"మనిషి మంచితనం చూడాలిగాని శరీరసౌందర్యం ముఖ్యం కాదు. ఈ అందం ఇవాళ్ళుండి రేపు మాసిపోయేది. నువ్వైనా పెళ్ళయ్యి ఇద్దరు పిల్లల తల్లివయ్యావంటే ఈ అందం వుంటుందా?" అంది తల్లి.
"అలా అని నీ కూతుర్ని ఏ కోతికో కడతావన్నమాట."
"అంత మాట ఎందుకంటావుగాని నీ కిష్టమైతేనే చేసుకో! లేకుంటే లేదు. బలవంతంగా నీమెడలు విరిచి చేయడానికి మేం కన్నవాళ్ళమేగాని , కసాయివాళ్ళం కాదు" శారదమ్మ రుసరుసలాడుతూ వంటింటి వైపు వెళ్ళిపోయింది.
"మీ అమ్మమాటే నాదీ అయినా నువ్వు పరిస్థితుల్ని అర్ధం చేసుకొంటావనే నా నమ్మకం" అన్నాడు వేదప్రకాశం మెత్తటి కత్తి మెడమీద పెడుతున్నట్లుగా.
భ్రమరకు మనస్సంతా చిరాకుగా తయారైంది. తను గట్టిగా వద్దంటే ఈ సంబంధం తప్పిపోతుంది. కాని, అమ్మా నాన్నా నొచ్చుకొంటారు. మళ్ళీ మరో సంబంధం వచ్చినా అందగాడే వస్తాడని గ్యారెంటీ ఏమిటి?
సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు భ్రమర దేవుడిముందు చేతులు జోడించి ఆంజనేయా! నిత్యం నీ సన్నిధికి వచ్చి పూజిస్తున్నది. , నీ గుడి చుట్టూ ప్రదక్షిమం చేస్తున్నది నీ రూపంలో వరుణ్ణి ప్రసాదించమని కాదు. అమ్మ, నాన్న మనసు నొచ్చుకోకుండా ఎలాగైనా ఈ సంబంధం తప్పిపోయేలా చూడు!" అని ప్రార్ధించింది.
శిఖామణి సెఠగోపం పెట్టి తీర్ధప్రసాదాలిచ్చి, "ముఖమలా చిన్నబుచ్చుకొన్నావేమమ్మా, భ్రమరాంబికా!" అడిగాడు.
"ఏం లేదు తాతయ్యా!"
"ఈరోజు ఏదో పెళ్ళి సంబంధం వచ్చిందని, పెళ్ళిచూపులు అయ్యాయని విన్నాను. పెళ్ళికొడుకు అందంగా లేడా ఏం?"
"ఆ......! ఈయనలా వున్నాడు! నా పూజలకు, ప్రదక్షిణలకు మెచ్చి ఆరూపంలో సాక్షాత్కరించాడీయన" కినుకగా గర్భగుడిలో విగ్రహం కేసి చూపింది భ్రమర.
వెంటనే ఫక్కుమన్న నవ్వు వినిపించింది.
అది ముందుకాదు, వెనుక.
భ్రమర గిర్రున వెనుదిరిగి చూసింది.
వికాస్ బాబు!
విలాసంగా ఓ ప్రక్కకి ఒరిగి, చేతులు కట్టుకొని పొడుగ్గా నిలబడివున్నాడు. మెడలో బైనాక్యులార్.
అంత త్వరగా తనకి పెళ్ళి చేసి పంపేయాలని అమ్మ, నాన్న హడావిడి పడడానికి కారణం ఈ మహానుభావుడు కదూ? పైగా వరుడు వానరావతారంలో వచ్చాడని నవ్వుతున్నాడా? అంత సంబరమనిపించింది కాబోలు.
భ్రమరకు వళ్ళు మండిపోయింది. "గొడ్డుకోదెబ్బ. మనిషికోమాట అన్నారు" అంది పదునుగా.
"నన్నేనా ఆ తిట్టింది?" ముఖంలో మాయని నవ్వుతో అడిగాడు వికీ.
"సిగ్గు లేకపోతేసరి"
"అది కూడా నన్నేనా?"
"ఈ వేట ఆపకపోతే తగిన బుద్ది చెప్పాల్సి వస్తుంది."
"వేటా? నా చేతుల్లో తుపాకీ గిపాకీ ఏం లేదే! నేనొచ్చింది గుడికి! వేటకికాదు"
"అమాయకత్వం నటించకండి! మీ వేటకి ఆయుధాలక్కరలేదు. ఆయుధాలక్కరలేకుండానే చక్కగా వేటాడగలరు! అది మీకు వెన్నతో పెట్టిన విద్య!"
"నాకు తెలియనివి నేర్పేట్టున్నారు భ్రమరగారూ!"
తెల్లబోయింది భ్రమర. "నేను మీకు నేర్పుతున్నానా?"
"మళ్ళీ మళ్ళీ పొడుస్తూ, గుర్తుచేస్తూ నాలో ఆ ఊహల్ని ప్రవేశపెట్టేట్టున్నారు."
అతడలా త్రిప్పికొట్టగలడని ఊహించని భ్రమర తెల్లబోయి చూసింది.
"మీకు ఇదివరకే చెప్పాను కదూ చినబాబూ భ్రమర జోలికి రావద్దని! ఆమెను అల్లరిపెడ్తే మీకేమొస్తుంది?" అన్నాడు శిఖామణి.
"మీరు లేనివి ఊహించుకొంటున్నారు పూజారిగారూ! ఆమెను అల్లరి పెట్టానని చెప్పడానికి ఒక్కటి చెప్పండి. నేను గుడికి వచ్చాను. ఇద్దరి లక్ష్యం స్వామి దర్శనం. అయితే ఆమె భక్తితో రావచ్చును. మేం బంగళాలో ఏం తోచక ఇలా చల్లగాలికని రావచ్చును! ఈ దేవుడు అందరివాడే కదా? ఈ గుడి అందరిదీ కదా! ఎవరైనా రావచ్చును పోవచ్చును కదా?"
"భక్తులైన వాళ్ళు ఎవరైనా రావచ్చును! పోవచ్చును!
విస్మయంనుండి తేరుకొని, పూజాద్రవ్యాలున్న బుట్ట అందుకొని, "వస్తాను తాతయ్యా!" అని కదిలింది భ్రమర.
ఇక అతడి జోలికివెడితే "నువ్వే నా చుట్టుపడుతున్నావు! నన్ను రెచ్చగొడుతున్నావు! అనేట్టున్నాడు. రాచబిడ్డకదూ? ఇక్కడ అక్కడ చదివాడా? లండన్ లో చదివాడు. అతడి తెలివితేటలు, మాటల చాతుర్యం సామాన్యంగా వుంటే ఆశ్చర్యంకాని, అసామాన్యంగా వుంటే ఆశ్చర్యం ఏముంది?
* * *
మరునాడు శనివారం.
శనివారం ఆంజనేయస్వామికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి.
ఎర్రగా సింధూరం పూసి, భక్తులు వెండితో చేయించిన కళ్ళు, మీసాలు, కిరీటం పెట్టి గుడిని అలంకరిస్తారు. ఆకు పూజచేసి , తులసి మాలలు , పూలమాలలు నిండా వేస్తారు. శనివారం రోజు గొప్ప కళతో పెరిగిపోతుంటాడు ఆంజనేయస్వామి.
భ్రమర చెల్లెలు సంగీతతో కలిసివచ్చింది సాయంత్రం.
ప్రదక్షణాలు ముగించి, తీర్ధప్రసాదాలు తీసుకొంటూ అన్యమనస్కంగా వెళ్ళిపోతున్న భ్రమర.
"ఏమిటమ్మా? ఈ రోజు స్వామిని నీ పాటలతో అలరించవా? అప్పుడే వెళ్ళిపోతున్నావెందుకు? అన్నాడు శిఖామణి.