అంతలో పండిత్ జవాబు చెప్పేడు. "మనిషి మెడ దగ్గర 37 గ్రాముల రేడియో ఆక్టివ్ ఐసోటోపు ఫ్లూటోనియమ్ 239 ఆక్సైడ్ అమర్చడం ద్వారా, మెదడుని కంప్యూటర్ ద్వారా కంట్రోల్ చెయ్యవచ్చునని."
"ఎవరు కనుక్కున్నారు?"
"భారతదేశపు ఒక డాక్టర్ డాక్టర్ సన్యాల్."
"ఆపరేషన్ విజయవంతం అయిందా?"
"అయింది"
"అంత నిశ్చయంగా ఎలా చెప్పగలరు?"
"కేవలం నేనొక్కణ్ణే ఆ సమయంలో డాక్టర్ సన్యాల్ తో వున్నాను కాబట్టి -ఆ రహస్యంగా జరిగిన ఆపరేషన్ కి నేనొక్కణ్ణే ప్రత్యక్షసాక్షిని కాబట్టి......."
"మీరీ విషయం అందరికీ ఎందుకు చెప్పలేదు?"
"చెప్పినా ఎవరూ నమ్మరు కాబట్టి - డాక్టర్ సన్యాల్ చనిపోయాడు కాబట్టి"
"ఇంతకీ ఏమిటా ఆపరేషన్? ఎవరికి చేశారు?"
"టప్ టపా టప్ అని ఎప్పుడూ అరుస్తూ తిరిగే ఓ పిచ్చివాడి మెదడుని కంప్యూటరైజ్ చేసి సరిచేసేం"
అబ్రకదబ్ర చేతిలో గ్లాసు జారి నేలమీద పడి భళ్ళున బ్రద్ధలయింది. అతిధులందరూ అతడివైపు తిరిగి చూసేరు.
అబ్రకదబ్ర నిశ్చేష్టతతో స్థాణువై నిలబడి వున్నాడు. అతడి పెదవులు అస్పష్టంగా కదిలినయ్...... "టప్ టపా టప్ అని అరుస్తూ తిరిగే పిచ్చివాడా!"
11
"మీకు నిజంగా అద్బుత శక్తులున్నాయి" అన్నాడు దార్కా.. సిద్దేశ్వరి నవ్వింది.. "నీ శక్తులతో పోల్చుకుంటే నావి చాలా చిన్నవి దార్కా. అందుకే మనిద్దరం కలిస్తే ఈ ప్రపంచంలో ఇంక ఏ శక్తి మనల్ని ఓడించలేదు."
"నా ఆశయం వేరు" అన్నాడు దార్కా.
"ఏమిటి నీ ఆశయం?" అని అడిగేడు చక్రవర్తి దార్కా చెప్పబోతూ వుంటే సిద్దేశ్వరీ చేత్తో ఆగమని సైగచేసి, దార్కా వైపు తిరిగింది.
"నాయనా, దేవి మహత్తుతో నీ ఆశయం కనుక్కోగలను నేను. దాన్ని సాధించడం ఎలాగో కూడా చెప్పగలను. అలా కూర్చో -నీ ప్రశ్నవ్రాయి."
దార్కా పొడవాటి బల్లకు ఒక చివర కూర్చొన్నాడు. కాగితం మీద ప్రశ్న వ్రాసేడు.
"కాద్రాని చంపిన ముగ్గురు వ్యక్తులు ఎవరు?"
బల్లకి అటుచివర్న కూర్చొన్న సిద్దేశ్వరి పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది. "తులసి కోసం కాద్రాని చంపిన ముగ్గురు వ్యక్తులు వివరాలూ నీకు కావాలా నాయనా" అని అడిగింది.
దార్కా అప్రతిభుడయ్యాడు.
తను ప్రశ్న వ్రాస్తుండగానే ఆ చివర కూర్చున్న ఆమెకి అది ఎలా తెలిసింది?"
"నీకు తులసి చిరునామా కావాలా నాయనా"
ఈమె తనకి ఆ చిరునామా ఇవ్వబోతూందా? తన ఇన్నాళ్ళ ఆశయం నెరవేరబోతూందా? ఉద్వేగంతో అతడు లేచి నిలబడ్డాడు.
సిద్దేశ్వరి చక్రవర్తి వైపు కళ్ళతో సైగ చేసింది. చక్రవర్తి ఒక రిజిష్టరు పుస్తకం తీసుకొచ్చి బల్లమీద వుంచి తెరిచేడు.
దార్కా ఆత్రంగా పేజీలవపు చూసేడు. విరాళాలు, దాతల పేర్లు చిరునామాలు వున్నాయి అందులో.
రూ.216, తులసి, అని చదవగానే పుస్తకాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కణ్నుంచి తినబోతున్న తాయిలం జారిపోయిన పిల్లవాడిలా వున్న దార్కా పరిస్థితి గమనించినట్టు సిద్దేశ్వరి చిరునవ్వుతో "ఆ తులసి వివరాలు చిన్న కాగితం మీద వ్రాసిస్తాడ్లే నాయనా. దానికి తొందరేముంది? ముందిది చెప్పు. ఆ తులసి ఎవరో నీకెందుకు" అంది.