Previous Page Next Page 
తదనంతరం పేజి 31


    ఈ దేశంలో ఎన్నో సంసారాలు కారణం లేకుండా దుఃఖాన్ని ఆహ్వానిస్తూ వుంటాయి.


    "ఏమండీ! నిద్ర రావటం లేదా?" మృదువుగా, ఆప్యాయంగా అరుంధతి గొంతు. తర్వాత ఆమె చెయ్యి అతని చుట్టూ పెనవేసుకుంది.

    
    అతనింకా యింకా ఆమె దగ్గరకు జరిగాడు. ఆమె చెయ్యి అతన్ని ప్రేమగా నిమురుతూ, జుట్టును సవరిస్తూ... క్రమ క్రమంగా ఒకరినొకరు హత్తుకుపోయారు.


    ఓ పది నిమిషాలు గడిచాయి.


    చాలాకాలం తర్వాత...యీవేళెంతో హాయిగా వున్నట్టనిపించింది. ఆమె గుండెలమీద తలవాల్చి సేదతీరుతున్నట్లు అలా కళ్ళు మూసుకుని పడుకున్నాడు.


    అంత తృప్తిలోనూ అతన్నేదో దుఃఖమావరిస్తోంది.


    అసలు తృప్తిలోనే, అనుభూతిలోనే దుఃఖం మిళితమై వుంటుందేమో. ప్రపంచంలో అన్నిటికన్నా సహజమైనది దుఃఖం కావటంవల్ల దానికా గుణం సిద్ధించి వుండవచ్చు.


    "ఏమండీ!" అన్నది అరుంధతి కొంచంసేపున్నాక నెమ్మదిగా.


    ఆమె చెయ్యి అతని చుట్టూ యింకా పెనవేసుకునే వుంది. అతనికి తామిద్దరూ చాలా చిన్నవాళ్ళమనిపించింది. పెళ్ళయిన ఆ తొలిరోజులు ఎంత నిర్మలంగా వుంటాయి. తమ కుటుంబ పరిధి రీత్యా ఏకాంతం కోసం కొన్ని ఇబ్బందులు ఎదుర్కుని వుంటే ఎదుర్కుని వుండవచ్చు గాక. పిల్ల పుట్టి రాను రానూ సమస్యల తోరణంలోకి యిరుక్కునే ముందు ఎంత మధురాతి మధురం.


    "ఏమండి" అన్నది మళ్ళీ.


    "ఊ"


    "ఏమిటి ఆలోచిస్తున్నారు?"


    "ఏమీ లేదు"


    రెండు క్షణాలు మౌనంగా గడిచాయి.


    "ఎందుకో...మిమ్మల్ని చూస్తోంటే జాలిగా వుంటుందండీ"


    "నా మీద జాలా...? వద్దు, నన్ను చూసెవరూ జాలి పడవద్దు"


    "కనీసం... నన్ను పడనివ్వండి"


    "ఆరూ! నా జీవితంలో అన్నీ నెగెటివ్ గానే జరిగాయి ఒక్కటి తప్ప"


    "ఏమిటది?"


    "నీతోడు లభించటం"


    ఆమె అతనికింకా దగ్గరగా జరిగి బుగ్గమీద ముద్దు పెట్టుకుంది.


    ఆమెకి కొంచం వయసొస్తే వచ్చి వుండవచ్చు. కాని మొహంలోని కళా, కళ్ళలోని కాంతీ, పలువరసలోని అందం, ఆరోగ్యం ఏమీ తగ్గలేదు. శరీరపు తీరులోకూడా వయసుతోబాటు నిర్దాక్షిణ్యంగా మీదపడే హెచ్చు తగ్గులు ఏమీ రాలేదు.


    "నీరజ అలా ఉద్యోగం చెయ్యాల్సి వస్తోన్నందుకు చాలా బాధగా వుంది" అన్నాడు.


    "అది ఓ సరదాగా తీసుకుందాం. కాలక్షేపంకోసం చేస్తుందనుకుందాం. ఆడపిల్ల చదువు పూర్తి చేశాక, ఏ వ్యాపకమూ లేకుండా యింట్లో కూర్చోవటం కష్టం కదా"


    "వ్యాపకం కోసం ఉద్యోగాలు చెయ్యటం వేరు, మన పరిస్థితి వేరు"


    "బహుశా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఉద్యోగాలు చెయ్యకుండా రోజులు గడవవనుకుంటాను" అంది అరుంధతి కొంచమాలోచించి.


    "ఈ పరిస్థితి ఎందుకొచ్చి వుంటుందంటావు?"


    అరుంధతి యీ ప్రశ్నకు సరియైన జవాబు కోసమాలోచిస్తూ తననిలా ప్రశ్నించుకుంటోంది.


    "అరూ!"

 Previous Page Next Page