Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 30


    ఫలితంగా....

    ఇద్దరికీ శిక్షలు పడ్డాయి.

    కానీ....

    జగపతి డబ్బు వెదజల్లి లాయర్లద్వారా బయటపడడానికి రానా కూడా సహకరించాడు. కాని తనకు ఎదురు తిరిగిన చక్రవర్తికి అలాంటి శిక్ష తగిందే అని భావించి అతనిపై కసి, ద్వేషం, పగ పెంచుకుని చక్రవర్తికి కానీ అసలు తెలియని విషయం ఒకేఒకటి వుంది.

    అసలు శ్రీప్రియ ఎందుకలా చేసింది?

    ఇప్పటికీ వాళ్ళిద్దరికి అంతుబట్టని ప్రశ్నగానే మిగిలిపోయింది....

    చక్రవర్తి ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ వాస్తవానికి వచ్చాడు....

    అంతవరకూ అతను జరిగిపోయిన విషాద సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. ఎవరో బయటనుంచి తలుపులను తట్టుతున్న చప్పుడు వినిపిస్తుంది. అనుమానంగా లేచి నిలుచున్నాడు చక్రవర్తి.


                            *    *    *


    "దాదా జైలు నుంచి చక్రవర్తి పారిపోయాడట...."

    ఒక అనుచరుడు పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు రాణాకు.

    "నిజమా...." రాణా ఆశ్చర్యపోయాడు.

    ఒక్కసారిగా అతని ముఖంలో రంగులు మారిపోయాయి.

    "ఎలా జరిగిందది?"

    "వార్షికోత్సవ సందర్భంలో జైలుగార్డులు కళ్ళుగప్పి పారిపోయాడు...."

    రాణా కళ్ళు ఎర్రగా కాల్చిన ఇనుపముక్కల్లా తయారయ్యాయి.

    "మన మధ్య నుంచి వేరుపడి వెళ్ళిపోయినా వాడిని అంత తేలికగా వదలడానికి వీల్లేదు. మీరు ఏంచేస్తారో నాకు అనవసరం. నగరం మొత్తం గాలించండి....ప్రాణాలతో వాడ్ని పట్టితీసుకురండి. ఒకవేళ సాధ్యం కాకపోతే వాడిని అక్కడికక్కడే కాల్చిపారెయ్యండి. ఆ రెంటింటిలో ఏది చేసినా సంతోషమే.

    "అలాగే దాదా" వెళ్ళిపోయాడతను.

    రాణా కళ్ళలో గతం కదులుతోంది....

    ఒకప్పుడు దిక్కులేక రోడ్డుమీద పడివున్న ఒక అనాధను తెచ్చి పెంచి అతనికి చక్రవర్తి అని పేరు పెట్టాడు. తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పించాడు.

    తనకు నమ్మకయిన, విశ్వాసపాత్రుడిగా అతన్ని తయారుచేశాడు....ఇరవై ఏళ్ళపాటు తనపట్ల విశ్వాసముతోనే కుడిభుజంగా మెలిగిన ఆ చక్రవర్తి ఒక ఆడదానికోసం తననే ఎదిరించాడు....

    నమ్మక ద్రోహం చేసి తనను వెన్నుపోటు పొడిచాడు ఆ చక్రవర్తి....!

    తన కుడిభుజాన్ని చీల్చిన ఆ వంచకి....శ్రీప్రియ....!

    ఇప్పుడు తన దృష్టిలో నేరస్థుడు ఒక్క చక్రవర్తే కాదు....ఆ శ్రీప్రియ కూడా!

    ఇద్దరినీ....ఇద్దరినీ ఒకేచోటికి చేర్చి సమాధిచేయాలి....

    అంతవరకూ విశ్రమించకూడదనుకుంటూ తనలో తనే భీష్మప్రతిజ్ఞ చేసుకున్నాడు రాణా....!


                           *    *    *


    చక్రవర్తి అనుమానంగా కిటికీరెక్క కొంచెం తెరిచి చూశాడు.

    బయట నిలుచుని వున్న వ్యక్తి రాజేంద్ర....

    ప్రమాదమేమీ లేదని అర్ధం కావడంతో వెళ్ళి తలుపు తెరిచాడు.

    "చక్రవర్తీ....నీ కోసం నగరంలో అప్పుడే వేట మొదలయింది తెలుసా?" అన్నాడతను వచ్చీరావడంతోనే....

    చక్రవర్తి బదులు పలకలేదు....

    "నిన్ను విడిపించడం కోసం నా మనస్సాక్షికి విరుద్ధంగా ఒకపని చేశాను....అందుకు ప్రతిఫలంగా ఒక నిజాయితీ కలిగిన ఆఫీసర్ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు...."

    "ఏమిటది?" అప్పుడు ప్రశ్నించాడు చక్రవర్తి.

    "జైలర్ పరశురామ్  తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు...."

    "ఎందుకు?"

    "ఎందుకేమిటి....నిన్ను వదిలిపెట్టినందుకు తనకు తను విధించుకున్న శిక్ష అది....ఒక ఖైదీ తన నిర్లక్ష్యంవల్లనే పారిపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవిని వదులుకుంటున్నట్టు లేఖ రాశాడు. అంతేకాదు....చక్రవర్తి అనే హంతకుడు ఈ నగరం వదిలిపెట్టి ఎటూ పారిపోడు కాబట్టి అతన్ని ఎలాగయినా వట్టి బంధించమని అప్పటివరకూ తనకు మనశ్శాంతి వుండదని పరోక్షంగా పోలీస్ డిపార్టుమెంట్ ను అభ్యర్ధించాడు కూడా...." రాజేంద్ర చెప్పడం ఆపాడు.

    "అసలు అంత నిజాయితీపరుడు ఎందుకు వదిలిపెట్టాడు నన్ను?...."

    "అతని కూతురు కనిపించినవాడితో ప్రేమాయణాలు సాగించడంలో ఎక్స్ పర్టు....కాలేజీలో ఆమె ప్రేమదాహానికి ఎందరో దాసోహం అన్నారు....ఆ విషయంలో కూతురిని కంట్రోల్ చేయలేని బలహీనత అతనిది....అందుకే ఎటూ విచ్చలవిడిగా శృంగారాన్ని వెలగబెట్టేదే కదాఅని ఒక నెలరోజులపాటు నా మనిషిని ఆమె ప్రియునిగా ఆమె వెంట తిప్పించాను. చివరకు ఒకరోజు హోటల్ గది బుక్ చేసుకున్నారు. ఆ విషయం ముందే తెలుసుకున్న నేను వాళ్ళకన్నా ముందుగానే ఆ గదిలో వుండి శృంగార లీలలను ఫోటోలు తీసి వాటిని చూపి జైలర్ ను బ్లాక్ మెయిల్ చేశాను....అందుకే నిన్ను వదిలిపెట్టాడు....కానీ తన నిజాయితికి మచ్చ తెచ్చుకోవడం యిష్టంలేక పదవినే వదులుకున్నాడు....కానీ పూర్ ఫెలో...."

    అతను చెప్పేమాటలమీద లేదు చక్రవర్తి మనసు....

    తనను దారుణంగా మోసం చేసిన శ్రీప్రియను పట్టుకోవాలి....

    అదే తన కర్తవ్యం....

    జైలు నుంచి పారిపోయిన తనకోసం పోలీసులు వెదుకుతుంటారని తెలుసు....మరొకవైపు రాణా మనుషుల నుంచి కూడా తను తప్పించుకుంటూ వుండాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనాసరే ఆమె ఎక్కడుందో వెదికి పట్టుకోవాల్సిందే!
 

 Previous Page Next Page