మహిమ కూడా వినోద్ ని చూసి ఎందుకో తెలియకుండానే ఎమోషనల్ అయింది.
"సార్! నిజం చెప్పనా... మీ గురించి విన్నాక, జరిగిందంతా తెలిశాక, మిమ్మల్ని చూశాక... మీ పట్ల కోపం, ఏహ్యత బదులు జాలి అనిపించింది. ఆ పరిస్థితిలో మీరు పడిన అవమానం, క్షోభ నాకు అర్థమైంది. పరిస్థితుల ప్రాబల్యంతో మీరు అనుభవించిన బాధ, మీ నిస్సహాయత అర్థం అయింది".
"మహిమా థాంక్స్! నిజంగా నన్నిలా అర్థం చేసుకుంటావని అనుకోలేదు. నా పట్ల ఇంత సానుభూతి చూపి, నాలుగు మంచిమాటలు చెప్పే మనిషి ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు. రియల్లీ... నాకివాళ మనసువిప్పి మాట్లాడగల మనిషి దొరికినందుకు ఎంతో ఆనందంగా ఉంది. గుండెలమీద నుంచి పెద్ద భారం దిగిన ఫీలింగ్. మన పరిచయం అతిస్వల్పం. అయినా నా ఫీలింగ్స్ ని ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థాంక్స్. ఇంత మంచి సోదరినిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను" చెమర్చిన కళ్ళను కర్చీఫ్ తో తుడుచుకున్నాడు.
"సార్! మీరు నన్ను సోదరిగా భావించారు కాబట్టి, ఆ చనువుతో, మీరు అర్థం చేసుకుంటారని ఓ మాట చెబుతాను. ఒక స్త్రీ మనోభావాలు, అందులో ఒక భార్య మనోభావాలు ఎలా ఉంటాయో మీకు తెలియదు సార్. మీరు ఎంతసేపూ మీవైపునుంచే ఆలోచిస్తున్నారు. మీ భార్య గురించి నాకేం తెలియదు. ఒక స్త్రీగా మాత్రం ఆమె ఆలోచన ఎలా ఉంటుందని ఆలోచించి నేను చెపుతున్నాను. మీరు ఆమెను కేవలం డబ్బుకోసం పెళ్ళిచేసుకున్నారు. అదేగదా నిజం. అది ఆమెకీ తెలుసు. తను అందగత్తె కాదని, కేవలం తండ్రి దగ్గర డబ్బుండబట్టి తన డబ్బు కోసమే ఈ పెళ్ళి జరిగిందన్న ఆమె భావాన్ని మీరెప్పుడయినా అర్థం చేసుకున్నారా? మీ కోణం నుంచే ఆలోచించారు. ఆవిడ మనోభావాలు ఎలా ఉంటాయన్నది ఎప్పుడన్నా మీరు పట్టించుకున్నారా? పెళ్ళయితే చేసుకున్నారు కానీ, ఆమెలో తను అందగత్తె కాదన్న అభద్రతా భావాన్ని మీరు ఒక్కసారన్నా, కనీసం మాటల్లో కాకపోయినా చేతల్లోనయినా తొలగించే ప్రయత్నం చేశారా? భర్తగా కాస్త ప్రేమ, అనురాగం చూపారా? ఇష్టంగా మాట్లాడారా? ప్రేమగా దగ్గరకి తీసుకున్నారా? ఏదో కొత్తరోజుల్లో ఆ అవసరం కొద్ది కొన్నాళ్ళు కాపురం చేశారు. అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత పిల్లాడి తల్లిగానైనా ఆమెపట్ల అభిమానం కలిగిందా? నిజాయితీగా మీకు మీరే జవాబు చెప్పుకోండి". మహిమ చెప్తున్న తీరుకి అలా తెల్లబోయి చూస్తూ విన్నాడు వినోద్.
"సార్, అందంగా లేనంత మాత్రాన తనకి మనసుండదా? భర్త ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడన్నా, ఏ చిన్న విషయంలోనన్నా తన గురించి కాస్త ప్రేమగా మాట్లాడాలనుకోదా? నా డబ్బు తింటూ నన్ను నిర్లక్ష్యంగా చేస్తున్నాడు అన్న అహం ఆమెలో తలెత్తదా? అసలే డబ్బుతో వచ్చానన్న అహంకారం ఉన్న మనిషికి 'తనకు భర్త గుర్తింపు ఇవ్వడు' అన్న కోపం ఉండి, అది మీ పట్ల మరింత విముఖత పెంచి, అడుగడుగునా తన దర్పం ప్రదర్శించి మిమ్మల్ని అదుపులో పెట్టుకుని మీమీద పైచేయి సాధించి, మిమ్మల్ని కంట్రోల్ చేసి కక్షసాధిస్తూ, మీ చర్యకి ప్రతిచర్యగా ఆమె మరింత అహంభావిగా తయారయిందనిపిస్తోంది. అదే మీరు కాస్త లోపల లేకపోయినా బయటికన్నా ప్రేమ, గౌరవం, అభిమానం చూపే చర్యలు నలుగురిలోనన్నా చూపిస్తే ఆమెలో కసి తగ్గేదేమో. పెళ్ళి చేసుకోవడం నా ఖర్మ అన్నట్టు, మీరు అయిష్టతని స్పష్టంగా చూపిస్తే ఏ స్త్రీ అవమానంగా భావించదు. ఆ అవమానం నుంచి పుట్టుకొచ్చిన కక్షసాధింపు చర్యలవల్ల మీ వివాహ జీవితం పాడయింది. సార్, ఇప్పటికీ మించిపోలేదు. మీ ప్రవర్తన ద్వారా ఆమెను మీరు అర్థం చేసుకున్నట్టు కొద్దిగా దయగా, సానుభూతిగా, ప్రేమగా పలకరిస్తూ ఉండి, 'భర్త తనను పట్టించుకుంటున్నాడు, కాస్త మారాడు' అని ఆమె సంతోషించి తన ఆధిక్యతను ప్రదర్శించడం తగ్గించుకుని కాస్తంత సామరస్యంగా మారచ్చు సార్! ఆడది కాస్తంత ప్రేమకే బానిస అవుతుంది. ప్రేమ దక్కకపోతే ఆమెలో రాక్షసత్వం చోటు చేసుకుంటుంది. ప్రీతి కూడా అంతే! మీరు తనకు దక్కరన్న అభద్రతకి లోనై, ప్రేమతో లొంగదీసుకోవాల్సింది పోయి, సాధించి బెదిరించి లొంగదీసుకోవాలనుకోవడం ఆమె చేసిన పొరపాటు. మీ భార్యకి మీ ఇతర స్త్రీ సంబంధాలు తెలియనంతవరకు, ఏదో భార్యగా, తల్లిగా, కోడలిగా ఆ ఇంట్లో తన స్థానం దక్కించుకుని, మీ ప్రేమ లేకపోయినా సర్దుకుంది. ఎప్పుడయితే భర్త జీవితంలో ఇంకో స్త్రీ తన స్థానంలో ఉందని తెలిసిందో, అదీ ప్రీతికోసం మీరు చేసిన ఏర్పాట్లు, ఆమె గర్భవతి అని తెలియడంతో, ఆమే కాదు, ఏ స్త్రీ తట్టుకోలేదు. మామూలు భార్య అయితే ఏడ్చి, చస్తానని, పోతానని బెదిరించేది. రకరకాలుగా భయపెట్టేది. కానీ ఆమెకి కొండంత అండగా తండ్రి, డబ్బుతో ఏదన్నా చేయగల తండ్రి ప్రేమ ఉన్నాయి. ఆయన కార్యదక్షతతో ప్రీతిని నామరూపాలు లేకుండా నల్లిలా నేలరాసింది. సమాజంలో తలెత్తుకోకుండా మీ మీద పగతీర్చుకుంది.
"అవును మహిమా... నేను తప్పు చేశాను. తనకి ద్రోహం చేశాను. దానికి నన్నింతలా దెబ్బతీసింది. నాకంటే కూడా ప్రీతిని ఆమె అంత నిర్ధాక్షిణ్యంగా, క్రూరంగా అణచివేయడం... ప్రీతి తప్పుచేసింది. దానికి నేను కారణం. ఒక స్త్రీ అయి, అంత నిర్ధాక్షిణ్యంగా అంత బాధకి గురిచేయడం నా బాధని మరింత పెంచింది. తనని బెదిరించి పొమ్మనచ్చు. ఏదో డబ్బు ముట్టచెప్పి మళ్ళీ ఇటు రాకుండా కట్టుదిట్టం చెయ్యచ్చు. ఎంతయినా నేనూ మనిషినే. ఆమె పట్ల నాకు ప్రేమలేదు గాని ఆమెను నేను ఏనాడూ అవమానపర్చలేదు. నన్ను అందరిముందు అంత దిగజార్చింది. అలాంటి భార్యని నేను ఎలా క్షమించాలి..." వ్యధగా అన్నాడు.
"తప్పదు. తప్పు మీది, చక్కదిద్దుకోవాల్సింది కూడా మీరే. మీ ముందు ఇంకా ఎంతో జీవితం ఉంది. ఇంత అశాంతిగా, సుఖం, ఆనందం అన్నది లేకుండా, ఇంట్లో భార్యతో సామరస్యం అన్నది లేకుండా ఎన్నాళ్లు గడుపుతారు. దొరకని దానికోసం అర్రులు చాచేకంటే దొరికినదానితో ఆనందం వెతుక్కోవడం తెలివైన వాళ్లు చేసే పని వినోద్ గారు. గతం మర్చిపోండి. కొత్త జీవితానికి తెరలేపండి. మీవైపు నుంచి దిద్దుబాటు చర్యలు చేపట్టి చూడండి. తప్పక ఆవిడ కూడా ఒక అడుగు ముందుకు వేస్తారని నా నమ్మకం. జీవితంలో బాహ్యరూపానికే కాదు, అంతరంగానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వండి. ప్రేమకి లొంగని మనిషి ఉండడు".