Previous Page Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 31


    "ఎప్పుడూ మత్తులో వుంచే ప్రేమలో పడటమే తప్పనిపిస్తుంది."

 

    "ప్రేమలేని మానవ శరీరం యంత్రం లాంటిది తెలుసా?"

 

    "యంత్రమైనా అదే బెటరేమో?"

 

    "నువ్వలా కాలేవు. మనసులోని ప్రేమని, మొహంమీది పుట్టుమచ్చని దాయటం కష్టం. నీ మొహాన్ని నేను రోజూ చూస్తూనే వున్నాను."

 

    గతుక్కుమన్నాడు శ్రీధర్.

 

    నిజానికి తనలా మారలేడు.

 

    "ఓ.కె. ఒప్పుకుంటాను. ప్రేమనే వ్యాధికి పెళ్ళి సరయిన మందంటారు గదా? మరెందుకు అపర్ణ మా పెళ్ళి పట్ల విముఖత చూపుతోంది?"

 

    "చెప్పానుగా నిజమయిన ప్రేమ పబ్లిసిటీని కోరుకోదని. కాని అపర్ణ తన నాట్య ప్రతిభకి పబ్లిసిటీని, పాపులారిటీని కోరుకుంటోంది. అలా అని అపర్ణ నిన్ను ప్రేమించటంలేదని చెప్పటం నా వుద్దేశం కాదు సుమా..."

 

    "నాకేం అర్థమయి చావటంలేదు" అయోమయానికి గురవుతూ అన్నాడు శ్రీధర్.

 

    "అమాయక జీవి! ప్రేమంటే రెండు శరీరాల ఒకే గుండె చప్పుడు. స్నేహానికి మధురమైన సంగీతాన్ని కలపటమే ప్రేమంటే. సంగీతాన్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా నిజమైన ప్రేమికులు.ఎప్పుడూ పాటలు, సంగీతం వినే వాళ్ళు కొందరికి పిచ్చివాళ్ళులా కనిపిస్తారు. అది వాళ్ళ ఖర్మ. నిజానికి ఇప్పుడు నేను చెప్పినవో నువ్వు చెప్పినవో మన కొటేషన్స్ కావు. ప్రేమ ప్రవాహంలో పడి కొట్టుకుపోయి దాన్ని అనుభవించి, ఆరాధించి, అంతు చూసిన ప్రేమికుల గుండెలోతుల్లోంచి పెల్లుబికినవి నీకు తెలుసా? నిజానికి ఈ ప్రపంచంలో ప్రేమని పరిపూర్ణంగా వ్యక్తంచేసే పదాలు ఏ భాషల్లోనూలేవు.

 

    పదాలు వ్యక్తం చేయలేని అంశాలు ఈ ప్రపంచంలో రెండే వున్నాయి. ఒకటి ప్రేమ, రెండు భక్తి. ద్వేషం వెలిగించే పెద్ద కాగడాకన్నా, ప్రేమ వెలిగించే చిరుదీపం చాలా గొప్పది. కనుక నువ్వు ప్రేమకి దూరంగా వెళ్ళిపోలేవు. కాకపోతే ఏది నిజమైన ప్రేమ, ఎవరిదీ నిజమైన ప్రేమ అనేది తెలుసుకోవటమే చాలా కష్టం. నిజంగా ప్రేమించేవాళ్ళ మధ్యే, అవసరాలకు, స్వార్థానికి ప్రేమిస్తున్నట్టు నటించేవాళ్ళు వుంటారు. వాళ్ళు పాలలో నీళ్ళలా కలిసిపోతారు. నిజమైన ప్రేమ గురించి తెలుసుకోవాలంటే మనం హంసలా మారగలగాలి. తెల్సిందా బుజ్జికన్నా?"

 

    తిరిగి శ్రీధర్ మౌనం వహించాడు.

 

    "లైన్లో వున్నావా?" తిరిగి అడిగిందామె.

 

    "ఆ...ఆ...నీ అడ్రస్ చెప్పకపోతే ఫోన్ పెట్టేస్తాను" బెదిరిస్తున్నట్టుగా అన్నాడు శ్రీధర్.

 

    "ఫోన్ పెట్టేస్తే నేనెవరయింది నీకెలా తెలుస్తుంది?"

 

    "ఇప్పుడు మాత్రం ఏం తెలుసుకోగలిగాను?"

 

    "నా సంభాషణల్లో దొర్లే మాటల్ని బట్టి, వివరాల్ని బట్టి, నీ తెలివితేటల్ని వుపయోగిస్తే తెలుసుకోగలవు. అయినా ఎంతో కష్టపడి వెంటాడి వేటాడి నీ గురించి నేను ఎంతో తెలుసుకోగలిగినప్పుడు నా గురించి తెల్సుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నిన్నడిగే, నేను నీ గురించి అన్నీ తెలుసుకున్నానా?"

 

    "నాగురించి నువ్వేం తెలుసుకోగలిగావు? మేబీ ఫ్లాట్, ఫోన్ నెంబరు, ఆఫీసు నెంబర్, నాపేరు, రెసిడెన్స్ ఆఫీసు అడ్రసులు. అంతేగా?"

 

    "యు ఆర్ బీయింగ్ క్వయిట్ చైల్డిష్" నవ్వుతూ అందామె.

 

    ఆనవ్వే...ఆనవ్వే...ఆనవ్వే...తనని ఏదేదో లోకాలకు తీసుకెళ్తుంది.

 

    ఆమె నవ్వులో అంతటి సమ్మోహనం ఎలా ఒదిగిపోయింది...? ఆమె నవ్వినప్పుడల్లా గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం మర్చిపోతుంది... ఎందుకలా?

 

    కొన్ని భావాలు మన ప్రమేయంతో పుట్టుకొస్తే-మరికొన్ని, ఆప్రమేయంగా అంతర్లోకాల్లోంచి, ఎలా వస్తాయి? వాటికి పునాది ఏమిటి? స్పందనేనా....?

 

    "నడివేసవి వెన్నెల రాత్రుల్లో జాజిపూలు విరజిమ్మినట్టు మల్లెతోటల్లోంచి కొన్ని లక్షల పుష్పాల సుగంధం తన ఫ్లాటంతా ఆవరించుకున్నట్టుగా, ఓ సౌందర్యరాశి ముందు నుంచుని తన్మయంగా చూస్తుంటే, వెండి వెన్నెల ఇసుకతిన్నెలపై నడిచే ముగ్ధమోహన పాదాల వెండిపట్టీల సవ్వడి గుండెల్లో గుబులెత్తించేటట్టు...ఎలా...ఎలా...అంత అందంగా ఎలా నవ్వగలుగుతోంది?

 

    మనసు స్వచ్చంగా వున్నవాళ్ళు గుండెల నిండుగా నవ్వుతారట- అపరిచితురాలి నవ్వు అలాగే అనిపిస్తోంది తనకు.

 

    "హలో...బాస...ఏం ఆలోచిస్తున్నావ్."

 

    "ఏం...ఏం లేదు." తడబడుతున్నట్టుగా అన్నాడు శ్రీధర్.

 

    "ప్రేమ ఎవరికీ పైనుంచి దిగివచ్చి చేతిలో వాలదు. ప్రేమికులే ప్రేమ జౌన్నత్యానికి ఎదగాలి...దాన్ని పూర్తిగా అందుకున్నాకే- వారికి దాన్ని అనుభవించే హక్కుంటుంది" చిలిపిగా అన్నా ఆ మాటల వెనుక ఎంతో గాఢత వుంది.

 

    "ఈ మాటల వెనుక నీ వుద్దేశం ఏమిటి? ఏదన్నా కాని- నా గురించి అన్నీ తెలుసుకుని - నాతో ఎందుకిలా ఆటలాడుతున్నావ్?"

 

    "చిన్నప్పుడు ఆటలు సరదా తీరక - అయినా అందమైన ఆడపిల్లతో ఇంత కఠినంగా మాట్లాడనక్కర్లేదేమో!" అందామె మృదువుగానే.

 

    "అయామ్ సారీ! ఐయామ్ ఇరిటేటింగ్...వితవుట్ మై నాలెడ్జ్."

 

    "వద్దు ప్రేమలో అబద్ధాలు అగాధాల్ని సృష్టిస్తాయి."

 

    "అబద్ధాలా? వాడ్డూయూమీన్?"

 

    "ఎస్...ఐ మీన్...నిజంగా నీకు నాపట్ల ఇరిటేషన్ వుంటే... ఇంతసేపు మాట్లాడవు. యామైరైట్?"

 

    "ఎస్...అఫ్ కోర్స్! కాని నాకు అపరిచితులతో మాట్లాడడం ఇష్టముండదు."

 

    "యూ ఆర్ రైట్. బట్...ఎవరైనా, ఎవరికైనా తెలుసుకోనంత వరకే అపరిచితులు. తెలుసుకుంటే పరిచితులే కదా!"

 

    "మరి మనం తెలుసుకోలేదే? పరిచితులమెలా అవుతాం?"

 

    "డోంట్ బీ ట్రిక్కీ ఐ....సే."

 

    "పోనీ నీ పేరయినా చెప్పు, అదొక తృప్తిగా వుంటుంది."

 

    "......" ఫోన్ కి ఆవేపునించి మాటలు లేవు.

 Previous Page Next Page