"నీయవ్వ! ఊ కొండెహ. మద్దెన మీరు కతలు పడుతున్నారేంది?" అని గదమాయించాడు. ఆ తరవాత వనజాక్షి మొగుడితో "రేపు నువ్వూ, నేనూ పోదాంపా! ఆ పోరి నాయినతో లగ్గం ముచ్చట మాట్లాడొద్దామ్!" అన్నాడు.
ఒళ్ళంతా కట్లతో కుర్చీలో కూర్చున్న విశ్వనాధం డొక్కలో రాయి తగిలిన కుక్కపిల్లలా మూలుగుతూ "అమ్మో! ఆయన సంగతి నీకు తెలీదురా బాబూ! లక్షాధికార్లయితే కనీసం కూర్చోమంటాడు. మనలాంటి వాళ్ళం వెళ్తే కనీసం గేటుదాటి లోనికి రానివ్వడు. మన దరిద్రం అంటుకుంటుందని భయం. అటువంటివాడు రిషికి పిల్లని ఇస్తాడనుకోడం మన బుద్ధి తక్కువ" అన్నాడు.
"అయితే ఇప్పుడేం చేద్దాం?" మధు అడిగాడు.
వెంటనే బామ్మగారు అందుకుని "సుబ్బరంగా మన సుబ్బుల్నిచ్చి పెళ్ళి చేసేద్దాం ఆ పిల్ల తిక్క కుదుర్తుంది" అంది.
"ఏవంటావోయ్ మరి?" తాతగారు రిషిని అడిగారు.
"ఎంత తపస్సు చేసినా గిల్టు నగలేసుకుని ఏ దేవుడూ ప్రత్యక్షమవడు కానీ నోరు తెరిచి మాట్లాడు, నీ ఉద్దేశం ఏవిటో చెప్పు?" శ్రీజ చిరాకుపడుతూ అంది.
సుబ్బలక్ష్మి తమ్ముడు గాలిపటం ఒకటి పట్టుకుని "డుర్....ర్...." అంటూ పరుగెత్తుకుంటూ వచ్చి 'ఆదివారం పెళ్ళిట నిజమేనా?" అని రిషిని పట్టుకుని ఊపేస్తూ అడిగాడు.
"ఓర్నీ! అప్పుడే మీదాకా వచ్చిందా?" అంది వనజాక్షి నోటి మీద వేలేసుకుని.
వాడు విసుగ్గా "బుజ్జీ, చంటీ వెళ్ళి ఎదురు లైన్లో వాళ్ళకీ పక్కలైన్లో వాళ్ళకీ కూడా చెప్పేసారు" అన్నాడు.
"ఆ!" అంటూ బామ్మగారు ముక్కున వేలేసుకున్నారు.
రిషి మంచంమీద లేచి కూర్చుంటూ "అవును ఆదివారమే పెళ్ళి! ఇందులో ఎటువంటి మార్పూ వుండదు" అన్నాడు.
"భలే! భలే!" అంటూ సుబ్బలక్ష్మి తమ్ముడు చప్పట్లు కొట్టాడు.
సుబ్బలక్ష్మి వడియాల పిండితోనే చెయ్యి బుగ్గకి జేర్చేసుకుంది.
"ఆలోచించుకునే అంటున్నావా? పెళ్ళి అంటే పకోడీలు తినడం కాదు- అంత త్వరగా తయారయ్యిపోవడానికి" అరిచింది శ్రీజ.
"ఆలోచించే అంటున్నాను" చిరాగ్గా అని రిషి లేచి లోపలికి వెళ్ళి పోయాడు.
"అది కాదురా...." అంటూ మధు లోపలికి వెళ్ళబోతుండగా---
"రిషి వుండేది ఇక్కడేనా అండీ?" అని సన్నని కంఠం వినిపించింది.
మధు తల తిప్పేసరికి ఆశ్రిత నిలబడి వుంది.
"ఆశ్రితా రా! మంచి సమయానికి వచ్చావు" అంది శ్రీజ.
"ఆదివారం మా మనవరాలితో రిషి పెళ్ళి. ఇప్పుడే నిశ్చయించుకున్నాం" అంది బామ్మగారు.
వనజాక్షి వెంటనే లేస్తూ "పదండి బామ్మగారూ.... బోలెడు పనులు ఎదురు చూస్తున్నాయి. పెళ్ళంటే మాటలా?" అంది. బామ్మగారు ఔనంటూ తలూపి, ఆమెతో కలిసి వెళ్ళిపోయింది.
"నే వెళ్ళి వంటవాళ్ళని మాట్లాడొస్తా. సామర్లకోట పప్పు నూనే వాడాలి అని చెప్తాను" అంటూ ముసలాయన క్రిందకి వెళ్ళిపోయాడు.
"నేను పోయి అలా బజా బజాయించేటోల్లని మాట్లాడొస్తా" అంటూ మల్లేష్ ఆయన వెనకాలే వెళ్ళిపోయాడు.
"బాబోయ్, నాకు సిగ్గేస్తోంది" అంటూ సబ్బులు లేచి పరిగెత్తింది.
మధు ఆశ్రిత వైపు చూసి "మీరు ఆలస్యంగా వచ్చారు ఆశ్రితగారూ" అని క్రిందికి వెళ్ళిపోయాడు.
ఆశ్రిత కళ్ళ నిండుగా నీళ్ళు చేరాయి. "శ్రీజా! ఇది నిజమా?" అని అడిగింది.
శ్రీజ నవ్వి "నువ్వు ప్రాక్టికల్ అయితే అతను డబుల్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తాడు. నిజం కాక ఏమౌతుంది మరీ! క్రిందికి వెళ్తాను. బామ్మగారికి సహాయం చెయ్యాలి. పాపం ఒకత్తీ ఏం అవస్థ పడ్తుందీ వయసులో?" అనేసి వెళ్ళిపోయింది.
ఆశ్రిత కళ్ళ నించి నీటి చుక్కలు ఆమె చెంపల మీదుగా జాలు వారుతుండగా అలాగే నిలబడింది. అంతలో రిషి బయటికి వచ్చాడు.
"ఆదివారం పెళ్ళట- నిజమేనా?" అడిగింది ఆశ్రిత.
"ఊ!" అన్నాడు రిషి ముభావంగా.
ఆశ్రితకి దుఃఖంతో మాట రావడమే కష్టం అయిపోయింది. అతికష్టం మీద గొంతు పెగిలించుకుని "అంత గట్టిగా నిశ్చయించుకున్నావా? ఏమీ మార్పు వుండదా?" అని అడిగింది.
"రిషి పది మాటలు మార్చేవాడు కాదు. ఒకటే మాట!" అతని కంఠం పదునుగా పలికింది.
"అక్కరలేనప్పుడు అతిగా యిచ్చి, మాకు కావలసినప్పుడు దాచేసుకోవటం మీ జాతి లక్షణం! మీకు ఏదైనా అందేదాకా నిద్రపట్టదూ, అందాకా విలువ తెలియదూ!" ఆశ్రిత రోషంగా ముక్కులు ఎగబీలుస్తూ అంది.
"నీ ఉద్దేశం ఏవిటో నాకు అర్ధం కావటంలేదు!" రిషి తాపీగా అన్నాడు.
ఆశ్రిత చీర కొంగుతో కంటినీరు తుడుచుకుంటూ ఆవేశంగా అంది "ప్రతి మనిషీ అవకాశం కోసం ఆశపడ్తుంటాడు. కానీ ఆ అవకాశం అందుకోవడానికి కష్టపడాలనుకోడు! నువ్వూ అంతే!"
"నేనూ మనిషినేగా!" రిషి కొద్దిగా నవ్వుతూ అన్నాడు. ఆమెకి చాలా కోపం వచ్చినట్లుగా చురచురా చూసింది. నారింజ రంగు సంధ్యాకాంతుల్ని ఆమె మీద వెదజల్లుతూ సూర్యుడు కొంటెగా నవ్వుతున్నాడు. అతడితో పోటీపడ్తున్నట్లుగా ఆమె ముక్కు కొస ఎర్రగా మెరిసింది. ఎరుపు జీరతో మెరుస్తున్న కలువ రేకుల్లాంటి ఆమె కళ్ళని చూస్తూ ఇలాంటి కళ్ళని చూసే ఏమో కృష్ణశాస్త్రిగారు ఏదియొ అపూర్వ మధుర రక్తి స్ఫూర్తియించు కాని అర్ధమ్ము కాని భావగీతమ్ములని అన్నారు అనుకున్నాడు రిషి.
అతను ఆ మత్తు నుండి తెప్పరిల్లి చూసేటప్పటికి ఆశ్రిత అక్కడ లేదు.
"ఆశ్రితా....ఆశ్రితా" అంటూ అతను మెట్లు దిగాడు. క్రింద ఆడవాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని కూర్చున్నట్లున్నారు. వనజాక్షి మూడో కొడుకు ఆమె చీర కుచ్చిళ్ళు పట్టి లాగేస్తున్నా, బామ్మగారి ఆఖరి మనవరాలు ఆకలి అంటూ ఆరునొక్క రాగం ఆలపిస్తున్నా వాళ్ళు వినిపించుకోవడం లేదు.