చాలాఏళ్ల తరువాత కంటబడిన చిన్ననాటి ప్రియనిచ్చెలిని చూస్తున్నట్లుగా చూస్తున్నాడు శ్రీచక్ర.
పదహారేళ్ల కన్నెపడుచు హిమబిందు. ఆకుచాటు మొగ్గలా కనిపించేది.
ఆ రోజు ఆఖరిసారి రేపుమెట్లమీద నిలబడి తనంటే ఇష్టమని చెప్పి కన్నీళ్లతో పరిగెత్తిపోయింది.
ధీరనమీరే యమునా తీరే అన్న పాటకు ఆమె చేసిన నృత్యాభినయం నిన్నమొన్న చూసినట్లుగా అనిపిస్తోంది.
ఇప్పుడు నలభయ్యో పడిలో పడినా నిండుగా పూసిన పువ్వులా వుందామె.
నిత్యం నృత్యసాధనలో ఆమె శరీరం ఆకర్షీయంగా రూపుదిద్దుకుంది.
ఆమె విశ్వవిఖ్యాత నర్తకి హిమబిందు.
ఆమె ఫోటోలు వేసి పత్రికలు ఆమెను ఎంతగానో కీర్తించాయి.
అందరూ ఆమెనే చూస్తున్నారు.
భూపాల్ గారి వల్ల ఉపకారం పొందినవాళ్లు, ఆయన ఆర్దికసాయం వలన చదువుకుని ఈనాడు ఉన్నత ఉద్యోగాలలో వున్నవాళ్లు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆయనకి అశ్రుతర్పణచేసి తన భక్తిని చాటుకుంటున్నారు.
హాలు, బంగళా ఆవరణల జనాలతో కిటకిటలాడిపోతోంది.
ఒక ప్రక్కగా చేతులు కట్టుకుని గంబీరంగా నిలబడి వున్నాడు రవికుమార్.
భూపాల్ గారి చిత్రపటానికి నమస్కరించి వెళుతున్న ఒక వ్యక్తిని చూసాడు స్వామి.
"చూసారా అతడిని? అతడే మునిరాజు" నెమ్మదిగా చెప్పాడు స్వామి.
"అలాగా?" అన్నట్లుగా తల పంకించాడు రవికుమార్.
అతడి చూపులు మునిరాజు చుట్టూ వేటకుక్కల్లా పరిభ్రమించాయి.
చివరిగా భూపాల్ గారి లాయరుగారు వచ్చారు.
ఆయన భూపాల్ గారి చిత్రపటానికి నమస్కరించి వచ్చి బ్రీఫ్ కేస్ తెరిచి అందులోంచి కొన్నికాగితాలు తీసారు.
"ఇది మన వెంకటకృష్ణ భూపాల్ గారు పూర్తి స్పృహలో వున్నప్పుడు వ్రాయించి సంతకం పెట్టిన వీలునామా. ఇక్కడ సమావేశమయిన పెద్దలూ, పిన్నలూ అందరూ వినవలసిందిగా ప్రార్దన" అంటూ చదవడం మొదలుపెట్టారు.
"రామాపురం మాజీ జమీందారు వెంకటకృష్ణ భూపాల్ పేరుగల నేను పూర్తి ఆరోగ్యంతో వుండి ఇష్టపూర్తిగా వ్రాయించి సంతకం పెడుతున్న వీలునామా పత్రం ఇది.
నాకున్న ఒకే ఒక పుత్రసంతానం జయసూర్య భూపాల్ ఇల్లు విడిచి ఇరవయ్ సంవత్సరాలు దాటింది. ఇక తిరిగి వస్తాడన్న ఆశ అడుగంటింది. నేను చనిపోయేలోగా వస్తే అతడి ఇష్టప్రకారం ఈ వీలునామా మార్చబడుతుంది.
అతడు తిరిగిరాని పక్షంలో ఈ వీలునామాలో మార్పు వుండబోదు. సుమారు యాభయ్ లక్షల విలువచేసే నా స్థిరచరాస్థులు నాకు తల తలకొరివి మీద వచ్చే ఆదాయం నాకు పరిచర్యలుచేసి నా మంచిచెడ్డలు చూస్తున్న కీర్తిశేషుడైన ప్రసాద్ భార్య, రామ్ లాల్ కోడలు అయిన శ్రీమతి అలివేలు మంగకు చెందుతున్నట్లుగా నిర్ణయించాను.
నా ఈ నివాసమైన బంగళాను ఎవరైనా విద్యాపేక్షతో ఏదయినా కళాశాల పెట్టదలిస్తే వారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నా ఆస్తిపాస్తులను అనుభవించడంతోపాటు ఊరిలో కోదండ రామాలయం ధర్మకర్తగా నిధులు నిర్వహిస్తూ శుభలేఖ ఇచ్చిన ఏ పేద వధువుకైనా సరే పుస్తె, మెట్టె పసుపుబట్టలు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను.
ఇట్లు,
వెంకటకృష్ణ భూపాల్"
అప్పుడు అక్కడున్న అందరి చూపూ దశదినకర్మ రోజు క్షురకర్మ చేయబడి మిలమిల్లాడుతున్న గుండుతో కనిపిస్తున్నశ్రీచక్రమీద వాలాయి.
రాజ్యానికి వారసుడిని ఎన్నుకొమ్మని పట్టెపుటేనుగుకి పూలదండ ఇచ్చి పంపిస్తే నగర వీధుల్లో నడుస్తున్న ఎవరో బికారి మెడలో వేసి అతడిని రాజును చేసినట్లుగా భూపాల్ గారి వీలునామా ఊరేదో, పేరేదో తెలీని ఒక అపరిచితుడిని లక్షాధికారిని చేసింది.
అసలు వీలునామాలో వున్న విషయం తెలుసుకునే అతడు ఒక ప్లాన్ తో వచ్చాడేమో?
లేకపోతే ఎవరో ఏమిటో భూపాల్ గారికి శ్రాద్దకర్మ నిర్వహించడం ఏమిటి.
జనాలు గుసగుసలు పోసాగారు.
వీలునామాలో వున్న విషయం తెలిసాక తిరిగి ఆలోచనలో పడ్డాడు రవికుమార్.
"ఇదంతా భూపాల్ గారి వీలునామాలో వున్న విషయం తెలిసి స్వామితో కలిసి ఆడుతున్న నాటకం కాదుకదా. లేకపోతే జయసూర్య శ్రీచక్రగా పుట్టడం ఏమిటి? పూర్వజన్మ స్మృతులుండడం ఏమిటి? ఇద్దరూ కూడబలుక్కుని తన చెవిలో పూలు పెట్టలేదుకదా?"
అదే నిజమైతే పబ్లిక్ లో నిలబెట్టి ఉరి తీయిస్తాను. ఊరికే వదలను" అనుకున్నాడు.
మధ్యాహ్నం భోజనాలు చేసి ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోగా శ్రీచక్ర,కౌస్తుభ, మంగ, పనివాళ్లు వుండిపోయారు.
పనివాళ్లతో అంతా సర్దిస్తోంది మంగ.
ఖాళీ ఆవరణలో భోజనాలకోసం, వంటలకోసం తడకలతో వేసిన పాకలు విప్పుతున్నారు కొందరు.
నాలుగైదు రోజులుగా వూపిరి సలపనట్లుగా వున్న పనులలో పాలుపంచుకుని అలసిపోయి నడుంవాల్చిన కౌస్తుభ దగ్గరికి వచ్చాడు శ్రీచక్ర.
"రేపు వెళ్లిపోతాం కదా? అలా వూళ్లోకి వెళ్లి వూరెంత మారిందో చూసివద్దాం రా!"
"అబ్బా! కాళ్లు లాగేస్తున్నాయి. నేను రాలేను. మీరెళ్లిరండి"అంది కౌస్తుభ.
శ్రీచక్ర అడ్డ పంచెమీదే వున్నాడు.
షర్టు వేసుకుని భుజంమీద తువ్వాలు వేసుకున్నాడు.
జయసూర్య వూళ్లో వెడితే ఇలాగే నిరాడంబరంగా వెళ్లేవాడు.
ఊళ్లో అక్కడక్కడ కొత్త ఇళ్లులేచాయి.
ఊళ్ళోకి కరెంట్ వచ్చింది.
కుళాయిలు వచ్చాయి.
ఊళ్లో చాలామంది యువకులు చదువులు చదివి ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో వున్నారు.
ఊరిజనాల్లో మంచి రాజకీయ చైతన్యం వచ్చింది.
ప్రైమరీ స్కూలు హైస్కూలుగా మారింది. ఇంత మార్పు వచ్చినా దరిద్రపు చాయలుమాత్రం పోలేదు.
శ్రీచక్రకి తెలిసినవాళ్లెవరూ కనిపించలేదు. అన్నీ అపరిచితమైన ముఖాలు.
సాయంత్రం అయ్యేసరికి వూరి పెద్దలతో కళకళలాడిపోయే రచ్చకట్ట ఎవరూలేక వెలవెలబోయినట్లుగా వుంది.
ఊళ్లోకి టీవీలు, డిష్ లూ వచ్చాయి.
చిన్నా - పెద్దా టీవీల ముందు బందీలుగా కూర్చుంటే రచ్చకట్టబోసి పోక ఏమవుతుంది?
ఒక ముసలావిడ మాత్రం గోనెపట్టా మీద కాల్చిన పల్లీలు పోసి అమ్ముకుంటోంది.
"ఈ ఊళ్లో పెద్దరెడ్డి అని ఒకాయన వుండాలికదా? ఆయన పోయాడా?"
"ఆయన ఎప్పుడో పోయాడు. ఆయన కొడుకూ పోయాడు. కొడుకుపిల్లలు మాత్రం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడో పండగకీ, పబ్బాలకీ ముసలామె దగ్గిరికి వస్తుంటారు. ఇంతకీ తమరెవరండీ బాబూ?"
"చిన్నప్పుడు ఈ వూళ్లో వున్నానులే!"
ఊరవతల శివాలయం, బిల్వవృక్షం అలాగే వున్నాయి.
ఏమీ మార్పులేదు.
తిరిగివస్తూ రంగసాని ఇంటి ముందునుంచి వచ్చాడు. గేటుకున్న రేకు విరిగిపోయింది.
లోపల ఇంటివాకిలి మూసి తాళం పెట్టివుంది.
ఆలనా - పాలనా కరువైనట్లుగా గోడలు పెచ్చులూడిపోయాయి. మనుష్య సంచారం లేనట్లుగా చెత్తాచెదారంతో నిండిపోయింది.
ఒకనాడు సంగీత నృత్యాలతో పరవశించిన ఆ ప్రదేశం ప్రస్తుతం పాడుబడింది.
హిమబిందు తల్లి తప్ప అందరూ పోయారు.
ఆమె కూతురు దగ్గరే వుంటోంది.
హిమబిందు నగరంలో పెద్ద బంగళా కట్టుకుని అష్ట ఐశ్వర్యాలను అనుభవిస్తోంది.
ఈ సంగతులన్నీ మంగ నుండి విన్నాడు శ్రీచక్ర.
తిరిగి వచ్చాక అడిగింది కౌస్తుభ "ఎవరైనా మీకు తెలిసినవాళ్లు కనిపించారా?"
"ఉహూ.. .అంతా కొత్త ముఖాలు!"
"మీసెకండ్ హీరోయిన్ వస్తే పలకరించలేదేమి?
"సెకండ్ హీరోయిన్ ఎవరు?"
"హిమబిందు"
"ఆమె నాకు తెలుసు. నేనామెకు తెలియదు కదా? నా గత జన్మ జ్ఞాపకాలతో ఆమెను గందరగోళపరచడం ఎందుకని వూరుకున్నాను."
"మంగ చెప్పింది. ఆమె జయసూర్యను ఆరాధిస్తూ, ఇంకెవరినీ పెళ్లి చేసుకోలేనని అలాగే వుండిపోయిందట పాపం."
"జయసూర్య మట్టిలో కలిసిపోయాడని తెలియదు కదా! అతడుతిరిగి వస్తాడని ఆమె నిరీక్షిస్తుందేమో?"
* * * *
"నాకు తెలిసిన ఒక డాక్టరుకు కారు ఏక్సిడెంట్ లో తలకి దెబ్బ తలిగిలింది. పూర్వంలా ఆపరేషన్ కేసులు చేయగలనా లేదా అని అధైర్య పడుతున్నాడు. మీ పర్యవేక్షణలో అతడిచేత ఒక ఆపరేషన్ కేసుచేయించి చూడండి."