Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 32


    విసుగ్గా చక్రవర్తి చేతికి రిసీవర్ ఇచ్చాడు రాజేంద్ర.

    ఆ నంబర్ ను తిప్పాయి చక్రవర్తి చేతివ్రేళ్ళు....

    "హల్లో సుహాసినీ హియర్...." అందమయిన లేడీ వాయిస్.

    చక్రవర్తి టక్కున ఆగిపోయాడు.

    ఇంతకుముందు రిప్లయ్ వచ్చిన అన్ని ఫోన్ లు మగవాళ్ళే ఎత్తారు. కానీ ఈసారి ఆడగొంతు....తప్పకుండా ఈమెకు శ్రీప్రియ గురించి తెలిసి వుండాలి....

    "హల్లో...."

    చక్రవర్తి తనను తను సర్దుకున్నాడు.

    "హల్లో సుహాసిని గారూ....నేను శ్రీప్రియ స్నేహితుడ్ని. గతంలో ఒకసారి శ్రీప్రియ మీ గురించి చెప్పి, మీ ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆమె పెద్ద అపాయంలో ఇరుక్కునేలా వుంది. ఆ ఆపద ఎలాంటిదో ఆమెకు తెలియదు. నేను ఆమె శ్రేయోభిలాషిని. అందుకే శ్రీప్రియ కోసం చాలాచోట్ల వెదికి, చివరకు మీకు ఫోన్ చేస్తున్నాను..."

    అవతల వైపు నుంచి నిశ్శబ్దం....

    "ఇంతకూ మీ పేరు చెప్పనేలేదు...."

    ఏ పేరు చెప్పాలో చక్రవర్తికి అర్ధంకాలేదు....

    "ఏమిటండీ మాట్లాడారు...."

    "ఆ....వెంకటేశ్వరరావు...."

    "చూడండి వెంకటేశ్వరరావుగారూ....ఇంతకూ ఆమెతో చెప్పవలసిన అంత ముఖ్యమయిన విషయం ఏమిటండీ?"

    "అదీ....అది ఆమెతోనే పర్సనల్ గా చెప్పాలి...."

    "మరింకేం....ఆమెతోనే మాట్లాడండి. నాకెందుకు ఫోన్ చేయడం...."

    "అదే....మాట్లాడడానికి, ఆమె ఎక్కడ వుందో తెలియదుగా...."

    "నల్లమడవాగులో...."

    "అదెక్కడుంది...." చక్రవర్తి గొంతులో ఆశ్చర్యం.

    "ఎందుకు లేదూ....ఆంధ్ర రాష్ట్రంలో ఒక మారుమూలన...."

    "అదేంటండీ....అలా జోక్ చేస్తారు?

    "లేకపోతే మరేంటండీ....ఆ శ్రీప్రియ నాకు కనిపించి చాలా రోజులు అయింది. కనీసం అది నా బర్త్ డే ఫంక్షన్ కు కూడా రాలేదు. అందుకే ఆమె అన్నా....ఆమె బంధువులన్నా నాకు చాలా కోపంగా ఉంది. అది అసలు ఇలా చేస్తుందనుకోలేదు....దాని దగ్గర నావి కొన్ని విలువయిన వస్తువులు కూడా వున్నాయి...." ఆమె గడగడా చెప్పుకుపోతున్నది.

    "మీ దగ్గరకు వచ్చి ఎంతకాలం అయిందండీ...."

    "బహుశా రెండు మూడు నెలలు అవుతుందనుకుంటాను"

    "ఓకే మేడమ్....నేనే వెదుక్కుంటాను లేండి" 

    "ఏమిటండీ....నా వస్తువులా?"

    "కాదు....శ్రీప్రియను...."

    "మీకు కనిపించినప్పుడు మాత్రం ఒకసారి నా గురించి గుర్తుచేయండి...."

    "తప్పకుండా...." ఫోన్ పెట్టేశాడు చక్రవర్తి.

    సుహాసిని మాటలలోని నిజాయితీ అతనికి అర్ధమయింది....శ్రీప్రియను గురించి తెలిసిన ఏకైక వ్యక్తి ఆమె మాత్రమే....కానీ శ్రీప్రియ ఎక్కడుందో ఆమెకూ తెలియదు....

    మిగిలిన ఫోన్ నంబర్లన్నీ మరోసారి ట్రై చేశాడు చక్రవర్తి....

    కానీ, ప్రయోజనం లేకపోయింది....

    ఇద్దరూ ఆటోలో బయలుదేరారు....


                                                                    *    *    *

    అధునాతనమయిన గెస్ట్ హౌస్

    జీటివిలో వస్తున్న హార్రర్ సినిమాను ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు యువకులు బయట కారు హారన్ శబ్దం వినడంతో లేచి నిలుచున్నారు.

    వాళ్ళిద్దరూ ప్రభుత్వాన్ని చేతుల్లో తిప్పుకునే మంత్రులు కొడుకులు....

    కారులో నుంచి మొదటి దిగిన వ్యక్తి శివరామ్!

    జీన్స్ పాంట్ మీద పెట్టీ కోటు ధరించిన ఆ వ్యక్తి భాగ్యనగరంలోని ప్రముఖ వ్యాపార వేత్తలతో పేరుమోసిన ఒక ఇండస్ట్రియలిస్టు ఒక్కగానొక్క కొడుకు, అతని పేరు మీదనే ఒక టెక్స్ టైల్ పరిశ్రమ, మరికొన్ని కోట్ల పెట్టుబడితో షేర్స్ వున్నాయి.

    అందుకే డబ్బుని చిల్లపెంకుల్లా చూసే వ్యక్తి అతను.

    ఇక రెండవ వ్యక్తి చాణక్య....

    శివరామ్ ప్రాణమిత్రుడన్న అర్హత తప్ప అతనికి ఎలాంటి ఆస్థిపాస్తులూ లేవు. ఒక సాధరణమయిన కుటుంబంలో నుంచి వచ్చిన యువకుడే అయినా మిగిలిన మిత్రులు ముగ్గురూ ధనవంతులే కావడంతో అతనికి కూడా దర్జాగా వుండడమే అలవాటయింది.

    కాయకష్టం తెలియని ఈ నలుగురిని తెలిసిందొక్కటే జీవితాన్ని ఎంజాయ్ చేయడం.

    "రండిరా రండి....మీకోసమే ఎదురుచూస్తున్నా...." అంటూ ఆహ్వానించాడు ఆనంద్.

    "ఏరా అశోక్....మంగతాయారు తాంబూలం పంపించలేదా ఇంకా" లోనికి అడుగు పెడుతూనే చాణక్య ప్రశ్నించాడు.

    "లేదు శివా....ఇప్పటికే రెండుసార్లు ఫోన్ చేశాను....కొత్త రుచులు ఇంకా దొరకలేదు. పంపడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పింది" అన్నాడు ఆనంద్.

    "ఏం చేద్దాం....అది పంపించే వరకూ సురాపానంతో కాలక్షేపం చేద్దాం పదండి" అన్నాడు మరొకడు.

    విస్కీబాటిల్స్ ఓపెన్ చేశారు.

    "శివా....ఎప్పుడూ ఒకేటైప్ అయితే బోర్ కొడుతుందిరా...." ముద్దుముద్దుగా వస్తున్నాయి ఆనంద్ నోటి వెంట మాటలు.

    "అంటే ఏమిటో కాస్త అర్ధమయేట్టు చెప్పు" విసుక్కునాడు అశోక్.

    "ఏం లేదురా....ప్రతీసారి మనం ఆ మంగతాయారుకు ఫోన్ చేయడం....అది ఎవతెనో పంపడం....దానిలో మనం ఎంజాయ్ చేయడంలో త్రిల్ ఏముంటుందో చెప్పు...."
 

 Previous Page Next Page