పవిత్రమైన పెళ్ళి
పదో క్లాసు పాసయిన వకుళ సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అసలు తను పాసవగలనని అనుకోలేదు వకుళ...
పెద్దత్తకు జబ్బుచేసి హాస్పిటల్లో ఉంటే రోజూ సాయంత్రం కేరియర్ తీసికెళ్ళవలసి వచ్చేది. చిన్నత్తకు పురుడొచ్చింది...అమ్మకి సరేసరి కీళ్ళవాతం...కొన్నాళ్ళు పొద్దున్నా, సాయంత్రం వంట తనే చెయ్యవలసి వచ్చేది...
పాపం! అమ్మమ్మ మాత్రం మంచంలో పడుకుని 'ఇంత చిన్న వయసులో నీకెన్ని యాతనలే!" అని కళ్ళనీళ్ళు తెచ్చుకునేది అంతకంటె ఆవిడమాత్రం ఏం చెయ్యగలదు?
ఈ గొడవలన్నింటి మధ్యా అసలు పుస్తకంపట్టుకోవటానికే వీలుపడేది కాదు__ఏం చదివిందో, ఎలా చదివిందో ఆ భగవంతుడికే తెలియాలి...హాస్పటల్ కి వెళుతూ బస్ లో చదివేది...కూరముక్కలు కలియబెడుతూ చదివేది. అత్తకు కాళ్ళురాస్తూ చదివేది...అయినా పాసయింది. ఫస్ట్ క్లాసులో పాసయింది...
పేపర్ చేతిలో పట్టుకుని తన నంబర్ మళ్ళీ మళ్ళీ చూసుకొంటున్న వకుళ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చింది శారద...
ముందు వకుళ నోట్లో స్వీట్ పెట్టి "నేను సెకండ్ క్లాసులో పాసయ్యాను దొంగ! పరీక్షలు రాసి ఎప్పటికప్పుడు ఏడ్చేదానివి__ఫస్టుక్లాసులో పాసయ్యావు" అంది.
వకుళ సంబరంగా నవ్వి "ఇప్పటికీ నాకు నమ్మకం కలగటంలేదు" అంది మళ్ళీ పేపర్ చూస్తూ...
"నీలాంటివాళ్ళు అంతేలే? మరి స్వీట్ ఏదీ?"
బిత్తరపోయి బేలగా చూసింది వకుళ. శారద నాలుక కరచుకుంది...
"అయామ్ సారీ! అందరినీ అడుగుతున్నట్లు అలవాటుగా అడిగేశాను. ఏమీ అనుకోకు...మరి కాలేజీలో చేరుతున్నావా? త్వరగా అప్లికేషన్లు పెట్టు__ఆలస్యం చేసావంటే క్లాస్ వచ్చినా, సీట్ రాదు..." అనేసి మిగిలిన స్నేహితుల దగ్గరకు పరుగు తీసింది శారద.
కాలేజీలో చేరాలి! వకుళ పంచప్రాణాలూ కాలేజీలో చేరాలనీ, ఇంకా పైకి చదవాలనీ అలమటించిపోతున్నాయి. సాయంత్రం మావయ్యని అడగాలి! మావయ్యని ఏం అడగాలన్నా ప్రాణం పోయినట్లే ఉంటుంది...ఒక పురుగుని చూసినట్లు చూస్తూ ముఖం చిట్లించుకుని వంద సణిగి అడిగిన దానిలో సగం ఇస్తాడు__అయినా గత్యంతరంలేదు__అతణ్ని అడిగితే తప్ప గడిచే మార్గంలేదు. రెండే రెండు పరికిణీలతో సంవత్సరమంతా గడుపుకొస్తుంది. మధ్యాహ్నం తిన్నా తినకపోయినా ఆకలి నిగ్రహించుకొంటుంది. పుస్తకాలూ, పెన్ లూ, వాళ్ళనీ వీళ్ళనీ అడిగి ఎలాగో గడుపుకొస్తుంది__అయినా మావయ్యని అదీ, ఇదీ అడక్క తప్పదు... వెధవ జీవితం ...
భయపడుతూనే మావయ్యను అడిగింది.... "మావయ్యా! కాలేజీలో అప్లికేషన్ పడెయ్యనా?" అని__అక్కడే ఉన్న పెద్దత్తయ్య ఏదో విడ్డూరం వింటున్నట్లు గుండె బాదుకుంటూ, "ఏమిటీ? చదువుతావా? చదివి ఎవర్ని ఉద్ధరించాలి తల్లీ! ఎంత చదివినా పెళ్ళి చెయ్యక తప్పదుగా! మాకు అదొక తద్దినం ఉండనే ఉంది. ఏదో ఒక సంబంధం చూసి పెళ్ళి చేసేయ్యాలనుకొంటూ ఉంటే, ఇంకా చదువులేమిటి? అడగటానికైనా నోరు రావాలి!"
'పెళ్ళి...' ఆ పేరే కొత్తగా విడ్డూరంగా వినిపించింది వకుళకు...ఆనాటి వరకూ ఆ పేరు ఏనాడూ మనసులోకి రాలేదు తనకు పెళ్ళా? పెళ్ళి అంటే?__
వకుళకు తియ్యని ఊహలూ, వెచ్చని పులకరింతలూ ఏమీ రాలేదు. ఆ పసి మనసు ఛ! ఛ! అనుకుంది భయంతో, చీదరతో...
ప్రయోజనం లేదని తెలిసీ, తల్లి దగ్గిర మరొకసారి తన మనసు బయటపడేసుకుంది.
"అమ్మా! నేను కాలేజీలో చేరి చదువుతాను."__
ఆ తల్లికీ కూతుర్ని చదివించాలనే ఉంది. కానీ తన నిస్సహాయ స్థితికి ఎవరిమీద కోపం తెచ్చుకోవాలో తెలియక కూతురిమీదే విరుచుకుపడింది...
"ఏవిటే! బుద్ధి ఉండి అడుగుతున్నావా? బుద్ధిలేక అడుగుతున్నావా? మీ నాన్న అన్ని విధాలా ఇలా అన్యాయం చేసి పోయింతరువాత ఇంకా మనకి ఆశలేమిటీ?" అని ఏడుపు మొదలుపెట్టింది.
ఇదివరలో తల్లి ఎప్పుడు ఏడుపు మొదలుపెట్టినా, వకుళ మనసు కరిగిపోయేది. సాధ్యమైనంతవరకూ తల్లిని ఓదార్చాలనే ప్రయత్నించేది.
వకుళకు ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్ళు....ఇందరినీ, వాళ్ళ కర్మానికి వాళ్ళను వొదిలి తండ్రి ఎక్కడికో పరారి అయిపోయాడు...పాపం. వకుళ అమ్మమ్మ తన కూతురికి మంచి సంబంధమే, మంచి కట్నంతోనే చేసింది. కానీ ఆ ప్రబుద్ధుడు....వకుళ తండ్రి, ఆస్తి ఇష్టం వచ్చినట్టు తగలేసి దేశాలు పట్టిపోయాడు. గత్యంతరంలేని వకుళతల్లి పుట్టింటికి చేరుకుంది.... వకుళ మావయ్య లిద్దరికీ మండిపోయింది బోలెడు కట్నాలు గుమ్మరించి పెళ్ళిళ్ళు చేసింది చాలక, మళ్ళీ ఈ గంపెడు సంసారాన్ని భరించాలంటే మాటలా? కానీ, తల్లి ముఖం చూసి ఏమీ అనలేక ఇంట్లో ఉంచుకున్నారు. వకుళ అమ్మమ్మకి కూతురి స్థితి కష్టంగానే ఉంది. అయినా ఏం చెయ్యగలదు? తన కొడుకులు తన మీద కొద్దిపాటి గౌరవముంచి తోబుట్టువును ఈ మాత్రంగా ఆడుకుంటున్నదే మహాభాగ్య మనుకుంది. ఈరోజుల్లో డబ్బు ముందు రక్త సంబంధాలు ఎవరు చూస్తున్నారు?
వకుళకు ఈ మధ్యనే, సావిత్రితోనూ, సుశీలతోనూ స్నేహాలు కలిసాయి. సావిత్రి తల్లినికూడ మొగుడు వదిలేసాట్ట. మరెవరినో పెళ్ళిచేసుకున్నాట్ట... అయినా సావిత్రి తల్లి వాళ్ళ పంచనా, వీళ్ళ పంచనా చేరలేదు. ఆ వయసులో చదువు ప్రారంభించి మెట్రిక్ పాసయి మరో అయిదేళ్ళలో బి.ఏ. కూడా పాసయింది. వయసు మీరిపోయిందని ఎవరూ ఉద్యోగం ఇయ్యకపోతే తనంతట తను ఒక కె.జి.స్కూల్ ప్రారంభించి స్వయంకృషితో దాన్ని వృద్ధిలోకి తెచ్చింది. తన ముగ్గురు పిల్లలనూ లక్షణంగా పెంచుకుంటూ గౌరవంగా కాలంగడుపుతోంది సావిత్రి తల్లి... సుశీలకు చిన్నవయసులోనే భర్త పోయాడు. అంతగా చదువుకోలేదు. కొన్నాళ్ళు పుట్టింట్లో ఉంది. కానీ...అక్కడ అందరూ అన్ని పనులూ చేయించుకుంటూ వంటలక్క కంటే హీనంగా చూస్తోంటే భరించలేక పోయింది. కూతురితోసహా బయటకొచ్చేసింది. అప్పడాలు చేసి అమ్ముకునీ, ఊరగాయాలు అమ్ముకునీ, పెళ్ళళ్ళకు పేరంటాలకూ వంటలు చేసి, ఎలాగో కూతురిని చదివిస్తోంది.