Previous Page Next Page 
తులసి పేజి 31

    దార్కా మాట్లాడలేదు. సిద్దేశ్వరి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి తాపీగా చెప్పడం మొదలు పెట్టింది.

    "దార్కా! ప్రజలని బాధలనుంచి తప్పించడానికి, ప్రజల దుఃఖం తొలగించడానికి దేవుడు తరపున పంపబడ్డ దేవిని నేను. ప్రజలకి నమ్మకం కలిగించడం కోసం దేవుడు నాకు కొన్ని శక్తులు ఇచ్చాడు. వాటిని ప్రదర్శించి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాను. తండోపతండాలుగా ప్రజలు నన్ను కలుస్తున్నారు."

    ఆమె మొహంలో కొద్దిగా నవ్వు తొంగి చూసింది. "నీలో నాకుబాగా నచ్చింది నిజాయితీ. దార్కా - ఆ నిజాయితీతోనే నేనూ నీకు కొన్ని విషయాలు చెప్తాను విను. ప్రజలు మూర్ఖులు, వారి మూర్ఖత్వాన్ని డబ్బు చేసుకోవడంలో తప్పులేదు. వారి భ్రాంతులకి, వారి మానసిక రుగ్మతలకీ మానవాతీత శక్తుల పేర్లు అన్వయించి డబ్బు సంపాదించడం నా ఆశయం. నాతో రా చూపిస్తాను" అతడు తటపటాయించి ఆమెతో నడిచేడు. వాళ్ళిద్దరూ విశాలమైన వరండా గుండా ప్రయాణం చేసి చీకటిగా వున్న చోట మెట్లు దిగి కింది గదిలోకి వెళ్ళారు. గది అడుగున వున్నా అఖ్కడ ఎంతో చల్లగా వుండడం అతడు గమనించేడు. సిద్దేశ్వరి ఇనుప పెట్టె తెరిచింది.

    ఆ దృశ్యాన్ని చూసి దార్కా అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసేడు.

    ఆ పెట్టెనిండా బంగారు ఆభరణాలు, కరెన్సీ వున్నాయి .కొన్ని లక్షల విలువగల ఆభరణాలు.అతడు నిశ్చేష్టత నుంచి తేరుకోకుండానే ఆమె అన్నది,  "ఇంతకాలం మానవాతీత శక్తులు ఏవీ లేవనే నేను నమ్ముతూ వచ్చాను. కానీ నిన్ను చూసిన తరువాత నా అభిప్రాయం మార్చుకొన్నాను. ఈ ప్రపంచంలో నీ అవసరం నాకు చాలా వున్నది దార్కా."

    అతడు విస్మయంతో "నా అవసరమా" అన్నాడు.

    "నా అంతరంగిక శిష్యులు -నన్ను ఎంతగానో నమ్ముకున్నవారు కొంతమంది వున్నారు." అంది సిద్ధేశ్వరి. "వారికి సాయం చేయవలసిన బాధ్యత నా మీద వుంది."

    "దానికి నేనేం సాయపడగలను"

    "చాలా"

    "ఎలా?"

    "తన పార్టీలో తనకన్నా పై స్థానంలో వున్న మంత్రిని నా శిష్యుడు ఏదైనా చేసి అడ్డుతొలగించుకోవాలనుకుంటున్నాడు. ఈ రాజకీయ చదరంగంలో చేతబడి అనే షా నువ్వు చెప్పాలి. బిజినెస్ లో తన ప్రత్యర్ధి ఒక పదిరోజులపాటు మంచాన పడితే నా శిష్యుడికి నూనె గింజల వ్యాపారంలో పది లక్షల పైగా లాభం వస్తుంది. అతడి ఉపవాయువుల మీద నువ్వు ప్రయోగం చెయ్యాలి దార్కా! ఎవరికీ చెప్పుకోలేనివి నా వాళ్ళు నాకు చెప్పుకుంటారు. అవి నీకు చెబుతుంటాను. వారి వారి శతృవుల్ని నీ శక్తితో చంపాలి -బాధ పెట్టాలి -లేవకుండా చెయ్యాలి. దానికి ప్రతిఫలంగా నీకు......" ఆమె అతడివైపు చూసి చప్పున మాటల్ని ఆపింది.

    అంత చీకటిలోనూ అతడి మొహం ఎర్రగా ప్రతిబింబిస్తూంది. బిగించిన పెదవులు అతడు తన కసినీ, కోపాన్నీ, రోషాన్నీ, ఎంత బలంగా నిగ్రహించుకుంటున్నాడో సూచిస్తున్నాయి. అతి కష్టం మీద తన కోపాన్ని దిగమింగి, "నన్ను మీ డబ్బుతో కొనాలనుకుంటున్నారా" అన్నాడు.

    "అంత పెద్ద పదాలెందుకు. మన మొక వ్యాపారపు అగ్రిమెంటులో....."

    "క్షమించండి....."

    ఇనప్పెట్టె మూసి, ఆమె అతడి దగ్గిర కొచ్చింది. "ఒక్కొక్క చేతబడికీ నీకు లక్ష రూపాయలిస్తాను"

    అతడు మొహం తిప్పుకున్నాడు.

    "సరే....... నీ కిష్టం లేకపోతే వెళ్ళిరా దార్కా"

 Previous Page Next Page