ఇద్దరూ చేరి కొంచెం టీ తాగసాగారు.
తలుపు కొంచెం తోసి అనుమానంగా లోపలకు చూసింది గంగాభవాని. తరువాత ధైర్యంగా లోపలి కొచ్చింది.
"ఇంట్లో చేరిన ఇంత కాలానికి యిలా విడి విడిగా చూశాను......."
"అది మీ ఇంటి తప్పు. ఇంత యిరుకిళ్ళు కట్టిస్తే ఎవరు మాత్రమేం చేస్తారు?" అన్నాడు సురేష్.
"మీరు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పటానికొచ్చాను......" అందామె .
ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
"మేమిద్దరం కూడా మీ యింట్లోనే వుండటానికి మాకేం అభ్యంతరం లేదు గాని - లైట్లు పోయినప్పుడు మాత్రం మీకేమయినా ఇబ్బంది కలుగుతుందేమోనని........."
ఆమె ముఖంలో కోపం పొడుచుకోస్తోంది.
"సీరియస్ గానే చెపుతున్నాను.'
"ఎందుకని?" అడిగింది తులసి.
"మీరన్నీ అబద్దాలు చెప్పారు. మీకు పెళ్ళి అవలేదని కమల చెప్పింది.
"తేడా అమెకేలా తెలిసింది. తెలిస్తే తులసికి తెలియాలి.'
"తులసి మెడలో మంగళ సూత్రం లేదు.'
'అదా!" నవ్వాడు సురేష్. "హాహా! అదా! మేము క్రిస్టియానిటీ తీసుకున్నాం."
ఆమె అదిరిపడింది.
'అంతా అబద్దం. మీరెప్పుడూ చర్చికి వెళ్ళలేదు."
"తప్పదంటే రేపాదివారం వెళ్తాం. బైదిబై మీరు కూడా వస్తారా? పాపాలన్నీ నశించిపోతాయ్."
"రేపు ఫస్ట్ కి ఖాళీ చేసేయాలి" గంగాభవాని వెళ్ళిపోయింది.
అతను మంచం మీద కూర్చుని తులసిని కౌగిట్లో కి లాక్కున్నాడు.
ఆమె ముఖంలో అదివరకటి ఉత్సాహం , అనందం లేవు.
ఆయామ్ సారీ డియర్!" అన్నాడు ఆమె నాలుక మీద ముద్దు పెట్టుకుంటూ.
ఆమె స్పర్శ నిలువునా బరువుగా, మెత్తగా కాలుస్తోంది.
అతని జుత్తుని వెనకకు తోస్తూ నువ్వెందుకు సారీ చెప్తావ్?" ఆమె కళ్ళు నిండుగా నీళ్ళు.
చెళ్ళున ముఖాన చరచినట్లయింది డార్క్ డెవిల్ డైలాగ్, "ఒరేయ్! ఎప్పటికి ఆ పిల్ల కన్నీరు పెట్టకుండా చూచుకో.'
"తులసీ!క్ ప్లీజ్! నీతో కన్నీరు పెట్టించటానిక్కాదు నేను నిన్ను ప్రేమించింది. నువ్వెప్పుడూ నవ్వుతుండాలనీ , నీ పెదాల మీద చిరునవ్వు చేరగాకూడదనీ , నిన్ను నా దాన్ని చేసుకున్నాను. ప్లీజ్ డోంట్ డిస్ హర్టేన్ మీ."
అతని గుండెల మీద తన్మయత్వంతో పడుకుండిపోయింది తులసి.
"నీకు గుర్తుందా తులసీ! మనం సంతోష్ లో సినిమా కెళ్ళినప్పుడూ మధ్యలో పాట మొదలయి నేను సిగరెట్ వెలిగించుకుందామని బయటికెళ్ళ బోతుంటే వెనుక నుంచి ఎవరో అరిచారు."
"ఏయ్! కింగ్ సైజ్ కూర్చో!" అని.
తులసికి నవ్వాగలేదు......
'అవును" అంది గుర్తు తెచ్చుకుని త్రుళ్ళి త్రుళ్ళి నవ్వుతూ.
"వెల్! ఇవాళ ఓ ప్యూన్ ఉద్యోగం కోసం. వెళితే అతనేమన్నాడో తెలుసా? ఓవర్ క్వాలిపైద్ సారీ" అన్నాడు. తులసి నవ్వటం ఆపేసింది.
"ఓవర్ సైజ్ , ఓవర్ క్వాలిఫికేషన్, ఓవర్ సెక్స్ .ఓవర్ ఇంటలిజెన్స్ " విసుగ్గా అన్నాడతను.
"ప్యూన్ ఇంటర్యు కెళ్ళావా?" జాలిగా అడిగిందామె.
"సమ్ ధింగ్ ఈజ్ బెటర్ దెన్ నధింగ్."
సురేష్ జేబులో నుంచి యాభయ్ రూపాయల నోటు తీసి ఆమె కొచ్చాడు.
"ఎక్కడిది? అడిగింది తులసి ఆశ్చర్యంగా.
"మా ఫ్రెండ్ - ఒకతను రోడ్డు మీద కనిపించి టి,వి స్టేషన్ కి లాక్కెళ్ళడు. వాళ్ళ డ్రామాలో ఓ కారెక్టర్ తక్కువయాడట. వాడి ప్లేస్ లో డైలాగ్స్ చదవమన్నారు - చదివాను . వందరూపాయల చెక్ ఇచ్చి యాభయ్ కట్ చేసుకున్నారు."
"అదేమిటి?"
"ఏభయ్ ఆ డ్రామా సెక్షన్ ప్రొడ్యుసర్ కి లంచం. వెల్! యాభయ్ రూపాయలు- ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి సంపాదించా నివాళ- కానీ అక్కడ కూడా అదే రిమార్క్, ఓవర్ యాక్షన్!"
తులసికి మళ్ళీ నవ్వోచ్చేసింది.
మర్నాడు ఇంట్లో నుంచి బయటి కోస్తోంటే పాదుల దగ్గర కూర్చున్న గంగాభవాని ముఖం మాడ్చుకుని అవతలి వేపుకి తిరిగింది.
"నా యాభయ్ రూపాయల సంగతేమిటి?"
"మీ ఋణం వుంచుకోనని అదివరకే చెప్పాను.'
"రేపు ఫస్ట్ కల్లా యివ్వకపోతే తులసి తో చెప్పేస్తాను.'
'అయితే నేనూ మన విషయం చెప్పేస్తాను తులసితో!"
"మన విషయం ఏమిటి?" అడిరిపడుతూ అడిగింది.
"అదే - తులసి లేనప్పుడు మనం - మా ఇంట్లో-'
"అబద్దాలు చెపితే మర్యాదగా వుండదు" అంది కోపంగా.
'సరే - అయితే సాయంత్రం వస్తాను రడీగా వుండండి."
"సాయంత్రం యిస్తారా?"
"ఇస్తాను గానీ కాష్ రూపంలో కాదు కైండ్."
అమె రుసరుసలాడుతూ యింట్లోకి వెళ్ళిపోయింది.
హోటల్ చేరుకునేసరికి రాజ్యలక్ష్మి తుది మెరుగులు దిద్దుకుంటుంది అద్దం ముందు కూర్చుని.
"ఓ! యూ హావ్ కమ్!" అంది అతనివేపు చూసి.
సురేష్ మంచం మీద కూర్చున్నాడు.
"సహదేవ్ తో మాట్లాడాను."
"నకులుడు, సహదేవుడు ఎవరయినా ఫర్లేదు .........ఏమన్నాడో చెప్పండి?"
"మిమ్మల్ని తీసుకురమ్మన్నారు."
"నన్ను చూసి సారీ! కింగ్ సైజ్ అనరు కదా?"
ఆమె నవ్వేసింది.
"నా రికమెండేషనుంటే ఎవరూ ఆపలేరు.'
"థాంక్యు గోల్! మీ అద్భుతమైన రికమెండేషన్ పవర్ గురించి నా మనవళ్ళకూ, ముని మనవలకూ వాళ్ళు భోరున ఎడ్చేవరకూ కధలు చెపుతాను."
ఇద్దరూ అటో ఎక్కారు.
"ముందే చెప్తున్నాను. ఉద్యోగం దొరికేవరకూ నా భారమంతా మీ మీదే వుంటుంది - ఈ అటో చార్జి తో సహా.'
"నా బాకీ ఎలా వసూల్ చేసుకోవాలో నాకు బాగా తెలుసులెండి.' నవ్వుతూ అందామె.
అటో బంజారా హిల్స్ మొదట్లోనే వున్న ఒక పెద్ద హోటల్ ముందాగింది.
వెనుక వైపున లాన్స్ లో చాలామంది కుర్చీలో కూర్చుని వున్నారు.
పెద్ద గొడుగులా వున్న షెడ్ కిందకు నడిచింది రాజ్యలక్ష్మి. అప్పటికే టేబుల్ ముందు ఓ వ్యక్తీ కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు. కాఫీ కలర్ పాంట్, తెల్ల షర్టూ వేసుకున్నాడతను. గాలికి ఎగిరిపోయేలా సన్నగా వున్నాడు.
'హలో!" అంది రాజ్యలక్ష్మి.
'హలో బేబీ!' అన్నాడతను. అతని ముఖంలో చిరునవ్వు కనిపించలేదు. అసలా డార్క్ కూలింగ్ గ్లాసెస్ వెనకాల అతని కళ్ళలో ఏ భావం వుందో తెలీటం లేదు.
"మీట్ మిస్టర్ సురేష్!" అంటూ కుర్చీలో కుర్చుందామే.
సహదేవ్ ముందుకి వంగి అతనితో కరచాలనం చేశాడు. "ప్లీజ్ డ్ టు సీయూ మిస్టర్ సురేష్.'
సురేష్ కూడా కుర్చీలో కూర్చున్నాడు.
"సురేష్ కి జాబ్ చాలా అవసరం సహదేవ్. హి ఈజ్ డెస్పరేట్" చెప్పింది రాజ్యలక్ష్మి.
"ఆ విషయం తెలిసిపోతోంది" అన్నాడు సహదేవ్ నవ్వుతూ.
అప్పుడు గమనించాడు సురేష్ .....అతని ముఖం నవ్వుతుంటే పరమ భయంకరంగా కన్పించింది. చాలా అనీజీగా ఫీలయ్యాడు సురేష్.
బేరార్ ని పిలిచి ముగ్గురికీ కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేశాడు సహ దేవ్.
చుట్టూ ఓసారి చూశాడు సురేష్. అందమైన అమ్మాయిలు ముగ్గురు ఐస్ క్రీం తింటున్నారు ఓ పక్క, మరో వైపు సుమారు ముప్పయ్ సంవత్సరాల స్త్రీ ఇరవై ఏళ్ళ కుర్రాడి చేతులు తన చేతుల్లోకి తీసుకుని రహస్యముగా మాట్లాడుతోంది.
ఇద్దరు ఫారినర్స్ ఒక ఇండియన్ యువతిని మధ్య కూర్చోబెట్టుకుని ఆమె చెప్పే మాటలు ఆసక్తిగా వింటున్నారు.
బేరార్ కూల్ డ్రింక్స్ తెచ్చాడు.
"వాటీజ్ యువర్ క్వాలిఫికేషన్ మిస్టర్ సురేష్?" అడిగాడు సహదేవ్ కూల్ డ్రింక్ వైపు చూస్తూ.
"మీరెంతవరకూ కావాలంటే అంతవరకే."
"పోస్ట్ గ్రాడ్యుయేషన్?"
'అది ఓవర్ క్వాలిఫికేషన్ కాదనుకుంటే!"
"దటీజ్ నైస్!"
"నేనింక వెళ్ళవచ్చా?" అడిగింది రాజ్యలక్ష్మి.
"థాంక్యు - అయ్ విల్ గివే రింగ్-"
"వెళ్తాను సురేష్ బెస్టాఫ్ లక్ -"
"థాంక్స్!"
రాజ్యలక్ష్మి వెళ్ళిపోయింది.
"వెల్! మీకెంత జీతం కావాలి మిస్టర్ సురేష్?" అడిగాడతను.
"మీరెంత యివ్వగలిగితే అంత"
"సపోజ్ - నేను మీకు పది లక్షలిస్తాననుకొండి."