బహుశా ఒక్కగానొక్క కూతురు విషయంలో అతడు తీసుకున్న రిస్క్ ని ఇంకా జీర్ణించుకోలేకపోతూందేమో అసహనంగానే చూస్తూందతడ్ని.
"నన్నర్ధం చేసుకో సబితా...ప్లీజ్..."
హాస్పిటల్ నుంచి రిలీజైన తర్వాత కొన్ని గంటలుగా సబితలో ఇలాంటి మార్పుని స్పష్టంగా గమనిస్తున్నాడు.
"నేనేదో చరిత్రకోసం ఈ సాహసం చేయలేదు...తప్పనిసరైన ఒక బాధ్యత నన్ను ముందుకు నెట్టింది..."
"లల్లీ పసిపిల్ల" ఆర్దోక్తితోనే జవాబిచ్చింది. "మీ త్యాగనిరతిని అర్ధం చేసుకునే వయసుకాదు. కాబట్టే కొన్నిరోజులపాటైనా దాన్ని ఎక్కువగా దగ్గరకు తీసుకోమంటున్నాను." దుఃఖాన్ని నిభాయించుకుంటూ అంది. "కనీసం కొన్నాళ్ళపాటైనా ప్లీజ్...అర్దరాత్రి దాకా మీరు ఇంటికి రాకపోయినా మీతో కలిసే అన్నం తింటాననిమారాం చేసే లల్లీ ఇప్పుడు మీరంటేనే భయపడిపోతూందండీ..." అది కూడా కాదు. అయిష్టంగానే ఓ కాగితాన్ని అందించింది.
"ఆ స్థితిలో కూడా పదిగంటలదాకా మీకోసం వెయిట్ చేసింది. ఎల్లుండి తన పుట్టినరోజుకి ఎవరెవర్ని పిలవాలీ తన క్లాసు పిల్లలకి టీచర్లకి ఏమేం ప్రజెంటేషన్లనివ్వాలో మీతో చర్చించాలనీ అనుకుంటూ మీరు రాకపోయేసరికి తనే లిస్ట్ సిద్ధం చేసింది."
వచ్చీరాని అక్షరాలతో లల్లీ రాసిన పేర్లనీ ఇవ్వాల్సిన ప్రజెంటేషన్లనీ ఆమూలాగ్రం చూస్తున్న ప్రసన్న చూపులు చివరగా ఓ వాక్యం దగ్గర ఆగిపోయాయి. "డాడీకి నో ప్రజెంటేషన్... బేడ్ డాడీ..."
ఒకసారి కాదు పదిసార్లు అదే వాక్యాన్ని చదివాడు.
అమ్మతో మారాం చేసిన ప్రతిసారీ తన సపోర్టుతో సాధించుకునే లల్లీ దృష్టిలో ఆరోజు సంఘటనతో తనో శతృవైపోయాడు.
లల్లీ మనసులో నిక్షిప్తంగానైనా ఓ ముద్ర పడిపోయింది.
ఇదో అసాధారణమైన మార్పుకాదని అతడికీ తెలుసు. కాని ఆ పసిమనసులో ఏర్పడిపోయిన అణువంత ఏవగింపునీ మనసు జీర్ణించుకోలేకపోతూంది.
ఇది మాటలతో ఓదార్పునందించే సమస్యకాదు.
బిడ్డల్ని ఆపదలోనుంచి రక్షించాల్సిన ఒక తండ్రి కోరి తనే ప్రాణాంతకమైన ఆపదలోకి నెట్టినపుడు ఇంతకన్నా గొప్ప ఫలితాన్ని తను ఆశించలేడు.
నిస్త్రాణగా నిద్రపోతున్న లల్లీని చేరుకుని సమీపంలో కూచున్నాడు. ఏ మమతల వెల్లువ, ఉప్పెనై అతడ్ని కుదిపేసిందో అమాంతం లల్లీపైవాలి ఉద్విగ్నంగా చెంపలపై ముద్దు పెట్టుకున్నాడు.
లల్లీ కళ్ళు తెరవలేదు.
కాని ఇంకా చెరిగిపోని ఏ ఆందోళనో అదురుతున్న లల్లీ పెదవులపై స్పష్టంగా కనిపిస్తూంది. ఒకసారికాదు వందసార్లు మనసులోనే తన తప్పిదానికి క్షమార్పణలు చెప్పుకున్నాడు.
ఓ నీటిబొట్టు అతడి కళ్ళనుంచి రాలి లల్లీ ఫాలభాగంపై పడింది.
బడలికగా లేచి కిటికీ దగ్గరకి నడిచాడు "సబితా" ఆర్ద్రంగా పలికిందతడి కంఠం. " నా ఉద్దేశ్యం ఏదన్నాకాని నేను కూడని సాహసం చేశానని అంగీకరిస్తున్నాను. కాని ఒక్క విషయం...నేనూ తండ్రినే నాకూ లల్లీ అంటే ప్రేముంది... ఇది ఇప్పుడు కొత్తగా రుజువు చేసుకోవాల్సిన అగత్యం లేదనుకుంటాను..." గుండె గొంతుక్కడ్డం పడుతుంటే తేరుకోడానికి కొన్ని క్షణాల వ్యవధి అవసరమైంది. "ఐకాంట్ బేర్ దిస్ సబితా... షి మస్ట్ లవ్ మి ఏజ్ యూజువల్...లల్లీ నన్ను ఎప్పటిలాగే ఇష్టపడాలి. లల్లీ దృష్టిలో నేను మంచి డాడీగానే మిగిలిపోవాలి. యస్...నిజమే...నా మనసేమిటో ఏస్థితిలో అలాంటిదారుణం నేను చేసానో తెలుసుకునే వయసు కాదు కాబట్టే..." సబితవేపు తిరిగి అన్నాడు స్థిరంగా. "నా దినచర్యల్లో ఇకనుంచీ మార్పును పాటిస్తాను... ఎన్ని పనులున్నాసరే లల్లీకోసం తప్పనిసరిగా రోజూ కొన్ని గంటల్ని కేటాయిస్తాను. ఇది నిజం. ముందుగా లల్లీ వూహించనంత గొప్పగా దాని బర్త్ డే పార్టీ అరేంజ్ చేస్తాను. ఈ పుట్టినరోజుపండగ అది జీవితంలో మరచిపోలేనంత గ్రాండ్ గా అన్నీ నేనే దగ్గరుండి ఆర్గనైజ్ చేసి ఆ తర్వాత ఓ వారంరోజులపాటు శలవు పెట్టయినా మిమ్మల్ని ఎక్కడికన్నా తీసుకువెళతాను..."
ప్రసన్న ఇంకా మాట్లాడుతూనే వున్నాడు.
సరిగ్గా అప్పుడు ఫోన్ రింగయింది.
నిన్నగాక మొన్నటిదాకా జంటనగరాలను కల్లోలపరిచిన బ్లాక్ మాంబా ముఠాని పట్టి బంధించడానికి తీసుకోవలసిన సత్వర చర్యల గురించి చర్చించాక వచ్చింది కొన్ని నిముషాల క్రితమే.
అసహనంగా రిసీవర్ని అందుకున్నాడు.
"కమీషనర్ ని మాట్లాడుతున్నాను..."
ఇలాంటి వేళలో స్వయంగా ఆయనే మాట్లాడటం ప్రసన్నని నిశ్చేష్టుడ్ని చేసింది. "ప్రసన్న స్పీకింగ్ సర్"
"మళ్ళీ బ్లాక్ మాంబా రంగంలోకి దిగాడనుకుంటా...బేగంపేట పార్కులో ఓ కస్టమ్స్ ఆఫీసర్...ఆ ప్రాంతంలోనే మరో చైల్డ్ పాముకాటుతో చనిపోయారు. బాడీస్ హాస్పిటల్ కి తరలించబడ్డాయి. కమ్ సూన్..."
ముగిసిందనుకున్న కథ పునరావృతమైంది.
కొన్ని క్షణాలక్రితమే భార్యకి చాలా చాలా మాటిచ్చిన ప్రసన్న డిప్యూటీకమీషనరాఫ్ పోలీస్ ఇప్పుడామెను సూటిగా చూడలేకపోయాడు.
ఊపిరందని మరో సంగ్రామంలో అడుగు పెడుతున్నానని తెలుసుకోని ప్రసన్న వెంటనే బయలుదేరాడు.
అప్పుడు సమయం రాత్రి పదకొండున్నర కావస్తూంది.
* * * *
మృత్యువు నివాసమేర్పరుచుకున్న స్మశానంలా చీకటినగరాన్ని కప్పినవేళ.
రాబంధును ఎదుర్కునే పావురంలా ఓ కారు సిటీ పొలిమేరలవేపు దూసుకుపోతూంది.
దెయ్యాల్లా తలలాడించే చెట్ల మధ్యనుంచి సాగివస్తున్న ఈదురుగాలి కారు నడుపుతున్న శృతిని తాకి సడలిపోతున్న మనో నిబ్బరాన్ని గ్రహించి ఉగ్రంగా వెనక్కి జారిపోతూంది.
హెడ్ లైట్స్ కాంతిలో కనిపించే నల్లని తార్రోడ్డు నిశ్శబ్దంగా ప్రాణిని మింగే కొండచిలువలా విస్తరించి ఆమెలోని ఆరాటాన్ని ఉధృతం చేస్తూంది.
కారువేగాన్ని పెంచింది.
ఆమెకి తెలుసు ఇప్పుడు తను ఒక మృత్యువుకోనలోకి అడుగుపెడుతున్నట్లు. ఒకవేళ శత్రువు ఏ షరతూ విధించకపోతే పోలీసుల సహాయాన్ని కోరకపోయినా కనీసం జయేంద్రని తోడుగా తీసుకువచ్చేది కాని ప్రత్యర్ధి బలవంతుడు మాత్రమే కాదు. అనుకున్నది అక్షరాలా జరిపించగల సమర్ధుడు.
సరిగ్గా అదే ఆమెను భయపెట్టిందీ భయంగానైనా ముందుకు నెట్టింది కూడా...
జయేంద్ర నిలదీసినా వాస్తవాన్ని దాచింది. అతడు నిద్రపోవాలని కోటిదేవుళ్ళకి మొక్కుకుంది. ఇప్పటిలా అనుకున్న సమయానికే గమ్యాన్ని చేరుకుంటుంది.
డాక్టర్ సంఘమిత్రని ఎందుకు అపహరించుకుపోయిందీ ఆమెకు తెలుసు.
కాని తప్పనిసరిగా అదే జరిగి ఉంటుందని గట్టిగా నమ్మింది. లేనివాడు ఎంత దూరానవున్నా పాముల మూలంగా జంటనగరాలలో జరుగుతున్న సంఘటనలకి ఆయనా కలవర పడేవాడు...వెంటనే తిరిగి వచ్చేసేవాడు.
ఈ క్షణానకూడా ఆమె కోరుకుంటున్నది తను ఆపదలో చిక్కుకోకూడదని కాదు. కాని జన్మనిచ్చిన తండ్రెవరు తెలీని తనకు ఇన్నాళ్లూ బాసటగా నిలిచిన డాక్టర్ సంఘమిత్ర ఏ ఆపదా లేకుండా బయటపడాలని...
ఆమె ఆలోచనలనుంచి తేరుకుంది లైట్ల కాంతిలో కనిపించిన మైలురాయిని చూస్తూ...
అదే ప్రత్యర్ధి తెలియజేసిన సంకేత స్థలం...
కారుని ఓ వారగా ఆపింది.
చుట్టూ గుండెలదిర్చే నిశీధి...అంతకుమించి ఒంటరితనం...
పొదల్లోంచి కీచురాళ్ళ రొద భయానకంగా వినిపిస్తూంది. ఆమె వయసులో వున్న ఏ అమ్మాయికన్నా ధైర్యంతో శృతి తీసిపోనిదైనా కారు దిగుతుంటే శరీరం సన్నగా ప్రకంపించింది.
పరిసరాలలో ఎలాంటి అలికిడీ లేదు.
చేతికున్న ఇల్యూమినస్ రిస్ట్ వాచీ చూసుకుంది.
సరిగ్గా పన్నెండుగంటల రెండు నిముషాలు...
ఏమైంది...
ఎవరూ రారేం...
వెనక్కి తిరిగింది.
దూరంగా వెన్నెల రేఖలు అద్దినట్టు సిటీ విద్యుద్దీపాల కాంతులు అస్పష్టంగా కనిపిస్తున్నాయి.