అలాంటిదే మరోసారికూడా జరిగింది.
కానీ ఆయనమీదున్న గౌరవాన్ని బట్టి ఆయన చెప్పే నీతి కథలను బట్టి ఆ విధంగా అనుమానించడానికి ఆస్కారం లేకపోయింది.
"తమాషాగా వుంది__" తేరుకుంటూ అంది సావిత్రి.
"సరే_నేను వెళుతున్నాను. తలుపు వేసుకొని పడుకోండి" బయటకు నడుస్తూ అన్నాడతను. తలుపులు మూసివేసి మళ్ళీ మంచంమీద పడుకుండిపోయింది సావిత్రి. లైటు ఆర్పేయడానికి ఎంచేతో భయం వేసింది.
ఉదయం లేచేసరికి బాలకృష్ణ ఏదో పద్యాలు పాడుతూ మొక్కలకు నీళ్ళు పోస్తూ కనిపించాడు.
"ఏమమ్మా, శాంత రాలేదా?" అడిగాడు సావిత్రిని చూడగానే.
"ఊహు! రాలేదు." క్లుప్తసరిగా అంది సావిత్రి. ఎంచేతో అదివరలా చనువుగా మాట్లాడాలనిపించడంలేదు.
"ఎందుకనో?"
"ఏమో, తెలీదు."
"వెళ్ళక వెళ్ళక వెళ్ళిందికదా, ఇంట్లోవాళ్ళు వదల్లేదేమో."
మౌనంగా ఊరుకుంది సావిత్రి.
అతను మళ్ళీ తన దోరణిలో పడిపోయాడు.
సావిత్రి నూతి దగ్గర మొహం కడుక్కొని ఇంట్లోకి నడిచింది. "చెప్పేవన్నీ శ్రీరంగనీతులే" నవ్వుకుంటూ అనుకుందామె.
ఆఫీస్ కు బయల్దేరి బయటికొచ్చేసరికి బాలకృష్ణ ఎవరో ఓ అమ్మాయిని కూర్చోబెట్టుకొని తనెంతమంది రచయిత్రులను తయారుచేసిందీ వాళ్ళలో దాగిన రచనా శక్తిని ఎలా వెలుపలకు లాగిందీ వర్ణిస్తూ కనిపించాడు.
"ఏమ్మా, సావిత్రీ!ఆరోజు నేను చెప్పినది రాశావా?" అడిగాడు సావిత్రిని.
"ఊహు! ఇంకా రాయలేదండీ_" తప్పించుకుంటూ అంది సావిత్రి.
"త్వరగా రాసేయ్...! కథలు, కొత్త రచయితలు కావాలని చాలామంది పత్రికలవాళ్ళు ఉత్తరాలు గుప్పిస్తున్నారు నాకు."
జవాబివ్వకుండానే బయటకు నడిచిందామె.
ఆఫీసులో పని ఎక్కువయిపోయిందా రోజు. మధ్యాహ్నం వరకూ తలెత్తి చూడడానికి కూడా వీల్లేకపోయింది. శాంత రాసిన ఉత్తరం తెచ్చిచ్చాడు పోస్టుమన్.
ఆత్రుతగా తీసుకొని చదవడం మొదలుపెట్టింది.
డియర్ డార్లింగ్...
ఇంతకుముందు రాసిన ఉత్తరం చదివి సస్పెన్స్ పడిపోయుంటావు. అవునా...? విషయమంతా అప్పుడే రాసేద్దును గానీ, అప్పటికింకా ఎటూ తేలకుండా వుండిపోయింది.
ఇంతకూ జరిగిన కథా కధనం బెట్టిదన...
నేను మామూలుగానే మా ఊరు చేరుకొన్నాను. మా ఊరు సంగతీ అక్కడి నా చిన్నప్పటి స్నేహితురాండ్ర సంగతీ నీకు చెప్పి చాలాసార్లు బోర్ కొట్టానుకదా...! అందులో సుశీల అనే అమ్మాయి సంగతి కూడా నీకు బాగానే గుర్తుండి వుంటుంది. మంచినీళ్ళ చెరువుకి ఇవతలవేపు మా ఇల్లు...అవతల వాళ్ళిల్లు... ఆ రోజుల్లో సాయంత్రమయ్యే సరికి పిల్లలమంతా వాళ్ళింటి ఆవరణలో ఆడుకొనేవాళ్ళం. అప్పట్లో మేమంతా ఫస్టుఫారం చదువుతుండేవాళ్ళం... సుశీల తమ్ముడు కృష్ణ కూడా మాతోనే తిరుగుతుండేవాడు. అప్పుడప్పుడే మాకు ఆడపిల్లలకీ మగపిల్లలకీ మధ్య తేడా తెలుస్తోంది. ఓ రోజు నేను ఒంటరిగా వున్నప్పుడు కృష్ణ నాకు ఓ కాగితం తీసుకొచ్చి ఇచ్చాడు. 'ఏమిటది...' అంటూనే విప్పి చదివాను. అది ప్రేమలేఖ... ప్రేమలేఖంటే తెలీని వయసు కాదు గాని, రాసుకొనే వయసు మాత్రం ఇద్దరికీ కాదు...అదో పెద్ద పాపం అని కూడా ఆడపిల్లలకు అనుమానం. ఆ ఉత్తరం తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకు చూపిస్తానని అతన్ని హడలగొట్టాను... అతను బెదిరిపోయి ఇంకెప్పుడూ రాయనని బ్రతిమాలి ఆ ఉత్తరం తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత మళ్ళా నా ఎదుటపడితే ఒట్టు... ఎక్కడయినా కనిపించినా పారిపోయేవాడు. ఆ రహస్యం మా ఇద్దరి మధ్యే వుండిపోయింది. ఇన్నేళ్ళకు ఇప్పుడు అకస్మాత్తుగా కృష్ణ కనిపించాడు... ఇద్దరం ఒకరినొకరు గుర్తించడానికి కొంచెం శ్రమపడాల్సి వచ్చిందనుకో... మాట్లాడుకోడానికి ఇద్దరం సిగ్గు పడ్డాం... ఆనాటి సంఘటన ఇద్దరకూ గుర్తుకొచ్చింది. సుశీల విషయాలు నేనూ, నా విషయాలు అతనూ తెలుసుకుంటూ గంటలు గడిపాము. ఇంకా అదే ఇంట్లో వుంటున్న వాళ్ళ బాబాయి వాళ్ళని చూడ్డానికొచ్చాడట అతను...అతనికీ వివాహం కాలేదు. నెమ్మదిగా అతను తన మనసులోని విషయం బయటపెట్టాడు. నేను అంగీకరిస్తే నన్ను వివాహం చేసుకొంటా అన్నాడు. ఇద్దరం అంగీకారానికొచ్చాం...! పెద్దాళ్ళకు ఇష్టం కాదు. అయినా మేము గట్టి నిశ్చయం తీసుకోవడంతో ఊరుకొన్నారు. అతను మద్రాసులో సౌండ్ ఇంజనీర్ గా వుంటున్నట్టు, వచ్చే నెలలో వివాహం అవడం, నేను ఉద్యోగానికి రాజీనామా చేసి అతనితో మద్రాసు వెళ్ళిపోతున్నాను. నాలుగయిదు రోజుల్లో నీదగ్గరకొస్తా కదా...అప్పుడు మిగతా విషయాలు మాటలాడుకొందాం. అన్నట్లు మన ఇంటి ఓనరు బాలకృష్ణ మనిద్దరినీ రచయిత్రులను చెయ్యాలనుకొన్నాడు కదూ! కనీసం నువ్వయినా రచయిత్రి అయిపో! కావాలంటే నా కథే నీ ప్రధమ రచనగా తీసుకో. పాతికో పరకో అప్పిస్తే బాలకృష్ణే ఏదో పత్రికలో ప్రచురించే ఏర్పాట్లు చేస్తాడు...శాంత.
కలలోంచి బయటపడినట్లనిపించింది సావిత్రికి. ఉత్తరం పూర్తయ్యేసరికి అదంతా జరిగిన సంఘటనలు నమ్మబుద్ధికావడంలేదు. ఏదేమయినా శాంత అదృష్టవంతురాలు__తనమీద ఎన్నో బాధ్యతలున్నాయనీ, తను ఉద్యోగం చేయడం మూలాన వాళ్ళ కుటుంబానికి యెంతో సహాయంగా వుందనీ చెపుతుండేది. మరిప్పుడు వాటన్నిటినీ పక్కకు నెట్టి తన జీవితాన్ని ఓ దారిన పెట్టుకొంటోంది. నాలుగయిదు రోజులు గడచిపోయినయ్. ఒక్కరోజు కూడా శంకర్ కనిపించకపోయేసరికి మనసు మరింత బాధాకరంగా తయారయిపోయింది...అతని గదికి యెప్పుడు చూసినా తాళం వేసి కనబడుతోంది. అతనెక్కడికి వెళ్ళాడో బాలకృష్ణకు తెలిసే వుంటుంది కానీ అతన్నడగడం సావిత్రి కిష్టం లేదు. అంచేత మౌనంగా ఊరుకుండిపోయింది.