తన తల్లి కూడా వాళ్ళలా స్వతంత్యంగా బ్రతకడానికి ఎందుకు ప్రయత్నించకూడదూ? ఆ మాటే అనేసింది. "నాన్న వదిలేసాడని ఊరికే ఏడుస్తావు. అంతే! ఇక్కడ చేస్తున్న ఇంత చాకిరీ మరెక్కడైనా చేసుకుంటే మనకు గడవదా?"
తల్లి కళ్ళు పెద్దవిచేసి విచిత్రంగా చూసింది కూతురిని.
"ఏం మాట్లాడుతున్నావే! మావయ్యలు మనని బ్రతకనిస్తారా?"
"ఇప్పుడు బ్రతకనిస్తున్నారు మహా! ఇదీ ఒక బ్రతుకేనా?"
కూతురి ధోరణికి హడలిపోయింది తల్లి.
"ఛ! ఛ! నోరు మూసుకో! అత్తయ్యలెవరైనా వింటారు." అని కసిరింది.
వకుళ మళ్ళీ నోరు మెడపలేదు. ఆ పద్నాలుగేళ్ళ పసి మనసుకి తను ఏం మాట్లాడినా ప్రయోజనం లేదని అర్ధమయిపోయింది. ఏం చెయ్యాలో మాత్రమే అర్ధంకాలేదు.
"మా వకుళకు పెళ్ళి..." అని చెప్పింది తల్లితో శారద.
శారద తల్లికి వకుళ అంటే అభిమానం... వకుళ పరిస్థితి...ఆ అమ్మాయి మంచితనం...ముఖ్యంగా వకుళ తెలివితేటలూ, శారదకు ఎన్నోవిధాల చదువులో సాయం చెయ్యటం...ఇవన్నీ శారద తల్లికి వకుళ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగించాయి. ఎన్నోసార్లు వకుళకు అనేక విధాల సాయం చేసింది.
శారద వకుళకు పెళ్ళి అనగానే తెల్లబోతూ "అప్పుడే పెళ్ళా?" అంది.
"అవును__పాపం, వకుళ ఏడుస్తోంది." బాధపడుతూ చెప్పింది శారద.
శారద తల్లి సాధారణంగా ఎవరింటికీ వెళ్ళదు. అందుకు కారణం లేకపోలేదు. శారదతల్లి వృత్తిలో ఉన్న వేశ్య. అయినా తన కూతుర్ని మాత్రం గృహిణిని చెయ్యాలని భగీరధ ప్రయత్నం చేసింది. శారద అదృష్టమో, ఆ తల్లి తపనో, తెలియదు కాని, బంగారు బొమ్మలాంటి శారదను ఏ సంకోచాలూ లేకుండా అన్నివిధాలా యోగ్యుడయిన మాధవరావు శాస్త్రోక్తంగా పెళ్ళిచేసుకున్నాడు.
"మీరు చాలా సంస్కార భావాలు కలవారు." అని శారద తల్లి ఎప్పుడైనా భర్తను పొడిగితే అతడు ఊరుకోడు.
"నీ మొహం! నాకు సంస్కారమనే మాటకు అర్ధమయినా తెలియదు. నిన్ను చూసాను. ఈ బంగారు బొమ్మను చెయ్యిజారిపోనియ్యకూడదనుకున్నాను. వెంటనే పెళ్ళి చేసుకున్నాను అంతే!" అంటాడు నవ్వుతూ.
ఆ భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా హాయిగా జీవిస్తున్నారు. అది చూసి సహించలేని అమ్మలక్కలు ఏదో ఒక విధంగా శారద తల్లి గతాన్ని త్రవ్వి కులం ప్రసక్తి తెచ్చి ఆవిడ మనసు తూట్లు పొడిచి సంతృప్తి పడాలని చూస్తారు. అందుకే శారదతల్లి ఎప్పుడూ ఇరుగు, పొరుగూ, ఎవరింటికీ వెళ్ళదు. తన భర్త, కూతురు, ఇదే లోకంగా గడుపుతోంది.
కానీ శారద "వకుళ పెళ్ళి" అన్నాక స్థిమితంగా ఉండలేకపోయింది....వకుళను చదివించటానికి కూడా శక్తిలేక చదువుమానిపించిన ఆ తల్లి పెళ్ళి చేయగలుగుతుందా? ముక్కుపచ్చలారని వకుళకు పెళ్ళేమిటి? పాపం, శారద లాంటిదే కదూ, వకుళ కూడా!...
సంగతేమిటో తెలుసుకుందామని వకుళ ఇంటికి బయలుదేరింది.
వకుళ అత్తయ్యలూ, పెద్దమ్మలూ శారద తల్లిని కళ్ళప్పగించి చూసారు. ముప్పై యేళ్ళు దాటాకకూడా, ఇరవై దాటని యువతిలా అసాధారణ సౌందర్యంతో మెరిసిపోతోన్న ఆ లావణ్యరాసిని చూసి ఓర్చలేకపోయారు. గిర్రున ముఖాలు తిప్పుకున్నారు. శారదతల్లి కొద్దిగా చిన్నబుచ్చుకున్నా వెంటనే కూడదీసుకుంది, ఇలాంటివాటికి ఆవిడ బాగా అలవాటు పడిపోయింది. వకుళ తల్లిమాత్రం రండి! రండి!" అని ఆహ్వానించింది. వకుళకు శారదతల్లి చేసిన సహాయాలు వకుళ తన తల్లితో చెప్పేది. అంచేత ఆవిడపట్ల ఒకవిధమైన కృతజ్ఞతా భావం ఉంది.
"వకుళకు పెళ్ళి అని విన్నాను." అంది శారదతల్లి సంభాషణ ప్రారంభిస్తూ.
"అవును! మా ఇళ్లల్లో ఆడపిల్లని పెళ్ళికాకుండా ఎక్కువ రోజులు ఉంచం!" అంది వకుళ తల్లి మూతీ ముక్కూ తిప్పుకుంటూ.
ఆ ధోరణి అర్ధమయినా సహించి "పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడూ?" అంది శారదతల్లి సౌమ్యంగా.
"డాక్టరు!" గర్వంగా అంది వకుళ తల్లి.
శారదతల్లి ఆశ్చర్యపోతూ "ఎంత కట్నం?" అంది.
ఆ ఆశ్చర్యానికి మరింత మిడిసిపడుతూ "కట్నం ఏమీలేదు. అమ్మాయిని చూసి కోరి చేసుకుంటానన్నాడు. ఏం? మా అమ్మాయికి కులం తక్కువా? గుణం తక్కువా?"
ఎప్పటికప్పుడు ఎత్తిపొడుపు మాటలు మాట్లాడుతున్న వకుళ తల్లి ధోరణి అర్ధమవుతోన్నా వకుళ మీది అభిమానంతో సహించి "ఏ ఊరు ? ఎంత వయసు?" అంది శారదతల్లి.
ఈ ప్రశ్నకుమాత్రం వెంటనే సమాధానం చెప్పలేకపోయింది వకుళ తల్లి. నానుస్తూ "ఈ ఊరే! డాక్టర్ పినాకపాణి" అంది.
అదిరిపడింది శారదతల్లి....డాక్టర్ పినాకపాణిని ఆ ఊళ్ళో తెలియని వాళ్ళు లేరు. కొందరు అల్లరిగా డాక్టర్ పినాసిపాణి అని అంటారు. అంత డబ్బు మనిషి అతను ... అతని మొదటిభార్య చచ్చిపోయింది. ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేసారట... కాదు... హత్య అంటారు. కొందరు... రెండవ భార్య లేచిపోయింది ఎక్కడుందో ఏమయిందో ఎవరికీ తెలియదు...ఇది మూడవపెళ్ళి.
అక్కడే కూచున్న వకుళ లేత ముఖాన్ని చూస్తోంటే హృదయం ద్రవించింది శారద తల్లికి.
"ఏం వకుళా! నీకీ సంబంధం నచ్చిందా ?" అంది జాలిగా. వకుళ చిరునవ్వుతో "నచ్చింది" అంది.
ఆ చిరునవ్వుచూసి మతిపోయింది శారద తల్లికి.
"నచ్చిందా?" అంది నమ్మలేక.
"ఆ! ఆయన అమ్మనీ, తమ్ముళ్ళనీ, చెల్లాయిలనీ తన దగ్గరే ఉంచుకుంటానంటున్నారు. యేం ఇంక మావయ్యల దగ్గిర ఉండక్కర్లేదు," సంబరంగా అంది వకుళ.
ఆ సంబరాన్ని చూస్తోంటే, ఆ మాటలు వింటుంటే మనసు బాధతో మెలితిరిగిపోయింది శారద తల్లికి.
వకుళ తల్లి రెండు చేతులూ పట్టుకుని "ఇంత దారుణం చెయ్యకండి. అన్యాయంగా ముక్కుపచ్చలారని మీ కూతురి గొంతు మీరే నులమకండి" అంది ఆవేదనతో శారదతల్లి.
అంత పచ్చి నిజాన్ని విని భరించలేకపోయింది, వకుళ తల్లి...శారదతల్లి చేతులను విదిలించికొట్టి "డబ్బుకోసం వొళ్ళమ్ముకోవడం కంటె ఇది నయమే!" అంది.
నిర్ఘాంతపోయింది శారదతల్లి...అక్కణ్నుంచి లేచి వచ్చేసింది. వకుళ పరుగున వచ్చి వీధి గుమ్మంలో అతణ్ని కలుసుకుని రెండు చేతులూ జోడించి "ఏమీ అనుకోకండి! పాపం, మా అమ్మ, మా నాన్న వదిలేసిన దుఃఖంలో మతిలేకుండా మాట్లాడుతుంది." అంది.
శారద తల్లి క్షణకాలం ఆగి వకుళ శిరసు ఆప్యాయంగా నిమురుతూ "పిచ్చిపిల్ల అని కదిలిపోయింది.
ఒకప్పుడు కన్యాశుల్కాలుండేవి! ఆ రోజులో డబ్బుకోసం తల్లిదండ్రులే పసిపిల్లలను ముసలివాళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేసేవారు.
సంఘసంస్కర్తల మహత్తర ప్రయత్నాలకు ఫలితంగా ఆ దురాచారం పోయింది.
వరకట్నాలొచ్చాయి.