తలమీద దెబ్బతో షాక్ లో వున్న రంజితని ఆ టైమ్ లో వత్తిడి చేయదల్చుకోలేదు. రెండ్రోజులు గడిచినయ్. రంజిత మామూలుగా అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఆ టాపిక్ తీసుకువచ్చాడు.
"రంజితా! ఆ రోజు టేప్ రికార్డర్ లో నువ్వేం విన్నావ్? ఆ మాటలు నాకు యధాతథంగా కావాలి".
ఆమె అతడివైపు అయోమయంగా చూసింది. "నాకు గుర్తులేవు".
"అలా అంటే కాదు రంజితా. గుర్తుకు తెచ్చుకో!"
"ఏదో కడుపున పుట్టటం- సైకోపాత్ ఇలాటివేవో వున్నాయి".
రంజితా! నీవు ఏకసంథాగ్రాహివి. ఆమాత్రం చెప్పలేవూ?"
ఆమె చప్పున అతడివైపు చూసింది. అతడు ఆమె దగ్గిరగా వచ్చాడు. ఆమెకు ప్రేరణ కలిగిస్తున్నట్టూ అన్నాడు- "పడవ, కాకి, షాడో, ఈగ, పెన్ను- ఇలా ఒకదానికొకటి సంబంధంలేని పదాల్నికూడా గుర్తుపెట్టుకోగల నువ్వు- ఒక నాలుగు వాక్యాలని గుర్తుంచుకోలేవంటే నమ్మకం కుదరటం లేదు నాకు. గుర్తు తెచ్చుకో రంజితా! నువ్వు ఒక్కొక్కటీ చెప్తున్నకొద్దీ నాకెందుకో అనుమానం ఎక్కువ అవుతూంది. గుర్తు తెచ్చుకో....తెచ్చుకో ప్లీజ్..."
ఆమె కళ్ళు మూసుకుంది. షాడో ప్రోత్సాహం ఇస్తున్నకొద్దీ ఆమెలో శక్తి పెరగసాగింది. సర్వశక్తులూ కూడగట్టుకుని ఆలోచించసాగింది.
మబ్బు పొరలు విచ్చుకున్నట్టు... వెలుగు బైటపడుతున్నట్టు-
ఆమె కళ్ళు మూసుకునే చెప్పటం ప్రారంభించింది. ఆమె మెదడులో ఎక్కడో పొరల క్రింద నిక్షిప్తమైన మాటలు ప్రవాహంలో బయటకి వచ్చినయ్!
"ముసలోడా... నువ్వన్నావే శాడిస్ట్ అని. నిజమే..." అంటూ చెప్పటం ప్రారంభించింది. "ఉస్సోక్ .... అవును ఉస్సోక్!!! ఉస్సోక్ ప్రభువైన కుట్టిసైతాన్ అష్టావక్రుడి రూపంలో ఈ భూమ్మీదకు రాబోతున్నాడు. మేమతడికి సాయం చేస్తాం. పుట్టగానే తల్లిని చంపుతాడు. పుట్టినరోజే తండ్రిని చంపుతాడు. పెద్దవాడై క్షుద్రుల సాయంతో రాజ్యం ఏలతాడు. ముసలోడా! నీ గుండె పేలిపోయే వార్త చెపుతున్నాను విను! ఆ అష్టావక్రుడు పుట్టేది నీ కూతురి కడుపునే..."
షాడో నిశ్చేష్టుడయ్యాడు.
ఈ మాటలు రికార్డయింది తన తండ్రి ముందు! బహుశా నిస్సహాయమైన పరిస్థితుల్లో ఆయన ఈ మాటలు రికార్డు చేసి వుంటాడు. అది కాదు అతడు ఆలోచిస్తున్నది-
తన చెల్లెలి కడుపునా పుట్టబోతున్నవాడి సంగతి!
అష్టావక్ర! అ....ష్టా....వ....క్ర!!!
- ఆ అష్టావక్రుడి పేరు ఇంతకుముందే ఎక్కడో విన్నాడు. ఎక్కడ? ఎ....క్క....డ?
అతడికి చప్పున జ్ఞాపకం వచ్చింది.
అవతార్ బాబా తన చెల్లెల్ని శపించేటప్పుడూ ఇదే పదం ఉపయోగించాడు.
నిఘంటువుల్లోతప్ప మామూలుగా దొరకని పదం- ఆ 'అష్టావక్ర' అన్నది. ఇక్కడ తండ్రి దగ్గిర- అక్కడ అవతార్ బాబా నోటివెంట ఒకేలా రావటం యాదృచ్చికమా- లేక వెనుక ఏదైనా వుందా?
తన తండ్రి ఈ విషయాన్ని రికార్డు చేసిన తరువాత ఎవరికీ చెప్పకుండా ఎందుకు టేప్ ని అలానే దాచి వుంచాడు. కూతురికి సంబంధించిన విషయంలో అంత నిర్లక్ష్యంగా వుండటానికి వీల్లేదు. కుట్టిసైతాన్ పేరు వినగానే ఆయన నానా కంగారు చేసి వుండాలి...అంతేగానీ తాపీగా బాత్ రూమ్ లోకి వెళ్ళి, తాపీగా స్నానం చేసి వుండడు.
...ఏదో స్పురించగానే అతడు వేగంగా ఇంటికి చేరుకున్నాడు.
తండ్రి మరణించినప్పటి నుంచీ ఇల్లు అలాగే వుంది. బాత్ రూమూ- విరిగిన తలుపులూ...
పోలీసు డిపార్టుమెంటు పెద్దగా శ్రద్ధ చూపించలేదు. అతడు తలుపులు పరీక్షించి చూశాడు. అతడి అనుమానం కరక్టే అయింది. వెనుక వైపు లోపలి గడియ విరిగిలేదు. నిజంగా నౌకరు తలుపులు బ్రద్దలుకొట్టి గానీ బాత్ రూమ్ లోకి ప్రవేశించివుంటే లోపల గడియ విరిగి వుండాలి కదా?
అతడు మరి ఆలస్యం చేయకుండా ఆ నౌకర్ల చిరునామాలు తీసుకుని వెతుక్కుంటూ బయల్దేరాడు. భవానీశంకరం మరణంతో అందరూ వెళ్ళిపోయారు. మొదటి నౌకరు అడ్రస్ దగ్గిర దొరకలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరూ చెప్పలేకపోయారు.
రెండో నౌకరు కూడా ఇల్లు ఖాళీచేశాడు. "ఎక్కడికి వెళ్ళి పోయాడో మీకు తెలుసా?" అని అడిగాడు. కొత్తగా ఆ ఇంట్లో అద్దెకు చేరినవాళ్ళని.
"తెలీదు" అన్నాడతడు.
"ఏదో ఊరి పేరు చెప్పాడండీ. ఉత్తరాలొస్తే వచ్చి తీసుకుంటాను వుంచమన్నాడు".
"ఏ ఊరు?" ఆతృతగా అడిగాడు షాడో.
"ఏ ఊరబ్బా... ఆ జ్ఞాపకం వచ్చింది... కృష్ణాపురం".
షాక్ తగిలినట్టయింది షాడోకి. కృష్ణాపురం అవతార్ బాబా వున్న ఊరు. తన చెల్లెలున్న ఊరు. ఆరుగురు వికృత శిశువులు పుట్టిన ఊరు...
అతడు తీగెలాగటం మొదలు పెట్టాడు, దాంతో డొంకే కదుల్తుందో- ప్రపంచపు భవిష్యత్తే కదుల్తుందో తేలటానికి పదిహేను రోజులు గడవాలి.
* * * *
ఆలోచన్లతోనే అతడు కృష్ణాపురం చేరుకున్నాడు. చెప్పాపెట్టకుండా అన్న అలా రావటంతో గౌరీ కంగారుపడి, "ఎలా వుందిరా రంజితకి" అని అడిగింది.
"తనకేం, శుభ్రంగా వుంది" అని కొంచెం సేపు సంభాషణ జరిపాడు.
ఆ తరువాత- ఆలోచిస్తూనే అతడు ఊరి చివరికి వచ్చాడు. అక్కణ్ణుంచే అవతార్ బాబా ప్రాంగణం మొదలవుతుంది. తిరిగి మళ్ళీ ముసిరే ఆలోచన్లు...
అతడి కళ్ళముందు చెల్లెలి రూపం కదలాడింది. అంతకుముందు ఆ గ్రామంలో పుట్టిన పిల్లల రూపాలు కదలాడాయి. నిజంగా అలాటి వికృత శిశువు పుడితే...
అలాటి ఆలోచనే భరించలేకపోయాడు.
ఎదురుగా బాబా ఆశ్రమం కనబడుతూంది.
చటుక్కున ఒక ఆలోచన స్పురించింది..
చాలా క్లిష్టమైన ఆలోచన! చాలా దూరంలో వున్న గమ్యం. బహుశా గురిగా తగలకపోవచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో అంతకన్నా ఇంకొక మార్గం లేదు.
అతడు ఆశ్రమం వైపు నడిచాడు.
శిష్యులు తప్ప ఇంకా భక్తులు అక్కడికి చేరుకోలేదు. ఇంకా బాబా దర్శన సమయం దగ్గిర పడలేదు.
అతడు అటూ ఇటూ చూశాడు. ఎవరూ తనని గమనించటం లేదని తెలుసుకున్నాక బొగ్గుతో గోడమీద కనీ కనబడనట్టు రాశాడు.
"ఉస్సోక్" అని.
21
డాక్టర్ రంగప్రసాద్ లోపలి గదిలోంచి బయటకు వచ్చాడు. లోపల లేడీ డాక్టర్ ఇంకా గౌరితో మాట్లాడుతూ వుంది.
"ఎలా వుంది?" అడిగాడు బయట కూర్చున్న సిద్ధార్థ.
"ఇంకో వారంరోజులు" అన్నాడు ప్రసాద్. ఆధునికమైన పరికరాల ద్వారా ప్రసవం సరిగ్గా ఏ సమయానికి వచ్చేదీ కనుక్కోగలుగుతున్నారు ఒక గంట అటూ ఇటూగా.
సిద్ధార్థ కాలెండరు చూశాడు. ఏడు రోజులు కలుపుకుని తేదీ చూస్తూ "సరీగ్గా అమావాస్య అన్నమాట" అన్నాడు.
ఈ లోపు లోపల్నుంచి లేడీ డాక్టరు వచ్చింది. రంగప్రసాద్ ఆమె నేదో అడిగాడు. సిద్ధార్థకి ఆ మెడికల్ పదాలు సరిగ్గా అర్ధం కాలేదు. కానీ లేడీ డాక్టర్ జవాబుని బట్టి ఏదో అవుతూందని గ్రహించి, ఆందోళనగా ప్రసాద్ వైపు తిరిగి, "ఏమిటి? ఏమయింది?" అని అడిగాడు.
"ఏమీలేదు కవలలు అని అనుమానంగా వుందంటుంది. డెలివరీకి పట్నం తీసుకువెళ్తే బావుంటుందా అని చర్చిస్తున్నాం".
ఈ లోపులో లోపల్నుంచి గౌరి వచ్చింది. ఆ సమయానికి సిద్ధార్థ "తప్పకుండా తీసుకువెళ్తాను" అంటున్నాడు. "ఏమిటి" అని అడిగింది గౌరి. సిద్ధార్థ చెప్పాడు.
గౌరి ప్రసాద్ వైపు తిరిగి, "ఎందుకు" అంది. అతడు జవాబు చెప్పబోయే ముందే సిద్ధార్థ అన్నాడు కల్పించుకుని, "అక్కడయితే మరింత సౌకర్యంగా వుంటుందని-" అని. తన జవాబు ఆమెని సంతృప్తిపరచలేదని గ్రహించి, "ఈ పల్లెలో అర్జెంటుగా ఏదైనా కావల్సి వచ్చినా దొరకదుకదా" అన్నాడు.
మొదటి సమాధానంతోనే కేదారగౌరి డాక్టర్ ప్రసాద్ వైపు తిరిగి, "వాట్ ఆర్ దోస్ ఫెసిలిటీస్ అండ్ టెక్నాలజీ దట్ యు డు నాట్ హావ్ హియర్?" అని అడిగింది. ఎప్పుడూ చాలా ఒద్దికగా, వినయంగా వుండే ఆ అమ్మాయి అతికష్టంమీద తన విసుగునీ, కోపాన్నీ దాచుకుంటూ వుందని ఆ మాటల్లో కొట్టిచ్చినట్టు కనబడుతూ వుంది.
ఆమె ప్రశ్నకి రంగప్రసాద్ తడబడ్డాడు. సిద్ధార్థ కల్పించుకుని, "డాక్టరుగారు కవలలేమో అని అనుమానపడుతున్నారు. అందుకే పట్నం అయితే బావుంటుందని" అన్నాడు.
"ఎంతమంది కవలలకి- అంతకన్నా కష్టమైన రూపురేఖలతో పుట్టినవాళ్ళకి ఈ ఆస్పత్రిలో జననం జరగలేదు".
సిద్ధార్థకి కోపం వచ్చింది. "అందుకే..." అన్నాడు. "అందుకే ఇక్కడొద్దు అంటున్నాను" అన్నాడు కాస్త స్వరం పెంచి.
గౌరి తాపీగా తలెత్తి భర్తవైపు చూసింది. తరువాత రంగప్రసాద్ వైపు తిరిగి, "మీరు ఈ ఆస్పత్రిలో డెలివరీ కేసు చేసి ఎంతకాలమైంది డాక్టర్" అని అడిగింది. సంబంధం లేని ప్రశ్నకి రంగప్రసాద్ ఏమీ సమాధానం చెప్పలేదు. కొత్తగా వచ్చిన లేడీ డాక్టర్ వీళ్ళవైపు చూస్తూంది. గౌరి చెప్పటం మొదలు పెట్టింది. ఒక ప్రవాహంలా మాటలు వచ్చినాయ్.
ఒకప్పుడు ఈ ఆస్పత్రి పేషెంట్లతో కిటకిటలాడుతూ వుండేది. డాక్టర్ గారి చెయ్యి తగిలితేనే చాలు అనుకునేవారు రోగులు. ఆ వత్తిడికి తట్టుకోలేక డాక్టర్ గారు మరో లేడీ డాక్టర్ ని సాయంగా కూడా తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు చూడండి. ఈ ఆస్పత్రి ఎలా వెలవెలా బోతూందో? ఒకరిద్దరుకన్నా ఎక్కువ లేరు. మొన్న మొన్నటివరకూ తండోపతండాలుగా వచ్చిన జనాన్ని ఈ రోజు రాకుండా ఆపుచేస్తున్నదేమిటి...? మూర్ఖత్వం! అవును. కేవలం మూ...ర్ఖ...త్వం!!! కడుపుతో వుండి అతి తొందర్లో డెలివరీకి సిద్ధంగా వున్నవాళ్ళు ముగ్గురూ ఈ పల్లె విడిచి వెళ్లిపోయారు. ఈ రోజు మనమూ వెళ్ళిపోదామని మీరంటున్నారు. దానికి "టెక్నాలజీ" అని రంగు పూస్తున్నారు. ఆత్మవంచన చేసుకుంటున్నారు. కానీ అసలు మనసులో కారణం అదికాదు. ఈ ఊరులో ఇప్పటికే ఆరుగురు వికృత శిశువులు జన్మించారు. మనకేమవుతుందో అని భయం. అవునా? అందుకే ఇక్కడొద్దు అంటున్నారు... ఏదీ చెప్పమనండి చూద్దాం... నిజంగా ట్విన్ డెలివరీ నిర్వహించలేని చిన్న ఆస్పత్రా రంగప్రసాద్ గారిదీ? మీరన్నట్టు ఇక్కడలేని ఆధునిక పరికరాలు పట్నం ఆస్పత్రిలో నిజంగా వున్నాయా? మీరు వున్నాయని నిజాయితీగా చెపితే, తప్పకుండా వస్తాను. కానీ లేవు. లేవని మీకూ తెలుసు. బ్రతికే బిడ్డ అయితే అక్కడా బ్రతుకుతాడు. ఇక్కడా బ్రతుకుతాడు..." అంటూ దగ్గిరగా వచ్చింది. "అన్నీ వదులుకొని ఈ పల్లెలో ప్రాక్టీసు పెట్టారు డాక్టరుగారు. బీదలకు సాయం చేయటం మొదలుపెట్టారు. దేవుడన్నారు ప్రజలు! దిగివచ్చిన దేవతలున్నారు రోగులు!! కానీ కథ కొద్దిగా మలుపు తిరగగానే, తుపాకీ దెబ్బకు ఎగిరిపోయిన పక్షుల్లా వెళ్ళి పోయారు. ఒకప్పుడు పెళ్లి పందిరిలాగా నిండుగా కళకళలాడిన నర్శింగ్ హోమ్ ఇప్పుడు ఒక్క పేషెంట్ లేక శ్మశానంలా మారిందంటే దానికి కారణం ఏమిటో మీకు తెలుసు" ఆమె కంఠం ఎందుకో రుద్ధమైంది. దృఢంగా అంది- "నేనీ ఆస్పత్రిలోనే పిల్లవాడిని కంటారు! అంతా నిర్మానుష్యం కానీ! నర్సులతో సహా అంతా భయభ్రాంతులై వెళ్ళిపోనీ! నేను మాత్రం పట్నం రాను. ఈ విశాలమైన ఆవరణంలో నేనొక్కతినే వుంటారు డాక్టరుగారూ! మీకు నమ్మకం కలిగించటానికి, మీకు తోడుగా ఒక నమ్మకాన్ని నిలబెట్టటానికీ నేను వుంటానండీ! పడిపోతున్న వాడిమీద మరో రాయి విసిరే ఈ జనం నుంచి 'నమ్మకాన్ని' రక్షించటం కోసం, తనవరకూ వచ్చేసరికి అప్పటివరకూ తను నమ్మినదాన్ని వదిలేసే మనిషి పిరికి తనాన్ని పొగొట్టటం కోసం నేనిక్కడే వుంటాను... ప్రపంచం అంతా ఎదురు తిరిగినా 'సరే' అంటూ వడివడిగా అక్కడినుంచి కదిలిపోయింది.