"బి-కాంప్లెక్స్ వేసుకుంటారా? ఏ కంపెనీది వాడతారు?"
"పాలిబియన్. అదయితే ఎక్కువ నొప్పి పెట్టదు. నాకు నొప్పంటే చచ్చే భయం."
"ఏవీ? ఇంజక్షన్ యాంప్యూల్స్ వున్నాయా?"
"నిన్ననే ఒకటివుంటే వేసుకున్నాను. మళ్ళీ తెచ్చుకోవాలి."
"మీకు ఇంజక్షన్ చెయ్యటం వచ్చునేమిటి?"
"మా అంకుల్ బాంబేలో పెద్ద డాక్టరు. ఆయన దగ్గర సరదాకి నేర్చుకున్నాను."
"మీ అంకుల్ ఐ స్పెషలిస్టా?"
"కాదు. ఇ.ఎన్.టి. స్పెషలిస్ట్. మీకేమన్నా ఇయర్, నోస్, థ్రోట్ ట్రబులుంటే చెప్పండి. చిటికెలో డయాగ్నోట్ చేసి నయంచేసి పారేస్తాడు. కావాలంటే రికమండేషన్ లెటర్ ఇస్తాను."
"థాంక్స్. అక్కర్లేదు" అని రంజిత బయటకు వెళ్ళటానికి గుమ్మందాకా వెళ్ళింది.
"ఇంతకూ మీరెందుకు వచ్చారో చెప్పలేదు?"
"చెప్పానుగా. మీతో పరిచయం చేసుకుందామని."
"మీలాంటి అందమైన ఆడపిల్ల తనకు తానుగా పరిచయం చేసుకునేందుకు రావటం చాలా సంతోషం కలిగిస్తోంది."
"ఉహూ అలాగా?" అంటూ ఆమె డోర్ హ్యాండిల్ మీద చెయ్యి వేసి లాగింది. తలుపు రాలేదు.
"ఆగండి. ఆ డోర్ తెరవటానికి ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ఇతరులకి సాధ్యంకాదు" అంటూ అతను ముందుకొచ్చి హాండిల్ మీద చెయ్యివేశాడు. అప్పటికింకా ఆమె చెయ్యి దానిమీదే వుంది. చప్పున వెనక్కి లాక్కుంది. ఒక్క సెకను... ఏదో చేశాడు. డోర్ తెరవబడింది. ఆమె బయటకు వెళ్ళబోతూ ఏదో గుర్తు వచ్చినట్లు ఆగింది.
"అన్నట్లు మేడమీద ఎవరుంటారు?"
"నేనే వుంటాను."
"ఒక్క మనిషికి ఇంత పెద్ద ఇల్లా?"
"సినిమాఛాన్స్ రాకపోతే బిజినెస్సే శరణ్యం కదండీ. క్రిందంతా ఆఫీసుకు తీసుకుంటున్నాను. పైన కాపురమంటున్నాను. ఒక్కడికి ఇన్నిగదులు వేస్టేననుకోండి. మరి రేపొద్దున పెళ్ళయితే-మళ్ళీ కొత్త ఇల్లు వెదుక్కోవాలంటే కష్టం కదండీ. అందులో ఈ కాలం ఆడపిల్లలున్నారు చూశారూ? వాళ్ళకి రకరకాల అభిరుచులండీ. వాళ్ళకన్నీ విశాలంగా కావాలి."
రంజిత బయటకు అడుగుపెట్టింది.
"అన్నట్లు నేనూ ఓ సంగతి చెప్పాలి."
ఆమె వెనక్కి తిరిగి అతని మొహంలోకి చూసింది. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి.
ఉలిక్కిపడింది. ఆ రోజు హేమసుధ ఇంట్లోంచి అతను బయటకు వస్తోన్నప్పుడు అచ్చం అలాగే జరిగింది.
"ఉండండి, కదలకండి."
"ఏమిటి?"
"మీ కళ్ళు..."
మౌనంగా చూస్తోంది.
"చాలా గొప్పగా వుంటాయి."
ఒక్కసారి కనులు ఆర్పి మళ్ళీ తెరిచింది.
"వాటిని చూస్తుంటే..."
అతని కళ్ళలోకి సూటిగా చూస్తోంది అప్పటికప్పుడు వ్యాపిస్తోన్న ఎర్రని జీరలని గమనిస్తూ.
"సొంతం చేసుకోవాలనిపిస్తోంది."
ఆమె ఏమీ మాట్లాడలేదు. ఒక్కక్షణం అలాగే నిలబడి, తర్వాత మూవ్ అయి మెట్లు దిగి గేటుదాటి వెళ్ళిపోయింది. ప్రఫుల్లకుమార్ ఆమె కారు స్టార్టయి వెళ్ళిపోయేదాకా అలాగే నిలబడ్డాడు. అతని కళ్ళల్లో రకరకాల భావాలు మెరుస్తున్నాయి.
లోపలకు వెళ్ళి డోర్ వేసేశాడు. గబగబ మెట్లెక్కి పైకివెళ్ళాడు. పైన మెట్లెక్కగానే చిన్న హాలు, ప్రక్కనే బెడ్ రూమ్, ప్రక్కనే చిన్న గది. అవతల ఇంకా మూడు గదులున్నాయి.
బెడ్ రూమ్ ప్రక్కనేవున్న చిన్న గదిలోకి వెళ్ళాడు. గోడలో బయటకి కనిపించకుండా చిన్న అల్మైరావుంది. ప్రఫుల్లకుమార్ గోడరంగులో కలిసిపోయివున్న అల్మైరా తలుపు తెరిచి లోపల ఉన్న ఫోన్ బయటకు తీశాడు. ఓ నంబర్ డయల్ చేశాడు. అవతల నుంచి ఎవరో రిసీవర్ ఎత్తిన చప్పుడయింది.
"గోకుల్! రంజిత ఇక్కడకు వచ్చింది. నేను చెప్పిన విషయం ఫినిష్ చేసెయ్."
ఫోన్ పెట్టేసి, బయటకు వచ్చి బెడ్ రూం గుమ్మం దగ్గర నిలబడివున్న మనిషిని చూసి కొయ్యబారిపోయాడు.
12
రంజిత వెళ్ళి డాక్టర్ వసంతకుమార్ ని కలుసుకుంది. ఆమెను చూడగానే అతను కోపంతో కళ్ళెర్రచేశాడు.
"మీరు పోలీస్ డిపార్టుమెంట్ మనుషులని తెలుసు. మా హాస్పటల్ నీ, డాక్టర్లనీ అప్రతిష్ఠపాలు చేసిన ఈ సంఘటన గురించి ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వమని చెప్పానుగా! ఎలాంటి పరీక్షలకూ ఒప్పుకోను. దిసీజ్ ఆల్ బిగ్ న్యూసెన్స్! నా నుంచి మీకు ఎలాంటి సహకారం లభించదు" అన్నాడు.
"మీకు ట్రబుల్ ఇస్తున్నానని తెలుసు. పద్మనేత్రాలయకు దేశంలో విశిష్టమైన పేరుంది. వ్యక్తిగతంగా నాక్కూడా మీ హాస్పటలంటే ఎంతో గౌరవం. అలాంటి హాస్పటల్ అందరి నోళ్ళలో నాని, దారుణమైన చెడ్డ పేరు తెచ్చుకున్నదంటే నాకెంతో బాధగా వుంది. ఈ మచ్చను తొలగించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాను" అంది రంజిత. ఆమె మాటల్లో నిజంగా చాలా సానుభూతి ఉంది.