Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 31


    మర్నాడు శాంత రానే వచ్చింది.
    ఆమె సాన్నిధ్యంలో వారం రోజులు ఎలా గడిచినాయో తెలీదు. మధ్య మధ్య శంకర్ గుర్తుకొస్తూనే వున్నాడు గానీ...అతని జాడే తెలియలేదు... హఠాత్తుగా ఓ రోజు వుదయమే వచ్చి తలుపు కొట్టాడతను. శాంతే వెళ్ళి తలుపు తీసింది.
    "ఎవరు...?" అనడిగింది అతనిని ఆశ్చర్యంగా చూస్తూ.
    "సావిత్రిగారున్నారా?" అడిగాడతను. అతని గొంతు వింటూనే తను త్వరగా అక్కడికి చేరుకుంది.
    "రండి" అంది అతనిని లోపలికి ఆహ్వానిస్తూ.
    లోపలికొచ్చి కూర్చున్నాడతను.
    "ఈయన శంకర్ శాంతా...! బాలకృష్ణగారు వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండట! ఉద్యోగం కోసం ఈ ఊరొచ్చారు..." తడబడుతూ పరిచయం చేసింది సావిత్రి.
    ఇద్దరూ 'నమస్తే' అనుకొన్నారు.
    "ఇవాళే ఊరునుంచి వచ్చాను. బాలకృష్ణగారికి ఓసారి కనబడి వెళ్దామని వచ్చాను. అలాగే మీ దగ్గరికి వచ్చేశాను..." నవ్వుతూ అన్నాడతను.
    "మరి ఊళ్ళో ఇన్ని రోజులు క్యాంపు వేశారేమిటో అడిగింది సావిత్రి.
    "రాబుద్ధి కాలేదండీ! అక్కడి ఫ్రెండ్సూ...వాతావరణం...ఇక్కడెక్కడుంటుంది__వుద్యోగం లేకపోయినా సరే, అక్కడే వుండిపోదామనిపించింది..."
    మళ్ళీ నవ్వేస్తూ అన్నాడతను.
    సావిత్రికి ఏం మాట్లాడాలో తెలీలేదు...ఒంటరిగా ఉన్నప్పుడయితే ఏదొకటి మాట్లాడగలిగేది. కాని శాంత ఎదురుగ్గా అతనితో మాట్లాడాలంటే సిగ్గుగా వుంది. అతనికీ ఇబ్బందిగానే ఉన్నట్లుంది. మరో రెండు మూడు మాటలు మాట్లాడి మళ్ళీ కనబడతానంటూ వెళ్ళిపోయాడు.
    "నేను లేనప్పుడు ఓ మంచి స్నేహితుడిని సంపాదించావన్న మాట" నవ్వుతూ అంది శాంత.
    "బాలకృష్ణగారే పరిచయం చేశారు_ ఆ తర్వాత నీ హూ ఈజ్ హూ పుస్తకం కావాలాని వచ్చాడు. ఇచ్చాను అంతే__! ఎందుకో ఉన్న విషయం పూర్తిగా చెప్పబుద్ది కాలేదు సావిత్రికి.
    "అంతకంటే ఎక్కువ వుందని నేనేమీ అనలేదు లేవే" నవ్వేస్తూ అంది శాంత.
    సావిత్రి సిగ్గుపడిపోయింది. "యూ ఆర్ సిల్లీ..." అంది తనూ నవ్వేస్తూ__
    "ఆ రెండోరోజు తను ఏవో ఫైల్సు చూసుకొంటుంటే 'నమస్తే' అన్న గొంతు వినిపించి తలెత్తి చూసింది... ఎదురుగ్గా శంకర్ నుంచుని" ఉన్నాడు.
    "మీరా?" ఆశ్చర్యపోతూ అంది సావిత్రి.
    "కూర్చోవచ్చా?" ఆమెకెదురుగా ఉన్న కుర్చీ లాక్కొని కూర్చుంటూ అన్నాడతను.
    "కూర్చోండి!" ఆనందంగా అందామె...అతను తనంతతానుగా ఆఫీస్ కి రావడం ఆమెకు సంతోషాన్ని కలిగించింది.
    "మీ పని పాడుజేయటం లేదుకదా నేను."
    "అదేం లేదులెండి..." ఫైల్సు మూసివేస్తూ అంది సావిత్రి.
    "ఇలా ఈ రోడ్డు వెంబడి వెళుతుంటే మీరు గుర్తుకొచ్చారు. మీతో సరదాగా మాట్లాడి చాలా రోజులయిపోయిందని వచ్చాను"
    సావిత్రి చిరునవ్వు నవ్వి ఊరుకుంది.
    "మొన్న అసలు మీతో చాలా మాట్లాడాలని వచ్చానుగానీ, మీ ఫ్రెండు_ఆమె పేరేమిటో నాకు తీలేదు. ఆమె ఉండడం వల్ల మాట్లాడలేకపోయాను" కొంచెం తడబడుతూ అన్నాడతను.
    "ఏమిటంత మాటలు?" నవ్వుతూ అడిగింది సావిత్రి.
    "ఇంట్లో గొడవల్లేండి! మనసులోని బాధంతా ఆప్తులకు చెప్పుకుంటే మనశ్శాంతి లభిస్తుందంటారు గదా...!"
    సావిత్రి మనసు ఆనందంతో ఊగిసలాడింది. అంటే అతను తనని ఆప్తురాలిగా చూస్తున్నాడా? అతని మనసులో తనంటే అలాంటి అభిప్రాయాలు ఏర్పడినాయా? వయసులో ఉన్న ఓ యువకుడు వయస్సులో వున్న మరో యువతిని ఆప్తురాలిగా భావిస్తున్నాడంటే అర్ధం ఏమిటి? ప్రేమిస్తున్నట్లు కాదా?
    "పదండి అలా క్యాంటీన్ వైపు వెళ్దాం" సీట్లోంచి లేస్తూ అంది సావిత్రి. ఇద్దరూ క్యాంటీన్ వైపు బయల్దేరారు. ఆఫీస్ లో అందరి కళ్ళూ తామిద్దరి మీదే కేంద్రీకరించి ఉండడం కనిపెడుతూనే ఉందామె.
    క్యాంటీన్ ఖాళీగానే వుంది. రెండు కప్పుల్లో కాఫీ తెచ్చుకొని ఇద్దరూ ఓ టేబుల్ దగ్గర కూర్చున్నారు.
    "అంత అర్జంటుగా మీ ఊరు వెళ్ళిపోయారేమిటి? అడిగింది సావిత్రి.
    "ఏమిటోనండీ! ఆ రాత్రి బాలకృష్ణగారి గొడవయిపోయాక మీ ఇంటికొచ్చాను గదా! అక్కడనుంచి మళ్ళీ నా గదికి వెళ్ళి పడుకున్నాను. నిద్రపట్టలేదు... ఏమిటో పిచ్చి పిచ్చి ఆలోచనలు! తెల్లారేవరకూ నరకం అంటారు చూశారూ, అంతటి ఘోరమయిన పరిస్థితి అన్నమాట... ఎందుకో మా వాళ్ళందరూ గుర్తుకొచ్చేశారు. అంతే!... పొద్దున్నే బస్సెక్కేశాను. అక్కడికెళ్ళి వారం రోజులుండేసరికి, తమాషా చూశారో లేదో_మళ్ళీ మనస్సు ఇక్కడికి మళ్ళింది. అక్కడికంటే ఇక్కడే బాగున్నట్లు అనిపించింది. అక్కడి స్నేహబృందం అందరికంటే ఇక్కడ మీతో కాసేపు మాట్లాడటంలోనే ఆనందం ఉందనిపించింది_ మళ్ళీ బయల్దేరేవరకూ అక్కడ నరకం అనుభవించానంటే నమ్మండి... నేను నా మనసులో విషయాలు మాట్లాడేస్తున్నాను...మీరేం కోపం తెచ్చుకోరుగదా" అనుమానంగా అడిగాడతను.

 Previous Page Next Page