శారదాంబ సజల నేత్రాలతో అలాగే గోడకు అనుకొని కొంచెంసేపు శూన్యంలోకి చూస్తూ నిలబడింది. ఈ మధ్య ఆమెకు రోజులు ఇది వరకటిలా సామాన్యంగా, ఏమీ నవ్యత లేకుండా నడిచిపోవటంలేదు.
విషాదమైనవో, ఇంకేవో సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూ ఏనాటికైనా గుర్తుకు వచ్చేవిగా వున్నాయి. అటువంటి వాటిలో ఈ రోజు ఒకటి.
16
ఒక స్థలం మార్పే ఏమిటి? చుట్టూ తిరుగుతున్న మనుషులూ, మసులుతున్న పరిసరాలూ, కొన్ని కొన్ని సంఘటనలూ, సన్నివేశాలూ, ఏదీ కాకపోతే తన అంతరాత్మే తనను మార్చివేసేటట్లు చేస్తుంది.
ఈ పృథ్విలో ఒక రకం మనుషులు వుంటారు. వారు రెల్లుగడ్డిలాంటి వాళ్ళు. ఎటు గాలివేస్తే అటు వొంగుతూ వుంటారు. ప్రకాశరావు స్వతహాగా అటువంటి మనిషి కాకపోవచ్చు. కాని ఇప్పుడు తనకు తెలియకుండానే తను విచిత్రంగా మారిపోసాగాడు. ఇదివరకు గడిపిన జీవితమంతా ఒక నాటకంలాగ, బూటకంలాగ, కలగా, లీలగ, అసహ్యంగ, అనృతంగా కనిపించసాగింది. ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఇరవై రెండు సంవత్సరాలు ఏమీ సుఖం అనుభవించకుండా వృధా చేశానా అని వృధ చెందడం ప్రారంభించాడు. అట్లా అని యిరవై రెండు సంవత్సరాల పిదప మేలుకున్నాక అతననుభావిస్తూన్న సుఖమూ లేదు. అసూయతో బాధపడటం తప్ప, ఇది వరకు లేదు. ధనవంతుడ్ని చూస్తే అతనికిప్పుడు యీర్ష్య, క్రోధం ఇటువంటివన్నీ కలుగుతున్నాయి. "వాళ్ళకెందుకు వుండరాదు?" అన్న భావాలు కలుగుతున్నాయి. శకుంతలతో మాట్లాడుతున్నప్పుడూ, ఆమె యింట్లో సంచరిస్తున్నప్పుడూ చీటికీ మాటికీ తమ యింటి వాతావరణంతో పోల్చుకొని కుమిలిపోయేవాడు. ఇదివరకు తను ఏ విధంగా బట్టలు వేసుకున్నా, ఏ విధంగా ప్రవర్తించినా లెక్క చేయలేదు. ఇప్పుడు తన చిరిగిపోయిన చౌకబారు దుస్తుల్ని చూసి ఖేదపడసాగాడు. ఇంత ఖేదం అనుభవిస్తూనే అతను చేసిన సుకృతం యేమిటంటే తనని తాను ఎప్పుడూ ఎదుటివారి ఎదుట కించపరుచుకోలేదు. మరీ శకుంతలతో చనువుగా మాట్లాడుతున్నప్పుడు తప్ప తన భావాలను ఎప్పుడూ బయలపరుచుకొనలేదు.
ఇవాళ ప్రకాశరావు గదిలో వంటరిగా కూర్చుని వున్నాడు. ప్రయివేటు కుర్రాళ్ళు ఇంతకు ముందే వెళ్ళిపోయారు. ఇంతలో బయట టకటకమని బూట్ల చప్పుడు వినిపించింది. ఆ శబ్దం లోపలకు వస్తూండటం చూసి ప్రకాశరావు లేచి నిలబడ్డాడు. రామారావుగారు లోపలకు రావటంతోనే "కూర్చోండి" అన్నాడు.
ఆయన తొందరపడుతూ "ఆహఁ. టైమయిపోయింది నాకు. మీతో ఒక విషయం చెప్పిపోదామని వచ్చాను. ఇవ్వాళ్ళ రాత్రికి మనం ముగ్గురం కలిసి పిక్చర్ కి పోదాం" అన్నాడు.
ఈ మధ్య తండ్రి కూతుళ్ళు యెక్కడకు పోయినా యీ పరాయి వూరు, పరాయి కులం అబ్బాయిని తమతోబాటు తీసుకెళ్ళటం అలవాటు అయిపోయింది. ప్రకాశరావుకు ఇది యెక్కువగా ఇష్టంగాలేదు. కాని తప్పించుకో వీలులేకుండా వాళ్ళు చేస్తున్నారు.
"ఎందుకండీ. ఎప్పుడూ మీతో....."
"మాతో కాకపోతే మీరు ఇంకెవరితోనూ పోవటంలేదు కదా! అభ్యంతరం చెప్పకండి. సాయంత్రం నే వచ్చేసరికల్లా రెడీగా వుంటారుగా"
ప్రకాశరావు చేసేదిలేక అంగీకారంగా తల ఊపాడు. తర్వాత ఆయన లేచి టక్ టక్ మని చప్పుడు చేసుకొంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు.
అతను గట్టిగా శ్వాస తీసుకోకముందే "పంతులగారూ." అంటూ శకుంతల ప్రత్యక్షమయింది.
"చెప్పండి"
"ఈ రోజు నా పుట్టినరోజు."
ప్రకాశం కొంచెం విరక్తిగా "అంతులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. కొద్ది రోజుల క్రితమే నా పుట్టినరోజు కూడా చాలా మామూలుగా గడిచిపోయింది" అన్నాడు.
శకుంతల కొంచెం దెబ్బతిని "ఎంత పొరపాటు చేశాను? నాతో ముందుగా మాట మాత్రమైనా చెప్పకపోతిరే" అంది.
"చెప్పకపోతే ఏమైంది?"
"ఏమీ కాలేదు. చెబుతేనే అయ్యేది?"
"ఏమయేది? నేనేం చంటిపిల్లాడ్ని కాదుగా."
"కాకపోవచ్చు. కానీ పుట్టినరోజు పండుగ చేసుకోవడం అతి నాగరికత కాదు."
అటువంటివన్నీ ధనవంతులకు మాలాంటి బీదవాళ్ళకు యెట్లా సాధ్యమవుతాయి?" అని ప్రకాశరావు చప్పున అనేశాడు. నోరు జారాక బాధపడ్డాడు.
శకుంతల కొంచెం కోపంగా కలిగివుండి నాకందులో యేమీ సుఖం కనిపించడంలేదు. పైపెచ్చు సోమరితనం బాగా అలవడింది. ఇది యెట్లా మాపుకోవడమా అని చూస్తున్నాను" అంది. ప్రకాశరావు ఇలా మాట్లాడాక ఆమె అతన్తో తను చెప్పటానికి వచ్చిన విషయం చెప్పలేకపోయింది. మెల్లగా అడుగులువేస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆమెను గుమ్మం దాకా పోనిచ్చి ప్రకాశరావు పిలిచాడు. "ఆగండి."
శకుంతల ఆగింది.
"ఇటు చూడండి"
"శకుంతల అతనివైపు వింతగా చూసింది. ఒక్కక్షణం ఆమెవంక రెప్పపాటు లేకుండా చూసి, గట్టిగా నవ్వాడు. "పొరపాటు నాదే. అసలు ఇవాళ మీ వేషాన్ని గుర్తించవలసింది..... చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా? చెప్పేదేదో సాంతం చెప్పి మరీ వెళ్ళండి" అన్నాడు.
తన వేషభాషల్ని గురించి ప్రకాశరావు ఏనాడూ ఒక్కమాటన్నా అనలేదు. ఇవాళ క్లుప్తంగా, వ్యంగ్యంగావున్న అతని మాటలకు శకుంతల సిగ్గుపడింది.
"ఇవాళ మా ఇంట్లో లంచ్ కి రండి" అంది.
ప్రకాశరావు ఎక్కువ వాదించకుండా "అలాగే"నని వెంటనే ఒప్పుకున్నాడు. ఏదో మాటల్లో "కానీ ఇందాక మీ నాన్నగారు వచ్చి నాతో మాట్లాడినప్పుడు యీ విషయం ఎందుకు చెప్పలేదో" అన్నాడు.
"ఆయన యీ బాధ్యత అంతా నా మీదే వొదిలిపెట్టారు."
కొంచెం ఆలోచించి ప్రకాశరావు "సిగ్గువిడిచి ముందుగానే చెబుతున్నాను. మీ జన్మదిన కానుకగా ఈ బీదవాడు ఏమీ ఇచ్చుకాలేడు" అన్నాడు.
అతను యిలా అనటంలో యేదో బాధ ప్రస్పుటమవుతూందని ఆమె చాలా తేలికగా గ్రహించింది. ఇవాళేకాదు. ఈ విధంగా అతను బాధపడుతూ మాట్లాడటం ఆమె యీ మధ్య తరచు గమనిస్తూనే వుంది.
"మిమ్మల్ని భోజనానికి పిలిచి మీ దగ్గరనుంచి బహుమానాన్ని ఈ ధనికురాలు యేమీ ఆశించలేదు. తప్పు చేస్తున్నామనే బాధతో కాకుండా మనస్పూర్తిగా మా ఆతిధ్యాన్ని స్వీకరించమని అడుగుతోంది."
శకుంతల యీ మాటలు చాలా సున్నితంగా చెప్పింది. ఈ మాటలోని సొగసు అతన్ని ఆకర్షించగా అన్నాడు, "ఐతే ఇవాళ కాలేజీ ఎగవేయాలి అన్నమాట."
ఆమె నవ్వుతూ "నాకోసం మీరు ఇవాళ యెగచేసిన ఫరవాలేదు. కాని ఎవరి కోసమూ కాకుండా అనేక రోజులు మానినందుకు పశ్చాత్తాపపడి, ఇహముందు అటువంటి పొరపాట్లు చేయకుండా చూచుకోండి" అని పలికింది.
"మీ ఆజ్ఞ శిరసావహించటానికి ప్రయత్నిస్తాను."
శకుంతల వెళ్ళిపోతూంటే ముగ్ధడై చూస్తూ కూర్చుండి పోయాడు ప్రకాశరావు. ఎందుకనో తెలియదు. ప్రతి విషయంలోనూ ఆమె అతన్ని ఆకర్షిస్తూ వచ్చింది. ఇదివరకెప్పుడూ కలగని వినూత్న భావాలు యిప్పుడు ఆమెను చూస్తుంటే కలుగుతున్నాయి. అయితే అవి చౌకబారు భావాలు కావు. ఆమెను చూస్తుంటే కలుగుతున్నాయి. అయితే అవి చౌకబారు భావాలు కావు. ఆమెను తేలికదృష్టితో అతనెప్పుడూ చూడలేదు. శకుంతల సౌందర్యాన్ని గురించిగాని ఇదివరకెప్పుడూ కలగని వినూత్న భావాలు కావు. ఆమెను తేలికదృష్టితో అతనెప్పుడూ చూడలేదు. శకుంతల సౌందర్యాన్ని గురించిగాని అతను ఇదివరకెప్పుడూ తలపోయలేదు. కొన్ని రోజుల్నుంచీ ఆమె చాలా సౌందర్యవతి అన్న భావం అతనికి కలుగుతున్నా, ఎప్పుడు తనకు ఎదురుపడినా ఆమె అందచందాల్లోకి అభివృద్ధులు గమనించసాగాడు. చాలామందిలాగా శకుంతల అలంకరించుకోదని అతనికి తెలుసు. ఎక్కువగా అలంకరించుకోకుండా వుండటంవల్ల ఆమె అందంగా వున్నదని అతను భావిస్తూ వుండేవాడు. జన్మదినం నిమిత్తం అభ్యంగనస్నానం ఆచరించి వచ్చిన శకుంతల అతన్ని ఇవాళ మరీ ఆకర్షించి ఒక విధమైన గౌరవంతో అతని హృదయమంతా నిడిపోయింది.
రామారావుగారు ఇంటికి వచ్చేసరికి పన్నెండు దాటింది. శకుంతల నిరాడంబరత్వాన్ని భోజనాలవేళ ఇవాళ నాలుగోసారో, అయిదోసారో గ్రహించాడు ప్రకాశరావు. తన్నుకాక ఇంకా ఎంతమందినో స్నేహితుల్ని పిలుస్తుందని అతను మొదట అనుకున్నాడు. కాని ఆ అభిప్రాయం పొరపాటయింది. అతిధి తను వొక్కడే. అయినాకూడా రామారావుగారు అపూర్వమైన వాగ్ధాటివల్ల ఎంతోమంది వున్నట్లు చేసి, అలవాటు పడివున్న కూతుర్నీ ప్రకాశరావునీ చాకితుల్ని చేశారు.
భోజనాలు అయినాక పేకాట వేద్దామానుకున్నారు ఆయన. ప్రకాశరావు ఈ వూరువచ్చాక వాళ్ళదగ్గరే పేక ఆడటం నేర్చుకున్నాడు. మొదటి రోజుల్లో అతను గదిలో కూర్చుని చదువుకుంటూంటే, తండ్రీ-కూతుళ్ళిద్దరూ హాలులో కూర్చుని ఆడుకుంటున్నప్పుడు అతనేమీ పట్టించుకునేవాడు కాదు. కాని ఈ మధ్య వాళ్ళతో ఆటలు అలవాటయ్యాక చింతింపసాగాడు. అతని చదువుకు భంగం కలుగుతుందని వాళ్ళూ ఏ ఆదివారమో తప్ప పిలిచేవారు కాదు.
మొగవాళ్ళిద్దరూ యీవేళ ఆడపిల్లతో చిత్తుగా ఓడిపోయారు. అయితే ఆ యిద్దరిలో యెవరికీ ఉక్రోషం లేదు. మూడుగంటలకు పేక ముక్కల్ని బొత్తిపెట్టి పెట్టెలో పెడుతూ "యిహ" చాలు" అన్నారు రామరావుగారు. అప్పుడు మళ్ళీ కాఫీలు.
సాయంత్రం అయిదున్నర అయ్యేసరికి ముగ్గురూ తయారయి బయటికి వచ్చారు. కొంతసేపు బీచికి పోయి గడుపుదామనుకున్నారు. రామారావుగారు టాక్సీలో యెక్కి బీచికిపోయి, అక్కడ అరగంట కాలక్షేపం చేశాక సినిమా థియేటర్ కి టాక్సీలోనే వెళ్ళారు.
"అమ్మాయికి ఇంగ్లీషు పిక్చర్లంటే ఎక్కువ ఇష్టంలేదు. అయినా పాపం నా కోసం వస్తుంది" అన్నారు రామారావుగారు.
యువతీ యువకులు ఇద్దరిలో యెవరూ మాట్లాడలేదు.
ప్రకృతిలో వున్న చిత్రం ఏమిటంటే, చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక విషయంగానీ, విశేషంగాని ఇవాళో రేపో జరుగుతుందని ఆవేశపడుతూ ఆశాభంగంకూడా పొందుతుంటారు. అది ఏనాటికో ఎదురుచూచినట్లే జరిగాక "నిజంగా జరుగుతుందా?" అన్న భ్రాంతిగూడా కలుగుతుంది. కాని ఎదురుచూడని సంగతి ఆకస్మికంగా జరిగిపోయినప్పుడు ఏ భ్రాంతీ కలుగదు. బ్రతికి బాగుండి ఏనాడో విశ్రాంతితో కూర్చుని చర్వితచర్వణం చేసుకునే రోజునతప్ప, ప్రమోదాల విషయంకన్నా ప్రమాదాల విషయంలో యీ సూత్రం బాగా అన్వయిస్తుంది.
ఇంటర్వల్ అయి పదినిముషాలు గడిచాక హఠాత్తుగా రామారావుగారు రెండు చేతుల్తోనూ తలపట్టుకుని "అబ్బ! తల ఎందుకో తిరుగుతున్నట్లుగా వుంది" అన్నాడు దీనంగా.
అటూ- ఇటూ కూర్చున్న యువతీ యువకులిద్దరూ తెల్లబోయి ఆయనవంక ఒకేసారి చూశారు.
"ఏమిటి నాన్నా?" అని శకుంతల తడి ఆరిన గొంతుతో అడిగింది.
"తలలో ఏదోపోటుగా వుంది" అంటూనే అంత బలమైన మనిషి కుర్చీలో ఒక ప్రక్కకు వొరిగిపోసాగారు.
శకుంతల భయంతో వణికిపోతూ ప్రకాశరావు ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచింది. అతను మట్టుకు జవాబు ఏమని చెబుతాడు? అక్కడ యెక్కువగా మాట్లాడి ప్రక్కవాళ్ళకు విసుగు కలిగించడం ఇష్టంలేక "బయటకు పోదాం" అన్నాడు ఆమెతో. ఇద్దరూ చెరోవైపు బలమంతా ఉపయోగించి పట్టుకొన్నారు. ఆయన తెలివి పూర్తిగా తప్పిపోకుండా వుండటంచేత ఎలాగో తీసుకువచ్చి టాక్సీలో పడవేయటానికి యెక్కువ కష్టం కాలేదు.