సశ్య క్షణంపాటు విజూషవైపు చూసి వెంటనే దృష్టి మరల్చి రుత్విని అడిగింది.
"అసలు పోటీనుంచి ఎందుకు విత్ డ్రా అయ్యాను?"
"ఓడిపోతానన్న భయంకాదు"
"ఓడిపోతేనే సశ్యకి అతడు భర్తగా అయ్యేది అన్న విషయం గుర్తుకొచ్చిన విజూష "మరెందుకు విరమించుకున్నారు?" అంది సాలోచనగా. "చాలా సమస్యలనుంచి గట్టెక్కాలని."
ఆ మాట అతడెందుకన్నదీ ఆ ఇద్దరికీ తెలీదు.
అయినా ఇద్దరూ అప్రతిభులై చూశారు.
ముందు క్లారిఫై చేసుకోవాలనుకున్నది సశ్య.
"కాస్త అర్దమయ్యేట్టు చెబితే సంతోషిస్తాను."
మృదువుగా నవ్వాడు రుత్వి.
"వక్షములు రెండు సర్వ ప్రపంచమునకు
కృష్ణపక్షమొక్కటే నాకు కేవలమ్ము
నీవే నిశ్చయమ్ముగా జీవితేశ్వరీ
నిదానంబ నీపై పరీత్యమునకు"
శివ శంకరశాస్త్రి కవిత చెప్పిన రుత్వి ఆ ఇద్దరినీ చూశారు మార్చి మార్చి.
"ఒక్క ముక్క అర్దమైతే ఒట్టు" అంది సశ్య.
"అమెరికాలో పెరిగినా ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా వుందని ఒప్పుకుంటున్నావు" అన్నాడు రుత్వి కావాలనే.
చివాలున రుత్వివేపు తిరిగింది.
కాలిపోకుండా కాపాడుకుంటున్న ఏ భాస్వరస్వప్నాలు అణువంత వేడెక్కాయో..... మనసు కాగితంపై ముత్యాలతో రాసుకున్న ఏ అక్షరాలు అసమాన ప్రభంజన తుఫాను ఎడారిలో రేణువుల్లా ఎగిరిపోయాయో ఆమె క్షణాలమీద విరామంలో నిశ్శబ్దమైంది.
మరుక్షణం తనేమిటో అన్నది విజూషకి అర్దమయ్యేట్లు చెప్పింది.
"నేను తెలుసుకోవాల్సింది ఎంతవున్నా నేనేమిటీ అన్నది నీకు తెలుసు రుత్వి.
అమెరికాలో పుట్టి పెరిగినదాన్ని మాత్రమే కావాలి అంటే ఓ లీడింగ్ లేడీ ఇండస్ట్రియలిస్టు కూతురిగా ఈ రాష్ట్రాన్ని ప్లాట్లు చేయించి కొనేయగలను కూడా."
సశ్య ఇలా రెచ్చిపోతున్నది ఖచ్చితంగా తనను ఉద్దేశించే అని అర్దమయిన విజూష తనూ తక్కువ కాదని నిరూపించుకోటానికి ఇంతకన్నా అవకాశం రాదనుకుందేమో.
"నీకున్నదే నీ గొప్పతనాన్ని నలుగురూ గుర్తించడానికి కొలబద్ద అనుకుంటే నేనూ తక్కువదాన్ని కాదు మిస్ సశ్య."
"యూ సీ మిస్!" సశ్య వారించబోతే అవకాశం లేదు విజూష.
"విజూష" ఆర్దోక్తిగా తన పేరు చెప్పింది విజూష.
"డాటరాఫ్ ది లీడింగ్ ఇండస్ట్రియలిస్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ ప్రసాదభూపతి.
ఎస్! అమ్మేవాడుంటే ఈ రాష్ట్రాన్ని నువ్వేకాదు నేనూ కొనేయగలను."
చప్పట్లు వినిపించడంతో ఇద్దరూ తలతిప్పి చూశారు.
సౌందర్యాల పంచ శరపంజరంలోనుంచి బయటికి వస్తున్న యువరాజులా నవ్వుతున్నాడు రుత్వి.
"మీ పరస్పర పరిచయాలు పూర్తయ్యాయి కాబట్టి యిక మామూలుగా మాటాడుకుంటే ఆనందిస్తాను.
"అవసరంలేదు రుత్వీ" అరిచింది సశ్య.
"నీకు కొత్తగా పరిచయమయిన విజూషనే ఆడపిల్లతో మామూలుగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అంతగా కావాలీ అనుకుంటే" ఉక్రోషంగా క్షణం ఆగింది.
"నాకన్నా నీకు ఆ పిల్లే ముఖ్యమనుకుంటే నువ్వు మాట్లాడుతూ కూర్చో"
వెళ్లబోయింది సశ్య.
అడ్డంగా నిలబడ్డారు రుత్వి.
ఒకవేళ ఆ క్షణంలో అతడు ఆపకపోతే సశ్య ఆ తర్వాత విజూషపై పగ తీర్చుకునేదో లేదో తెలీదుకానీ ముందు కళ్లనీళ్పపర్యంతం అయ్యేది.
ఖగోళమెత్తుకు పేర్చుకున్న ఏ ఆశల వటవృక్షాలో మండిపోతున్నట్టు ఆరాటపడుతూ వురేసుకున్న పూల సుగంధమై వూపిరి అందనట్టుట వుక్కిరిబిక్కిరయ్యేది.
"విజూష నాకు పరిచయమైంది నిన్నగాక మొన్న సశ్యా. ఆ విషయం నీకు తెలుసు " ఓదార్పులా అన్నాడు రుత్వి.
"కానీ జన్మజన్మల బంధం అన్నట్టు వెనకేసుకొస్తున్నావ్?" అంది సశ్య రోషంగా.
భావరహితంగా చూశాడు సశ్యవేపు.
పసిపిల్లలా అనిపించింది.
తన ఆకృతికి తనే అద్దంలా చూపిస్తూ అది కనిపించకూడని అహంకారపు చేతుల్ని అడ్డం పెట్టుకుంటున్నట్టుగా వుంది.
అసలు...........
విజూషని ఏ ఒక్క విషయంలోనూ సమర్దించలేక ఇలా ఎందుకు మాట్లాడుతూంది సశ్యం?
"ఇంత అసూయని ప్రకటించావూ అంటే నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో అర్దమైంది సశ్యా."
విజూష ఉలికిపాటుగా చూసింది ముందు.
అది గమనించిన రుత్వి వెంటనే అన్నాడు -
"నీలాగే నన్ను చాలామంది ఇష్టపడుతుంటారు కాబట్టి అందరిలో నువ్వూ ఒకదానివి నేను అననుకాని నేను యిష్టపడే అమ్మాయిగా మారడానికి ఎందుకు ప్రయత్నించవూ అని అడుగుతున్నాను?"
హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
కొసమెరుపు విరుపులాంటి మలుపు.
ఆశయాలు పుట్టలో దాగిన ఆ వాల్మీకినో బయటికి రప్పించే అవకాశం యిస్తున్న ఛాలెంజ్.
కోరుకున్న ఆడపిల్ల గుండె శబ్దపు సంగీతంలో ఆమె ఇకముందు వేసే ప్రతి అడుగూ సుమధుర సంగీతమై అతడ్ని వివశుడ్ని చేయాలీ అంటే ఏం చేయాలో చెప్పకుండా అతడు చెబుతుంటే.....