సుబ్బారావు గంభీరంగా వుండటానికి ప్రయత్నిస్తూ ఇంతకీ మీరు చెప్పదలచుకున్నదేమిటి?" అన్నాడు.
"మీరు చేసిన ఛండాలపు పని గురించి మాట్లాడటానికొచ్చాను."
"ఛండాలపు పనులా? అలాంటివి నేనేం చెయ్యనే"
"అబ్బా, అంతటి మహానుభావులా? మావారి చేత బలవంతంగా కోబ్లిగెంట్ గా సైన్ చేయించి చిట్ ఫండ్ పాడేసి, ఆ డబ్బు మీ విలాసాలకు వాడుకుని, వాయిదాలెందుకు కట్టటంలేదు?"
"ఓహో అదా! నేనింకా ఏమిటో ననుకున్నాను. హ్హహ్హహ్హహ్హ" అంటూ దాన్ని గురించి చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లు నవ్వేశాడు సుబ్బారావు.
"ఎందుకలా వెకిలిగా నవ్వుతున్నారు అడిగిందానికి జవాబు చెప్పకుండా?"
విమలాదేవి తన భర్త ఇరకాటంలో పడుతూవుండటము చూసి కల్పించుకుంది. "చూడండి! మీరు ఆడవాళ్ళయి వుండి మొగాళ్ళని అలా నిలదీసి అడగటం...మీవారొచ్చి మాట్లాడితే బావుంటుంది"
"వ్యవహారం ముదిరేదాకా వచ్చినప్పుడు ఆడేమిటి? మొగేమిటి? మా వారి తరపున మాట్లాడటానికి నాకు హక్కుంది, ఈ సంగతేమిటో యీవేళ తేలిపోవాల్సిందే."
ఆమె ఉగ్రరూపం చూసి విమలాదేవికి భయమేసింది. విషయమంతా రాధాప్రియకు చెప్పి సాయం తెచ్చుకోడానికి హడావుడిగా పరిగెత్తింది.
"అసలు ఇప్పుడేమంత ఉపద్రవం జరిగిందని అంత ఇదయిపోతున్నారు?"
"ఏం జరిగిందా? మీరు డబ్బు కట్టకపోతే ఆ డబ్బు మావారు కట్టవలసి వస్తుంది. కట్టలేకపోతే లీగల్ ప్రొనిడింగ్స్_ కేసు, ఎటాచ్ మెంట్ వగైరాలన్నీ జరుగుతాయి.
"ఆఁ అంతవరకూ దేనికొస్తుంది? ఈ లోగా కట్టిపారెయ్యనూ?"
"ఏదీ! ఇప్పుడు వెంటనే కట్టండి"
"వెంటనే అంటే ఎలా? డబ్బు చూసుకోవాలా మరీ"
"ఈలోగా మీరు చేసిన వెధవ పనికి మావారు మెంటల్ టార్చర్ అనుభవిస్తూ వుండాలా?"
"ఇందులో మెంటల్ టార్చరేముంది? ఇవన్నీ ఫ్రెండ్ షిప్ లో మామూలే. ఒకరికొకరు సాయపడటం, పరిస్థితి కలసిరాకపోతే రిస్క్ ఫేస్ చెయ్యడం, ఆ మాటకొస్తే ఇలాంటి సంతకాలెన్నో ఎంతమందికో పెట్టాను. వాళ్ళు కట్టలేకపోతే డబ్బు నేను కట్టాను. ఆఁ స్నేహమంటే అదీ"
"మావారు మీకోసం రిస్క్ చీసుకునేంతటి స్నేహితులేం కాదు. మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని మొహమాటంలో పెట్టి యిబ్బందిలో పడేశారు."
"అదేంటండీ అలా అనేశారు. ఆయన్ని నా ఆప్తమిత్రులని అనుకుంటున్నాను. అదీగాక ఆయనంటే నాకెంతో గౌరవం."
ఈలోగా రాధాప్రియ విమలాదేవితోపాటు రంగంలో ప్రవేశించింది.
"ఏమిటండీ! ఏమిటి ఇంటిమీదకొచ్చి రాద్దాంతం చేస్తున్నారు. మేనర్స్ లేకుండా" వస్తూనే ఎటాక్ మొదలుపెట్టింది.
"నాకు మేనర్స్ లేదా?"
"లేదు. ఉంటే ఆడదానివై వుండి మగవాళ్ళ విషయములో కల్పించుకుని ఇలా అగ్లీగా ఎందుకు బిహేవ్ చేస్తావు?"
"ఆహా! బాగా అడిగారు అన్నట్లు విమలాదేవి రాధాప్రియ వంక ప్రశంసా పూర్వకంగా చూసింది.
"ఇది వాళ్ళకూ మాకూ సంబంధించిన ప్రాబ్లెమ్. మధ్య నువ్వెవరివి జోక్యం చేసుకోవడానికి" అంటూ సుజాత కోపంగా అడిగింది.
"ఎవర్నా? వాళ్ళ ప్రాణ స్నేహితురాల్ని"
"అయితే? ఈ సమస్యలో కల్పించుకోవటానికి నీకేమిటి హక్కు?"
"వాళ్ళ తరఫున మాట్లాడటానికి ఆ హక్కూ, వకాల్తా ఇచ్చారు."
"అవును. స్పెషల్ వకాల్తా ఇచ్చాము" అంది విమలాదేవి.
"ఓహో! అలానా? అయితే చెప్పండి. ఎవరితో ప్రమేయం పెట్టుకోకుండా మా దార్న మేము బతుకుతూంటే ఇలా తీసుకొచ్చి సంతకాలూ అవీ చేయించి బర్డెన్ ని మా నెత్తిన వెయ్యటం...
"ఈ సంగతి సంతకం పెట్టినప్పుడు తెలీదా?"
"ఓహో! ఎంత గొప్పగా అడిగారు" అనుకుంటూ విమలాదేవి సంతోషిస్తోంది.
సుజాత షాక్ అయింది.
"అవును నేను న్యాయం మాట్లాడుతున్నాను. అంత బాధ్యత తీసుకుని సంతకం పెట్టారంటే మీవారు బాధ్యత తీసుకున్నట్లే. అంటే సుబ్బారావుగారు కట్టలేకపోతే మీవారు కట్టడానికిష్టపడి సైన్ చేశారన్నమాట. అది కట్టుబడి. తెలీకుండా పెట్టారు, పెట్టమంటే పెట్టారు, బలవంతం చేస్తే పెట్టారు" ఇవన్నీ అర్థంలేని మాటలు. తప్పించుకునే మాటలు. ఏం? సంతకం విలువ తెలీని అమాయకుడా నీ మొగుడు? ఆయనగారి అమాయకత్వమేమిటో ఓసారి రోడ్డుమీదకెళ్ళి చూడు తెలుస్తుంది"
"ఇదిగో రాధాప్రియా నువ్వు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు"
"ఏమిటి లిమిట్స్? నువ్వొచ్చి యిక్కడ అల్లరి చేస్తే వూరుకోం. మేము జవాబు చెబితే రూల్స్. ముందూ వెనక చూడకుండా సంతకాలు పెట్టినప్పుడు యీ తెలివితేటలు ఏమయినాయి?
"రాధాప్రియా! నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు."
"సుజాతా! నువ్వంతకంటే తలాతోకా లేకుండా మాట్లాడుతున్నావు"
"రాధాప్రియా! నేను న్యాయంకోసమొచ్చాను. అల్లరి చెయ్యటానిక్కాదు."
"సుజాతా! నేనూ న్యాయం చెప్పటానికే వచ్చాను. నువ్వరిచి గీ పెట్టినా సుబ్బారావు గారిప్పుడు స్వయంగా డబ్బు కట్టే స్థితిలో లేరు. ఉంటే నీలాంటివాళ్ళ చేత అడ్డమైన మాటలూ పడే మనిషి కాదు ఆయన. చాలా పెద్ద మనిషి."