"నీదేం రేర్ పేరు అయివుండదు. ఎందుకంటే ఆంద్రప్రదేశ్, చైనా ఒకటే పేర్ల విషయంలో, కామన్ పేర్లు ఎక్కువ. ఒకవేళ నీ పేరు చెప్పినా, ఆ పేరు ఎన్నో వేలమందికి వుంటుంది. ఇంటిపేరు చెప్పక్కర్లేదు. దీని మూలంగా పెద్ద క్లూ ఏం దొరుకుతుంది నాకు?"
"నిజమే! పోనీ ఓ పనిచేద్దూ....నువ్వే ఓ మంచి పేరు-ముద్దు పేరు పెట్టు. దాంతో పిలువు. ఏమంటావ్?"
"బందెర సుబ్బమ్మ...ఎంత బాగుందోగదా! ఇలాగే పిల్వనా? ఉక్రోషంగా శ్రీధర్ అంటే, ఫోన్ కి ఆవేపునుంచి పకపకమని ఆమె నవ్వింది.
కొంతసేపు ఆమె అలా నవ్వుతూనే వుండిపోయింది.
"నాకంతకంటె మంచి పేరు తట్టలేదు. పిలవనా అలాగే?" తిరిగి రెట్టించాడు శ్రీధర్.
"బాగోలేదోయ్...కంగారేం లేదు. రేపటివరకు ఆలోచించి మంచి పేరు పెట్టు."
"లేదు...నేను పెట్టిన పేరుతో పిలిపించుకోడానికి నువ్వు యిష్టపడాలి. లేదంటే నీ పేరు చెప్పాలి" మొండిగా అన్నాడు.
"మంచి పేరు పెట్టలేవా? మనేకా గాంధీ పేర్ల పుస్తకం దొరుకుతుంది. అది కొని ట్రై చేయకూడదూ-" ఆమె చెబుతుండగానే చిరాకుపడి పోతూ ఫోన్ పెట్టేశాడు శ్రీధర్.
నిజానికసలు అతనికి ఫోన్ పెట్టేయాలని లేదు. కానెలాగైనా ఆమెని రెచ్చగొట్టి, ఆ ఒక్క విషయంలోనైనా గెలవాలనే పట్టుదల బాగా పెరిగిపోయింది శ్రీధర్ లో.
క్షణం....క్షణాలు...నిమిషం....నిమిషాలు....
ఇక ఆగలేకపోయాడు. ఫోన్ తిరిగి లిప్ట్ చేశాడు.
"నాకు తెలుసు. నాతో మాట్లాడకుండా నువ్వు వుండలేవు. నిన్ను బాధపెట్టినందుకు గాని, విసిగించినందుకు గాని, ఐయామ్ రియల్లీ సారీ! నా పేరు చెప్పనా?" అందామె వీణని సుతారంగా మీటినట్టు.
"నేను నమ్మను. నువ్వు చెప్పవు- ఉడికిస్తావంతే" చిన్నపిల్లాడిలా అన్నాడు శ్రీధర్.
"నో...మైడియర్! నిజంగా నిజమే చెబుతాను. ఈసారి... నా పేరు...నా పేరు..." ఆమె కంఠం మధ్యలో ఆగింది. "ఊ... నీ పేరు...?" ఉద్వేగం అంచున వున్నట్టుగా వున్నాడు శ్రీధర్.
"అంత ఆరాటమా?" కిలకిలా నవ్వుతూ అందామె.
"ప్లీజ్...చెప్పు...చెప్పు...ఏంటి నీ పేరు?" ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా అతని కంఠంలో పలికే ఉద్వేగం మాత్రం స్పష్టంగా ప్రస్ఫుటమవుతోంది.
"నా పేరు...నా పేరు..."
"వూ...వూ...నీ పేరు...."
"పూజ...."
కొద్ది క్షణాలు రెండువేపులా నిశ్శబ్దం.
పూజ...ఎంత బాగుంది పేరు! ఆమె స్వరంలో ఎంత మాధుర్యం తన పేరు చెబుతున్నప్పుడు...
"బాగుందా? నేనేమనుకోను చెప్పు" అంది ఆమె ఫోన్ కి ఆవేపునుంచి.
ఆ కంఠంలో ఎంతటి భావ తీవ్రత...?
ఎంతటి ఉద్వేగం...?
ఆమె కంఠంలోంచి వచ్చే ప్రతిమాటా ఆమె పెదవులమీంచి జాలువారినట్టుగా వుండదు... గుండెలోతుల్లోంచి ఎంతో నమ్మిక-మరెంతో నిజాయితీ- ఇంకెంతో ఆత్మీయతను కలగలుపుకుని వచ్చినట్టుగా వుంటుంది.
కొందరి కంఠం ఎవరినో శాసించడానికే పుట్టినట్టుగా వుంటుంది. ఇంకొందరి కంఠం అవతలివారిని మభ్యపెట్టి పబ్బం గడుపుకుని, పనులు సాధించుకోవడానికే పుట్టినట్టుగా ఉంటుంది.
చాలా తక్కువమంది కంఠమే తమలో రేగే భావాల్ని అవతలి వారిలోనూ ప్రేరేపించేలా వుంటుంది. అలాంటి కంఠమే మనసు అట్టడుగు పొరల్లో దాగివుండే ఆలోచనలకు ఊపిరి పోసేది. అలాంటి కంఠమే ఆనందానికి ఆలంబనయ్యేది.
తనలో ఎప్పుడూ...ఎప్పుడూ ఉద్భవించని స్పందన...ఎందుకిలా తనలో తనకు తెలీకుండానే అతివేగమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి?
అపర్ణను తొలిసారి చూసినప్పుడు, తొలిసారి మాట్లాడినప్పుడు... తొలిసారి ఆమె స్పర్శానుభూతిని పొందినప్పుడు కూడా స్పందన కలిగింది. కానది ఇప్పుడు చిన్న గీతలా అనిపిస్తోంది! అది తన ప్రేమలో దృఢత్వం లేకనా?
తన మనస్తత్వం తనకు బాగా తెలుసు.
తనను తానే సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని, బాగా సమీక్షించుకున్నాడు.
తనది స్వప్నదర్శన ప్రపంచం...
తను ఏకాంతాభిలాషి...
తనో మితభాషి...
అపర్ణ కోసం అమెరికా మట్టిదిబ్బలపై గంటల తరబడి ఎందుకలా కూర్చునేవాడు? సరసు వొడ్డున ఒక్కడూ రాత్రంతా ఎందుకు గడిపేవాడు? ఇతరులకు వినబడిన ధ్వనుల్ని, దృశ్యాల్ని తను మాత్రమే ఎందుకు అనుభూతించేవాడు? ఒక్కోసారి అవి తనకు భ్రమలా తోచేవి.
ఇప్పుడలా లేదు. అలా అనిపించడంలేదు. తను పూజని ప్రేమిస్తున్నాడా? అపర్ణని ప్రేమించిన తను - పూజని ప్రేమించడం నిజమే అవుతుందా? ప్రేమ కాదేమో- ఇంకేదో...అనుభవంలోకి రాకుండా ఆవలిగట్టున కూర్చున్న విచిత్రమైన భావన...
అర్థంకాకుండా, అంతరంగాన్ని అతలాకుతలం చేసే అందమైన ఊహల ప్రపంచం, తనలో ఇటీవల కాలంవరకు ప్రోదిచేసుకున్న ఉదాసీనత ఎందుకు డాన్స్ చేయాలని, పాటలు పాడాలని, పరుగెత్తి సిటీ బస్ ఎక్కాలని, వర్షంలో కారేసుకుని షికారుకెళ్ళాలని, తొలకరి చినుకుకు తలలూపే పామ్ చెట్లను సృజించాలని, అందమైన గులాబీ రెక్కపై చివరికి మిగిలిన ముత్యంలాంటి వర్షపు చినుకును నాలుక చివరతో ఆస్వాదించాలని, కాలి వేళ్ళ మధ్యనుంచి జాలువారే వర్షపు నీటి, పిల్లకాలువలకు బుల్లిబుల్లి కట్ట లేయాలని, సముద్ర పొడ్డున గుజ్జిన గూళ్ళు కట్టుకుని, వాటిలో పాదాల్ని దూర్చాలని, వానే వరదయి వర్షించేవేళ ఎవరూ చూడని ఏకాంత ప్రదేశాలకెళ్ళి నగ్నంగా తడిచిపోవాలని, రోడ్డెంట కాల్చే మొక్కజొన్న పొత్తుల్ని వేయించే తంపటకాయల్ని, మిరపకాయ బజ్జీల్ని తినాలని, ఏ భేషజాలూ, అహాలూ, ఆత్మవంచనలు, ఆత్మనూన్యతాభావాలు లేకుండా బాపు బుడుగులా సీగానపెసూ నాంబతో సరసాలాడాలని, నండూరి ఎంకితో జానపదం పాడాలని, తిలక్ కథానాయికతో పాట పాడాలని...ఇంకా... ఏదో...ఏదో...ఏదేదో... ఏమేమో... చెయ్యాలన్నంత ఉద్వేగంగా వుంది శ్రీధర్ కి.