Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 30


    "ఆహా....! అంతటి శక్తి మంతుడివన్నమాట! చూడటానికి చాలా మామూలుగా వున్నావు...." సూదుల్లాంటి చూపులతో స్వామిని నిలువెల్లా చూసాడు.    

    "ప్రస్తుతం రాష్ట్ర మంతటా  ఖజానా ఖాళీగా వుంది. నీకొచ్చిన విద్యను ఉపయోగించి నింపొచ్చుకదా!"

    అతడి వ్యంగ్యాన్ని పట్టించుకోలేదు.

     "ప్రస్తుతం అదే పనిలో వున్నాను ఎస్. పి. సాబ్! మన రాష్ట్రం లోని నల్లమల అడవిలోవున్న భైరవుని కొండలో అపారమైన గుప్త  సంపద వుంది. అందుకు సంబంధించిన తామ్రపత్రం మా పెద్దలు సేకరించింది వుంటే మన సి. ఎం. గారకి అందజేసాను. స్వయంగా ఆ నిధిని నేనే తీస్తానని కూడా చెప్పాను. అతీంద్రియశక్తులు కాపలావున్న ఆ గుప్తనిధిని మామూలు మనుషులు కదిలించలేరు. ఆ ప్రయత్నంలో నా శక్తి చాలక బలి అయినాసరే.... దేశానికి ఉపయోగపడే ఒక మంచి పని చేసి పోవాలనుకుంటున్నాను."

    "అచ్చా! ఆ మధ్య పత్రికల్లో చదివాను మన సి. ఎం. గారికి గుప్తనిధి హస్తగతమయితే, రాష్ట్ర దరిద్రం తీరుతుందని, ఆ విషయం ఆయన విలేఖరుల సమావేశంలో వెల్లడించారని. ఆ వార్త  చదివినప్పుడు ముఖ్య మంత్రికి రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక, గుప్తనిధుల వేటలో  పడ్డారే  అని మేం నవ్వుకున్నాం.  ఆ తామ్రపత్రం అందజేసింది నువ్వేనన్నమాట.  జయసూర్యను చంపింది నువ్వుకాదు మరొకరు అని చెప్పడానికి ఒక్క ఆధారం చూపు చాలు. వాళ్ళ పని పడతాను."

    "ఆధారం ఇతడే ఎస్. పి. సాబ్! జయసూర్య ఎలా హత్య చేయబడిందీ చెప్పడానికి ప్రత్యక్ష సాక్షి ఇతడే!"

    "ఆర్ యూ జోకింగ్....?" రవికుమార్ కళ్లు కోపంతో ఎర్రబడ్డాయి.

     "అయామ్ నాట్ జోకింగ్..." ఆ తరువాత స్వామి చెప్పేదంతా ఇంగ్లీషులోనే సాగింది.

     మునిరాజు ముఠా చేత అన్యాయంగా హతమైన జయసూర్య శ్రీచక్రగా పుట్టాడని, కానీ గతజన్మ జ్ఞాపకాలు అతడిని వీడలేదని, అతడా సంఘర్షణలో వుండగానే నిధి భూపాల్ గారి అంత్య సమయంలో ఉండగా ఇక్కడికి తీసుకువచ్చిందని, ఆయనకి తల కొరివి పెట్టి కర్మకాండ నిర్వహించి తన రుణం తీర్చుకున్నాడనీ.....

     ఏదో నాలుగు మంత్రాలు చెప్పుకుని సాదాసీదాగా  బ్రతికే పిలక బాపడని చులకనచేసి మాట్లాడుతున్న రవికుమార్ కి తల తిరిగినట్టయింది - చక్కని ఇంగ్లీషులో ఎంతో సంస్కారయుతంగా మాట్లాడుతున్న అతడిని చూసి.      

    "మీరు చెప్పేదంతా నేను నిజమని నమ్ముతాను. కానీ కోర్టులో ఇతడిని సాక్షిగా నిలబెట్టలేంకదా? పూర్వజన్మ జ్ఞాపకాలంటే కోర్టు పట్టించుకోదు. అంతా ట్రాష్ అని కొట్టివేస్తుంది. అసలు జయసూర్యే యితడని చెప్పడానికి ఆధారం ఏమిటి?"

    శ్రీచక్ర అన్నాడు - "ఆ రోజు వాళ్లు నన్ను అనేకచోట్ల కత్తితో పొడిచారు. చివరికి కత్తిపోటు గుండె క్రింది భాగంలో తగలడంతో ప్రాణం పోయింది. అస్తిపంజరాన్ని వైద్యపరీక్ష చేస్తే  ఆ విషయం బయటపడుతుంది. నేను చెప్పింది నిజమైతే  నేనే జయసూర్యని నమ్ముతారుకదా? నా ఎడమ చేతికి బంగారు చెయిన వున్న స్విస్ గడియారం వుండేది. ఆ రోజు వాళ్లు అది శవం మీద నుండి తీయకపోతే అది అక్కడ దొరుకుతుంది."

    "ఇంకేమైనా గుర్తులు..... చేతికి ఉంగరాలు వుండేవా?"

    "కుడిచేతి ఉంగరపు వ్రేలికి పచ్చ పొదిగిన ఉంగరం వుండేది."

    "వాళ్లు తీసుకోకపోతే అది అక్కడ దొరకాలి. మీరుచెప్పిన గుర్తులు సరిపోతే  మీరే జయసూర్య అని నమ్మవచ్చు. కానీ కోర్టులో సాక్షిగా మిమ్మల్ని తీసుకోలేం."

    "పూర్వజన్మ జ్ఞాపకాలకు సంబంధించి దీన్ని ప్రత్యేకమైన కేసుగా టేకప్ చేయవచ్చుకదా?" అన్నాడు స్వామి.      
    "లోగడ పూర్వజన్మ జ్ఞాపకాలకు సంబంధించిన కేసులేమైనా వుంటే దాన్ని ఆధారంగా చేసుకుని మనం ముందుకు ప్రొసీడ్ కావచ్చు."

    "యుపిలో ఆమధ్య ఇలాంటి సంఘటనే ఒకటి జరిగినట్లుగా చదివాను. తన ఇరవై అయిదో ఏట హత్య చేయబడ్డ ఒక యువకుడు పునర్జన్మ ఎత్తి గత జన్మ జ్ఞాపకాలతో అతడు పోలీసులకు తనను చంపిన హంతకులను పట్టించిన ఉదంతం చదివాను."

    "పత్రికల్లో వచ్చేవన్నీ వాస్తవాలని చెప్పలేం. పాఠకుల్లో సెన్సేషన్ సృష్టించడంకోసం ఏదో కట్టుకథలు రాస్తారు. నిజ నిర్దారణకి పెడితే నిలిచేది తక్కువ."

    "నాతోపాటు అమెరికాలో చదువుకున్న ఇద్దరు స్నేహితులు వున్నారు. రాజేంద్ర, వినీత్ అనుకుంటాను. రాజేంద్ర ఇక్కడే డిస్పెన్సరీ పెట్టాడు.  ఇప్పుడెక్కడున్నాడో తెలియదు. వినీత్ మద్రాస్ లో వుండేవాడు. వాళ్లు బ్రతికే వుంటే అదీఇండియాలోనే వుంటే వాళ్లవల్ల కొంతవరకు నన్నునేను నిరూపించుకోవచ్చు."

    "అసలు గత జన్మలో మీరు డాక్టర్ కదా? ఏదైనా ఆపరేషన్ చేసి మీరు డాక్టర్ గా నేర్చుకున్న సర్జరీ అవి. నాకంతగా గుర్తులేవు."

    "గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు శ్రీచక్రా!"

    "అదెలా సాధ్యం?"

    "యోగాలో సాధ్యం కానిదంటూలేదు. గతజన్మలో నువ్వు యోగసాధకుడివి. అంతకుముందు జన్మలో మంత్రోపాసకుడివి. పులిని పిల్లిలా నీ ప్రక్కన నడిపించుకున్నవాడివి. మనసు లగ్నంచేసి  ప్రయత్నిస్తే గతంలోకి ఇంకా గతంలోకి వెళ్లగలవు."

    "ఉహూ! సాధ్యంకాదు"నిస్సహాయత వ్యక్తం చేశాడు శ్రీచక్ర.

    "సాధ్యం నేనుచేస్తాను ఎస్. పి. సాబ్" మాట యిస్తున్నట్లుగా అన్నాడుస్వామి.

     "మీరు వెళ్ళండి. సంధ్య పడింది. ఏటిలో మునిగి సంధ్యావందనం చేసుకునివస్తాను. శ్రీచక్రా నువ్వుండు "వెళ్లబోతున్న శ్రీచక్రని వారించాడు.

    రవికుమార్ వెళ్లిపోయాడు.

     శ్రీచక్ర ఏటిలోకి దిగాడు స్వామితోపాటు. ముక్కుమూసుకుని అతడితోపాటు మునిగాడు.

    "అవసరమైనప్పుడు తనని తలచుకుంటే వస్తానని మన గురుదేవులు చెప్పారు. మరుగునపడ్డ నీలోని ఆత్మశక్తిని తెర తొలగించడానికి ఇప్పుడు వారి అవసరం ఎంతో వుంది. ఆయనని స్మరించు శ్రీచక్రా!"

    శ్రీచక్ర కళ్లుమూసుకున్నాడు.

     ఎవరిదో బొటనవ్రేలు భృకుటి మధ్యన ఆనినట్లుగా అయింది.
     
    మెదడులో ఏదో విస్పోటనం!

    బాహ్యస్మృతి పోయింది.

     "గత జన్మలో నువ్వు శాపగ్రస్తుడివి. గత జన్మలలో చేసిన పాపాలకు నువ్వు మూల్యం    చెల్లించుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే నువ్వు ఆపదలో చిక్కినప్పుడు నీ మంత్రసిద్దులేమీ గుర్తురాలేదు. దుర్మార్గుల చేతిలో కుక్కచావు చచ్చావు.  కర్మ విమోచనం చెంది పరిశుద్దుడివయ్యావు. నీ జన్మ పరంపర నీకు గుర్తుండేలా  అనుగ్రహిస్తున్నాను. అప్పుడు నీకంతా కలతలామలకం. అవసరమైనప్పుడు నీశక్తిని లోకకళ్యాణానికి ఉపయోగించు. విజయోస్తు బిడ్డా!"

    అది గురుదేవుల వాణి.

     కానీ ఆయన కనిపించలేదు.

    కళ్లు తెరిస్తే ఎదరుగా స్వామి. కళ్లుమూసుకుని ఏదో ధ్యానిస్తున్నాడు. కాసేపటికి కళ్లు తెరిచాడు.

    "గురుదేవులు కనిపించారా?"

    "ఉహూ! ఆయన వాణి మాత్రం వినిపించింది. నాకు ఆశ్చర్యంగా వుంది. ఇంకా ఆయన జీవించే వున్నారా? అప్పటికే ఆయన వృద్దుడు కదా?"

    "వృద్దుడు అయినా ఆయన వయసు వందల సంవత్సరాలు తెలుసా ఆయన ఇప్పటికీ జీవించే వున్నారు. ఆయన చివరిసారిగా నన్ను కలసినప్పుడు చెప్పారు హిమాలయాల్లోకెళ్లి తపస్సు చేసుకుంటానని. ఇక తిరిగి రానని. ప్రస్తుతం ఆయన సమాధి  స్థితిలో వుండివుంటారు. అక్కడ నుండే నీకు సమాధానం లభించింది."


                           *    *    *    *

   
    పదమూడోరోజు వైకుంఠ సమారాధన.

    భూపాల్ గారు చేసిన ఆర్దికసాయంవల్ల చదువుకుని నాగార్జున సాగర్ డాంలో పనిచేస్తున్న ఒకాయన భూపాల్ గారి చిత్రపటాన్ని నిలువెత్తు గీయించుకుని వచ్చారు. కారులో ఆ చిత్రపటానికి సరిపోయిన దండ కూడా పట్టుకొచ్చారు.      
    ఆ చిత్రపటం హాలు మధ్యనపెట్టి దండ వేశారు.

    ఊరి జనాలంతా వరుసగా ఆ చిత్రపటానికి భక్తిగా నమస్కరించి కళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోతున్నారు.

     బంగళా ముందు అప్పుడే కారు దిగిన ఒకప్రౌఢ యువతి కన్నీళ్లు తుడుచుకుంటూ వచ్చిహాలులో  భూపాల్ గారి  చిత్రపటం ముందు మూర్చిల్లినట్లుగా పడింది.

     ఆమె కారుడ్రైవరు చెప్పాడు "ఉదయం అమ్మగారు ప్లేన్ దిగుతూనే బాబుగారు పోయారని తెలిసింది. ఇంటికి కూడా వెళ్లకుండా అటు నుండే వచ్చేశారు."

    అందరూ ఆమెనే చూస్తున్నారు ఆసక్తిగా.

     మంగ వెళ్లి ఆమెను తట్టిలేపింది.

    "లే బిందూ! ఏడిస్తే బాబుగారు వస్తారా? పండుటాకు రాలిపోయింది. అంతే!"

    "కనిపించని దేవుడు ఆయనలో నాకు కనిపించాడు మంగా, ఆ దేవుడి చివరి చూపుకి నోచుకోలేకపోయాను. ఇరవై రోజుల క్రితం నేను అమెరికాకు  బయల్దేరివెళ్లే ముందు ఆయన ఆశీస్సులకోసం వచ్చినప్పుడు  ఆయన ఎంతో ఆరోగ్యంగా వున్నారు. ఎంతో చక్కగా,  కులాసాగా మాట్లాడారు. అదే ఆఖరిచూపు,  ఆఖరి మాట అవుతుందని ఎంతమాత్రం  అనుకోలేదు" వెక్కి వెక్కి ఏడవసాగింది.

 Previous Page Next Page