"రాజేంద్రా....నేనెలాగయినా బయటకు వెళ్లాలి...."
"ఎందుకు....?"
"ఆ శ్రీప్రియను వెదకడానికి...."
"చక్రవర్తీ....ఆమెను వెదకడానికి సమయం కాదు...."
"ఇప్పటికే చాలా ఆలస్యమయింది రాజేంద్రా...."
"నువ్వు తప్పించుకుని మూడు రోజులైంది....బహుశా బయట పరిస్థితి నీకు తెలియక నువ్వు ఇలా ఆలోచిస్తున్నావనుకుంటాను. ఇన్స్ స్పెక్టర్ రంజిత్ కు నీ కేసు అప్పగించబడింది. అతనెంత పట్టుదల కలిగిన పోలీస్ ఆఫీసరో ప్రత్యేకంగా నీకు చెప్పనవసరం లేదనుకుంటాను....డిపార్ట్ మెంట్ లో అతన్ని మొండిమనిషిగా చెప్పుకుంటారు. అలాంటి ఇన్స్ పెక్టర్ నీ కోసం నగరం మొత్తాన్ని జల్లెడవేసి గాలిస్తున్నా నీ నిర్ణయం ఇదే అయితే నేనేమీ చెప్పలేను...." రాజేంద్ర సీరియస్ గా చెప్పాడు.
"అయినా సరే....వెళ్ళాల్సిందే...." చక్రవర్తి మొండిగా అన్నాడు.
"ఆమె ఎక్కడ వుందని వెదుకుతావు?"
"ఆమె ఎక్కడ వుండేదీ తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు....నేను అనుకున్న పని సాధించిన తర్వాత నా అంతట నేనే పోలీసులకు సరెండర్ అయిపోతాను....అంతవరకూ పోలీసులు కాదు కదా....రాణా మనుషులు ఎదురయినా సరే వాళ్ళతో ఢీ కొంటాను."
"ఓకే చక్రవర్తీ....ఒక స్నేహితునిగా ఈ సమయంలో నా సహాయం నీకు ఎప్పుడూ వుంటుంది. కోరి ఆపదలను తలకెత్తుకుంటున్న నిన్ను అనుక్షణం రక్షించుకోవడానికయినా సరే నీవెంట నేనూ వస్తాను.... అందుకు అభ్యంతరం చెప్పకు...." అన్నాడు రాజేంద్ర.
చక్రవర్తి మౌనం వహించాడు.
ఇద్దరూ ఆ ప్లాట్ లో నుంచి బయటకొచ్చారు.
ఒక ఆటోలో గతంలో శ్రీప్రియ వున్న భరణి కాంప్లెక్స్ కు చేరుకునేసరికి గంట పట్టింది. తీరా అక్కడకు వెళ్ళాక ఆమె ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయిందనే విషయం తెలిసింది.
చక్రవర్తి నిరాశ పడ్డాడు.
ఆ కాంప్లెక్స్ ఓనర్ ను ఎంక్వయిరీ చేస్తే 'ఏమో ఎక్కడకు వెళ్ళిందో తెలియదు' అన్న సమాధానం వచ్చింది.
"ఆ....ఆమె ప్లాట్ ను హడావుడిగా ఖాళీచేసి వెళ్ళేటప్పుడు ఒక పాకెట్ బుక్ మరచిపోయి వెళ్ళింది. ఆమెకు తెలిసిన వాళ్ళెవరయినా వస్తే ఇద్దామని దానిని జాగ్రత్తగా దాచి వుంచాను...." అంటూ ఒక చిన్న బుక్ ను ఇచ్చాడతను.
ఆ పుస్తకం చూడగానే చక్రవర్తికి ఎంతో ఆనందం వేసింది?
మారుమాట్లాడకుండా ఆ ఇద్దరూ ఆ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చారు.
ఆ పాకెట్ బుక్ లో కొన్ని ఫోన్ నంబర్లు మాత్రం వేసి వున్నాయి తప్ప ఇంకేమీ లేవు. వాటిలో గతంలో రాణా దగ్గరున్నప్పుడు చక్రవర్తి ఫోన్ నంబర్, జగపతి ఫోన్ నంబర్లు కూడా వున్నాయి....
వాటిని చూడగానే చక్రవర్తికి ఒక ఆలోచన వచ్చింది....
"రాజేంద్రా....ఒక పని చేద్దాం...."
"ఏమిటి....?"
"ఇందులో వున్న ఫోన్ నంబర్లన్నీ ప్రయత్నిద్దాం....శ్రీప్రియ జాడ తెలియడానికి ఇది ఒక్కటే మార్గం....అన్నాడతను.
ఫలితం వుంటుందంటావా?"
"ముందు ప్రయత్నించి చూద్దాం...." అంటూ ఒక పబ్లిక్ టెలిఫోన్ వైపు దారితీశాడు చక్రవర్తి.
మౌనంగా అతన్ని అనుసరించాడు రాజేంద్ర.
చక్రవర్తి మొదటి నంబర్ డయల్ చేశాడు.
రెండు మూడు నిమిషాలు గడిచినా ఎవరూ ఎత్తలేదు.
"ఏమిటి....ఎవరూ లిఫ్ట్ చేయడం లేదా...." రాజేంద్ర అడిగాడు.
"ప్చ్...." చక్రవర్తి పెదవి విరిచాడు.
"ఇంకొక నంబర్ ట్రై చేయి...."
రెండవ నంబర్ ను డయల్ చేశాడు చక్రవర్తి.
"హల్లో...."
"పరమేశ్వరం గారున్నారండీ...."
"ప్రతి ఫోన్ నంబరు ముందు పేరు కూడా రాసి వుండడంవల్ల ఆ ఫోన్ నంబర్ ఎవరిదో తెలుసుకోవడం పెద్ద కష్టం కాలేదు అతనికి....
"నేనేనయ్యా పరమేశ్వరాన్ని....మీరెవరు?"
"నేను శ్రీప్రియా వాళ్ళ అంకుల్ నండి...."
"శ్రీప్రియా...."
"అవునండీ...."
"ఆవిడ ఎవరు?"
"అదేనండీ శ్రీప్రియ అని..."
"అబ్బ....ఎవరయ్యా ఆ శ్రీప్రియ...."
"ఒహ్....మీకు మీ అమ్మాయి తన స్నేహితురాలిని గురించి పరిచయం చేసుండదు....దయచేసి మీ అమ్మాయిని పిలుస్తారా?"
"రాస్కెల్....అసలు నాకు అమ్మాయే లేదు...."
చక్రవర్తి టక్కున ఫోన్ పెట్టేశాడు.
రాజేంద్ర అడిగాడు "ఏం జరిగిందని...."
"ఆమె ఎవరో తెలియదంటున్నాడు...." చక్రవర్తి గొంతులో నిరుత్సాహం.
తరువాత మరో నంబర్ ను డయల్ చేశాడు రాజేంద్ర....అది రాంగ్ నంబర్ అని అవతలివైపు నుంచి రిప్లయ్ మరొక నంబర్....నో యూజ్....నంబర్ తరువాత నంబర్ చేస్తూనే వున్నారు....వాళ్ళు ఆశించినట్టు శ్రీప్రియ సమాచారం మాత్రం దొరకలేదు.
చివరకు ఒకే ఒక నంబర్ మిగిలింది....