Previous Page Next Page 
మహిమ పేజి 30


    రెండో యాడ్ లో నటించే అవకాశం ఆరతికి రావడంతో, అదీ మహిమ డైరెక్షన్ లో ప్రెజెంట్ చేయడంతో, మహిమ పట్ల అందరికి గౌరవం, అభిమానం పెరిగింది. ఆమె తమందరిలో ప్రత్యేకత ఉన్న వ్యక్తిగా గుర్తించి మహిమకి ఓ ప్రత్యేక స్థానం తెలీకుండానే ఇచ్చేశారు అమ్మాయిలు. తన ఆనందాన్ని, అభిమానాన్ని, కృతజ్ఞతలు తెలియపరుచుకోడానికి ఆరతి, అందరికి హోటల్లో ట్రీట్ ఇచ్చింది.
    "ఇంకేం... మన ఆరతి గొప్ప నటి, మన మహిమ గొప్ప దర్శకురాలు అయిపోయారు. ఉయ్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్" అంతా అభినందించారు.
    "ఏయ్ మహిమా! నీకింత అందమైన ఆలోచనలు. ఆలోచనలకి సరిపోయే మాటలు ఎలా తడతాయి..." సీమ మెచ్చుకోలుగా అడిగింది.
    "ఏమిటో మరి... అదేనేమో క్రియేటివిటీ అంటే! నాకు తెలియకుండానే, ఒక ప్రోడక్ట్ గురించి ఆలోచించగానే ఫ్లాష్ లా కళ్ళముందు కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి. అలా ఏకాగ్రతతో దాని గురించే ఆలోచిస్తుంటే ఇంకా కొన్నికొన్ని దృశ్యాలు సినిమాలా కదలాడతాయి. అవన్నీ గుదిగుచ్చితే కొన్ని సీన్లు కలిపి 'నే చెప్పాల్సిందిదే' అనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని మాటల్లోకి అనువదించడమే స్క్రీన్ ప్లే! తెరపై ఎలా చూపాలి, పేపర్ లో ప్రకటన ద్వారా ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు మంచి మాటలు పది రకాలుగా ఆలోచిస్తా. అన్నింటిలోకి మంచివి ఏరుకోవడమే. అంటే నే చెప్పదలచిందానికి సరైన మాట పడిందా, సరైన రూపు వచ్చిందా? అన్నదానికి కంప్యూటర్ ముందు కూర్చుని పర్ముటేషన్స్, కాంబినేషన్స్ సెట్ చేసుకుంటూ పోతే... ఆఖరికి ఓ రూపు తయారై నాకు తృప్తినిచ్చాక ఫైనల్ వెర్షన్ తయారుచేస్తా..." తాను ప్రెజెంట్ చేసే పద్ధతి వివరించింది.
    "గ్రేట్!" అన్నారంతా చప్పట్లు కొట్టి.
    "నా యాక్షన్ ఎలా ఉందో చెప్పలేదు మీరెవరూ. నన్ను పొగడలేదు" అలిగినట్టు అంది ఆరతి.
    "మొదటి యాడ్ కంటే ఇందులో ఎక్కువ కాన్ఫిడెన్స్ కనిపించింది. అన్ని యాంగిల్స్ లో అందంగా కనిపించావు" మహిమ నిజాయితీగా అంది.
    "ఎగైన్ దట్ క్రెడిట్ గోస్ టు యూ" బుంగమూతి పెట్టింది.
    "ఇది సక్సెస్ మీట్ అనే గదా అందరం పార్టీ చేసుకుంటున్నాం. మహిమ కొంగు వదలకు" మంగళ నవ్వుతూ అంది.
    "నాదేముంది... ప్రోడక్ట్ అవసరాన్ని బట్టి యాక్టర్స్ ని వాళ్లే చూసుకుంటారు. రాయడం వరకే నావంతు."
    "ఏమో! రేపు డైరెక్టర్ ఛాన్స్ ఇస్తారేమో ఈ వర్క్ సక్సెస్ అయిందని!" అంది సీమ.
    సీమ అన్నట్టే, మర్నాడు విశాల్ రూముకి పిలిచాడు. "కంగ్రాట్స్ మహిమ! మీరు డైరెక్ట్ చేసిన ప్రోడక్ట్ సక్సెస్ అయింది. డాడీ కూడా మెచ్చుకున్నారు. మీకు డైరెక్షన్ సైడ్ ఇంత పట్టు ఉందని మాకు తెలియలేదు. ఎనీహౌ ఉయ్ ఆర్ ఆల్ హ్యాపీ అండ్ ప్రౌడాఫ్ యూ! మీకు డైరెక్షన్ సైడ్ ఇంటరెస్ట్ ఉందంటే, డాడీ మిమ్మల్ని విజువల్స్ సెక్షన్ కి ప్రమోట్ చేయమన్నారు. ఈజిట్ ఓకే విత్ యూ!" విశాల్ మర్యాదగా అడిగాడు. ఒక్కక్షణం మహిమకి ఏం జవాబివ్వాలో తెలియలేదు.
    'జాయిన్ అయిన రెండు నెలలకే డైరెక్షన్ వైపు అంటే... ఇంతకంటే జీతం బాగుంటుంది. తొందరగా పేరు తెచ్చుకునే అవకాశం. క్రియేటివ్ సెక్షన్ లో పేరు బయటికి తెలియదు. వెనకాల పేపర్ వర్క్ అంతా తమదే అయినా, డైరెక్ట్ చేసినవారికి వచ్చిన పేరు రాదు. ప్రకటనల యాడ్ లో కూడా తయారుచేసిన వారి పేరు ఉండదు. ఇది తనకు దొరికిన గొప్ప అదృష్టం. కాని, విజువల్స్ అంటే ప్రలోభాలు, అవకాశాలు అందిపుచ్చుకోడానికి, బాస్ లను ఇంప్రెస్ చేసేందుకు తంటాలుపడే నటీనటులు, డైరెక్టర్లు... ఈ వాతావరణంలో తను ఇమడగలదా?'
    "ఏమిటి ఆలోచిస్తున్నారు? మీ క్రియేటివిటీని, మీ ఆలోచనని మీరే డైరెక్ట్ చేసుకుని ప్రజెంట్ చేయడం... ఇటీజ్ ఏన్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ!"
    "ఎస్! కాని, ఎక్స్ పీరియన్స్ అంతగా లేదుగదా అని భయపడుతున్నాను" ఏదో ఒక జవాబివ్వాలి గదా అని అంది మహిమ.
    "ఐ నో, యూ ఆర్ కాన్ఫిడెంట్? ఒకటి రెండుసార్లు చేస్తే అదే అలవాటవుతుంది. మీకు హెల్ప్ చేయడానికి మిగతా స్టాఫ్ ఉంటారు".
    "థాంక్స్ సార్! మీ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. నాకింత ప్రాముఖ్యం ఇచ్చినందుకు ఈ కంపెనీకి నా చేతనైనంత సపోర్ట్ ఇస్తాను".
    ఆ రోజు ఆఫీసులో మహిమ అదృష్టానికి ఆనందించినవారూ, తమకన్నా జూనియర్ కి మంచి పోస్టు వచ్చిందని లోలోన అసూయపడ్డవారూ ఉన్నారు.
    ఇంటికి వెళుతూ స్వీట్స్, పకోడీలు ప్యాక్ చేయించి తీసుకెళ్లింది మహిమ. అమ్మాయిలంతా ఆటలు, పాటలతో సందడి చేస్తూ అభినందనలు అందించారు మహిమకి.

                                                           *  *  *  *

    ఆరోజు క్రియేటివ్ డిపార్ట్ మెంట్ నుండి ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ కి మారింది మహిమ. డిపార్ట్ మెంట్ హెడ్ వినోద్ కాబట్టి మర్యాదపూర్వకంగా అతన్ని కలిసింది.
    "ఓ! వెల్ కం మహిమా! యూ ఆర్ మోస్ట్ వెల్ కం! ఐ యామ్ హ్యాపీ టు హావ్ యూ అండర్ మి! నాకు విజువల్స్ అంటే ఎంతో ఇష్టం. దీన్లో మీరూ నేనూ కలిసి పనిచేసి, మంచి రిజల్ట్స్ సాధిద్దాం. ప్లీజ్ బి సీటెడ్" మర్యాదగా లేచి నిలుచుని విష్ చేసి, సీటు చూపి కూర్చోమన్నాడు. తరువాత కాస్త తటపటాయిస్తూ, "మహిమా! ఆ రోజు మీరంతా వచ్చి అలా 'రాఖీ' కట్టడం నాకెంత మేలు చేసిందో చెప్పలేను. మీరిక్కడికి రాకముందు జరిగిన దురదృష్ట సంఘటన. దానికి మీరెంత బాధ్యులో ప్రీతి కూడా అంతే బాధ్యురాలు. తనూ తొందర పడింది. ఆవేశపడింది. దానికి మూల్యం చెల్లించింది. తనూ, మీరూ ఇద్దరూ శిక్ష అనుభవించారు. ఇంక అది ఓ పీడకల అనుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి సార్. క్షమించండి. చనువు తీసుకుంటున్నందుకు" అంది.
    "నో నో! నాకెంతో మనశ్శాంతిగా ఉందిప్పుడు. నిజం చెప్పనా మహిమ. ఆ రోజు నిన్ను... సారీ... మీరు అనబుద్ది వేయడం లేదు. ఆ రోజు మొదటిసారి నా రూములోకి రాఖీ కట్టడానికి మీరు చెప్పినప్పుడు నాకిలాంటి చెల్లెలుంటే ఎంత బాగుండును అనుకున్నాను. మీ ఆలోచన, మీ చొరవ, ఇంప్రెస్ చేసే ప్రవర్తన, మాటలు, పనిలో మీ సామర్థ్యం... అన్నీ చూశాక నిజంగా నాకు ఇలాంటి చెల్లెలే కావాలనిపించింది. ప్లీజ్ నన్ను అన్నయ్యగా భావించు..." చాలా ఎమోషనల్ గా అన్నాడు.

 Previous Page Next Page