నేనాలోచిస్తుండగానే కోమలి అవతల వైపు వెళ్ళి తలుపు వేసుకుంది. తర్వాత ఇద్దరాడవాళ్ళ మాటలూ కొద్ది క్షణాలు వినిపించాయి.
ఆపైన నా బుర్ర పనిచేయడం మానేసింది.
నెమ్మదిగా ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఇంటికి తాళం వేశాను. స్కూటర్ స్టార్టు చేశాను.
అత్తయ్యగారింటికి వెడుతున్నాను నేనిప్పుడు.
O O O O
కోమలి చెప్పిన మాటల్లో అబద్దం లేదు.
అత్తయ్యగారికి వంట్లో బాగుండక పద్మిని వారింటనే ఉండిపోయింది. నేను మాత్రం భోంచేసి రాత్రికి మళ్ళీ మా యింటికి వచ్చేశాను.
వాళ్ళింట్లో నాకు నిద్రపట్టదు.
సుమారు తొమ్మిదింటికి నేను ఇల్లు చేరానేమో తలుపు తాళం తీస్తూండగా డాక్టర్ విలాస్ వచ్చి నన్ను పలకరించాడు.
"ఏమిటి విశేషం? ఇంట్లోని వారంతా ఏమయ్యారు?"
అతడికింట్లోని వారిమీద దృష్టి ఉన్నదని నాకు తెలుసు. చిరాకును బయల్పరచకుండా క్లుప్తంగా వివరంచెప్పాను.
"అయ్ పిటీయూ! ఈరోజు ఏకాంతశయనం అన్నమాట" అన్నాడతను.
నాకామాటలు నచ్చలేదు. అలాగని పైకి అందామంటే మళ్ళీ నార్తిండియన్, సౌతిండియన్ పోలికలు తీసుకుని వస్తాడేమోనని భయంవేసి ఊరుకున్నాను.
అతడు నాతోటే లోనికి వచ్చాడు.
"సరదాగా స్లెయిడ్స్ చూద్దామా?" అన్నాడు నాతో నెమ్మదిగా.
"స్లెయిడ్స్ ఏమిటి?" అన్నాను.
"ఫారిన్ నుంచి తెచ్చాను చూడాల్సినదే! ఇంట్లో వేద్దామంటే మా ఆవిడ ఒప్పుకోదు. ఎప్పుడైనా చూడాలని ఉంటుంది" అన్నాడు విలాస్.
"ఏం స్లెయిడ్స్?" అన్నాను.
"మీ ఇంట్లో మీ ఆవిడ లేదుగా" అన్నాడతను.
"అయితే?" అన్నాను.
"అలా కూర్చోండి" అన్నాడు. కొద్దిక్షణాల్లో తనింట్లోకి వెళ్ళి ఓ చిన్న స్లెయిడ్ ప్రొజక్టర్ తో వచ్చి "ఎన్నోలేవు. ఇరవై వున్నాయి" అన్నాడు.
నా కేమీ అర్ధం కాలేదు కానీ ఏదో తిరకాసుందనిపించింది.
డాక్టర్ విలాస్ ప్రొజక్టుచేసి ఆ స్లెయిడ్స్ చూపించాడు.
నాకు మతిపోయినట్లయింది. పోర్నో గ్రఫీ గురించి వినడమే కానీ దూరంగా ఉంటాను నేను. ఎప్పుడూ చూడలేదు.
ఆ స్లెయిడ్స్ చూసి షాక్ తిన్నాను.
స్త్రీ పురుషులు ఫోటోగ్రాఫర్ల ముందు అంత దారుణంగా సిగ్గు విడిచి ప్రవర్తించగలరన్నది నా ఊహకుకూడా అందని విషయం.
"ఎలా ఉన్నాయ్?"
"షాక్!" అన్నాను.
విలాస్ నా భుజం తట్టి "స్లెయిడ్సు కే షాక్ అంటే ఎలా? ఎప్పుడూ బ్లూ ఫిల్మ్ చూడలేదా? నేనై తే బ్లూఫిల్మ్ లేం కర్మ...లైఫ్ షోసే చూశాను" అన్నాడు.
నేను మాట్లాడలేదు. డాక్టర్ విలాస్ నాకు అన్నీ వివరంగా చెబుతున్నాడు.
నాకు వినాలని లేదు. కానీ వింటున్నాను.
మసి బొగ్గును తెలుపు చేయాలంటే ఎంత కష్టమో! కానీ తెలుపును నలుపు చేయడానికి ఒక్క బొగ్గురేణువు చాలు.
నా మనసు కలుషిత మవుతున్నది. విలాస్ చూపిన బొమ్మలు చెప్పే కబుర్లు నా మనసునెక్కడికో తీసుకుని పోతున్నవి.
నన్ను నేను నిగ్రహించుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.
విలాస్ నవ్వుతూ, "ఇలాంటి అవకాశం కోసమే నేనూ చూస్తున్నాను ఇన్నాళ్ళకు మీరు దొరికారు. నా వద్ద మంచి ఆల్బమ్స్ వున్నవి. రేపుదయం చూపిస్తాను. అవి చూశారంటే మీకు నిద్ర పట్టదు అందుకే ఇప్పుడు చూపించను..." అన్నాడు.
అతను వెళ్ళిపోయాడు ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు.
నాకు మధ్య మధ్య కోమలి హెచ్చరికలు గుర్తుకు వస్తున్నాయి. విలాస్ ముందు నాతోనే ప్రారంభిస్తాడన్నదామె.
కానీ, ఆమె హెచ్చరికలను మించి పిలుపు ఎక్కువగా వినబడుతున్నది నాకిప్పుడు.
కోమలి రెండు చేతులూ చాపి_"రామం__రావూ" అంటున్నది నేను ఆమె ముందు నిలబడి వున్నాను. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను.
నాలోంచి గోపీ, రఘు వచ్చి ఎదుట నిలబడ్డారు.
"మూర్ఖుడా! కోమలి నిన్ను కోరి వచ్చింది. బంగారం లాంటి అవకాశం పాడు చేసుకోవడమే కాక_ఒకజ అందమైన ఆడపిల్ల మనసు కష్టపెట్టావు ఇందుకు నిన్ను దేవుడు క్షమించినా-ఆఖరికి ఆ కోమలే క్షమించినా-నేను మాత్రం క్షమించను..." అంటున్నాడు గోపీ.
"నీ పేరు సార్ధకం చేసుకో. ఇంత వరకూ నువ్వు సాధించిన విజయం సామాన్యమయినది కాదు. నీ నిగ్రహం అనితరసాధ్యం. నిన్ను నేనభినందిస్తున్నాను. కీపిటప్..." అంటున్నాడు రఘు.