Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 30


    "ఏం చెయ్యను వదినా....ఛా....ఇలా వీడిని వదిలి నేనక్కడ ఎలా సుఖంగా..... ' సుగుణ గొంతు పట్టుకుంది. "పోనీ వీణ్ణి గదిలోకి తీసుకేడతాను అక్కడే పక్క వేసి పడుకోపెడతాను " అంది. మరో అయిదు నిమిషాలకు కూడా రవి పడుకునే సూచనలు లేకపోవడంతో అలా తప్ప మరో మార్గం ఏం లేదని స్పష్టమయింది. సుగుణ మరో పరుపు పట్టుకెళ్ళి గదిలో వేసి వచ్చింది. భాస్కరరావు సుగుణ వచ్చి పరుపు వేయడం మంచం మీద పడుకుని తీక్షణంగా చూశాడు. సుగుణ అది గ్రహించినా చూపులు తప్పించి రవిని తీసుకొచ్చి తలుపులు వేసింది.
    "ఏమిటిది?.....వాణ్ణి ఎందుకు తెచ్చావు" అన్నాడు భాస్కరరావు చిరాగ్గా.
    "ఏం చెయ్యను . నన్నొదిలి ఎంతకీ నిద్ర పోవడం లేదు.....ఏడుస్తున్నాడు " అంది శుష్కహాసం చేస్తూ , వాడిని పడుకో బెట్టి జో కొడుతూ.
    "హు......బాగుంది" కర్కశంగా అన్నాడు భాస్కరరావు. అంతకంటే క్రొత్త భార్యను ఇంకేమనాలో అర్ధం కాలేదు . అలా తీక్షణంగా కాసేపు చూసి అటు తిరిగి పడుకున్నాడు. అతని ఉత్సాహం , ఆత్రుత, ఆరాటం అంతా నీళ్ళు కారిపోసాగింది. అతనికి చాలా కోపంగా, అసహనంగా వుంది. కాని అది ఏ విధంగా చూపించాలో అర్ధం కాలేదు. తన ఆనందానికి అడ్డువచ్చిన ఆ రెండేళ్ళ పిల్లాణ్ణి నమిలి మింగేయలన్నంత కోపంగా వుంది. ఇదేం ఖర్మ! మొదటిరాత్రి హాయిగా వుండాల్సిన తనకి ఈ పిల్లాడు అడ్డు వస్తున్నాడు . పిల్లాడి తల్లిని పెళ్ళాడి తనేం తొందర పడలేదు గదా అన్న బాధ తలెత్తింది. వీడే అడ్డు లేకపోయే యీ పాటికి..... యీ పాటికి ......చిరాకుగా మళ్ళీ ఇటు తిరిగాడు. సుగుణ వాడి ప్రక్కనే పడుకుని నిద్రపుచ్చుతుంది. అర్ధరాత్రి కావస్తుంది. కోపం ముంచుకు వచ్చింది భాస్కరరావుకి. ఏమిటీ వ్యవహారం? కనీ వినీ ఎరుగని సంగతి! శోభనం రాత్రి పెళ్ళాం పిల్లాడి ప్రక్కన నిద్రపోవడం ఎక్కడన్నా ఉందా!..... అనుకున్నాడు. 'అనుభవించు గొప్పగా, ఏదో అనుకుని పిల్లాడి తల్లిని పెళ్ళాడితే ఇంతకంటే ఏం అవుతుంది" అంది మనసు. ఈ వ్యవహారం ఏదో తేల్చాలి! లేకపోతె రోజూ ఇదే వ్యవహారం సాగితే లాభం లేదు! చాలా గట్టిగా మనసులో నిశ్చయించుకున్నాడు.
    సుగుణ మరో అరగంటకి నిద్రపుచ్చి లేచి వచ్చింది. కోపంగా అటు తిరిగి పడుకొన్న భాస్కరరావుని ప్రసన్నం చేసుకోడానికి భుజం మీద చెయ్యి వేసింది. "వెళ్ళు వెళ్ళు అక్కడే పడుకో" అన్నాడు చిరాకుగా.
    "కోపగిస్తే ఎలా? నేనేం చెయ్యను వాడు నిద్ర పోకపోతే" అంది నెమ్మదిగా సుగుణ. తెల్ల చీరలో మెరిసిపోతున్న అందమైన భార్య దగ్గిరికి వచ్చాక ఎంతోసేపు కోపాన్ని చూపలేకపోయాడు భాస్కరరావు. చేయి లాగి కూర్చోపెడుతూ 'చూడు, ఇదేమన్నా బాగుందా.....నీవే చెప్పు ...." అన్నాడు. సుగుణ ఏం అంటుంది? "నాకిదెం నచ్చలేదు.....ఎందుకలా అలవాటు చేయాలి పిల్లాడికి.....రేపట్నించి ఇదే వరసయితే నాకు కోపం వస్తుంది సుమా" అన్నాడు. సుగుణ జవాబీయలేదు. అమెకిదంతా ఏమిటోలా వుంది. ఓ ప్రక్క కొడుకు, మరోప్రక్క మొగుడు! ఎవర్ని కాదంటుంది? ఏం చేస్తుంది? యేమిటి , ఇలాంటి అవస్థ లో పడ్డాను అనుకుంది! మొదటిరోజు ఇలా వుంటే .....తరువాత ....
    "మాట్లాడావెం . ఎంతయింది టైము చూశాడు. ఎన్ని గంటలు వృధా చేశావో చూడు" దగ్గరికి లాక్కుంటూ భాస్కరరావు నవ్వుతూ అన్నాడు . బలవంతంగా నవ్వింది సుగుణ.

                                             *    *    *    *
    భాస్కరరావు , సుగుణ కాపురం పెట్టి పదినేలలవు తుంది.
    ఈ పదినెలలు క్రొత్తగా పెళ్ళి చేసుకున్న సుగుణకి పది క్షణాలలాగ కాక పది యుగాలు గడిచినట్లనిపించింది. పెళ్ళి చేసుకుంటే జీవితంలో పోగొట్టుకున్న అనందం, సుఖం లభ్యమవుతాయని ఆశించిన ఆమె ఆశలు కోరికలు తీరకపోగా ఈ పెళ్ళి చేసుకుని పొరపాటు చేయలేదు గదా. చేసుకుని తప్పు చేశాను, పొరపడ్డాను.... తొందరపడ్డాను" అనుకున్న సంఘటనులు , సన్నివేశాలు చాలా జరిగాయి ఈ పది నెలలలో!"
    ఈ పెళ్ళి తనకి సుఖ సంతోషాలు యీయడం అటుంచి మరిన్ని సమస్యలని తెచ్చి పెడ్తుందని సుగుణ ముందు ఎన్నడూ ఊహించలేదు.
    భాస్కరరావు యిలా ప్రవర్తిస్తాడని , యింతలో మారిపోతాడని ఊహించక పోవడం తనదే పొరపాటని వగస్తుంది. తమిద్దరి మధ్య కలతలకి, కలహాలకి తన బిడ్డ కారణంగా నిలుస్తాడని, ఆ బిడ్డని అంతలా ద్వేషిస్తాడని, శత్రువులా చూస్తాడని అనుకోని సుగుణ ఎమేరుగని పసిపిల్లాడిని అంత ఏహ్యంగా చూడడం సహించలేక పోతుంది. వాడి నీడ కూడా భాస్కరరావు భరించలేక పోతున్నాడని అర్ధం అయ్యాక ఏం చెయ్యాలో తోచని స్థితిలో గిలగిలలాడ సాగింది.
    ముందు నించీ, కాపురానికి వచ్చిన రోజునించే రవిని ద్వేషిస్తున్నా చాలా రోజులకి గాని గ్రహించలేక పోయాననుకుంది సుగుణ.
    ముందురోజు బెడ్ రూములో రవి ప్రక్క కూడా వేస్తుంటే "వాడి ప్రక్క ఇక్కడెందుకు? ప్రక్కగదిలో వెయ్యి" అన్నాడు అదోలా. "వాడక్కడ ఎలా పడుకుంటాడు చిన్నపిల్లాడు" అంది మాములుగా సుగుణ.
    'అలాగే అలవాటవుతుంది , మనగదిలో పడుకో బెట్టడం మంచిది గాదు. అలా నాకిష్టం లేదు" అన్నాడు కాని, రెండేళ్ళన్నా నిండని పసివాడిని మరో గదిలో వంటరిగా పడుకో బెట్టడానికి సుగుణ మనసు అంగీకరించలేదు.
    "మరో ఏడాది , రెండేళ్ళు పొతే ఎలాగో పడుకో బెట్టాం, ఇప్పుడింకా చిన్న వాడు వాడొక్కడు ఎలా పడుకుంటాడు. అందులో వాడికసలు విడిగా పడుకోడం అలవాటు లేదు" అంది మాములుగా సుగుణ. భాస్కరరావు కాసేపు వాదించాడు. మొహం ముడుచుకున్నాడు కాని సుగుణ అంత పట్టించుకోలేదు ఆ విషయం.
    రాత్రిళ్ళు సుగుణ పడుకోడానికి రావడంలో ఆలశ్యం జరిగిందంటే అదంతా రవి వల్ల అని భాస్కరరావుకి కోపం వచ్చేది. వెళ్ళు వెళ్ళు నీ కొడుకు దగ్గరే జోల పాటలు పాడుకుంటూ పడుకో. అని అలిగే వాడు. అవతల పిల్లాడ్ని నిద్ర పుచ్చడం, తరువాత భర్త గారిని బ్రతిమలుకోడం ----- అలా అవస్థ పడేది సుగుణ.
    పిల్లాడికి పాలుపడ్తూనో , భోజనం తినిపిస్తూనో , స్నానం చేయిస్తున్నప్పుడో భాస్కరరావు పిలవగానే చేతిలో పని వదిలేసి రావాలనేవాడు. వాడే నీకు ముఖ్యం, నామీద నీకేం లేదన్నమాట. ఎంతసేపూ వాడి ఆలనా పాలనా సరిపోతుంది గానీ, నా సంగతి నీకక్కర లేదని మొహం ముడుచుకుంటూ దేప్పేవాడు.
    పిల్లాడి సంగతి చూడకూడదనా ఏమిటి అతని ఉద్దేశం అని ఆశ్చర్యపడేది సుగుణ.
    సుగుణ కొడుకుని ముద్దులాడుతుంటే యీర్ష్యగా చూసేవాడు భాస్కరరావు" మరీ పట్టలేనప్పుడయితే "చాల్లెద్దూ ఆ ముద్దులు.....మహా కొడుకు నీకేవున్నట్లు పొంగి పోతున్నావు' అనేవాడు నవ్వుతూనే. 'అంత ముద్దు వస్తున్నాడేమిటి , నీ కొడుకు?" ఆ మాటలకి కాస్త నోచ్చుకునేది సుగుణ. తన కొడుకు తనకి ముద్దు రాడూ?.... పొరపాటున కూడా ఎప్పుడూ భాస్కరరావు పిల్లాడిని దగ్గరికి తీసేవాడు కాదు. ఇంట్లో కొన్నాళ్ళ తర్వాత చనువు కొద్ది రవి దగ్గర చేరితే తప్పుకునే వాడు భాస్కరరావు. సుగుణ చుట్టుపక్కల లేకపోతే పోమ్మన్నట్టు తీక్షణంగా గదమాయించి చూసేవాడు. వాడిని చూస్తూ, ఇంట్లో వాడు తిరుగుతుంటే ఏదో బాధగా వుండేది. వాడిని చూసినపుడల్లా సుగుణ మొదటి భర్త అప్రయత్నంగా గుర్తు వచ్చేవాడు! తన కంటే ముందు సుగుణ ఇంకోడిని ప్రేమించిందని, సుగుణని తన కంటే ముందు మరో మగవాడు అనుభవించాడన్న నిజాలు గుర్తు వచ్చేవి. అసూయ ద్వేషాలతో మండి పడేవాడు భాస్కరరావు . ఆ అసూయ అక్కసు, తీర్చుకోడానికి అందరి కంటే ముందు రవి కనపదేవాడు. వాడిని ఏదో చెయ్యాలని వుండేది. కాని ఏం చెయ్యలేక పోయేవాడు. కొట్టినా నోరు వచ్చిన వాడు తల్లికి చెప్పుకొంటాడు వెధవ అనుకునేవాడు.

 Previous Page Next Page