రూమ్ లో కేమేరాలుంటాయ్.
ఆ 24 గంటలూ వారెం చేసినా , ఏం మాట్లాడినా అన్నీ ప్రేక్షకులు చూస్తుంటారు. ఇలా రోజుకో జంట చొప్పున నెలరోజుల పాటు ముప్పయ్ జంటల్ని చూపిస్తారు. ఆ ముప్పయ్ జంటల్లో ఏజంట బిహేవియర్ ప్రేక్షకులకు అధికంగా నచ్చుతుందో వాళ్ళు తలో లక్ష రూపాయలూ గెల్చుకుంటారు -
కాసేపు ఆ ప్రోగ్రాం చూశాక గానీ మల్లికకు గుర్తురాలేదు - అవును! శివ - శ్రీస్మిత మారేజ్ బ్రేకవటం గురించి బృందావన్ చానెల్ ఏమీ చూపించటం లేదేం? నిజానికి వాళ్ళే స్టార్ట్ చేయాల్సింది కదా అసలు!
కాసేపు ఆలోచించాక తట్టిందామేకి.
వాళ్ళకంటే ముందు తను మొదలు పెట్టె సరికి వాళ్ళు షాకయి ఉంటారు -
ఆ స్టోరీ సంపూర్ణ చానెల్ కేలా దొరికిందా అని రాకేష్ అప్సెట్ అయి ఉంటాడు.
అప్పుడే పోలీస్ కమీషనర్ మరికొందరు పోలీస్ అధికారులతో డోర్ తెరచుకొని లోపలికొచ్చాడు.
అనుమతి తీసుకోకుండా వాళ్ళలా లోపలకు రావటం భరద్వాజ్ కు కోపం తెప్పించింది.
"మిస్టర్ భరద్వాజ్ ! మీ చానెల్లో ఇవాళ మాణింగ్ నుంచీ బ్రేకింగ్ న్యూస్ అంటూ శివ- శ్రీస్మిత విడాకులు గురించి ఫ్లాష్ వేస్తున్నారు! అ న్యూస్ మీకెవరిచ్చారు?"
భరద్వాజ్ మల్లిక వేపు చూశాడు.
"మా సిఈఓ మల్లిక - ఆమె ఈ సెన్సేషనల్ న్యూస్ ఇన్ చార్జ్ -" అన్నాడతను.
"యస్ మల్లికాజీ! మీకా న్యూస్ ఎవరిచ్చారు?" మల్లిక నడిగాడు కమిషనర్ .
మల్లిక నవ్వింది.
"మాకు చాలా సెక్రెట్ రిసోర్సెస్ ఉంటాయ్ సార్! అవన్నీ బయట పెట్టేలేము!"
"ఆ వార్తలు నిజమయితే మీరు బయట పెట్టకపోయినా ఫరవాలేదు మేడమ్! కానీ మీ న్యూస్ టోటల్ గా బోగస్! అందులో వన్ పర్సెంట్ కూడా నిజం లేదు. ఫర్ యువర్ ఇన్ ఫర్మేషన్ ప్రస్తుతం శివ - శ్రీస్మిత స్విట్జర్లాండ్ లో హనీమూన్ లో ఉన్నారు - ఆ విషయం తెలుసా మీకు?"
మల్లిక ఆశ్చర్యపోయింది. కొంచెం భయం కూడా వేసింది . అంటే తను విన్నదంతా కరెక్ట్ కాదా?
"నాకు తెలీదు ?" అందామె.
"ఒకే - అలాంటి న్యూస్ టెలికాస్ట్ చేసేముందు -- మీరు ఆ దంపతులిద్దరితో ఒకరినయినా కాంటాక్ట్ చేసి కన్ ఫరం చేసుకున్నారా?"
"లేదు -"
"ఇన్ దట్ కేస్ - మీరు వెంటనే ఏ ఆధారాలతో మీరా న్యూస్ టెలికాస్ట్ చేశారో అది బయట పెట్టాలి! లేకపోతే మిమ్మల్నిద్దరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది ."
భరద్వాజ్ కంగారుపడ్డాడు.
ఏ ఆధారం లేకుండా మల్లిక అలాంటి న్యూస్ టెలికాస్ట్ చేయదని తనకు నమ్మకముంది. అయితే ఆ ఆధారాలు ఎంతవరకూ జేన్యువన్ అనేదే డౌటుగా ఉంది.
"డైరెక్ట్ గా ఎవిడెన్స్ అంటూ మా దగ్గరేం లేదు సార్! మా స్టాఫ్ కలెక్ట్ చేసిన రూమర్స్ ఆధారంగా అది టెలికాస్ట్ చేశాం! అందుకని నేనేం ప్రొడ్యూస్ చేయలేను -" అంటూ సెల్ తీసుకుని తన అసిస్టెంట్ కి రింగ్ చేసింది.
"వెంటనే శివ - శ్రీస్మిత గురించి ఆ న్యూస్ స్టాఫ్ చేసేయండి -- ' అంటూ చెప్పిందామె!
"ఒకే - ముందా న్యూస్ స్టాఫ్ చేశాను సార్- ఎవిడెన్స్ ఏముందో కనుక్కుని మీకు తెచ్చిస్తాను -"
కమిషనర్ - ఇన్ స్పెక్టర్ వేపు చూశాడు.
"ఇద్దరినీ అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్ళండి !" చెప్పాడతను.
భరద్వాజ్ కంగారు పడ్డాడు.
"చూడండి! ఈ చానెల్ ఎం.డి. గా నాకు మా స్టాఫ్ చేసే ప్రోగ్రామ్స్ తో డైరెక్ట్ గా ఏం సంబంధం లేదు - మా క్రియేటివ్ హెడ్ మల్లికే అన్సరబుల్ - " మల్లిక షాక్ అయింది.
అతను తనను ప్రొటెక్ట్ చేస్తాడేమో అని ఆశపడుతోంది.
"ఓకె జెంటిల్మన్ -" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కమిషనర్.
"మల్లికగారూ! ప్లీజ్- స్టేషన్ కి రావాలి మాతో - " అన్నాడు ఇన్ స్పెక్టర్.
మల్లిక భరద్వాజ్ వేపు చూసింది.
"ఓకె - వెళ్ళు - నేను బెయిల్ కోసం ట్రై చేస్తాను - " అన్నాడతను.
మల్లిక కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినాయ్.
ఇన్ స్పెక్టర్ తో పాటు బయటకు నడిచి జీప్ లో కూర్చుంది. తప్పు తనదే! తను చాలా ఇంటలిజెంటనీ, చాలా టాలెంటెడ్ అనీ - ఒక చానెల్ ని సక్సెస్ పుల్ గా నడపడం తనకు తెలిసినట్లు మరొకరికీ తెలీదని - ఎంత గర్వపడింది?
కేవలం తన వల్లే సంపూర్ణ చానెల్ నెంబర్ అయిందని ఎంత పొంగిపోయింది. అంత పేరూ, ప్రతిష్టా, అన్నీ క్షణాల్లో రివర్సయిపోయాయేమిటి? ఆ శివ - శ్రీస్మిత విషయంలో టోటల్ గా అంత పెద్ద బ్లండర్ ఎలా జరిగిందో అర్ధం కావటం లేదు -
రాకేష్ ఫోన్ టాప్ చేసినప్పుడు ఆ విజయ్ చెప్పిన మేటరే తను టెలికాస్ట్ చేసింది. అంత అధంటిక్ గా చెప్పాడు విజయ్ - కానీ అదే నిజమయితే రాకేష్ ఆ స్టోరీని ఎందుకు టెలికాస్ట్ చేయలేదు ?
అదే తనకర్ధం కాని విషయం!
జీప్ పోలీస్ స్టేషన్ చేరుకుంది. లేడీ కానిస్టేబుల్ వచ్చి ఆమెను తీసుకెళ్ళి లాకప్ లో వేసింది.
అంతవరకూ బింకంగా ఉన్నా ఒక్కసారిగా దుఖం పొంగుకొచ్చిందామెకి.
తను చేసిన తెలివి తక్కువతనం వల్ల చాలా పెద్ద సమస్యలో ఇరుక్కు పోయింది. ఇప్పుడీ విషయం తల్లికి చెప్పాలా? చేస్తే - జరిగేదేంటో తనకు తెలుసు. ఆమెకు బీపీ పెరిగిపోతోంది. హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. కానీ ఎంతసేపు దాస్తుంది. రాత్రి తొమ్మిది గంటల కల్లా ఇల్లు చేరుకోకపోతే అమ్మే తనకు ఫోన్ చేస్తుంది.
కానీ రాత్రి తొమ్మిది లోపల భరద్వాజ్ తనకు జామీను ఇప్పించగలడా? తప్పకుండా ఇప్పిస్తాడు. అతనికా కెపాసిటీ ఉంది. మనీ ఉంది. కనెక్షన్స్ ఉన్నాయ్- అతనే తననీ ప్రాబ్లం నుంచి బయట పడేస్తాడని తనకు నమ్మకం ఉంది.
తన సెల్ లో ఉన్న ఇతర నేరాలు చేసిన స్త్రీలతో సహా తనూ ఒకర్తే అయిపొయింది. లావుపాటి స్త్రీ - కన్నీళ్లు పెట్టుకున్న మల్లిక దగ్గర కొచ్చింది.
"ఏం జరిగింది బిడ్డా! ఎవర్నయినా లేపెశావా?"
మల్లిక మాట్లాడలేదు.
"ఇగో- చూడు! నువ్వేం బుగులు పడకు! బయటి కెళ్ళినాక నీకేమయినా సాయం గావాల్నంటే నేను జేస్తా! అందంగున్నావ్! రోజుకి అయిదువేలు కమాయించవచ్చు! గిరాక్ లు నేను తీసుకొస్తా - ఏమంటున్న ?"
మల్లికకు కోపం ఆగలేదు .