ఆమెకేడుపొస్తోంది.
లోపల్నుంచి మంచాని కతుక్కుపోయి వున్న ముసలి అత్తగారి గొంతు వినిపించింది.
"ఇందాకట్నుంచీ దాహంతో చచ్చిపోతున్నాను. కాస్త మంచి నీళ్ళివ్వవే"
రాధాప్రియ ఒక్కసారిగా ఆవిడ మీద విరుచుకు పడింది. "మంచినీళ్ళా గించినీళ్ళా? నోరు మూసుకుని పడివుండు. తప్పుడు ముండా"
"దాహానికి తట్టుకోలేక పోతున్నానే"
"తట్టుకోలేకపోతే చావు. పీడ విరగడయిపోతుంది. అవునూ! రోజు యింతమంది చస్తున్నారు. ఆరోగ్యంగా, బలంగా వున్నవాళ్ళు కూడా ఠప్ మని చచ్చిపోతున్నారు. సంవత్సరాల తరబడి మంచం మీదపడి తీసుకుంటున్న నీకెన్నాళ్ళకీ చావు రాదేం?"
"అదేనే. నాకూ అర్థం కావటం లేదు. ఆ దేవుడికి నామీద దయ రావటం లేదు."
"దేవుడూ గీవుడూ వాడొకడు వుండుంటే ప్రపంచంలో యిన్ని అరాచకాలెందుకు జరుగుతాయి? నాలాంటి పతివ్రతలకు అవమానాలూ బేవార్సు ముండలకి సన్మానాలూ__"
ఆమె అంతరంగంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న భావాలకు సింబాలిక్ వక్షస్థలం ఎగిరెగిరి పడుతోంది.
12
నాలుగు నెలల కాలం గడిచిపోయింది.
విజయ్ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. వస్తున్నాడు రోజు రోజుకీ అప్పులు పెరిగిపోతున్నాయి.
చేయని తప్పుకు నేరస్థుడిలా శిక్షించబడుతూ క్రమక్రమంగా కృంగిపోతున్నాడు.
ఒకరోజు ఓ చిట్ ఫండ్ కంపెనీ నుంచి నోటీసొచ్చింది. సుబ్బారావు అనే వ్యక్తికి కోబ్లిగెంట్ గా పాతికవేల రూపాయలకు హామీ వున్నందువల్లా, ఆ యిన్ స్టాల్ మెంట్స్ కొన్ని నెలలుగా కట్టబడకపోవటంవల్లా, అతని మీద చట్టరీత్యా చర్య తీసుకోబడుతుందని.
సుజాత ఆ ఉత్తరం చూసింది. ఇహ నిగ్రహించుకోలేకపోయింది.
విజయ్ గదిలో కుర్చీలో స్తబ్దుగా కూచుని వున్నావు. ఆమె అంచుమీద కూచుని అతని గుండెల మీద తల వాల్చింది.
"చెప్పండి. ఎందుకిలా జరుగుతున్నాయి సంఘటనలు? ఈ మధ్య మీ ప్రవర్తన ఏమిటోలా వుంటోంది. ఆఫీసుకు సరిగ్గా వెళ్ళటంలేదు. ఒక వేళా క్రమమూ లేకుండా మీ స్వభావానికి విరుద్ధంగా ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు. మీ చూపులు కూడా అదోలా వుంటున్నాయి. ఇప్పుడీ నోటీసు."
"సుబ్బారావుగారొచ్చి నా ప్రాణాలు అదేపనిగా కొరికేస్తే ఆ మధ్య ఆయన పాడుకున్న చీటికీ కోబ్లిగెంట్ గా సంతకం చేశాను. ఆయన వాయిదాలు కట్టటం లేదని నాకు తెలీదు."
"మరి...మీ ప్రవర్తన. ఆఫీసుకు సరిగ్గా వెళ్ళకుండా వుండటం?"
"నా ఉద్యోగం పర్మినేట్ చేశారు."
"మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేశారా?" ఆమె విద్యుత్ ఘాతం తగినట్లు ఒణికింది.
"అవును."
"ఎందుకని? ఎందుకని అలా జరిగింది?"
"నేను అవినీతిపరుడ్ని. డ్యూటీ సరిగ్గా చెయ్యనివాడ్ని, లంచగొండిని."
"మీలాంటి నిజాయితీపరుడైన ఉద్యోగస్తుడి మీద ఈ అభియోగాలన్నీ మోపబడ్డాయా?"
"మోపబడటమే కాదు. నిరూపించబడ్డాయి."
"అన్యాయం. అన్యాయం" అని ఆక్రోశించింది ఆమె హృదయం. ఈ లోకంలో మంచివాళ్ళకు స్థానం లేదన్న సత్యం మరోసారి నిరూపించబడింది.
"మరి మీకు రావాల్సిన గ్రాడ్యుయిటీ, ఇలాంటివి ఇంకేవో గవర్నమెంటునుంచి..."
"గవర్నమెంట్ తెగతెంపులు చేసుకునేతప్పుడూ, ఆజ్ఞలు జారీ చేసేటప్పుడూ నిమిషాల మీద చేస్తోంది. లెక్కలు తేల్చి యివ్వటానికి కొన్ని సంవత్సరాల కాలం తీసుకుంటుంది."
ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. గుండెల్లో సన్నని మంట చెలరేగుతుంది.
"మరి యిప్పుడు..."
"మరో ఉద్యోగం వెతుక్కోవాలి. బ్లాక్ లిస్ట్ లో పడిపోయాను కాబట్టి అదీ కష్టమే"
"ఈ చిట్ ఫండ్ గురించి..."
"సుబ్బారావుగారు సరిగ్గా జవాబు చెప్పటంలేదు. తప్పించుకుని తిరుగుతున్నాడు."
ఆమె అతని గుండెల మీద తలవుంచి చేతులు మెడ చుట్టూ వేసి, దగ్గరగా లాక్కుని కళ్ళు మూసుకుని వుండిపోయింది.
"ఇన్నాళ్ళూ నాకు చెప్పకుండా దాచి వుంచినందుకు మిమ్మల్ని అపార్థం చేసుకోనండి. మీ స్వభావం నాకు తెలుసండి. మీరు తప్పు చెయ్యరని తెలుసండి. కాని మీరింత అన్యాయానికి గురవుతూంటే ఎలా భరించనండి."
మూసి వున్న కనురెప్పల ప్రక్కనుంచి చెంపల మీదుగా కన్నీరు జారిపోతోంది.
అలా కొన్ని క్షణాలు గడిచాక ఏదో ఆలోచన వచ్చి ఆవేశంతో హృదయం భగ్గుమంది. అతన్నుంచి విడివడి లేచి నిలబడింది.
"సుజా! ఎక్కడికి?"
"ఇప్పుడే వొస్తాను. అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయింది.
ఆ సమయానికి సుబ్బారావు భార్య విమలాదేవి ప్రక్కన గురించి తానెంత గొప్పవాడో, సమాజంలో తనకెంత పేరు ప్రఖ్యాతులున్నాయో వల్లిస్తున్నాడు.
సుజాత తలుపు తీసుకుని దూకుడుగా లోపలకెళ్ళింది.
విమలాదేవి భర్తకానుకుని కూచున్నదల్లా ఉలిక్కిపడి లేచి నిల్చుంది.
వెంటనే తేరుకుని అదేమిటలా బెల్ కొట్టకుండా, తలుపు తట్టకుండా భార్యా భర్తలు ఏకాంతంగా వున్నప్పుడు మేనర్స్ లేకుండా లోపలికొచ్చేస్తారు అన్నది.
"ఆ మాత్రం మేనర్సు నాకు తెలుసులే. మొగుడూ పెళ్ళాలు ఏకాంతంగా వుండటం మీకేకాదు. పెళ్ళయిన ప్రతి చవట వెధవలకీ వచ్చు."