్యి!"
కాగడా అంటించి ఆమె ముందు వుంచాడు.
ఆషా మనస్సు ఆనందంతో నిండిపోయింది. తన కుడి అరచేతిని కాగడా జ్వాల మీద వుంచి, ఉద్యమ సభ్యురాలుగా ప్రమాణం చేసింది.
ఆమె కనులు మెరిశాయి!
కమాండరు వెంటనే ఒక రైఫిల్ ను ఆమె చేతికి అందించాడు.
సాయుధుడు నల్ల ప్యాంటును, షర్టును, జంగిల్ షూస్ ను ఆమెకిచ్చారు.
కమాండరు కనుసైగ మేరకు సాయుధుడు వెళ్ళి కిరణ్ కుమార్ ను పట్టుకు ఈడ్చుకువచ్చారు.
అతను బందీయే! లేవడానికి ప్రయత్నిస్తున్నాడు....ఓపిక చాలడం లేదు.
క్షణం ఆలస్యం చేయకుండా ఆర్డరు జారీచేశాడు కమాండరు:
"కామ్రెడ్ ఆషా! రైఫిల్ ని లోడ్ చెయ్!"
తక్షణమే ఆచరించింది ఆషా, హుషారుగ.
అయితే, ఆ తరువాత కమాండరు నోటి నుంచి వినవచ్చే ఉత్తర్వు ఏమిటో ఊహించుకోగానే ఆమె హృదయం లయ తప్పింది. ముచ్చమటలు పడుతున్నాయి. కాలు చేతులు వణుకుతున్నాయి.
వళ్ళు జలదరింపు....
"షూట్ హిమ్!" కిరణ్ కుమార్ ను చూపుతూ గర్జించాడు కమాండరు.
"నో....ఐ....కాంట్....!" రోదనతో కూడిన అరుపు అరుస్తూ రైఫిల్ ను కిందకు జారవిడిచింది ఆషా.
బేలగా, బెంబేలుగా చూసింది.
వెనువెంటనే తన చేతిలోని రైఫిల్ ను లోడ్ చేశాడు కమాండరు.
వెంటనే తేరుకున్నది ఆషా. పరిసరాలను గుర్తించింది.
కమాండరు మరల అనుమానిస్తే తమ ఇరువురినీ నిర్దాక్షిణ్యంగా కాల్చివేయవచ్చు!
"కమాండర్ ! మీరంతా కిరణ్ కుమార్ ను అనుమానించినా, నా నమ్మకం నాకున్నది. సమాజంలో స్వయంగా దగాపడి, దెబ్బతిని, మన ఉద్యమం ద్వారానే ఈ సమాజాన్ని మార్చడం సాధ్యపడుతుందని నమ్మి ముందుకు వచ్చిన ధీరచిత్తుడు కిరణ్ కుమార్ అని నా ధృడాభిప్రాయం. అటువంటి వ్యక్తినే కాల్చి చంపితే, ఇహ మన ఉద్యమంలోకి ఎవరు చేరతారు? ఎలా చేరగలరు? ఒక్కసారి పునరాలోజించండి. ఆత్మ విమర్శ అవసరం! కిరణ్ కుమార్ ను మన ఉద్యమంలోకి ఆహ్వానిద్దాం !"
సాయుధులకు సైగ చేశాడు కమాండరు. వారు ఆషాను పక్కకు లాగారు.
"ప్లీజ్! ఆయన్నేమీ చేయొద్దు...." ఆషా మరల కన్నీరు పెట్టుకున్నది.
"ఇక్కడ మమకారాలకు చోటులేదు!" కర్కశంగా మారింది కమాండరు గొంతు.
"మమకారం కాదు కమాండర్, యుగ ధర్మం! తన పసుపు_కుంకుమలు తన కళ్ళ ఎదుటే చెరిగిపోతుంటే ఏ భార్య సహించగలదు....?"
"ఏమిటి?"
కమాండరుతో పాటు అంతా నిశ్చేష్టు లయ్యారు.
గాలి స్థంభించింది.
క్షణం ఆగి, అనుమానంగా, అసహనంగా అడిగాడు కమాండరు: "మీరిద్దరూ భార్యాభర్తలా? ఆధారం ఏమిటి?"
"పంచ భూతాల సాక్షిగా మేమిద్దరం ఇక్కడ_ఈ మన స్థావరంలోనే_పెండ్లి చేసుకున్నాం. ఇదుగో ప్రత్యక్ష సాక్ష్యం!" అంటూనే తన మెడలోని పసుపుతాడును బయటకు తీసింది ఆషా. నిబ్బరంగా నిజాయితీగా చూపింది.
అది పసుపు కొమ్ము కట్టిన తాళి!
ఈసారి తెల్ల బోవటం కిరణ్ కుమార్ వంతు అయింది.
అత్యంత సహజంగా వున్న ఆమె ప్రవర్తన, మాట్టాడిన తీరు అందరినీ ఆకర్షించాయి. నిజమే కావచ్చు!
తమకు మాట మాత్రమైనా చెప్పక, తమకు తెలీకనే పెళ్ళి చేసుకున్న నవ దంపతులు!
"గంధర్వ వివాహమా!...." ఇంకా నమ్మకం కుదరనట్టే హేళన ధ్వనింపచేస్తూ అన్నాడు కమాండరు.