Previous Page Next Page 
దశావతారాలు పేజి 30


    "నేను మీతో ఉండనులెండి! నన్ను వేరే ఎక్కడైనా దించండి. నా బ్రతుకు నేను చూచుకోగలను. ఇక్కడినుండి తప్పించండి..."
    "మరి మీ బాబాయి..."
    "భలేవారండీ. మా బాబాయి ఏం చెయ్యగలడు మిమ్మల్ని!"
    "ఆల్ రైట్ ..."
    అలా నాగావళి జీవితమార్గం నాగావళి ఎన్నడూ అనుకోని విచిత్రమైన మలుపు తిరిగింది.
    ప్రతి రంగంలోనూ హైక్లాస్, మిడిల్ క్లాస్, లోక్లాస్ అని ఉంటాయి. ఏ రంగంలోనయినా హైక్లాస్ వాళ్ళ ను ఏమీ చెయ్యలేరు. హైక్లాస్ దొంగల్ని పట్టగలిగే పోలీస్ లేడు!
    హైక్లాస్ లో ఏంచేసినా అందంగానే ఉంటుంది. చివరకు వ్యభిచారం కూడా. నాగావళి సంవత్సరానికొకరికి భార్యగా ఉంటుంది. ఆ సోకాల్ట్ భర్తగారి దగ్గిర మెలేసి తనకు రెండువేలు తక్కువకాకుండా వసూలు చేస్తుంది. ఎప్పటికప్పుడే ఆవిడ మహా పతివ్రత. ఆవిడ భర్తల్లో ఎవరినడిగినా ఆ విషయం ఒప్పుకుంటారు. ఇప్పుడు నాగావళి బోలెడు డబ్బు కూడబెట్టింది. సంఘంలో పరువుప్రతిష్టలకు కూడా తక్కువలేదు. ఆ మధ్య ఏదో సాహిత్య సమావేశానికి అధ్యక్షత కూడా వహించింది. రెండు మహిళా సంఘాలకు సెక్రటరీ__మూడు అనాధ శరణాలయాలకు ఎడ్ వైజరు... అయిదు సాహితీ సంఘాలకు అధ్యక్షురాలు.
    నాగావళి జీవితం అలా నవనవోన్మేషంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. పిల్లలు పుడితే అందం చెడిపోతుందని ఆవిడ పిల్లల్ని కనలేదు. అయితే పిల్లలులేని కొరత ఆవిడకు లేదు. ఒక పిల్లాణ్ని పెంచుకుంటుంది. వాడికి ఆవిడంటే పంచప్రాణాలూ! ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా డబ్బు విలువ తెలుసు..."
    ఆరోజు మహిళామండలి సభ్యురాలు మిసెస్ శోభాదేవి చెప్పిన కథ చాలా ఆశక్తి కలిగించింది నాగావళికి...
    "పాపం. ఆవిడ ఎవరో పెద్దింటి మనిషిలాగానే ఉంది. పెళ్ళయింది ముగ్గురో నలుగురో పిల్లలుకూడాను... ఆ మొగుడికేం రోగమో...ఇప్పుడు మరొకదాన్ని తెచ్చుకున్నాడు. బాధపడింది. దెబ్బలాడింది. ఏమీ ప్రయోజనం లేకపోగా చచ్చినట్లు నోరు మూసుకు పడిఉంది, బయటపడలేక! అక్కడితో ఆగలేదు ఈ కథ__ ఆ మహా ఇల్లాలికి అసలైన ఇల్లాలి స్థానం ఆక్రమించాలని ఆశకలిగింది. అంచేత పాపం, ఈవిణ్ని వెళ్ళగొట్టాలని ప్రయత్నించింది, ఈవిడ భారతనారీ శిరోమణి కదండీ!...అందుకని ఆ భర్తగారి పాదపద్మాలు వదలనని మొండికేసి కూర్చుంది! అప్పుడా పతిదేవులు ఈవిడ పాతివ్రత్యాన్ని మరింత పరీక్షించాలని ఉభయ సంధ్యల్లోనూ మరిచిపోకుండా చావతన్నటం మొదలుపెట్టాడు. అప్పటికీ ఈవిడ చలించలేదు. ఆ అఖండ 'కులట' బిరుదునిచ్చి...ఆ బిరుదుకు తగిన ఘనసన్మానాలతో పుట్టింటికి సాగనంపాడు....  
    "మనుష్యులకి... ముఖ్యంగా మన తెలుగువాళ్ళకి స్కాండల్స్ అంటే ఉన్నంత ముచ్చట ఇంతా అంతా కాదు. మరోళ్ళగురించి సలుసును కాడంతచేసి చెప్పుకుంటే మన గొప్పతనం మనకే మరికాస్త గొప్పగా కనిపిస్తుంది మరి! అంచేత ఆవిడ ఎటు కదిలినా పదికళ్ళు వింతగా చూసేవి. పై నాలుకలు వెక్కిరింతగా బయటకు సాగేవి...తల్లీ తండ్రీ ఆదరించినా, వదినలకు మరదళ్ళకూ తమ ఆడబిడ్డ మీద ఆధిపత్యం సంపాదించడానికీ సతాయించడానికీ ఇదొక మంచి ఆయుధం దొరికింది."
    "చివరకు ఆవిడ పుట్టింట్లోనూ ఉండలేకపోయింది... బి.ఏ. చదువుతుండగా పెళ్ళవటం వల్ల చదువు మానేసిందట! ఆ డిగ్రీకూడా రాలేదు. నాకేదో దూరపు బంధువులెండి! ఏదైనా ఉద్యోగం చూపించమని వచ్చంది...."
    కధంతా విని నిట్టూర్చింది నాగావళి...
    "సరే! తీసుకురండి! చూద్దాం!" అంది__
    తనకు సాధ్యమయినంతవరకు మరొకళ్ళకు ఉపకారం చెయ్యటానికి నాగావళికి ఎలాంటి అభ్యంతరమూ లేదు.
    ఆ మరునాడు శోభాదేవితో కూడా తన దగ్గిరకు వచ్చిన వ్యక్తిని చూసి నివ్వెరపోయింది నాగావళి...
    "సరో...." అని ఆగిపోయింది__సరోజ ముఖంలోనూ రంగులు మారిపోయాయి. గిర్రున వెనక్కు తిరిగింది...
    "వెళ్లిపోతున్నారేం? ఉద్యోగం అక్కర్లేదా?"
    శాంతంగా అడిగింది నాగావళి, సరోజ ఆగి నాగావళి వైపు తిరిగింది.
    నాగావళి కంఠం ఎంత శాంతంగా ఉందో కళ్ళలో అంత హేళన ఉంది...
    సరోజ ధైర్యంగా సమాధానం చెప్పింది...
    "అవును! కావాలి!"
    "మేం ఇచ్చిన ఉద్యోగం చేస్తారా?"
    "ఉద్యోగం ఎవరు ఇచ్చినదయితేనేం? సవ్యమయినదయితే చాలు!"
    "ఓహ్! ఇంతవరకూ మీరు అంతా సవ్యంగానే బ్రతికారన్నమాట!"
    "జీవితం మన చేతుల్లో లేదు. సాధ్యమయినంతవరకూ ఒక మార్గంతో నిలబడాలని ప్రయత్నించాను!"
    "సరోజా! నన్ను గుర్తుపట్టావా!"
    "ఎప్పుడు మరిచిపోయానని?"
    "ఓహ్! ఇప్పుడు ప్రేమలన్నీ పొంగుతున్నాయి కాబోలు!"
    "నిన్ను నమ్మించాలని నేను ప్రయత్నించలేను!"
    "ప్రయత్నాలెందుకు? ఆ రోజు గుమ్మంలోనుంచి వెళ్ళగొట్టడం చాలదా?"
    "ఆ రోజు కాదు! ఈ రోజైనా ఆ గుమ్మంలోకి నువ్వొస్తే అంతే చేస్తాను!"
    "ఎందుకో!"
    "ఈ ప్రశ్నకు ఒకప్పుడయితే సమాధానం చెప్పలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు నా బ్రహ్తుకు బజారునపడింది గనుక అభిమానమనేది నాకేమీ మిగలలేదు గనుక చెప్తున్నాను. ఆనాడు నువ్వు అడుగుపెట్టిన ఇంట్లో నాకెలాంటి స్వాతంత్ర్యమూ లేదు. చివరకు ఒక స్నేహితురాలికి ఆతిధ్యమిచ్చే స్వాతంత్ర్యం కూడా లేదు. నిన్ను గురించి వివరంగా ఆయనకు చెప్పుకోవాలి! ఆ అవహేళనలన్నీ భరించాలి! అది నా వల్ల కాలేదు.
    కానీ, చివరకు నేనిచ్చిన బహుమానాలు కూడా తిరస్కరించి..."
    "ఆనాడే చెప్పాను...నిన్ను ఆదరించలేకపోయాక ఆ బహుమతులు తీసుకోలేనని...నేనూ మనిషినే! వస్తాను!"
    వెళ్ళబోయింది సరోజ...
    నాగావళి ఇంక నిగ్రహించుకోలేకపోయింది ...
    కన్నీళ్ళతో రోషంగా "వెళుతున్నావా? ఇంకా నన్ను శిక్షించాలానే అనుకుంటున్నావా?" అంది.
    సరోజ కళ్ళలో నీళ్ళు తిరిగాయి ...
    "ఆరోజు నిన్ను గుమ్మంలోంచే వెళ్ళగొట్టినందుకు నాకు నేను విధించుకుంటున్న శిక్ష. నిజం చెప్తున్నాను ఆనాడు నీమీద నాకు తేలికభావం లేదు__ఈనాడు అసలు లేదు. జీవితంలో నేను సాధించినదేమిటి? పొందినదేమిటి? ఏనాడూ చల్లనిమాటకు నోచుకోలేదు. అనురాగము ఆప్యాయత ఎలా ఉంటాయో కథల్లో చదవటమేతప్ప అనుభవంలోకి రాలేదు. ఇక పరువుప్రతిష్టలు..."
    సరోజ ఆగి పకపక నవ్వి అంది __
    "ఈనాడు సంఘంలో నీకున్న పరువులో సగం కూడా నాకులేదు!..."
    నాగావళి సిగ్గుతో తల దించుకుంది...
    అంతలో తలెత్తి "ఇంతకూ ఏం చేద్దామని?..." అంది.
    "ఉద్యోగం..."
    "చాల్లే! వాడిని అలా వదిలేస్తావా? నీ పాతివ్రత్యం నువ్వూ..."
    "పాతివ్రత్యంకాదు! నిస్సహాయత్వం! ఏం చేయగలను నేను?"
    సరోజ కళ్ళలో ఎరుపు నాగావళి కళ్ళలోని ఎరుపును మించిపోయింది.
    "అయితే చూసుకో! వాడిని కోర్టుకెక్కిస్తాను మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాను. నీ అడుగులకు మడుగులొత్తిస్తాను. కానీ...అంతవరకు నువ్వెక్కడుంటావు?"
    "నీ దగ్గిరే ఉంటాను. ఇంతవరకూ నా మీద ప్రచారంలో ఉన్న స్కాండల్స్ మాసిపోవాలంటే నీ పరువు నేను కాస్త పంచుకోవాలి!"
    అల్లరిగా నవ్వింది సరోజ...
    "ఆహా! ఏం విలువలు!" విషాదంగా గొణుక్కుంది నాగావళి...


                                * * *   

 Previous Page Next Page