Previous Page Next Page 
తదనంతరం పేజి 30


    ఒకనాటి పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో పిల్లలకు వయసుతో బాటు వ్యక్తిత్వం పోటీపడి పెరుగుతూ వుంటుంది. అర్హతల్లో సమంగా లేకపోయినా, పెద్దవాళ్ళ అంతరంగిక వ్యవహారాలో తలదూర్చటం, సమర్థతలో లేకపోయినా, ఆర్ధిక విషయాల్లో హక్కు వున్నట్లు దూసుకొస్తూ వుండటం పరిపాటయిపోయింది.


    జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు! అసహ్యాలు!


    అతని అహంమీద అతని నమ్మకమున్నా, భార్యా పిల్లల దగ్గరకొచ్చేసరికి కారణం తెలీదు. ఎందుకో బలహీనత లాంటిది ఏర్పడి లొంగిపోవల్సి వస్తోంది.


    ఉన్నట్లుండి అతనికి జీవితమంటే భయమేసింది. ఆమెకు దూరంగా జరిగి, అటుకేసి తిరిగి గట్టిగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు.


                                                                             7


    సుదర్శనం ఆఫీసునుంచి ఇంటికొచ్చాడు.


    పద్మనాభం బయట వసారాలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు.


    "బావగారూ! ఏమిటింతసేపు చేశారు. తొందరగా వస్తే సినిమాకి వెడదామన్నాను కదూ" అన్నాడు మాటల్లో తన నిరసన తెలియజేస్తూ.


    సుదర్శనానికి చాలా విసుగనిపించింది. అయితే అతనిలోని విచిత్రమైన గుణమేమిటంటే_అతని కోపానికీ, విసుగ్గూ ఆ యింట్లో విలువ లేదు. అసలతని ఆలోచనలకే విలువ లేదు. విలువలేదంటే అతనంటే అగౌరవమనికాదు. అతని ఫీలింగ్స్ ని ఎలా ప్రదర్శించాలో తెలీదు. ఏ భావాన్నయినా తనలోనే యిముడ్చుకుని, లోలోపలే కుమిలిపోవటం మొదట్నుంచీ అలవాటు చేసుకున్నాడు. తన బాధ, యితరుల బాధ రెండూ తనే అనుభవించటం అతనిలోవున్న విచిత్రమైన వ్యాధి. కొంతమందికి కోపమొస్తే, అలాంటి సమయాల్లో వాళ్ళ కళ్ళు చూస్తే ప్రక్కవాళ్ళకు భయమేస్తుంది. అతనికి కోపం వస్తే ఎదుటి వాళ్ళకి వీసమెత్తుకూడా భయమనిపించదు. అలాగే అతనికేదన్నా బాధ కలిగితే ఎవరికీ జాలి కలగదు_ ఒక్క భార్య అరుంధతికి తప్ప. నిజం చెప్పాలంటే అతని ఫీలింగ్స్ ని ఒక్క భార్య తప్ప ఇతరులెవరూ గౌరవించరు. ఇంకో మాటల్లో చెప్పాలంటే అతని ఫీలింగ్స్ ని క్రమమైన పద్ధతిలో ప్రదర్శించి ఇతరులచేత గౌరవించబడేటట్లు చేసుకోవటమతనికి చేతకాదు. స్నేహితుల్లోం బంధువర్గంలో కూడా అందరి అవసరాలకూ అతను ఉపయోగపడతాడు. అసలతన్ని ఉపయోగించుకున్నంత తేలిగ్గా యితరులెవర్నీ ఉపయోగించుకోలేరు. ఇది అతని మంచితనమే అనుకుంటే అది కేవలం తెలివితక్కువ ఆలోచనే అవుతుంది. తాను చాలా మంచివాడినని అతను కూడా అనుకోవటం లేదు. ఒకవేళ మంచితనమే అని ఎవరయినా వాదించినా, అది బలహీనతే అవుతుంది కాని ప్రయోజకత్వం కాదు. ఇతరులకు తేలిగ్గా ఉపయోగపడటం, తమకి తాము ఉపయోగపడకుండా వుండటం దారుణమైన అసమర్థత. ఇంకో జాతి వున్నారు. వాళ్ళు తమకుతామూ ఉపయోగపడరు, ఇతరులకీ ఉపయోగపడరు.


    "ఆఫీసులో పనివల్ల ఆలస్యమైపోయిందండీ. సెకండ్ షోకి వెడదాం లెండి" అన్నాడు సుదర్శనం.


    "బావగారూ! మీరు మరీ అంత సిన్సియర్ గా పనిచెయ్యకూడదండీ. ఈ రోజుల్లో సిన్సియర్ గా పనిచేసే వాళ్ళకు భవిష్యత్తు లేదనుకోండి" అన్నాడు జీవిత సత్యం చెబుతున్నట్లు.


    సుదర్శనం బలవంతాన నవ్వి లోపలకు వెళ్ళాడు.


                                                              *    *    *    *


    రాత్రి రెండుగంటలు దాటి వుంటుంది. సుదర్శనానికి నిద్ర పట్టటంలేదు. ప్రక్కమీద అటూ యిటూ కదులుతున్నాడు.


    ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. గది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. అవి గడియ పెట్టటానికి మొహమాట పడే స్థితిలో అతను జీవిస్తున్నాడు. భార్యనెప్పుడన్నా దగ్గరకు తీసుకోవాలంటే_ఏ తెల్లవారుజామునో వీలవుతుంది. అదన్నా స్వేచ్చగా కాదు. భయం భయంగా_తప్పు చేస్తున్నట్లుగానే.

 Previous Page Next Page