"ఏయ్ - ఫాల్టు మాటలు మాట్లాడకు!" అనేసి ఇంకో పక్కకెళ్ళి కూర్చుంది .సాయింత్రం అవుతోండగా ఇన్ స్పెక్టర్ ఆమెని పిలిపించాడు.
"మీ లాయర్ కేవళ్ళకయినా ఫోన్ జేసినావా?" అడిగాడతను.
"లేదు - మా ఎం.డి. గారే ఎరేంజ్ చేస్తారు -"
"నేనిప్పుడే మీ ఎండీకి రింగ్ చేసి మాట్లాడాను. ఈ కేస్ తో తనకేం సంబంధం లేదంటున్నాడు -"
మల్లిక షాకయింది.
"వ్వాట్! నిజంగా అలా అన్నాడా?"
"అవును! అయన జగాలో ఎవరున్నా అదే అంటారులే - ఎందుకంటె కేస్ చాలా సీరియస్ అయింది. ఋజువులు లేకుండా బురద జల్లే చానెల్స్ అన్నిటికీ ఈ కేస్ ఒక కనువిప్పు గా ఉండాలని -- అందుకని సివియర్ గా డీల్ చేయమనీ చీఫ్ మినిస్టర్ నుంచి ఇన్ స్ట్రక్షన్స్ వచ్చాయ్-"
మల్లికకు భయం వేసింది -
తను చాలా పెద్ద నేరంలో ఇరుక్కుపోయింది. తననెవరూ రక్షించలేరు. లాయర్ని ఎంగేజ్ చేసుకుని కేస్ కోర్ట్ లో పోరాడాలన్నా తనకు భరద్వాజ్ సపోర్ట్ కావాలి!
సెల్ ఫోన్ మోగుతోంది. ఎవరా అని చూసింది - మమ్మీ! ఫోన్ తీయాలా వద్దా? తీస్తే జరిగిందంతా చెప్పాల్సి వస్తుంది. ఫోన్ కట్ చేసిందామె. వెంటనే భరద్వాజ్ కి రింగ్ చేసింది.
రెండుసార్లు డిస్కనెక్ట్ చేశాక మూడో సరి మాట్లాడాడతను.
"హలో మల్లికా...."
"సార్ - నన్ను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నారా సార్?"
".........."
"సార్....."
"సారీ మల్లికా! ఆ ఏర్పాట్లేవో నువ్వే చేసుకోవాలి! ఎందుకంటే ఏదొక ప్రూఫ్ లేకుండా అలాంటి న్యూస్ టెలికాస్ట్ చేయటం నీ తప్పు !"
మల్లిక షాకయింది.
"కానీ సార్ - మనం టెలికాస్ట్ చేసే న్యూస్ లో తొంభయ్ శాతం - ఏ ఆధారమూ ఎలాంటి ప్రూఫ్ లేకుండానే టెలికాస్ట్ చేస్తున్నాం కద్సార్ -"
"నీకు మొదటి నుంచీ చెప్తూనే ఉన్నా మల్లికా! గవర్నమెంట్ నీ, పొలిటికల్ పార్టీస్ ని ఎంత విమర్శించినా ఫర్లేదు. ఎన్ని అభూత కల్పనలు చేసినా ఒకే - కానీ పర్సనల్ మేటర్స్ వచ్చేప్పటికి కనీసం ఫేప్టీ పర్సెంట్ అయినా ఋజువులుండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నీకు సపోర్ట్ ఇస్తే -- నన్ను కూడా జైల్లో వేస్తారు. అందుకని నీ సంగతి నువ్వు చూసుకో- నాకేం సంబంధం లేదు. ఓకె-"
ఫోన్ కట్ చేశాడు.
మల్లిక పూర్తిగా అప్సెట్ అయిపొయింది. భరద్వాజ్ ఇంత' కట్ త్రోట్ కాండేట ని తానెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడెలా తప్పించుకోవటం! ఎవరు తనకు హెల్ప్ చేస్తారు ?
ఫోన్ మళ్ళీ మోగుతోంది - మమ్మీ -
అన్ చేసింది , "మల్లికా! ఇంకా ఇంటికి రాలేదేంటి ? నీ కోసం ఏడింటి నుంచీ వెయిట్ చేస్తున్నా!"
"మమ్మీ! ఆఫీస్ లో కొంచెం లేటయింది - నువ్ నిద్రపో! నేను ఇంకో రెండు గంటల తర్వాత వస్తా-"
"అవునూ - మీ చానెల్ వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాఏంటి ? ఏం జరిగింది ?"
మల్లిక ఉలిక్కిపడింది.
"ఏం వార్తలోస్తున్నాయ్?"
"అదే - మీ చానెల్ వాళ్ళేదో తప్పుడు వార్త టెలికాస్ట్ చేశారనీ అందుకని మీ చానెల్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారనీ చూపిస్తున్నారు -"
ఇలాంటివి అన్నీ చానెల్స్ కీ కామన్ అన్న విషయం తల్లికి తెలుసు .
అందుకే ఆమె గొంతులో అంత ఆత్రుత లేదు -
'అవును మమ్మీ! అందుకే నేను రావటం ఆలస్యమవుతుంది -"
"సరే -"
తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మల్లిక.
వెంటనే తన ఫ్రెండ్ శిరీషకు ఫోన్ చేసింది. జరిగినదంతా చెప్పి వెంటనే తనకు బెయిల్ విషయం ఎవరయినా ఒక లాయర్ తో మాట్లాడమని కోరింది.
ఒక గంట తర్వాత శిరీష ఫోన్ వచ్చింది.
"మాకు తెల్సిన లాయర్ ఇంటికొచ్చాను మల్లికా - అర్జంటుగా ఇప్పటికిప్పుడు బెయిల్ కావాలంటే రెండు లక్షలు కట్టాలంటున్నాడు-"
మల్లిక షాకయింది.
"రెండు లక్షలా?"
'అవును! కోర్టు వాళ్ళ కూడా షేర్ ఇవ్వాలంట-"
మల్లిక ఫోన్ పెట్టేసింది.
తనీ రాత్రికి బయట పడటం కష్టం -
ఆమెకు హటాత్తుగా దుఖం ముంచుకొచ్చింది. అతి కష్టం మీద ఏడుపు బిగపట్టుకున్నా కన్నీరు ఆగటం లేదు.
రాత్రి పన్నెండవుతోండగా సెల్ డోర్ తెరచిన శబ్దం అయింది. లేడీ కానిస్టేబుల్ లోపలి కొచ్చింది.
"పద - ఇన్ స్పెక్టర్ సార్ పిలుస్తున్నారు -"
ఆమెతో పాటు నడిచింది మల్లిక.
ఇన్ స్పెక్టర్ కేదురుగ్గా ఒక లాయర్ కూర్చుని ఉన్నాడు.
"నీకు బెయిల్ వచ్చింది. ఇంక వెళ్ళవచ్చు -- ' అంటూ ఆమె సంతకాలు కొన్ని పేపర్ల మీద తీసుకున్నాడతను.
మల్లిక ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు.
భరద్వాజ్ పంపిన లాయరే అయుంటాడు-
బయట కారుంది.
"రామ్మా! కూర్చో -' అంటూ తను బాక్ సీట్లో కూర్చున్నాడతను. అతని పక్కనే కూర్చుంటూ డ్రైవర్ సీట్లో కూర్చున్న రాకేష్ ని చూసి ఉలిక్కిపడింది.
"నువ్వా?"
"డౌటా? నా పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయ్యేమో చూస్తావా?"
"అహహ -అది కాదు - అంటే ......."
"నేనే బెయిల్ ఏర్పాటు చేయించా! మీ బాస్ చెయ్యిచ్చాడని తెలిసి - ' మల్లిక కేం మాట్లాడాలో తెలీలేదు.
తను చాలా విచిత్రమయిన పరిస్థితిలో ఇరుక్కుపోయింది.
తనకీ పరిష్టితి ఎలా వచ్చిందో తెలుస్తే అతను తనకిలా బెయిల్ ఇప్పించే వాడు కాదేమో !