Previous Page Next Page 
నిషా పేజి 31

    "ఈరోజు ఎందుకో ఉత్సాహంగా లేదు తాతయ్యా!"

    "ఎందుకమ్మా?"

    "అదే తాతయ్యా! ఆ మారుతీమోహనుడే తనకు మగడైపోతాడేమోనని బెంగపట్టుకుంది అక్కకి!" చెప్పింది సంగీత.

    "మీ అక్క మారుతికి పరమ భక్తురాలు. ఆమెకు నచ్చని మగణ్ణి ఎప్పటికీ అంటగట్టడు. మీ అక్క మనసులో ఏ రాజకుమారుడు మసలుతున్నాడో, సరిగ్గా ఆ రూపమే అనుగ్రహిస్తాడు స్వామి" శిఖామణి అన్నాడు.

    "ఈరోజు నీ పాట వినకపోతే స్వామి చిన్నబుచ్చుకొంటాడు పాడమ్మా!"

    భ్రమర కూర్చుంది. "ఏ కీర్తన పాడదామే సంగీతా?"

    "జలుబుతో నా గొంతు పట్టుకుపోయింది. నువ్వే పాడక్కా!" అంది సంగీత.

    వికీ ఆలయ ప్రవేశం జరిగింది. ఒక్కసారిగా అతడి చెవుల్లో అమృతం పోసినట్టుగా అయింది. ఈరోజు చెట్లలో పుట్టల్లో తిరుగుతూ పక్షి కూతల్ని టేప్ చేయాలని తెచ్చుకున్న టేప్ రికార్డర్ స్విచ్ నొక్కాడు.

    పాట వెంట పాట.......నాలుగు పాటలు, హనుమాన్ చాలీసా చక్కగా రికార్డ్ అయిపోయాయి. భ్రమర చాలించడంతో గప్ చిప్ గా స్విచ్ ఆఫ్ చేసి సంచీలో పెట్టేసుకున్నాడు. తరువాత నెమ్మదిగా గుడిముందుకు వచ్చి తీర్ధప్రసాదాలు తీసుకొని నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు.

    అతడు వెళ్ళిపోయాక అడిగింది సంగీత "ఈయనేనా చినరాణి గారి కొడుకు?"

    అవునన్నట్టు తలూగించింది భ్రమర.

    "ఓహ్! ఎంత అందంగా వున్నాడు." అక్కకు కన్నుకొట్టి అంది సంగీత.  "నీ మనస్సులో మెదిలే రాజకుమారుడితడేనా?"

    "నోర్ముయ్, గాడిదా" భ్రమర చెయ్యి విసురుగా పైకి లేచింది. "ఏమిటా పిచ్చివాగుడు?" కళ్ళెర్రజేసి అడిగింది.

    "ఇందాకా తాతగారు అనలేదూ, నీ మనసులో మెదిలే రాజకుమారుణ్ణే స్వామి ప్రసాదిస్తాడని"

    "నేను మాట వరుసకి రాజకుమారుడన్నాను. రాజకుమారుడంటే, రాజకుమారుడు లాంటి అందచందాలు, ఐశ్వర్యం కలవాడన్నమాట" సర్దిచెప్పాడు శిఖామణి. "చెల్లెలు ఏదో ఆట పట్టించడానికి అంటూంది. అంతకోపమెందుకమ్మా, భ్రమర?"

    భక్తుల రాకమొదలైంది.

    బయటికి వచ్చాక అంది సంగీత, "వేదప్రకాశం కడుపున పుట్టినందుకు నేనెప్పుడూ విచారించలేదు. కాని ఈ రోజు మొదటిసారిగా విచారిస్తున్నానక్కా!"

    "ఎందుకే?" ఆశ్చర్యంగా అడిగింది భ్రమర.

    "ఏ తుంగభద్ర కడుపున్నో పుడితే బాగుండేది!"

    "అదీ ఓ జన్మేనా? ఏకుక్క కడుపున్నో పుట్టడం దానికంటే నయం కదూ?"

    "కుక్క కడుపున పుడితే రాజకుమారుడు లక్ష్యంకాడు కదా?"

    "ఏమిటా బరి తెగించిన మాటలు? ఇంటికి పద! గరిటకాల్చి మూతిమీద వాతపెడతాను!"
 
    "ఇలాంటి మాటలు మాట్లాడితేనే మైలపడిపోయే బ్రాహ్మణ కులంలో పుట్టి మనం ఎంత నష్టపోయామో నీకు తెలియడం లేదు. ఏ కోతి మొహం వాడొచ్చినా కిక్కురుమనకుండా పెళ్ళి చేసుకొని వెళ్ళిపోవాలి. మడి గుడితో, పూజలు పునస్కారాలతో జీవితం తెల్లారిపోతుంది"

    "నీకేదో దెయ్యం పట్టినట్టుంది!"

    "ఆ.......రాచదెయ్యం!"

    "అగ్ర కులంలో పుట్టావు. ఆచార సంపన్నుల ఇంట్లో పెరిగావు. నీకిలాంటి ఊహలెలావస్తున్నాయో నా కర్ధం కావడంలేదు."

    "అగ్రకులం శరీరానికేగాని, మనసుకు కులమేమిటక్కా? ఇహ ఆచార సంపన్నత అంటావా? జీవితంలో ఎలాగూ పొందలేం! కనీసం ఊహల్లోనైనా తృప్తిపడొద్దా?"

    "దీన్నే మానసిక వ్యభిచారమంటారు. అదుపులో వుంచాల్సింది ముఖ్యంగా దీన్నే."

    "ఎంతో దుఃఖ భాజనమైన మానవజీవితంలో ఊహ అన్నది భగవంతుడిచ్చిన వరం. ఊహకి పాపం పుణ్యం ఏమిటి? ఊహని చంపుకోవడం ఎందుకక్కా?"

    జవాబు చెప్పలేనట్టుగా చూసింది భ్రమర. నిజమే! ఊహ అన్నది మనిషికి భగవంతుడిచ్చిన వరం. ఎంతో నిస్పృహలోనూ ఈ ఊహలే మనిషికి ప్రాణప్రతిష్టనిస్తాయి. ఊహలతో ఆశాసౌధాలు కట్టడమే మనసుకి చేతకాకపోతే మనిషి బ్రతుకు కడు దుర్భరమైపోతుంది.

    తనకంటే ఏడాది మాత్రమే చిన్నదైన సంగీత తనకంటే తెలివైందో కాదో చెప్పలేదుగాని తనకంటే ధైర్యస్తురాలని చెప్పగలదు. అమ్మానాన్న మాటకు తనెప్పుడూ ఎదురుచెప్పదు! కాని, సంగీత చెబుతుంది. తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా బయటపెడుతుంది సూటిగా, కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతుంది. ఆ గుణం దానికి మొదటినుండీ ఉంది.

                                                                   *    *    *

    ఒకరోజు ఉదయం వికీ అడిగాడు. "ఇల్లెక్కడవుంది, తుంగభద్రా?"

    "ఎందుకు చినబాబుగారూ"

    "ఈరోజు మీ ఇంటికి వద్దామనుకొంటున్నాను."

    "మా ఇల్లేమన్నా మీవలె రాజప్రసాదమా చూడ్డానికి? ఆ రంకణాల మట్టి మిద్దె, పెచ్చులూడిపోతున్న మట్టిగోడలు, సత్తుగిన్నెలూ, మట్టి కుండలూ తప్ప ఏముంటాయి మా ఇంట్లో?"

    "అది చూడ్డానికే వస్తాను"

 Previous Page Next Page