Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 31


    
    ఆరో రంగం: అబ్బాయి వీధిలో బికారిలాగా అటూయిటూ తిరుగుతూంటాడు. బట్టలు చిరిగి పీలికలు అయిపోయి వుంటాయి. పది రోజుల్నుంచి అన్నం మొహం ఎరుగనివాడి మొహంలాగా వుంటుంది. ప్రేక్షకుల వంక తిరిగి జాలిగా "కడుపు మండిపోతోంది నాకు డబ్బున్నాళ్ళూ జల్సా చేసినా స్నేహితులంతా ఒకపూట అన్నం పెట్టించటానికే నిరాకరించారు.
    
    "ఇప్పుడేది దారి?" అంటాడు తనలో తను అనుకుంటున్నట్లు అంతలో ఆ దారిన అతని స్నేహితుల్లో ఒకడు పోతుంటాడు. అబ్బాయి అతన్ని ఆపి "కాఫీకైనా డబ్బులివ్వరా!" అని బ్రతిమాలుతాడు. అతను విదలించుకుని, "అడ్డమైన వాళ్ళకూ ధర్మాలు చేయటానికి నేనేం కర్ణుడ్ని కాదు" అని వెళ్ళి పోతాడు. అబ్బాయికి ఏడుపు వస్తుంది. కళ్ళనుండి నీళ్ళు కారతాయి. "నేనేం చెయ్యను? నేనేమయిపోతాను?" అనుకుంటాడు. అంతలో వెనకనుంచి అంతరాత్మ ప్రబోధం వినిపిస్తుంది. "ఎందుకోయ్ యిలా చెడిపోతావు? తల్లి దండ్రులు చెప్పినట్టు నడుచుకో, యింటికి పోయి పిచ్చి పిచ్చి వేషాలెయ్యకుండా హాయిగా బ్రతుకు" అంటుంది అంతరాత్మ. "వాళ్ళు నన్ను బందిఖానాలో వుంచుతారు. ఎక్కడికీ పోనివ్వరు. ఖర్చుకు కాణీ కూడా యివ్వరు. ఎలాగ?" అంటాడు అబ్బాయి నువ్వు ఎంత పిచ్చివాడివిరా! జల్సాగా తిరిగి యిష్టం వచ్చినట్టు ఖర్చు పెడితేనే జీవితం అనుకుంటున్నావా? ఇంట్లో వుండి, పెద్దవాళ్ళు చెప్పినట్లు వింటే అది జీవితం కాదనుకుంటున్నావా? తప్పయినా ఒప్పయినా పెద్దవాళ్ళు చెప్పినట్లే వినాలి. అసలా పెద్దవాళ్ళు తప్పు ఎప్పుడూ చెప్పరు. వాళ్ళు చెప్పేది ఒప్పే అయివుంటుంది. అందుకని వాళ్ళు చెప్పినట్లే విని ఆచరించాలి. అలా చెయ్యడం కొంచెం కష్టంగావున్నా అదే చీకూచింతా లేకుండా చేస్తుంది. పో పోయి అమ్మనీ, నాన్ననీ వేడుకో" అని అంతరాత్మ ప్రబోధిస్తుంది. అబ్బాయి అంతరాత్మకు లోబడిపోతాడు. "అమ్మా! నాన్నా!" అంటూ పరుగెత్తుతాడు. తెరపడుతుంది.
    
    నిజానికి యీ సీను ప్రేక్షకులకు బాగా రక్తి కట్టినా అబ్బాయి పాత్ర నిర్వహించిన శంకరానికి బొత్తిగా నచ్చలేదు. అంతరాత్మ ప్రబోధం అతనికి అణుమాత్రమైనా హితవుగా లేదు. ఎంతసేపూ అబ్బాయి చేసిందే రైటు అనిపించింది తప్ప, అంతరాత్మ చెప్పింది కొంచెమైనా సబబుగా వున్నట్టు తోచలేదు. అయినా నాటకంలో అలానే వుందిగనుక అలానే యాక్టు చేయాల్సి వచ్చింది.
    
    ఇక ఏడో రంగం: ఏముంది? అబ్బాయి యింటికి పరుగెత్తుకు వస్తాడు. అతను వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఎధొఇ మాట్లాడుకుంటూ వుంటారు. అబ్బాయి వస్తూనే యిద్దరి కాళ్ళమీదా పడి, "తప్పు చేశానే, ఇంకెప్పుడూ చెయ్యనే" అని ఏడుస్తూ చెబుతాడు. తల్లిదండ్రులకి కూడా గుండె నీరయిపోతుంది. తల్లి ఎలాగూ అంతకుముందే బెంగపెట్టుకుని వున్నదాయె. ఇద్దరూ వరుసగా అబ్బాయిని దగ్గరకు తీసుకుని కావలించుకొంటారు. తెర వాలిపోతుంది.
    
    తరువాత మళ్ళీ నేపథ్యం. "అప్పట్నుంచీ అబ్బాయి మనసు మార్చుకున్నాడు. తల్లిదండ్రులు చెప్పినట్లే విన్నాడు. బడికి శ్రద్దగా వెళ్ళాడు. దాని ఫలితం ఏమయింది? అబ్బాయి పెద్దవాడయిన తర్వాత నిజంగా మణిపూస అయ్యాడు. అతని జీవితం హాయిగా గడిచింది. తల్లిదండ్రులు కోర్కె ఫలించింది. అంతే."
    
    అంతా చప్పట్లు కొట్టేశారు. తర్వాత తెలుగు మేష్టారు స్టేజిమీదకు వచ్చి "ఇప్పుడు హెడ్ మాస్టరు గార్ని కొంతసేపు మాట్లాడాలని కోరుతున్నాను" అని చెప్పాడు. హెడ్ మాస్టరుగారు పైకి ఎక్కారు.
    
    ఆయన నాటకాన్ని గురించి అమోఘంగా వుందనీ, అద్భుతంగా వుందనీ తెగ పొగిడేశారు. తెలుగుమాస్టారి దర్శకత్వాన్ని కూడా అభినందిస్తూ తన ధన్యవాదాలు తెలిపాడు. ఆ తర్వాత శంకరాన్ని గురించి మాట్లాడుతూ, నిజంగా యీ చిన్న కుర్రవాడి నటన మన హృదయాలను కదల్చివేసింది. ఇటువంటి మణిపూస నా స్కూల్లోనే వున్నట్లు నాకింతవరకూ తెలియనందుకు చాలా విచారిస్తున్నాను. ఇంకో విషయం! ఇతని అద్భుత నటనాచాతుర్యానికి పారితోషికంగా మన స్కూల్ కమిటీ నిధిలోనుంచి ఖర్చుపెట్టి ఒక చిన్న బంగారుపథకం యిస్తామని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను" అని చెప్పాడు.
    
    ప్రేక్షకులలో ఆఖరిసారిగా కరతాళధ్వనులు మ్రోగిపోయాయి. అందరూ యిళ్ళకు బయల్దేరారు. శంకరంకూడా వాళ్ళ వాళ్ళతో యింటికి బయలుదేరాడు. బావ అతన్ని తెగ పొగిడేశాడు. అక్కయ్యకూడా ఎక్కువగానే మెచ్చుకున్నది. పోతే నాన్నగారి విషయమే అతనికి ఇంకా అనుమానంగానే వున్నది. దారిలో ఆయనేమీ మాట్లాడలేదు. ఆయనకు కోపం వచ్చిందేమోనని హడలిపోయాడు శంకరం.
    
    ఇంటికిపోయిన తర్వాత "యిటు రారా" అని పిలిచారు నారాయణరావు గారు శంకరాన్ని. శంకరం వళ్ళు ఝల్లుమన్నది. భయపడుతూ, భయపడుతూ తండ్రిదగ్గరకు పోయాడు.
    
    కాని, శంకరం అనుకున్నట్లు జరుగలేదు. "బాగానే వేశావే" అంటూ నవవదాయన. ఆయన శంకరంతో సాధారణంగా నవ్వుతూ మాట్లాడరు. ఒకవేళ ఆ నవ్వులో రెండర్దాలు లేవుగదా అని హడలిపోయాడు శంకరం.
    
    "ఊఁ అయితే యింక ఎప్పుడూ యిదేపని పెట్టుకుని చదువు పాడుచేసుకోబోక" అన్నాడాయన తిరిగి. శంకరం తల ఊపి యివతలకు వచ్చేశాడు.
    
    ఆ రాత్రి శంకరం హాయిగా నిద్రపోయాడు. హెడ్ మాస్టరుగారు అతనికి బంగారు పతకం బహుమానమిస్తున్నట్లు కలగన్నాడు.

 Previous Page Next Page