Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 31


    "మాలీ!" అంటూ లేచివెళ్ళి తలుపు తీసింది.

    మాలతీ, భానుమతీ ఒకరికెదురుగుండా ఒకరు.

    బద్ధకంగా భానుమతి.

    అలసిపోయి మాలతి.

    "భానూ! వచ్చేశాను...." అంటూ మాలతి ఇంకా ఏదో చెప్పబోతోంది.

    "తెలిసింది - లోపలకు రా. ముందు కాఫీ, విషయాలు తర్వాత" చెయ్యి పట్టుకుని లోపలకు లాగింది. మాలతి వెళ్ళి స్నేహితురాలి గుండెలమీద పడింది.

    "గుండెలు ఏమంటున్నవో తెలుసా?"

    మాలతి అలాగే కళ్ళు మూసుకుని ఆమెను ఆనుకుని నిలబడి వుంది.

    "ఓ జీవితమా! భరించు అన్నీ. కానీ నీ విలువను పోగొట్టుకోకు" అని.

    ........

    "సరే రా, మొహాలు కడుక్కుందాం."

    పరిచయమైన గది. ఎన్నో నెలలు నివశించిన ఇల్లు. చాలాకాలం తర్వాత వచ్చినా కొత్తగా లేదు.

    కాఫీలు త్రాగారు. ప్రక్క ప్రక్కన ఒకర్నొకరు ఆనుకుని కూర్చున్నారు.

    మాలతి మెల్లమెల్లగా జరిగిందంతా చెప్పింది.

    "అంతా పోగొట్టుకున్నాను భానూ! నామీద నాకేం భ్రాంతి లేదు....... అసహ్యమే తప్ప. కానీ నువ్వు నమ్మవు, ఊహించలేవు. నేనతన్ని ప్రేమించాను. నా ప్రేమమీద నాకు గౌరవం వుంది. ఆ ప్రేమకోసం నాకు బ్రతకాలని వుంది."

    "నీ పద్ధతిలో నువ్వు కరెక్టే!"

    "భానూ!"

    "అవునే. మొదట్నుంచీ నీ ఆలోచనలనూ, జీవితాలనూ ఒకరకంగా మలుచుకుంటున్నావు. దానికి తగ్గట్టు ఆ సంఘటనలూ అలాగే జరుగుతున్నాయి. నాకు నచ్చిన విషయమేమిటం, ఆ పరిస్ధితిలో వున్న అందరిలా నువ్వు ఆత్మహత్య చేసుకుందామని అనుకోవటంలేదు. జీవితాన్ని ఏదో కోణంనుంచి సాధిద్దామని అనుకుంటున్నావు."

    మాలతి ఆమె మాటల్ని వింటూ, తనని తాను ప్రశ్నలు వేసుకుంటుంది.

    "నీలో మెలోడ్రామా వుందని మొదట్నుంచీ నేనంటూ వచ్చాను. అసలాలోచిస్తే - యిన్ని మెలికలు తిరిగేటంతటి మహా ఉపద్రవం ఏం జరిగిందనీ? ఏ జీవితం ప్రశాంతంగా వుంది? సృష్టి మొదలయిన దగ్గర్నుంచీ నేటి వరకూ స్త్రీ పురుషుల మధ్య ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే వున్నాయి. ఆడదికూడా ఓ శరీర కవచంలో, ఆకృతిలో తేడా తప్పితే రక్తంలో, ఆశల్లో, అనుభూతుల్లో, అనుభవంలో ఇద్దరూ ఒక్కటే. పురాణాల్లో పతివ్రతల దగ్గర్నుంచీ, ఈకాలం ఉద్యోగం చేసుకునే అమ్మాయిలదాకా చూట్టూ జరిగే వాతావరణంలో మార్పు వుండవచ్చుగానీ - వాళ్ళ బాధలు, మనస్తత్వాలూ అవే. అసలేం జరిగింది? మూడో వెధవని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే లేదుగానీ, వాడికి ఆ చనువు యిచ్చి, ఊపిరి తీసేసేటంతటి అధికారం ఇస్తే  లేదుగానీ, ఒక్కపోరపాటు జరిగినంత మాత్రంచేత జీవితాలు తారుమారయిపోవాలా? భార్యాభర్తలు ఎన్నాళ్ళు కలిసి కాపురంచేసినా, ఎంత అన్యోన్యంగా బ్రతికినా తెలిసో తెలియకో ప్రకృతికి లోబడి కొన్ని అనుభవాలు జరగడానికి వీల్లేదా?కేవలం భర్తకాకుండా సంవత్సరాల తరబడి ఈ విశాల ప్రపంచంలో ఎందరితోనో ప్రమేయం వున్నప్పుడు మధ్యలో - ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి జరగకుండా వుంటుందా? జరిగితే దానికి శాశ్వతమైన పరిష్కారాలా? భార్యాభర్తల మధ్య బంధం, అనుబంధం, కొన్ని విలువలు వుంటే వుండవచ్చు గానీ ఒకరి జీవితాన్ని ఇంకొకరు శాసించేహక్కు ఎవరిచ్చారు? ఏ అనుభవ్కమ్, సంఘటనలూ జరక్కుండా సంవత్సరాల కాలం బ్రతకడానికి వాళ్ళేమయినా బొమ్మలా? రాళ్ళా? లేక మరమనుషులా?"

    భానుమతిలో ఆవేశం, అంతకుమించిన బాధ! ఆ రెండిటితో కూడిన అసంతృప్తి.

    "బయట పడకుండా వుంటే, ఒకళ్ళనొకళ్ళు వంచించుకుంటూ ఆత్మవంచన చేసుకుంటూవుంటే - వాళ్ళు సుఖంగా వున్నట్లు, బయటపడే ధైర్యం ప్రదర్శిస్తే....నరకాన్ని వెదుక్కుంటున్నట్లు...."

    తనలో తను అనుకుంటున్నట్లు అంది భానుమతి. నేను మొగవాళ్ళనే తిట్టడంలేదు మాలీ! ఈ మాలిన్యం మనుషుల స్వభావంలోనే కరుడుగట్టుకుపోయింది. భర్తను గొప్పగా ప్రేమిస్తున్నాననుకునే ఆడది, అతను మరో ఆడదాన్ని గురించి ఆలోచించాడని తెలిస్తే అసూయతో భగ్గుమంటుంది. మరో ఆడదాని అందాన్ని పొగిడితే ఒళ్ళంతా దహించుకుపోతుంది. బయటపడినా ఇతర ఆడవాళ్ళ అందాలను అతను పరిశీలిస్తూ వుంటాడనీ, మనసులో ప్రలోభపడుతూ వుంటాడనీ, అవి చాలా సహజమైన బలహీనతలనీ, ఈ బలహీనతలు లేకుండా బ్రతికేమనిషి వట్టి బుకాయింపనీ అనుకునే కామన్ సెన్స్ వుండదు. చూట్టూ భయంకరమైన గిరులు, గీతాలు. ఊపిరి సలపనటువంటి ఆంక్షలు. అందుకే ఇద్దరిలో ఎక్కువభాగం ఒకరినొకరు గోప్యంగా అసహ్యించుకుంటూ వుంటారు. రహస్య జీవితాలకోసం ఆరాటపడుతూ వుంటారు. ఆ రహస్యాలు బట్టబయలు కాకపోతే తమది ఆదర్శదాంపత్యమని చెప్పుకుంటూ లోకంముందు ప్రగల్భాలు పలుకుతూ వుంటారు మాలీ! వింటున్నావా?"

    "ఊ!"

    "కానీ ఒప్పుకోవు. ఇంత జరిగినా ఒప్పుకోవు. నీకు కావల్సింది న్యాయం కాదు. ఏదోరకంగా మీ ఇద్దరి మధ్యా ఒప్పందం కుదరటం. ఖర్మంకాలి అతను నిన్ను క్షమిస్తే - నీ జీవితం ధన్యమైనట్లుగా భావిస్తావు. అవునా?"

    "భానూ! నువ్వే చెప్పావు, నేనో రకంగా మలచబడ్డానని."

    "సరే, లేచి స్నానంచెయ్యి."

                                          * * *

    రోజులు గడిచిపోతున్నాయి. ఈ జీవితంలో విచిత్రాలు ఎంత యదార్ధమో, వాటి తాలూకు నిజాయితీతో కూడిన బాధలూ అంతే యదార్ధం. నమ్మని విపరీతాలు, జరగటానికి కూడా సాధ్యమా అనిపించే వైపరీత్యాలు తరచు ఎక్కడో అక్కడ జరుగుతూనే వుంటాయి.

    మాలతికి రాత్రిళ్ళు అసలు నిద్రపట్టదు. పిచ్చెత్తినట్లు అటూఇటూ కడుల్తూనే వుంటుంది. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరుగుతాయి. "శేఖర్! నేను నాగురించి ఏడుస్తున్నాననుకుంటున్నావా? లేదయ్యా లేదు. నామీద నాకు ప్రేమ, మమకారం, నన్ను గురించిన భ్రాంతి ఏమీలేవు. నువ్వెలా వున్నావో అని, వంటరిగా ఆ ఇంట్లో ఎలా మసలుకుంటున్నావో అనీ నీగురించిన దిగులుతో చచ్చిపోతున్నాను. శేఖర్! నీతో జీవించాలన్న కాంక్షతీరక, ఆ తీరని కోరికతోనామీద అసహ్యాన్ని చంపుకున్తున్నాను. ఏం చెయ్యాలో తెలియటంలేదు. నీగురించి నాకు స్వార్ధమేం లేదు. నా ప్రేమను నువ్వు అర్ధం చేసుకుంటే ఒక ప్రాణి క్షోభ గుర్తించగలుగుతావు.                

 Previous Page Next Page