"దిగు" అన్నాడు కొరియన్.
తడుముకుంటూనే దిగాడు సెబాస్టియన్.
అతని చేయి అందుకున్నాడు కొరియన్. "నడు" అన్నాడు.
ఎత్తి ఎత్తి అడుగులు వేస్తూ నడవసాగాడు సెబాస్టియన్.
ఎక్కడో సమీపంలో నీళ్ళు పారుతున్న శబ్దం. ఏవో జలపాతం అయి వుండొచ్చు అనుకున్నాడు.
మరో ఐదు నిమిషాలు గడిచాక ఆగారు వాళ్ళు.
"ఇతనేనా ఆ వ్యక్తి?" ఎవరిదో కంఠం వినిపించింది.
"అతని భుజానికి వ్రేలాడుతున్న సంచిలో ఏమున్నాయి?" ఒకింత కరుకుగా వుంది ఆ గొంతు.
"డబ్బు మాత్రం వుంది"
"ఏ మాత్రం వుంది?"
"నాలుగు లక్షలు" జవాబు చెప్పాడు కొరియన్.
"అతని కట్లు విప్పండి"
ఎవరో దగ్గరకు నడిచి వస్తున్నట్లు అలికిడి అయింది.
కొద్దిక్షణాల తరువాత కట్లు విప్పాడు ఓ వ్యక్తి.
మెల్లగా కళ్ళు తెరిచాడు సెబాస్టియన్.
అప్పటి వరకు కళ్ళు మూసుకుని వుండటంతో వెలుగు చూడటం కష్టంగా వుందతనికి. మసకగా కొందరు వ్యక్తులు కనిపించసాగారు.
నాలుగైదుసార్లు కళ్ళు నులుముకున్నాక దృష్టి కొంచెం స్పష్టమయింది.
ఎదురుగా బండరాతిమీద కూర్చుని వున్నాడో వ్యక్తి.
సుమారు ముప్పై ఐదేళ్ళుంటాయి. నలుపురంగు ప్యాంట్, షర్ట్ ధరించి వున్నాడు. పొడవైన జుట్టు, మాసిన గడ్డం....ఏ మాత్రం శుభ్రం లేనట్లుంది అతని వాలకం.
అతని వెనుక నిలబడి వున్నారు మరో నలుగురు వ్యక్తులు.
వాళ్ళలో ఒకరిచేతిలో ఎకె. 47, మిగతావాళ్ళ దగ్గర లైట్ మెషిన్ గన్స్ వున్నాయి.
చుట్టూ కలయజూశాడు సెబాస్టియన్.
అక్కడ చెట్లు, చేమలు తప్ప_ఇల్లుగాని, కనీసం టెంట్ అయినా లేదు. అంటే అది టెర్రరిస్ట్ ల స్థావరం కాదన్నమాట!
ఏదో మధ్య మార్గంలో కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు. తమ స్థావరాలు ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తపడుతున్నారన్న మాట!
ఆ రాతి మీద కూర్చున్న వ్యక్తి నర్సింగ్ అని అర్ధం చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు సెబాస్టియన్ కి.
"నీ పేరేనా సెబాస్టియన్ అంటే?"అడిగాడు నర్సింగ్.
నర్సింగ్ మాట్లాడినప్పుడు అతని ముఖం వైపు పరీక్షగా చూశాడు సెబాస్టియన్. అతనిపై వరస పళ్ళు మూడో నాలుగో లేవు.
అవునన్నట్లు తల వూపాడతను.
"నువ్వు వచ్చిన పని ఏమిటి?" అతని కళ్ళలోకి స్పష్టంగా చూస్తూ అడిగాడు.
"కొంచెం మంచినీళ్ళు కావాలి" సమాధానంగా అన్నాడు.
అసహనంగా అతని వైపు చూశాడు నర్సింగ్.
ఆ చూపులోని భావం అర్ధం అయిన ఆ వ్యక్తి తన ప్రక్కనున్న సంచిలోంచి వాటర్ బాటిల్ ఒకటి తీసి యిచ్చాడు.
బాటిల్ ఎత్తి చుక్క కూడా మిగలకుండా తాగేశాడు సెబాస్టియన్.
ఖాళీ బాటిల్ క్రిందపెట్టి మూతి మీదగా ప్రక్కకు కారుతున్న నీళ్ళ చుక్కలు తుడుచుకున్నాడు పోయిన ఓపిక అంతా తిరిగి వచ్చినట్లయింది.
"విషయం త్వరగా చెప్పు ఇక్కడ మేము పదినిమిషాలు మించి వుండము" కరుకుగా అన్నాడు నర్సింగ్.
ఒక్కసారి అక్కడున్న వాళ్ళందరి మీద దృష్టి వుంచి చెప్పసాగాడు.
"సంజు అనే ఒక అమ్మాయి ఇంగ్లండ్ నుంచి వచ్చింది. వచ్చే ఆదివారం నాడు హైదరాబాద్ లో ఆమె మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతుంది. ఆమె ప్రోగ్రాం పూర్తయ్యేలోపు ఆమెను చంపాలి. అందుకు ఎంత ఖర్చయినా ఫరవాలేదు. కొంత డబ్బు ఎడ్వాన్స్ గా తెచ్చాను. మీరు ఈ పని పూర్తిచేస్తే...." సెబాస్టియన్ మాట పూర్తికాలేదు.
నర్సింగ్ బలమైన పిడికిలి అతని గడ్డాన్ని బలంగా తాకింది.
ఫట్ మన్న శబ్దంతో క్రింది పెదవి చితికి రక్తం బడబడా కారింది.
బాధతో అరిచాడు సెబాస్టియన్. నర్సింగ్ అలా ఎందుకు కొట్టాడో అర్ధం కాలేదు.
"మేము కిరాయికి మనుషులను చంపేవాళ్ళం అనుకున్నావా?" అరిచాడు నర్సింగ్.
అప్పుడర్ధం అయింది సెబాస్టియన్ కి. నర్సింగ్ కి అంత ఆవేశం ఎందుకు వచ్చిందో.
"మాకు కొన్ని లక్ష్యాలున్నాయి. ఆదర్శాలున్నాయి. వాటికి అడ్డం వచ్చిన వాళ్ళని మాత్రమే చంపుతాం. సాధారణ పౌరులతో మాకేం పని? అదీ మన దేశం కూడా కాని ఆడకూతుర్ని చంపాలా? ఆ పనికి మేము రావాలా? నాకు డబ్బు ఇస్తావా? లోకం మా మీద టెర్రరిస్ట్ లన్న ముద్రవేసింది కానీ, మేము టెర్రరిస్ట్ లం కాదు. ఇంకొక్క క్షణం కూడా ఇక్కడుండొద్దు. ఫో....ఇక్కడి నుంచి" ఆవేశంతో నర్సింగ్ కంఠనరాలు వుబికాయి.
"మీరు పొరపాటు పడ్డారు. మీకు కావలసిన మనిషిని ఒకరిని చంపేమార్గం నేను చెబుతాను కాదు. మార్గం చూపిస్తాను. మీరు కావాలనుకుంటున్న ఆ వ్యక్తిని చంపండి. అదే సమయంలో ఆ వ్యక్తి ప్రక్కనే వుండే ఈమెను కూడా చంపండి."
"నాకు కావలసిన వ్యక్తా....ఎవరు?"
"హోం మినిస్టర్....డి జి పి లు"
"వాట్!?"
"అవును. సంజు మ్యూజికల్ ప్రోగ్రాంకి హోంమినిస్టర్, డి.జి.పి లు ముఖ్య అతిధులుగా వస్తున్నారు. ఆ సందర్భంలో యీ ముగ్గురు వ్యక్తులు కొంత సమయంపాటు ఖచ్చితంగా స్టేజి మీద వుంటారు. ఆ సమయాన్ని మీరు వినియోగించుకోగలిగితే మీ పని, మా పని కూడా అవుతుంది."
"మాకేమైనా పిచ్చి పట్టిందనుకున్నావా? హోం మినిస్టర్, డి.జి.పి మాకు శతృవులయినంత మాత్రాన నువ్వు చెప్పిన పని చేస్తాం అనుకుంటున్నావా? వాళ్ళకి ఎంత సెక్యూరిటీ వుంటుందో తెలుసా? అదీ రాజధాని నగరంలో వాళ్ళ మీద మర్డర్ ఎటమ్ట్ చేయటం....అవివేకం....అసంభవం కూడా!"
"ఆ అసంభవంమనుకున్నదే సంభవమయ్యే మార్గం చెబుతాను. పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే మాకు సహకరించే వ్యక్తులున్నారు. వాళ్ళ సహాయంతో మీ తాలూకు ఒక వ్యక్తిని కూడా మారణాయుధంతో సహా స్టేజిమీదకు పంపించగలుగుతాము. ఆ అవకాశం వినియోగించగలిగితే....మీ పని, మా పని కూడా అవుతుంది. మీ మనిషిని హోంమినిస్టర్, డి.జి.పి లకు అతి సమీపంలోకి పంపడం, మీకు మేము చేసే సహాయం అయితే మాకు కావలిసిన వ్యక్తిని చంపడం మాకు మీరు చేసే సహాయం. ఈ సహాయానికి మీకు అవసరమైనంత డబ్బు కూడా యిస్తాము."
"మా వ్యక్తిని స్టేజి మీదకు పంపే బదులుగా అంతటి సామర్ధ్యం వుంటే మీరే డైరెక్ట్ గా చంపవచ్చు కదా! ఇందులో మా సహాయం దేనికి? మాకు డబ్బు యివ్వడం ఎందుకు?"
"మీకొక విషయం అర్ధమయి వుండాలి. హోంమినిస్టర్ ని చంపిన మరుక్షణం ఎవరైతే చంపడానికి వెళతారో వాళ్ళు కూడా చావటం ఖాయం. అక్కడి పోలీసు అధికారుల్లో, సెక్యూరిటీ మనుషుల్లో ఎవరో ఒకరు చంపేస్తారు చావకుండా ప్రాణాలతో పట్టుబడినా ఆ బ్రతుకు దుర్భరం. ప్రాణాలకు పూర్తిగా తెగించిన వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలరు! మా దగ్గర వున్న మనుషులు డబ్బు కోసం హత్యలు చేసేవాళ్ళేకానీ, ప్రాణాలు పోగొట్టుకోటానికి సిద్ధపడే వాళ్ళు లేరు" చెప్పాడు సెబాస్టియన్.
అతనికి తెలుసు. టెర్రరిస్ట్ గ్రూపుల్లో, సూయిసైడల్ స్క్వాడ్స్ వుంటాయి. ఆ ఆత్మాహుతి దళాలు చావుకి సిద్ధపడే హత్య చేయటానికి బయలుదేరతారు. ఆ పని ఆత్మాహుతి దళాలు మాత్రం చేయగలుగుతాయి. "ఈ పని పూర్తయ్యేవరకు మా మనుషులు కూడా మాతో సహకరిస్తారు. ఇందుకు ఎన్ని లక్షలు ఖర్చయినా మీకు మేము ఇస్తాము" తనే అన్నాడు సెబాస్టియన్.
సైలెంట్ గా కూర్చున్నాడు నర్సింగ్.
అతను ఈ విషయం గురించే ఆలోచిస్తున్నాడని అర్ధమైంది సెబాస్టియన్ కి.
నేల మీద వున్న గడ్డి పరకలు పీకుతున్నాడు కొరియన్.
పది నిమిషాలు సైలెంట్ గా గడిచాయి.
"ఈ విషయం గురించి నేను ఇప్పుడే చెప్పలేను. మా లీడర్స్ మరికొంతమంది వున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి రేపటిలోగా ఏ విషయం చెబుతాను.
తన చేతిలోని డబ్బు సంచిని నర్సింగ్ దగ్గర పెట్టాడు సెబాస్టియన్.
"మీరు ఈ పనికి ఒప్పుకుంటే ఈ కాష్ మీ దగ్గర పెట్టండి .లేకుంటే నాకు వాపస్ చేయవచ్చు. మరి నేను రేపటివరకు ఏం చెయ్యాలి? ఇక్కడే వుండాలా?"
"అవసరం లేదు. మాతో వుండటానికి ఎవరినీ అనుమతించను. మిమ్మల్ని మా మనుషులు మళ్ళీ అడ్డతీగల దగ్గర దింపుతారు. మీరు ఎల్లుండి వరకు అక్కడే వుండండి. ఈ పనికి మేము సిద్ధపడితే మిగతా విషయాలు మాట్లాడటానికి మా మనుషులు మిమ్మల్ని కలుస్తారు. అలా జరగకపోతే మీ డబ్బు మీకు అందజేస్తారు.
అలాగే అన్నట్లుగా తల వూపాడు సెబాస్టియన్.
"మీరింక వెళ్ళావచ్చు" చెప్పాడు.
లేచి నిలబడి ప్యాంట్ కి అంటుకున్న మట్టి దులుపుకొని ముందుకు కదిలాడు సెబాస్టియన్.
అతనితో పాటే లేచి నిలబడిన కొరియన్ ని దగ్గరకు రమ్మన్నట్లుగా సైగ చేశాడు నర్సింగ్.
"ఇతనిని నమ్మవచ్చా?" గుసగుసలాడినట్లుగా అడిగాడు.